నీరజ్-అర్షద్: ఈ ఇద్దరు ఆటగాళ్ల తల్లులు తమ కొడుకుల గురించి ఏం చెప్పారు?

- రచయిత, వికాస్ త్రివేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
'వీర్ జారా' సినిమాలో వీర్ ప్రతాప్ సింగ్‌ని పాకిస్తానీ మహిళ అయిన మరియం హయత్ ఖాన్ ఒక ప్రశ్న అడుగుతుంది. ‘మీ దేశంలోని ప్రతి కొడుకు నీలాగే ఉంటాడా?" అని.
అందుకు వీర్ ప్రతాప్ సింగ్..."అది నాకు తెలియదు. కానీ నా దేశంలో ప్రతి తల్లి కచ్చితంగా మీలాగే ఉంటుంది" అని బదులిస్తాడు.
ఊహకందని దృశ్యాలు సినిమాల్లో నిజమవుతున్నప్పుడు అవి ఎంతో అందంగా ఉంటాయి.
కేవలం 550 కి.మీ.ల దూరంలో ఉన్న ఇద్దరు తల్లులు, వారి దేశాలు వేరుగా ఉన్నప్పటికీ, తామిద్దరం తల్లులమేనని తమ మాటల ద్వారా నిరూపించారు. అది పాకిస్తాన్‌లోని మియాన్ చన్ను ప్రాంతం కావచ్చు, భారత్‌లోని పానీపత్ కావచ్చు. ప్రాంతాలు వేరు. కానీ తల్లి హృదయం ఒక్కటే.
ఈ కథ కేవలం సరోజ్ దేవి కొడుకు నీరజ్ చోప్రా, రజియా పర్వీన్ కొడుకు అర్షద్ నదీమ్‌ల గురించి మాత్రమే కాదు. వీరి మధ్య సాన్నిహిత్యాన్ని తగ్గించడానికి అనుమతించని కొన్ని దూరాలు ఉన్నాయి. ఈ కథనం కూడా ఆ దూరాల గురించే....

కొడుకులే ఆడారు, కానీ..
పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఆగస్టు 8వ తేదీ రాత్రి జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ మొదలైంది.
జావెలిన్ విసిరే ముందు దాదాపు 20 నుంచి 30 మీటర్లు పరిగెత్తుతారు. ఈ రేసులో లక్షలాది మంది గుండె చప్పుడు పెరిగింది. కానీ రెండు ఇళ్లలో నివసించేవారి గుండెలు మాత్రం ఇంకాస్త గట్టిగానే కొట్టుకుంటున్నాయి.
పాకిస్తాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్లు, భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా 89.45 మీటర్ల దూరం జావెలిన్‌లు విసరడంతో ఈ హృదయ స్పందనలు శాంతించాయి.
అర్షద్‌కు స్వర్ణం, నీరజ్‌కు రజతం లభించాయి. అయితే దీని వల్ల భారత్‌కు ఒక రజియా పర్వీన్, పాకిస్తాన్‌కు ఒక సరోజ్ దేవి లభించారు.
రజియా పర్వీన్ కుమారుడు అర్షద్ నదీమ్, సరోజ్ దేవి కుమారుడు నీరజ్ చోప్రా.
కానీ ఈ ఇద్దరు తల్లులను అడిగితే, వారు ఎటువంటి మొహమాటం లేకుండా చెబుతారు, ఇతనూ నా కొడుకే, అతనూ నా కొడుకే అని.
‘మాకు సిల్వర్ కూడా గోల్డ్ లాంటిదే, గోల్డ్ సాధించింది కూడా నా బిడ్డే. చాలా కష్టపడ్డాడు’ అని సరోజ్ దేవి అన్నారు.
ఈ ప్రేమ సరిహద్దు దాటి పొరుగు దేశంలోకి వెళ్లినప్పుడు అక్కడి నుంచి కూడా అదే స్పందన వచ్చింది.
"అతను నా కొడుకు లాంటి వాడు, నదీమ్‌కి స్నేహితుడు, సోదరుడు. గెలుపోటములను నిర్ణయించేది విధి. అతనూ నాకు కొడుకే. అల్లా అతన్ని కూడా గెలిపిస్తాడు. అతనికి కూడా పతకం సాధించే అవకాశం వస్తుంది." అని రజియా అన్నారు.

