అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను డోనల్డ్ ట్రంప్ తారుమారు చేయగలరా?

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆంథోని జర్చర్
    • హోదా, నార్త్ అమెరికా రిపోర్టర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో జో బైడెన్ విజయం సాధించినట్లు తెలిసి రెండు వారాలు కావస్తున్నప్పటికీ డోనల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. ఈ ఫలితాలను తారుమారు చేయడానికి ఆయన దగ్గర ప్రణాళిక ఏమైనా ఉందా?

ఈ ఎన్నికల ఫలితాలను చట్టబద్ధంగా సవాలు చేసేందుకు ట్రంప్ పన్నుతున్న వ్యూహాలన్నీ దేశంలో ఉన్న కోర్టు గదుల్లో ఎవరూ వినడం లేదు. ట్రంప్ బృందం అర్ధవంతమైన గెలుపునైనా పొందాలి లేదా డజన్ల కొద్దీ నమోదు చేసిన కేసుల్లో వోటింగ్ అక్రమాలు జరిగినట్లైనా నిరూపించగలగాలి.

జో బైడెన్ 160,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచిన మిషిగన్లో ట్రంప్ మద్దతుదారులు వేసిన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు

మాజీ న్యూ యార్క్ నగర మేయర్ ట్రంప్ న్యాయవాది రూడి జూలియాని గురువారం తెలిపారు.

జార్జియాలో సుమారు 50 లక్షల ఓట్లను తిరిగి లెక్కించిన తర్వాత బైడెన్ 12,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు తలుపులు మూసుకున్నట్లు కనిపించడంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ చట్టపరంగా, రాజకీయంగా వ్యూహాలను మారుస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్ష భవనం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ట్రంప్ ఎటువంటి వ్యూహాన్ని అనుసరించవచ్చు?

1. చట్టపరంగా కానీ, లేదా రిపబ్లిక్ పార్టీకి చెందిన అధికారుల ద్వారా గానీ ఎన్ని రాష్ట్రాలలో వీలయితే అన్ని రాష్ట్రాలలో ఓటు సర్టిఫికేషన్ ప్రక్రియను ఆపివేయడం.

2. బైడెన్ తక్కువ ఆధిక్యతతో గెలిచిన రిపబ్లికన్ల అధీనంలో ఉన్న చట్ట సభల్లో.. ఓటింగ్‌‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ ఎన్నికల ఫలితాలను రద్దు చేయడం.

3. డిసెంబరు 14 వ తేదీన ఎలక్టర్లు పాల్గొనే ఎన్నికలో ఆ రాష్ట్రంలోని ఎలక్టరల్ కాలేజీ ఓట్లను చట్ట సభ ద్వారా బైడెన్‌కు బదులుగా ట్రంప్‌కి వేసేటట్లు చూసుకోవడం

ఇదే ప్రక్రియను విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలలో చేస్తే ట్రంప్ గెలుచుకున్న 232 ఎలక్టోరల్ ఓట్లను కొంత వరకు పెంచుకునేలా చేయవచ్చు.

బైడెన్‌కి వచ్చిన 306 ఓట్ల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించినా ఆ ఎన్నికల తుది ఫలితాలను ప్రతినిధుల సభ నిర్ణయిస్తుంది.

ప్రతినిధుల సభ డెమొక్రాట్ల అధీనంలో ఉన్నప్పటికీ, కొన్ని మార్మిక నియమాల వలన ట్రంప్‌కి లాభం చేకూరే అవకాశం ఉంది.

జో బైడెన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ట్రంప్ చేస్తున్న పనులు చాలా ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయని బైడెన్ గురువారం నాడు ఒక పత్రికా సమావేశంలో అన్నారు

ట్రంప్ ఏం చేస్తున్నారు?

రాష్ట్రాల్లో అధ్యక్షున్ని ఎన్నుకోవడానికి మార్పులు చేయగలిగే వారి పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు.

అమెరికాలో అధ్యక్షున్ని ఎన్నుకోవడం అంటే ఆ పోటీ రాష్ట్రాలలోనే జరుగుతుంది కానీ, ఇది జాతీయ ఎన్నిక కాదు. ప్రజలు ఆయా రాష్ట్రాలలో ఎలక్టర్లను ఎన్నుకుంటారు. ఇక్కడ గెలిచిన ఎలక్టార్లు అధ్యక్షునికి ఓటు వేస్తారు. వీరు రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ అభిప్రాయాన్ని అనుసరిస్తారు. ఉదాహరణకు మిషిగన్‌లో బైడెన్ గెలిచారు కాబట్టి అందరూ ఆయననే ఎన్నుకుంటారు.

