విడాకులు తీసుకున్న మహిళలను మాజీ భర్తల వద్దకు పంపిస్తున్న తాలిబాన్లు

- రచయిత, మమూన్ దురానీ, కవూన్ ఖామూష్
- హోదా, బీబీసీ అఫ్గాన్, బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రతినిధులు
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత అఫ్గానిస్తాన్ న్యాయవ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
తమ న్యాయమూర్తులు ప్రస్తుత చట్టాలను సమర్థంగా అమలు చేయడమే కాకుండా, గత తీర్పులను సమీక్షించడానికి ఓవర్ టైం పని చేస్తున్నారని తాలిబాన్లు అంటున్నారు.
దీనిలో భాగంగా వాళ్లు సాధారణ ప్రజలకు ఉచిత న్యాయసహాయం అందిస్తున్నారని చెప్తున్నారు.
ఇది తాలిబాన్లు షరియా (ఇస్లామిక్ చట్టం) కింద పదివేల పాత కేసులను తిరిగి విచారించడానికి దారి తీయగా, ప్రత్యేకించి మహిళలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కొన్ని విడాకులు చెల్లుబాటు కావని తాలిబన్లు కొత్తగా తీర్పు ఇవ్వడంతో చాలామంది మహిళలు బలవంతంగా తిరిగి పాత వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు.
మరోవైపు తాలిబన్లు మహిళా జడ్జిలనూ న్యాయవ్యవస్థ నుంచి తొలగించారు.
తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన పది రోజుల తర్వాత, తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు 20 ఏళ్ల బీబీ నజ్దానా వంటగదిలో తల్లికి సహాయం చేస్తున్నారు.
బాధ నిండితో గొంతుతో తన తండ్రి అన్నతో చెబుతున్న విషయాన్ని వినడానికి ఆమె వాళ్లకు దగ్గరగా వెళ్లారు.
"నా పేరు వినగానే నా గుండె దడదడలాడింది" అని నజ్దానా చెప్పారు.
ఆమె సొంత ప్రావిన్స్ ఉరుజ్‌గాన్‌లోని తాలిబాన్ కోర్టు ఆమె కేసు పునర్విచారణ చేపట్టింది. తనకు ఇష్టం లేని వ్యక్తితో వివాహాన్ని రద్దు చేస్తూ ఆమెకు జారీ చేసిన విడాకుల కేసు మళ్లీ విచారిస్తున్నామని, కోర్టుకు రావాలని ఆమెను ఆదేశించింది.
కుటుంబ వివాదం పరిష్కరించుకునే క్రమంలో నజ్దానా తండ్రి బంధువుల కుర్రాడు హెక్మతుల్లాతో ఆమెకు వివాహం చేస్తానని వారికి మాటిచ్చారు.
అప్పటికి నజ్దానా వయసు ఏడేళ్లు కాగా హెక్మతుల్లా తన టీనేజ్‌లో ఉన్నారు.


‘కోర్టులో చెప్పాను'
నజ్దానాకు 15 ఏళ్లు వచ్చాక హెక్మతుల్లా తన ‘భార్య’ను(నజ్దానా) ఇంటికి తీసుకెళ్లడానికి రాగా ఆమె ఆ వివాహాన్ని అంగీకరించకుండా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కోర్టు విచారణ తరువాత విడాకులు మంజూరయ్యాయి.
‘అతడితో పెళ్లి ఇష్టం లేదని నేను కోర్టుకు చెప్పాను’ అని నజ్దానా చెప్పారు.
"దాదాపు రెండు సంవత్సరాల పోరాటం తర్వాత, నేను చివరకు కేసు గెలిచాను. కోర్టు నన్ను అభినందించింది. 'మీరు ఇప్పుడు విడిపోయారు, మీకు కావలసిన వారిని వివాహం చేసుకోవచ్చు' అని చెప్పింది అని నజ్దానా తెలిపారు.
ఆ విడాకులను వేడుక చేసుకుంటూ ఆమె కుటుంబం గ్రామంలోని స్థానిక మసీదులో స్నేహితులు, బంధువులకు విందు ఏర్పాటు చేసింది.
కానీ ఒక ఏడాది తరువాత తాలిబాన్లు అధికారం చేపట్టారు. దేశవ్యాప్తంగా కఠినమైన షరియాను (ఇస్లామిక్ చట్టం) అమలు చేయడం ప్రారంభించింది.
తాలిబన్‌లలో చేరిన ఆమె మాజీ భర్త, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోర్టును ఆశ్రయించారు. అయితే, షరియా ప్రకారం నజ్దానా కోర్టులో హాజరు కావడం నిషేధం.
‘షరియాకు వ్యతిరేకం కాబట్టి నేను కోర్టుకు హాజరు కాకూడదని తాలిబాన్లు నాకు చెప్పారు. నా బదులు నా సోదరుడు నాకు ప్రాతినిధ్యం వహించాలని వాళ్లు సూచించారు’ అని నజ్దానా చెప్పారు.
‘మేం దీనికి కట్టుబడి ఉండకపోతే, నా సోదరిని బలవంతంగా అతనికి (హెక్మతుల్లా) అప్పగిస్తామని వాళ్లు మమ్మల్ని హెచ్చరించారు," అని నజ్దానా 28 ఏళ్ల సోదరుడు షామ్స్ చెప్పారు.
కొత్తగా ఇచ్చే తీర్పు తన సోదరి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని షామ్స్ న్యాయమూర్తిని వేడుకున్నా, కోర్టు మునుపటి తీర్పును రద్దు చేసింది. నజ్దానా వెంటనే తన మాజీ భర్త హెక్మతుల్లాకు వద్దకు తిరిగి వెళ్లాలని ఆదేశించింది.
అయితే దేశం విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్న నజ్దానా, అందుకు సమయం కోసం పైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి ఆమె తన ఊరు వదిలి పొరుగు దేశానికి పారిపోయారు.

