శ్రీజేష్: క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశాన్ని హాకీ వైపు చూసేలా చేసిన ఆటగాడు

భారత జట్టు, హాకీ, కాంస్య పతకం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శ్రీజేష్ 2006లో హాకీలో అడుగు పెట్టాడు.
    • రచయిత, వికాస్ పాండే,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకోగానే ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.

అయితే పీఆర్ శ్రీజేష్ అనే ఆటగాడు మాత్రం మైదానంలో ఒకవైపు నుంచి మౌనంగా నడుచుకుంటూ రెండో వైపు వెళ్లి గోల్‌పోస్ట్ ఎదుట తల వంచి నమస్కరించాడు. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఆయన ఇల్లు అదే.

ఇకపై ఆ ఇంటికి దూరం అవుతున్నాడు. అయితే భారత జట్టు అంతకంటే ఎక్కువగా ఆయన్ని మిస్ అవుతోంది. ఈ గోల్ కీపర్ గురువారం తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

‘ద వాల్ ఆఫ్ ఇండియా’ గా ఫేమస్ అయిన శ్రీజేష్ ఈ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ మీద భారత్ 2-1 ఆధిక్యంతో ఉన్నప్పుడు దాన్ని సమం చేసేందుకు స్పెయిన్ జట్టు చివర్లో చేసిన ప్రయత్నాలను శ్రీజేష్ బలంగా అడ్డుకున్నాడు.

జట్టును గెలిపించేందుకు పూర్తి శక్తియుక్తుల్ని, వ్యూహాత్మక డైవ్‌లను ప్రదర్శించాడు. స్పెయిన్ జట్టు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లలో ఒక్కదాన్ని కూడా గోల్‌గా మలచలేక పోయిందంటే ఆట మీద అతని ప్రభావం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

జట్టు సాధించిన ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకునేందుకు శ్రీజేష్, అతని డిఫెన్స్ టీమ్ ప్రత్యర్ధి జట్టుని చివరి వరకు డిఫెండింగ్ లైన్‌కు అవతలే నిరోధించింది.

భారత హాకీ జట్టును పతకాల రేసులోకి తీసుకు వచ్చిన ఘనత కూడా ఈ మాజీ కెప్టెన్‌కే దక్కుతుంది. గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌లోకి వెళ్లింది. దీంతో తన జట్టుని రక్షించేందుకు ఈ గోల్‌ కీపర్ మరోసారి రంగంలోకి దిగాడు. బ్రిటన్ జట్టు కొట్టిన రెండు షాట్లను అడ్డుకోవడం ద్వారా జట్టును పతకం దిశగా నడిపించాడు.

భారత హాకీ జట్టు, పారిస్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోల్ పోస్ట్ దగ్గర వేగంగా కదలడంలో నేర్పరి

సెమీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో భారత్ జట్టు ఓడిపోయిన తర్వాత స్వర్ణపతకం చేజారిపోయిందని శ్రీజేష్ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే వెంటనే తేరుకుని తన దృష్టిని కాంస్య పతకం గెలుచుకునే అవకాశం ఉన్న మ్యాచ్ మీద పెట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత కూడా శ్రీజేష్ ఏడ్చాడు. అయితే ఈసారి అవి ఆనందంతో కూడిన కన్నీళ్లు.

దాదాపు రెండు దశాబ్దాలుగా దేశం ఆశలు, కలలను మోసిన వ్యక్తికి ధన్యవాదాలు చెబుతూ భారతీయులు కూడా ఏడ్చారు. సోషల్ మీడియా ఆయనను అభినందనలతో ముంచెత్తింది.

భారత్‌ క్రికెట్‌ను వెర్రిగా అభిమానించే దేశం. జాతీయ క్రీడ అయినప్పటికీ హాకీకి, హాకీ జట్టులో ఆటగాళ్లకు, ఇతర క్రీడలకు, క్రీడాకారులకు కూడా పెద్దగా గుర్తింపు ఉండదు. క్రికెటర్లతో పోల్చుకుంటే వారి ఆదాయం చాలా తక్కువ. ఇలాంటి దేశంలో హాకీ జట్టులో గోల్‌కీపర్‌కు గుర్తింపు దక్కడం దాదాపు అసాధ్యం.

“ఒక గోల్‌ కీపర్‌ను అభిమానించడం చాలా కష్టం. అతను ఆటలో పెద్దగా కనిపించడు, ఏదైనా తప్పు చేస్తే మాత్రం అందరూ అతణ్నే విమర్శిస్తారు. నేను యువకుడిగా ఉన్నప్పుడు భారత హాకీ జట్టు గోల్‌కీపర్ ఎవరో నాకు తెలియదు.” అని 2021లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు శ్రీజేష్.