ఇద్దరు రిపబ్లికన్లు, ఇద్దరు డెమొక్రాట్లతో కూడిన మిషిగన్ రాష్ట్ర ప్రచార బోర్డు సోమవారం సమావేశమై ఓట్లను లెక్కించి ఆ రాష్ట్రంలో 16 ఎలక్టర్ల ఓట్లు బైడెన్‌కి వేయనున్నట్లు ధృవీకరించాల్సి ఉంది.

మిషిగన్ లో అతి పెద్ద నగరమైన డెట్రాయిట్ లో ఎన్నికల ఫలితాలను ధృవీకరించడానికి అంగీకరించని రిపబ్లిక్ పార్టీకి చెందిన అధికారులను ట్రంప్ కలిసారనే వార్తలు రావడంతో ప్రస్తుతం వచ్చిన ఓట్ల ఫలితాలను ఆమోదించవద్దని రాష్ట్రాల మీద ట్రంప్ ఒత్తిడి పెడుతున్నట్లు సూచన అందింది.

అమెరికాలో ఉన్న వేలాది ప్రచారకులలో ఒక ఇద్దరు కింది స్థాయి పార్టీ అధికారులు అమెరికా అధ్యక్షుడితో నేరుగా మాట్లాడటం కొంత అసాధారణంగానే ఉంది. ఎన్నికల ప్రక్రియ విచారణను అడ్డుకుంటామనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ట్రంప్ తో చర్చల తర్వాత వారి నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేశారు.

మిషిగన్ చట్ట సభలో నాయకులంతా శుక్రవారం వైట్ హౌస్ లో ట్రంప్ ని కలిసేందుకు వెళ్ళడానికి ఆమోదం తెలపడం కూడా ట్రంప్ ఉద్దేశాలు ఏమై ఉంటాయనేందుకు ఆధారాలుగా నిలుస్తున్నాయి.

ఈ అనుమానాలకు తోడుగా ఎన్నికల ఫలితాలను సమీక్షించాలని, లేదా తిరగరాయాలని ట్రంప్ కొన్ని రాష్ట్రాల చట్ట సభల మీద ట్రంప్ ఒత్తిడి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

సాధారణంగా ఎన్నికలలో రాష్ట్రాలలో పోల్ అయిన మొత్తం ఓట్లను రెండు పార్టీల వారు కలిసి లాంఛనప్రాయంగా ఆమోదించే ప్రక్రియను ఇప్పుడు ట్రంప్ మరో నాలుగు సంవత్సరాల పాటు అధ్యక్ష పదవిలో ఉండేందుకు అనువుగా వాడుకోవాలని చూస్తున్నారు.

ట్రంప్ వ్యతిరేక నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయా?

ట్రంప్ గెలిచే అవకాశాలు లేవని పూర్తిగా కొట్టి పారేయలేం. కానీ, అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముందుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ తక్కువ ఆధిక్యతతో గెలిచిన చాలా రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలను తిరగ రాయాల్సి ఉంటుంది. ఇది 2000 సంవత్సరం కాదు.

ట్రంప్ లీగల్ బృందం లక్ష్యంగా చేసుకున్న మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, నెవాడా లో ఉన్న డెమొక్రటిక్ గవర్నర్లు ఇదంతా జరుగుతూ ఉంటె చూస్తూ ఊరుకోరు. ఉదాహరణకు మిషిగన్లో ఉన్న గవర్నర్ ప్రస్తుత రాష్ట్ర ఎలక్షన్ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు ద్వారా బైడెన్ విజయాన్ని ప్రకటించవచ్చు.

అలా అని బైడెన్ మద్దతుదారులు ఆందోళన చెందకుండా ఉండాల్సిన పరిస్థితి కూడా కాదు. లాటరీ పొందిన తర్వాత ఏదైనా మెరుపులా వచ్చి దానిని తన్నుకుపోతే అదొక రాజకీయ ఉపద్రవంగా పరిణమిస్తుంది. ఇలాంటి అవకాశం ఏ మాత్రం ఉన్నా అది డెమొక్రాట్లకు వణుకును తెప్పిస్తుంది.

ట్రంప్ వ్యూహానికి చట్ట బద్ధత ఉందా?

ట్రంప్ అధ్యక్ష పదవి నిబంధనలను సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ సమయాన్ని శ్వేత సౌధంలో గడిపారు. ఆయన పదవీ కాలంలో ఆఖరి రోజులు కూడా అంత కన్నా భిన్నంగా ఉండేటట్లు లేవు.

