మర్డర్ హార్నెట్స్: ఈ కందిరీగలను అమెరికన్ సైంటిస్టులు ఎందుకు వేటాడి చంపుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images
హంతక కందిరీగలుగా పేరున్న ఆసియాకు చెందిన రాక్షస కందిరీగల(జెయింట్ హార్నెట్స్) సంతతి తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని.. ఇక ముందు అమెరికాలో అవి కనిపించకపోవచ్చని ఆ దేశ వ్యవసాయ శాఖ వెల్లడించింది.
అయితే, ఇటీవల సైంటిస్టులు ఒకే తుట్టెలో ఇలాంటి హంతక కందిరీగలకు చెందిన 200 రాణి కందిరీగలను గుర్తించారు.
ఒక చెట్టు మీద ఉన్న ఈ కందిరీగల తుట్టెను గుర్తించిన సైంటిస్టులు వాటిని బంధించారు.
ఇవి కాక మరికొన్ని రాణీ కందిరీగలు ఉండి ఉండొచ్చని సైంటిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటికే వాటి సంతతిని బాగా తగ్గించగలిగామని వారు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
మనుషులపై దాడి చేస్తే..
ఆసియాకు చెందిన ఈ రాక్షస కందిరీగలు వాయవ్య పసిఫిక్ ప్రాంతంపై దాడులు చేస్తుంటాయి. ఇవి తేనెటీగలను చంపుతుంటాయి.
జపాన్, దక్షిణ కొరియాలలో కనిపించే ఈ కందిరీగలు ఒక తేనెపట్టును గంటల వ్యవధిలో సర్వనాశనం చేయగలవు. ఈ జాతి కందిరీగలు మనుషులు మీద కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాయి.
“అన్నింటినీ పట్టుకోగలిగామని చెప్పలేం. ఇంకొన్ని గూళ్లు ఉండొచ్చని అనుకుంటున్నాం’’ అని వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్‌కు చెందిన పరిశోధకుడు ఎరిక్ స్పిషిగర్ మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా గుర్తించారు ?
కెనడా సరిహద్దుల్లోని బ్లెయిన్ పట్టణానికి సమీపంలో ఉన్న ఓ చెట్టు మీద ఈ కందిరీగల తుట్టెను గుర్తించారు శాస్త్రవేత్తలు. వెంటనే ఆ తుట్టెను 9 అంగుళాల వ్యాసార్థం ఉన్న ఒక గాజు సీసాలో బంధించారు. 24 గంటల తర్వాత వాటిని పరీక్షించగలిగామని వారు వెల్లడించారు.
ఆ కందిరీగల తెట్టెలో 112 శ్రామిక కందిరీగలు, వివిధ దశల్లో ఉన్న 500 కందిరీగలు, 200 రాణీ కందిరీగలను గుర్తించామని సైంటిస్టులు తెలిపారు.
“మేం ఈ తుట్టెను పట్టుకోడానికి ముందే కొన్ని రాణీ కందిరీగలు వెళ్లిపోయి ఉండవచ్చు. అలా ఎన్ని వెళ్లి పోయాయో చెప్పడం కష్టం’’ అని స్పిషిగర్ వెల్లడించారు. తుట్టెను పట్టుకున్న తర్వాత కొన్ని రాణీ కందిరీగలు బయట కూడా కనిపించాయని ఆయన చెప్పారు.
కీలకమైన సమయంలో గుర్తించి పట్టుకోగలిగామని, దీనివల్ల రాణీ ఈగలు సంపర్కం జరపడానికి అవకాశం లేకుండా పోయందని శాస్త్రవేత్తలు తెలిపారు. చాలా రాణీ కందిరీగలను పట్టుకుని చంపినట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
సంపర్కం జరగ్గానే రాణీ కందిరీగలు వేరే ప్రాంతానికి వెళ్లి గూళ్లు ఏర్పాటు చేసుకోవడం మొదలు పెడతాయి. చలికాలంలో అవి సుప్తావస్థలో ఉండి, వర్షాకాలం వచ్చినప్పుడు తమ గూళ్లను పూర్తి చేస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు.
అమెరికా ప్రాంతానికి ఈ కందిరీగలు కొత్తని, విదేశాల నుంచి రవాణా అయ్యే చెక్కలు, మొద్దులు తదితర వస్తువుల ద్వారా ఇవి ఇక్కడికి వచ్చి ఉండొచ్చని స్పిషిగర్ తెలిపారు.
గత ఏడాది డిసెంబర్‌లో కెనడాలోని వాంకోవర్‌లో ఓ కందిరీగల తుట్టెను ఇలానే ధ్వంసం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
ఎందుకు చంపుతున్నారు ?
ఈ కందిరీగల జాతి ఇక్కడ పెరగకుండా నిరోధించడం మా పని అని వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్‌కు చెందిన అధికారులు వెల్లడించారు.
“ఆసియాకు చెందిన ఈ రాక్షస కందిరీగలు మనుషుల్ని వేటాడి చంపవు. కానీ వాటి గూడు దగ్గరకు వెళ్లినప్పుడు ప్రమాదాన్ని ఊహించి దాడి చేస్తాయి’’ అని స్పిషిగర్ చెప్పారు.
ఈ రాక్షస కందిరీగల కారణంగా ఆసియా ప్రాంతంలో ఏటా 40మంది చనిపోతున్నారని వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్ మ్యూజియం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- కరోనావైరస్ తమలోనే ఉన్నా గబ్బిలాలు జబ్బు పడవెందుకు? రహస్యం శోధిస్తున్న శాస్త్రవేత్తలు
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
- గిన్నిస్ రికార్డులకు ఎక్కిన భారత పులుల గణన.. ఎందుకంటే...
- 50 ఏళ్ల కిందట అంతరించిన అరుదైన జీవి.. ఆఫ్రికాలో మళ్లీ ప్రత్యక్షం
- 'ఏనుగులను హింసించి చంపేస్తారు, ఆ తర్వాత మొసలి కన్నీళ్లు పెడతారు...''
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








