రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్ ఫొగాట్, ఒలింపిక్స్‌లో ఆమెను అనర్హురాలిగా ప్రకటించడంపై రాజ్యసభలో దుమారం..

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ బౌట్‌కు కొన్ని గంటల ముందు వినేశ్ ఫొగాట్‌ను అనర్హురాలిగా ప్రకటించారు. అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంశంపై గురువారం రాజ్యసభలో దుమారం రేగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వినేశ్ ఫొగాట్ గురువారం ఎక్స్ (ట్విటర్)లో ప్రకటించారు.
‘‘అమ్మా, నాపై కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. క్షమించు. నీ కల, నా ధైర్యం రెండూ చెదిరిపోయాయి. ఇంతకు మించిన శక్తి ఇక నాలో లేదు.
(కుస్తీకి వీడ్కోలు 2001-2024.)
మీ అందరికీ రుణపడి ఉంటాను, క్షమించండి’’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

‘‘వినేశ్ మానసికంగా కుంగిపోయారు’’
మంగళవారం రాత్రి సెమీస్ గెలిచిన తర్వాత వినేశ్, స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు.
బుధవారం రాత్రి ఈ పోరు జరగాల్సి ఉండగా, నిర్ణీత బరువు కంటే కొన్ని గ్రాములు అదనపు బరువు ఉన్నారనే కారణంతో వినేశ్‌ను ఫైనల్ పోటీలకు అనర్హురాలిగా ప్రకటించారు.
ఫొగాట్‌పై అనర్హత వేటు గురించి తెలిసి షాక్‌కు గురయ్యానని, నిరాశ చెందానని భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు.
ప్రస్తుతం వినేశ్ శారీరకంగా, ఆరోగ్యం పరంగా బాగానే ఉన్నారని మానసికంగా కుంగిపోయారని పీటీ ఉష చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
‘‘వినేశ్ అనర్హతకు గురయ్యారనే వార్త ఎంతో షాకింగ్‌గా, నిరాశగా అనిపించింది. తర్వాత వినేశ్‌ను కలిసేందుకు వెళ్లాను. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ, మానసికంగా కుంగిపోయారు. మా సహాయక బృందం ఆమెతో ఉన్నారు’’ అని పీటీ ఉషను ఉటంకిస్తూ వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘కాస్’లో వినేశ్ అప్పీల్
అనర్హత వ్యవహారంపై ఫొగాట్, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్)లో అప్పీల్ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
తనకు రజతం ఇవ్వాలంటూ ఫొగాట్ చేసిన అప్పీల్‌పై గురువారం ఉదయం కాస్ తీర్పునిస్తుందని ఐఓఏ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ తెలిపింది.
‘‘తనపై అనర్హతను సవాలు చేస్తూ వినేశ్, కాస్‌లో అప్పీల్ చేశారు. రజతం ఇవ్వాలని కోరారు. గురువారం ఉదయం కాస్ తీర్పునిస్తుంది’’ అని ఏఎన్‌ఐ తన కథనంలో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘వినేశ్, మీరు ఓడిపోలేదు, మిమ్మల్ని ఓడించారు’’
వినేశ్ రిటైర్మెంట్ ట్వీట్‌పై సహచర రెజ్లర్ బజ్‌రంగ్ స్పందించారు.
‘‘వినేశ్ మీరు ఓడిపోలేదు, మిమ్మల్ని ఓడించారు. మాకు మీరే ఒక విజేత. మీరు భారత పుత్రిక మాత్రమే కాదు, దేశానికి గర్వకారణం’’ అని బజ్‌రంగ్ ట్వీట్ చేశారు.
వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన తర్వాత హరియాణా సీఎం నయాబ్ సైనీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
“హరియాణాకు చెందిన మా వీర కుమార్తె వినేశ్ ఫొగాట్ అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్ ఫైనల్స్‌కు చేరారు.
కొన్ని కారణాల వల్ల ఆమె ఒలింపిక్ ఫైనల్ ఆడలేకపోయి ఉండొచ్చు. కానీ ఆమె మనందరికీ చాంపియన్.
వినేశ్ ఫొగాట్‌ను ఒక పతక విజేతగా స్వాగతించాలని, సత్కరించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.
ఒలింపిక్ రజత పతక విజేతకు అందించే అన్ని రివార్డులు, సన్మానాలు, సౌకర్యాలను వినేశ్ ఫొగాట్‌కు కూడా కృతజ్ఞతతో మా ప్రభుత్వం అందజేస్తుంది.
మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం వినేశ్’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Sansad/tv
వినేశ్ ఫొగాట్ అనర్హతపై రాజ్యసభలో దుమారం
ఒలింపిక్స్ ఫైనల్‌కు ముందు వినేశ్ ఫొగాట్‌పై అనర్హత అంశాన్ని గురువారం కూడా పార్లమెంటులో లేవనెత్తారు. ఈ అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి.
వినేశ్ అనర్హత చాలా ముఖ్యమైన అంశమని, దీని గురించి నిన్ననే తాము ప్రస్తావించామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
ఇది ఫలానా వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, దీనిపై చర్చించాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.
రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ ఈ అంశంపై చర్చకు నిరాకరించారు.
వినేశ్ ఫొగాట్ అంశంపై రాజ్యసభలో విపక్షాలు గందరగోళం సృష్టించి సభ నుంచి వాకౌట్ చేశాయి.
వినేశ్ అనర్హత అంశం కేవలం తమనే బాధిస్తోందని విపక్షాలు భావిస్తున్నాయని ధన్కడ్ వ్యాఖ్యానించారు.
‘‘మన అమ్మాయి నిష్క్రమణతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. రాష్ట్రపతి నుంచి ప్రధాని వరకు అందరూ విచారంగా ఉన్నారు’’ అని ధన్కడ్ వ్యాఖ్యానించారు.
వినేశ్ ఫొగాట్ అంశం అధికార వర్గం, ప్రతిపక్షాలకు చెందినది కాదని, దేశానికి సంబంధించినదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రతిపక్షాలు రగడ చేయడానికి ఇంకేం మిగల్లేదని వ్యాఖ్యానించారు.
భారత ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వ శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమస్యను ప్రతీ సంబంధిత ఫోరమ్‌లలో లేవనెత్తారని ఆయన అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