శ్రీజేష్ ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు కోసం లేదా స్టార్‌డమ్ కోసం ప్రయత్నించలేదు. గోల్‌కీపర్‌గా తన బాధ్యతల మీదనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. హాకీలో ఆయన ప్రవేశం చేదు జ్ఞాపకాలను మిగిల్చినప్పటికీ తన వైఖరిని మార్చుకోలేదు. వేగంగా స్పందించడం, బంతి ఎటువైపు కదులుతుందనే దాన్ని క్షణాల్లో గుర్తించడం లాంటి అతని సామర్థ్యాలు జూనియర్ లెవెల్లో అతనికి గుర్తింపు తెచ్చాయి.

అయితే 2006 సౌత్ ఏషియన్ గేమ్స్‌లో సీనియర్ టీమ్‌లోకి ఆయన ప్రవేశించినప్పుడు పరిస్థితులు అంత బాగా ఏమీ లేవు. టోర్నమెంట్ అంతా బాగానే ఆడినప్పటికీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మీద ఒక గోల్‌ను అడ్డుకోలేకపోయాడు. దీంతో ఆయనపై విమర్శల దండయాత్ర జరిగింది. అవి ఆయనకు చాలా పాఠాలు నేర్పాయి..

పారిస్ ఒలింపిక్స్, భారత హాకీ జట్టు, కాంస్య పతకం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత హాకీ జట్టుని విజయపథంలో నడడంలో శ్రీజేష్ కీలక పాత్ర

ఆ తర్వాత కొన్నేళ్ల పాటు కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయనకు జట్టులో శాశ్వత స్థానం దక్కలేదు. భారత హాకీ జట్టుకు గడ్డు కాలం నడుస్తున్న కాలంలో శ్రీజేష్‌తో పాటు ఆయన జట్టు కూడా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం క్వాలిఫై కూడా కాలేదు.

అయినప్పటికీ శ్రీజేష్ తన నైపుణ్యాల విషయంలో రాజీ పడలేదు. నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఆయన ఎదురు చూస్తున్న తరుణం 2011లో వచ్చింది. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్- పాకిస్తాన్ మరోసారి పోటీపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో శ్రీజేష్ పూర్తి ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించాడు. పాకిస్తాన్ జట్టుకు వచ్చిన రెండు పెనాల్టీలను అడ్డుకుని భారత్‌ను విజేతగా నిలిపాడు.

ఈ మ్యాచ్ తర్వాత శ్రీజేష్ అందరి దృష్టిలో పడ్డాడు. దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2012 ఒలింపిక్స్‌లో పాల్గొనే హాకీ జట్టులో భాగంగా లండన్ వెళ్లాడు. అయితే ఈ ఒలింపిక్ క్రీడల్లో భారత్ పతకం సాధించకుండానే వెనుదిరిగింది.

శ్రీజేష్, గోల్ కీపర్, భారత హాకీ జట్టు, కేరళ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జట్టులో సహచరుల అభిమానాన్ని చూరగొన్న గోల్‌కీపర్

లండన్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఆట తీరు బాగా లేకున్నా గోల్‌కీపర్‌గా శ్రీజేష్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 2014 ఏషియన్ గేమ్స్‌లో భారత్- పాకిస్తాన్ ఫైనల్‌కు చేరినప్పుడు ఆయన ఎదురు చూస్తున్న అద్భుత క్షణం వచ్చింది. ఆ మ్యాచ్‌లో రెండు పెనాల్టీలను అడ్డుకున్న శ్రీజేష్ భారత్‌ పతకం గెలుచుకోవడంలో కీలకమయ్యాడు. తద్వారా పతకం కోసం 16ఏళ్లుగా ఎదురు చూస్తున్న జట్టు ఆశలకు జీవం పోశాడు.

అతని వ్యక్తిత్వం, స్థిర చిత్తం, దృఢ నిశ్చయాన్ని గురించి చెప్పాలంటే 2015లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్‌లో హాలెండ్ మీద విజయం సాధించి కాంస్య పతకం గెలిచిన మ్యాచ్ గురించి చెప్పాలి.

ఆ మ్యాచ్‌లో శ్రీజేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన తొడలకు ఐస్‌ప్యాక్‌లు తొడికారు. కాలి బొటన వేలు దాదాపు విరిగింది. భుజానికి సర్జికల్ టేప్‌లు అంటించి ఉన్నాయి. ఆ మ్యాచ్ ముగిశాక ఆయన నడవగలిగే స్థితిలో కూడా లేడు.

ఒక భద్రపరిచిన శవం మాదిరిగా తాను గోల్‌పోస్టులో నిల్చున్నానని శ్రీజేష్ అప్పట్లో జోక్ చేశాడు. ఆ బాధ, జోకుల వెనుక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టోర్నమెంట్‌లో మూడు దశాబ్ధాల తర్వాత భారత్‌కు పతకం సాధించాలన్ని సంకల్పం ఉంది. పెనాల్టీ షూటౌట్లను ‌అడ్డుకోవడం ద్వారా బలమైన జట్టు మీద భారత్ విజయం సాధించడంతో పాటు పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

2015 హాకీ వరల్డ్ లీగ్ తర్వాత భారత హాకీ జట్టులో శ్రీజేష్ స్థానం స్థిరపడింది. రియో ఒలింపిక్స్‌లో జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కింది. ఆ ఒలింపిక్స్‌లో భారత్ పతకం గెలవలేదు కానీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. లండన్ ఒలింపిక్స్‌తో పోలిస్తే రియోలో భారత ప్రదర్శన మరింత మెరుగుపడింది.