ఫొటో సోర్స్, EPA
భారత్ వర్సెస్ పాకిస్తాన్ కాదు భారత్‌తో పాకిస్తాన్
ఆ తల్లులు వారి కొడుకుల గురించి చెప్పారు. మరి కొడుకులు ఏమంటున్నారు?
స్వర్ణం గెలిచిన తర్వాత అర్షద్ నదీమ్ "నేను నా మొదటిసారి 2016లో గువాహటీలో నీరజ్ భాయ్‌తో కలిసి పోటీపడ్డాను. అప్పటి నుంచి నీరజ్ చోప్రా భాయ్ గెలుస్తున్నాడని నాకు తెలుసు. అక్కడే నేను మొదటిసారి పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టాను. ఆ తర్వాత కష్టపడితే దూసుకెళతానని నాకు అనిపించింది" అని అన్నాడు.
ఒకవైపు నీరజ్‌ని అర్షద్ పొగుడుతుండగా, మరోవైపు అర్షద్ శ్రమను నీరజ్ గౌరవించాడు.
"ప్రతి ఆటగాడికి అతనికంటూ ఒక రోజు వస్తుంది. ఇవాళ అర్షద్ రోజు. ఆ రోజు ఆటగాడి శరీరం భిన్నంగా ఉంటుంది. టోక్యో, బుదాపెస్ట్, ఏషియన్ గేమ్స్‌లో నాకు సమయం వచ్చింది. అవి నా రోజులు." అని నీరజ్ చోప్రా అన్నాడు.
ఒకవైపు కొడుకులు ఒకరినొకరు పొగుడుకుంటుంటే...తండ్రులు మాత్రం ఎందుకు వెనకబడతారు?

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఈసారి అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇతను చాలా కష్టపడ్డాడు. ఏ ఆటగాడు చేయని అత్యధిక స్కోరును నమోదు చేశాడు.’’ అని నీరజ్ తండ్రి సతీశ్ చోప్రా అన్నారు.
నీరజ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినప్పుడు ఒక విషయం అడిగారు.
‘‘మీ అమ్మ కూడా ఆటల్లో పాల్గొనేవారా? క్రీడా కుటుంబాల స్ఫూర్తి గురించి మీ అమ్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అది నిజంగా కరెక్ట్. ఆమెకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఈ వార్త అర్షద్‌కు చేరినప్పుడు, ‘‘తల్లులు అందరికీ ఒకటే. ఆమెలాంటి తల్లులు దొరికినందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. మేం వారి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాం.’’ అని అర్షద్ అన్నాడు.
భారత్, పాకిస్తాన్ మధ్య వ్యాపించిన ద్వేష భావనను ఆపడం కష్టమని అప్పట్లో భావించే వాడినని క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అన్నారు.
కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసినప్పుడు, ఇటువైపు ఉన్న ప్రజలు అటు వైపు ప్రేమను పంచడం, అటు వైపున్న ప్రజలు ఇటువైపు ప్రేమను పంపడం చూశానని తెలిపారు.
భారత్, పాకిస్తానీ యూజర్లు తరచూ ఆగ్రహం, ఆవేశంతో కూడిన ఎమోజీలు పెట్టుకోవడం మాత్రమే చూశానని చెప్పిన షోయబ్ అఖ్తర్, ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీలు పెట్టుకోవడం చూస్తున్నామని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రా స్నేహం
చాలా సందర్భాల్లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్‌లు స్నేహితులుగా ఉండటం చూశాం.
పారిస్ ఒలింపిక్స్ మ్యాచ్ తర్వాత, నీరజ్, అర్షద్‌లు ఒకరినొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని, హత్తుకున్నారు.
గత ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలిస్తే, అర్షద్ రజతం గెలుచుకున్నారు.
ఈ ఇద్దరి ఆటగాళ్ల కెరీర్‌ను చూస్తే, చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు ఒకటి, రెండు స్థానాల్లో నిలిచేవారు.
2022లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో 90 మీటర్లకు పైగా జావెలిన్‌ను విసరడం ద్వారా అర్షద్ నదీమ్ బంగారు పతకం గెలిస్తే, నీరజ్ గాయం కారణంగా ఆ టోర్నమెంట్ ఆడలేకపోయారు.
కానీ, అర్షద్‌కు శుభాకాంక్షలు తెలియజేయడంలో ఎక్కడ మొహమాట పడలేదు.
మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇరు దేశాల అభిమానులు రగిలిపోవడం చూస్తుంటాం.
అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రాలు మాత్రం పదునైన ఈటెల కొనపై నుంచి తమ ప్రేమ సంచిని మోస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిచి, అర్షద్ నదీమ్ ఐదవ స్థానంలో నిలిచినప్పుడు కూడా ఇదే ప్రేమ కనిపించింది.