తాలిబన్లు ఏమంటున్నారు?
‘‘మా న్యాయమూర్తులు కేసును అన్ని కోణాల్లో అధ్యయనం చేసి హెక్మతుల్లాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.’’ అని సుప్రీంకోర్టు మీడియా అధికారి అబ్దుల్ వహిద్ హఖానీ చెప్పారు.
"హెక్మతుల్లా, నజ్దానాల వివాహాన్ని రద్దు చేయాలన్న మునుపటి పాలకుల నిర్ణయం షరియా, వివాహ నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే కోర్టు విచారణకు హెక్మతుల్లా హాజరు కాలేదు" అని చెప్పారు.
బీబీసీ హెక్మతుల్లాను సంప్రదించడానికి ప్రయత్నించింది, ఆయన అందుబాటులో లేరు.
దీనిపై ఉరుజ్‌గాన్‌లోని న్యాయమూర్తిని బీబీసీ సంప్రదించగా, ఆయన మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు.
ఆగస్ట్ 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్ ప్రభుత్వం పరిష్కరించినట్లు చెప్తున్న దాదాపు 355,000 కేసులలో నజ్దానా కేసు ఒకటి. తాము విచారించిన చాలా కేసులు క్రిమినల్ కేసులు అని తాలిబాన్లు చెబుతున్నారు. వివాదాలలో 40 శాతం భూమికి సంబంధించినవి కాగా, మరో 30 శాతం విడాకులు సహా కుటుంబ వివాదాలు.
తాలిబాన్ ప్రభుత్వం అందించిన గణాంకాలను బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు.

న్యాయ వ్యవస్థలో మహిళలు
తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చాక న్యాయవ్యవస్థలో ఉండడానికి మహిళలు అనర్హులని ప్రకటించారు.
‘‘షరియా నియమాల ప్రకారం న్యాయవ్యవస్థలో తెలివితేటలు ఉన్న వ్యక్తులు అవసరం కాబట్టి స్త్రీలకు ఆ అర్హత లేదు, వాళ్లు తీర్పులు చెప్పలేరు’’ అని తాలిబాన్ సుప్రీంకోర్టులో విదేశీ సంబంధాలు, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అబ్దుల్ రహీమ్ రషీద్ అన్నారు.
తాలిబన్లు తొలగించిన మహిళా న్యాయమూర్తుల్లో అఫ్గానిస్తాన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫౌజియా అమీని ఒకరు. నజ్దానా లాంటి మహిళలకు చట్ట ప్రకారం రక్షణ కల్పించాలని ఆమె అన్నారు.
"ఒక స్త్రీ తన భర్తకు విడాకులు ఇచ్చి, దానికి కోర్టు పత్రాలు సాక్ష్యంగా ఉంటే, అది అంతిమం. పాలన మారిందని చట్టపరమైన తీర్పులు మారవు" అని అమీని అన్నారు.
మహిళా న్యాయమూర్తులను తొలగించడం వల్ల మహిళలకు చట్టపరమైన రక్షణ ఉండదని అమీని చెప్పారు.

తాలిబాన్ కోర్టు నిర్ణయాలు
అఫ్గాన్ న్యాయ వ్యవస్థలో ఒక దశాబ్దానికి పైగా పనిచేసిన తర్వాత, న్యాయమూర్తి అమినీ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. తాలిబాన్లు అధికారం చేపట్టాక, తాను ఇంతకు ముందు దోషులుగా తేల్చిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె చెప్పారు.
"మా సివిల్ కోడ్ 50 ఏళ్ల పాతది. తాలిబాన్‌లు పుట్టక ముందు నుంచీ దీన్ని ఆచరిస్తున్నారు," అని అమినీ చెప్పారు. "విడాకులు సహా అన్ని పౌర, శిక్షా స్మృతులను ఖురాన్ నుంచి స్వీకరించారు" అన్నారామె.
తాలిబాన్లు ఎక్కువగా 8వ శతాబ్దానికి చెందిన హనాఫీ ఫిఖ్ (న్యాయశాస్త్రం) మతపరమైన చట్టంపై ఆధారపడతారు. దీన్ని గతంలో ఒట్టోమన్ సామ్రాజ్యం మొదలు పెట్టగా ఇప్పటికీ వివిధ ఇస్లామిక్ దేశాలు ఆచరిస్తున్నాయి.
అనిశ్చిత స్థితిలో నజ్దానా
పొరుగు దేశానికి పారిపోయాక నజ్దానా ఏడాది పాటు పేవ్‌మెంట్‌పై ఉన్న ఒక చెట్టు కింద ఆశ్రయం పొందారు.
ఆమె గట్టిగా కట్టిన పత్రాలను తన ఒళ్లో పెట్టుకుని కూర్చున్నారు. ఆమెకు విడాకులు మంజూరు అయినట్లు, ఆమె స్వేచ్ఛగా జీవించవచ్చు అని తెలిపే ఏకైక రుజువులు అవే.
‘ఐక్యరాజ్య సమితి సహా చాలామందిని నేను సహాయం కోరాను. కానీ ఎవరూ నా గొంతు వినలేదు. మహిళలకు ఎవరు సహాయం చేస్తున్నారు? నాకు స్వేచ్ఛ లేదా?" అని నజ్దానా ప్రశ్నిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