సక్సెస్ ఏనాడు అతని తలకెక్కలేదు. మిగతా క్రీడాకారుల మాదిరిగా కాకుండా గ్లామరస్ లైఫ్, సెలబ్రిటీ స్టేటస్ లాంటి వాటికి దూరంగా ఉన్నాడు.

గోల్ కీపర్, కేరళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రత్యర్థులు కొట్టే షాట్లను అడ్డుకుని భారత్‌కు విజయాలు అందించిన గోల్ కీపర్

2017లో శ్రీజేష్‌కు తగిలిన గాయ ఆయన కెరీర్‌పై ఆందోళన రేకెత్తించింది. రెండు సర్జరీలు, కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత అన్ని రకాల అవరోధాలను ఎదుర్కొని ఆయన తిరిగి జట్టులోకి వచ్చాడు.

జట్టులోకి వచ్చిన తర్వాత ఆయన ఆట తీరు మెరుగుపడినా, గ్రౌండ్‌లో వేగంగా స్పందించలేకపోతున్నాడంటూ విమర్శకులు ఆరోపించేవారు. యువ గోల్‌కీపర్లు తమకు అవకాశం కల్పించాలని చెప్పేవారు. అయిత శ్రీజేష్ ఈ సందడికి దూరంగా కష్టపడి పని చేసుకుంటూ వెళ్లాడు.

ఆటపై తనకున్న అవగాహనతో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకం గెలుచుకోవడంలో తనవంతు కృషి చేశాడు శ్రీజేష్.

శ్రీజేష్ కేరళలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. మొదటి నుంచి ఆటలంటే ఆసక్తి. అయితే రన్నింగ్ మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దీంతో ఇతర క్రీడల్లో ఉత్సాహం చూపించారు. హాకీలో కూడా పెద్దగా పరుగు తీయాల్సిన అవసరం లేని గోల్ కీపర్ మీద దృష్టి పెట్టారు.

రాష్ట్ర స్థాయిలో అద్భుతంగా రాణించడంతో 2003లో జాతీయ జట్టు ఎంపిక కోసం దిల్లీ వచ్చారు.

దాదాపు 48 గంటలు ప్రయాణం చేసి దేశ రాజధాని చేరుకున్నారు. జట్టులో క్రీడాకారులంతా హిందీ మాట్లాడే వారే అయినప్పటికీ శ్రీజేష్‌కు పెద్దగా హిందీ రాదు.

హాస్టల్‌లో ఎక్కువగా హిందీ మాట్లాడే వారితో ఉండటంతో హిందీ నేర్చుకోవడానికి శ్రీజేష్ అనేక తంటాలు పడినప్పటికీ చివరకు భాష నేర్చుకున్నారు. మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగే సమయంలో అప్పుడప్పుడూ హిందీలో కొన్ని సరదా మాటలు చెప్పి వాతావరణాన్ని తేలిక పరిచేవాడు.

శ్రీజేష్. భారత హాకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత హాకీ జట్టు పతకం గెలిచిన మ్యాచ్‌లోనే కెరీర్‌కు ముగింపు పలికిన శ్రీజేష్

భారత జట్టుకి ఎంపికైన తర్వాత కూడా శ్రీజేష్‌కు గోల్‌ కీపర్‌గా మంచి కిట్ దొరకలేదు. దీంతో ఆయన తండ్రి ఆవును అమ్మేసి 10వేల రూపాయలు ఇవ్వడంతో మంచి కిట్ కొనుక్కున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకం సాధించిన తర్వాత గ్రామంలోని ప్రజలంతా శ్రీజేష్ ఇంటికి చేరి ఆయన తండ్రికి అభినందనలు చెప్పారు.

శ్రీజేష్‌కు ప్రస్తుతం ఆయన ఇద్దరు పిల్లలే ప్రధమ ప్రాధాన్యం. దీంతో పాటు జూనియర్ హాకీ టీమ్ కోచ్‌గా ఆయన కొత్త పాత్ర పోషించబోతున్నాడు.

“హాకీతో నా ప్రయాణం ముగిసింది. ఇప్పుడు నా పిల్లల ప్రయాణం ప్రారంభమైంది.” అని శ్రీజేష్ ఒలింపిక్స్ డాట్‌ కామ్‌తో అన్నాడు.

“ప్రజలు నన్ను మంచి వ్యక్తిగా గుర్తు పెట్టుకుంటే చాలు. యువకులు, పిల్లలు ప్యాడప్ అయ్యి హాకీ మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు నేను శ్రీజేష్ మాదిరిగా మంచి గోల్ కీపర్ కావాలి అనుకోవాలి.” అని శ్రీజేష్ అన్నట్లు ది హిందూస్థాన్ టైమ్స్ తెలిపింది

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)