అర్షద్‌కు సాయం చేసేందుకు నీరజ్ ప్రయత్నించినప్పుడు..
జావెలిన్ త్రోలో 10 పోటీల్లో నీరజ్, అర్షద్‌లు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు.
నీరజ్ ఏడు సార్లు తొలి స్థానంలో, మూడు సార్లు రెండో స్థానంలో నిలవగా.. అర్షద్ నాలుగు సార్లు మూడవ స్థానంలో, పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రథమ స్థానంలో నిలిచారు. అర్షద్‌కు ఇది భారీ విజయం. అలాగే, నీరజ్‌కు ఓటమి కూడా.
కానీ, వారి మధ్యనున్న బంధంలో మాత్రం ఎలాంటి తేడా కనిపించలేదు.
అంతకు కొన్నిరోజుల ముందు నీరజ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, కొత్త జావెలిన్ పొందేందుకు పాకిస్తానీ అథ్లెట్ ఇబ్బందులు పడుతున్నాడని తెలవడం ఇబ్బందికరంగా అనిపించిందన్నారు.
పాత ఈటెతోనే సాధన చేస్తున్నట్టు చాలా ఇంటర్వ్యూల్లో అర్షద్ చెప్పినట్లు తెలిపారు.
‘మా ప్రభుత్వం సాయం చేస్తున్న మాదిరి అక్కడ ప్రభుత్వం కూడా సాయం చేయాలని లేదా కొత్త జావెలిన్ కోసం ఏదైనా బ్రాండ్‌తో మాట్లాడాలని నేను మీకు సూచించగలను’ అని నీరజ్ చోప్రా అన్నాడు.
2023లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో నీరజ్, నదీమ్ ఒకటి, రెండు స్థానాల్లో నిలిచినప్పుడు నీరజ్ తల్లి సరోజ్ దేవి చెప్పిన మాటలు చర్చనీయాంశమయ్యాయి.
‘‘ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌లో ఆడతారు. అందరూ ఆటగాళ్లే. ఎవరో ఒకరు గెలుపొందుతారు. దీనిలో పాకిస్తాన్, హరియాణ అనే తేడా లేదు. ఇది కేవలం సంతోషానికి సంబంధించినదే. ఒకవేళ పాకిస్తాన్ గెలిచినా ఆనందంగా ఉండేది. నీరజ్ గెలవడం కూడా సంతోషంగా ఉంది.’’ అని సరోజ్ దేవీ తెలిపారు.
పోటీలో గెలిచిన తర్వాత నీరజ్ ఫోటో తీసేటప్పుడు, ఆయన అర్షద్‌ను పిలిచారు. పాకిస్తాన్ జెండా లేకుండా అర్షద్ అక్కడకు వచ్చాడు. ఆ తర్వాత నీరజ్‌తో అర్షద్ దిగిన ఫోటో వైరల్‌గా మారింది.
భారత్, పాకిస్తాన్‌కు స్వర్ణం, రజతం పతకాలు రావడం ఆనందంగా ఉందని అర్షద్ అప్పుడు అన్నాడు.
నీరజ్ చాలా శాంత స్వభావి అని సరోజ్ దేవి చెప్పారు. నీరజ్‌లోని ఆ స్వభావాన్ని 2021లో ఏడాదిలో చూశాం.
టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా నీరజ్ జావెలిన్‌ను అర్షద్ నదీమ్ పట్టుకున్నారని సోషల్ మీడియా, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నీరజ్ జావెలిన్‌ను అర్షద్ ట్యాంపరింగ్ చేశారని కొందరు ప్రచారం చేశారు.
అయితే, నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
‘‘నేను విసిరే ముందు నా జావెలిన్ అర్షద్ దగ్గర ఉందని కొందరు అంటున్నారు. కానీ, ఎవరి జావెలిన్‌ను ఎవరైనా వాడుకోవచ్చనేది రూల్. మీ డర్టీ ఎజెండా కోసం నా వ్యాఖ్యలను వాడుకోవద్దని ప్రతి ఒక్కర్ని నేను అభ్యర్థిస్తున్నా. క్రీడలనేవి ఐక్యతగా ఉండేందుకు సాయం చేస్తాయి. జావెలిన్ త్రోయర్లు అందరం స్నేహితుల్లా ఉంటున్నాం. మమ్మల్ని బాధించే కామెంట్లు చేయవద్దు.’’ అని నీరజ్ కోరాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















