డోనల్డ్ ట్రంప్: క్యాపిటల్ హిల్ దాడిని ప్రేరేపించినందుకు రెండోసారి అభిశంసనకు గురైన అధ్యక్షుడు

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా క్యాపిటల్ హిల్ భవనంలోకి 'చొరబాట్లను ప్రేరేపించినందుకు' అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది.

అభిశంసన తీర్మానానికి పదిమంది రిపబ్లికన్లు కూడా మద్దతు పలకడంతో బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో 232-197 మెజారిటీతో ట్రంప్‌పై మోపిన అభిశంసన తీర్మానం నెగ్గింది.

అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడుగా ట్రంప్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

ట్రంప్ అభిశంసనపై తదుపరి విచారణ సెనేట్‌లో జరగనుంది. అయితే, కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే ఈ విచారణ జరగనుంది.

జనవరి 20న బైడెన్ అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

ట్రంప్

బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వాషింగ్టన్ డీసీలోనూ, 50 అమెరికా రాష్ట్రాల రాజధానుల్లోనూ మరిన్ని సాయుధ నిరసన ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది.

కాంగ్రెస్‌లో ఓటింగ్ జరిగిన తరువాత ట్రంప్ ఒక వీడియోను విడుదల చేస్తూ..తన అభిమానులు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

"హింస, దాడులకు మన దేశంలో స్థానం లేదు. నా నిజమైన అనుచరులు ఎప్పుడూ రాజకీయ హింసకు మద్దతు తెలుపరు" అని ట్రంప్ అన్నారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ట్రంప్‌పై మోపిన అభియోగాలేంటి?

ట్రంప్‌పై మోపిన అభిశంసన అభియోగాలు రాజకీయపరమైనవే కానీ నేరపూరితమైనవి కావు. జనవరి 6న ట్రంప్ తన ప్రసంగంలో వైట్ హౌస్ వెలుపల ర్యాలీ నిర్వహించాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారని, అదే క్యాపిటల్‌పై దాడిని ఉసిగొల్పిందని ఆరోపించారు. "శాంతియుతంగా, దేశభక్తితో తమ గొంతు వినిపించేలా" ర్యాలీ చెయ్యాలని ట్రంప్ తెలిపినప్పటికీ, మోసపూరితంగా జరిగిన ఎన్నికలపై "తీవ్రంగా దండెత్తాలని" కూడా పిలుపునిచ్చారు.ట్రంప్ వ్యాఖ్యల తరువాత ఆయన మద్దతుదారులు క్యాపిటల్‌పై దాడి చేసారు. ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

వీడియో క్యాప్షన్, అమెరికాలో అధికార మార్పిడి మరో వారం రోజుల్లో... ఏం జరగబోతోంది?

"అధ్యక్ష ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని, ఫలితాలను అంగీకరించకూడదంటూ ట్రంప్ పదే పదే తప్పుడు ప్రచారాలు చేశారని" అభిశంసన పత్రంలో పేర్కొన్నారు.

ట్రంప్ "ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని, ఫలితంగా క్యాపిటల్‌పై చట్టవిరుద్ధమైన దాడి జరిగిందని" ఇందులో తెలిపారు.

"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతీయ భద్రతను తీవ్ర ప్రమాదంలో పడేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సమగ్రతకు భంగం కలిగించారు. శాంతియుతంగా జరగాల్సిన అధికార బదలాయింపుకు ఆటంకం కలిగించారు. ప్రభుత్వంలో ముఖ్య భాగమైన క్యాపిటల్‌పై దాడిని ప్రేరేపించారు" అని ఈ అభిశంసన పత్రంలో పేర్కొన్నారు.

2020 అమెరికా అధ్యక ఎన్నికల ఫలితాలను, ట్రంప్ ఓటమిని అంగీకరించబోమంటూ గతవారం 139 మంది రిపబ్లికన్లు ఓట్లు వేసారు.

అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు

చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ఏం చెప్పారు?

"అమెరికా అధ్యక్షుడు సాయుధ తిరుగుబాటును ప్రేరేపించారు. మనందరం ఎంతో ప్రేమించే దేశానికి ఆయన ప్రమాదంగా మారారు. ఆయన గద్దె దిగాల్సిందే" అని స్పీకర్ నాన్సీ పెలోసీ అన్నారు.

"అధ్యక్ష కార్యాలయాన్ని ఆక్రమించిన అత్యత ప్రమాదకరమైన వ్యక్తి" అని డెమొక్రాట్ పార్టీకి చెందిన జూలియాన్ కాస్ట్రో అన్నారు.

పలువురు రిపబ్లికన్లు ట్రంప్ అనుచిత వ్యాఖ్యలకు మద్దతు తెలుపలేదుగానీ జాతీయ ఐక్యత కొరకు ట్రంప్‌పై అభిశంసన విరమించుకోవాలని డెమోక్రాట్లను కోరారు.

"ఇంత తక్కువ వ్యవధిలో అధ్యక్షుడిని అభిశంసించడం పొరపాటు అవుతుంది. అయితే, జరిగిన దాన్లో ట్రంప్ తప్పు లేదని కాదు. గత బుధవారం క్యాపిటల్‌పై జరిగిన దాడికి ట్రంప్ బాధ్యత వహించవలసిందే" అని సభలో సీనియర్ రిపబ్లికన్ నేత కెవిన్ మకార్తీ తెలిపారు.

"తమ రాజకీయ ప్రయోజనలకోసం డెమొక్రాట్లు నిర్లక్ష్యంగా దేశాన్ని రెండుగా చీలుస్తున్నారని" ఒహియో రిపబ్లికన్ జిం జోర్డాన్ అన్నారు."ట్రంప్ గుంపును పిలిచారు. వాళ్లను కూడగట్టారు. ఈ దాడికి ఆజ్యం పోశారు" అని సభలో మూడో సీనియర్ రిపబ్లికన్ నాయకురాలు లిజ్ చెనీ అన్నారు.

"తన కార్యాలయానికి, రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి ఏ అమెరికా అధ్యక్షుడు, ఎప్పుడూ ఇంత పెద్ద ద్రోహం చేయలేదు" అని వ్యోమింగ్ ప్రతినిధి మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కుమార్తె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)