ఎన్నికల అధికారుల మీద, రాష్ట్రాల చట్ట సభల పైనా ట్రంప్ ఒత్తిడి తేవడం వివాదాస్పదమైనప్పటికీ అది చట్ట వ్యతిరేకం అయితే కాదు.

గతంలో రాష్ట్రాల చట్ట సభలకు ఎలక్టోరల్ ఓట్లను ఎలా కేటాయించాలనే అంశం పై విస్తృతమైన అధికారాలు ఉండేవి. ఇప్పటికీ వారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రవర్తించాలని రాజ్యాంగ నియమం ఏమి లేదు. కాలక్రమేణా, వారి ఓట్లను ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వేసేందుకు వారి అధికారాలను పరిమితం చేసుకున్నారు. అయితే, వ్యవస్థలో ఉండే కొన్ని పునాదులు మాత్రం చెక్కు చెదరలేదు.

ఒక వేళ మిషిగన్ లాంటి చట్టసభలను ఒప్పించడంలో ట్రంప్ విజయం సాధించగల్గితే డెమొక్రాట్లు కూడా చట్టపరంగా వ్యతిరేకించగలరు. ఇక్కడ జాతీయ, రాష్ట్రాల చట్టాలు విభిన్నంగా ఉంటాయి.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రాలు వెనక్కి వెళ్లి చట్టాలలో మార్పులు చేయగలవా అనేది ఒక సందేహం. బహుశా చేయవచ్చు. అయితే, తుది నిర్ణయం మాత్రం జడ్జీల పైనే ఆధారపడి ఉంటుంది.

ట్రంప్ మద్దతు ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Getty Images

గతంలో ఇలా ఎవరైనా చేశారా?

2000 సంవత్సరంలో అల్ గోర్ కి జార్జి డబ్ల్యు బుష్ కి మధ్య జరిగిన పోటీలో ఫ్లోరిడాలో అభ్యర్థుల మధ్య కేవలం కొన్ని వందల ఓట్ల ఆధిక్యత మాత్రమే కనిపించింది. ఆ సమయంలో యుఎస్ సుప్రీం కోర్టు రంగంలోకి ప్రవేశించి ఆ ఎన్నికల పై సమీక్షలు ఆపమని ఆదేశించడంతో బుష్ అధ్యక్ష పదవిని చేపట్టారు.

విభిన్న రాష్ట్రాలలో ఎన్నిక వివాదాస్పదంగా మారితే 1876 లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి రూథర్ ఫోర్డ్ బి హేస్ , డెమొక్రటిక్ అభ్యర్థి శామ్యూల్ టిల్డన్ కి మధ్య జరిగిన పోటీని చూడాల్సి ఉంటుంది.

ఆ ఎన్నికలలో లూసియానా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాలలో ఏ ఒక్క అభ్యర్థికీ ఎలక్టోరల్ కాలేజీలో ఆధిక్యత లభించలేదు. ఫలితాల ప్రకటనలో ఏర్పడిన స్తంభనతో అమెరికా ప్రతినిధుల సభ హేస్ కి మద్దతుగా నిలిచింది. 2000 లో బుష్ కి 2016 లో ట్రంప్ కూడా జాతీయంగా వారి ప్రత్యర్థి కంటే తక్కువ ఓట్లే లభించాయి.

ట్రంప్ ఆఫీసు వదిలి వెళ్లనంటే ఏం జరుగుతుంది?

ఎన్నికల ఫలితాలను తారు మారు చేయాలనే ట్రంప్ ప్రయత్నాలు విఫలమైతే జనవరి 20 వ తేదీన జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి ట్రంప్ అంగీకారంతో సంబంధం లేదు.

ఆ తరువాత అమెరికా సీక్రెట్ సర్వీస్, సైన్యం, ప్రభుత్వ ఆస్తులను అనధికారికంగా వాడే ఒక సాధారణ వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించే హక్కులు కలిగి ఉంటారు.

ట్రంప్ చేస్తున్న పనులు చాలా ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయని బైడెన్ గురువారం నాడు ఒక పత్రికా సమావేశంలో అన్నారు.

"ప్రజాస్వామ్యం పని చేసే విధానం పై చాలా దెబ్బ తీసే సందేశాలను ప్రపంచానికి అందిస్తున్నారు" అని ఆయన అన్నారు.

ఒక వేళ అధ్యక్షుడు ఎన్నికలలో గెలవకపోయినా, ఎన్నికల ఫలితాల పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన అవలంబిస్తున్న వ్యూహం మాత్రం రాబోయే ఎన్నికలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇది అమెరికా ప్రజాస్వామ్య విధానాల మీద, వ్యవస్థల మీద అమెరికన్లకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)