‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ రివ్యూ: ‘రైడ్‌’ రీమేక్ రైటా, రాంగా? రవితేజ సినిమా ఎలా ఉంది?

మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/People Media Factory

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

‘నీ అంత‌ట నువ్వు 35 మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వ‌డం వేరు, ప‌క్కింటోడు 95 మార్కులు తెచ్చుకొన్నాడ‌ని, వాడినే ఫాలో అయి, 95 మార్కులు తెచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం వేరు. ఆ ఒత్తిడి నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’

రీమేక్ సినిమాని ప‌రీక్షల‌తో పోలుస్తూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ చెప్పిన ఉదాహ‌ర‌ణ ఇది. నిజ‌మే...రీమేకులు తీసి, హిట్టు కొట్ట‌డం అంత తేలికైన విష‌యం కాదు. రీమేక్ అంటే, సినిమా మొద‌లెట్ట‌క‌ముందే ఓ బ్యాగేజీ భుజాన వేసుకోవ‌డం.

క‌థేమిటి? పాత్ర‌లు ఎలా ఉంటాయి? ముగింపు ఏమిటి? అనే విష‌యాలు ప్రేక్ష‌కుల‌కు ముందే తెలిసిపోతాయి. అయినా కూడా క‌థ‌ని ఆస‌క్తిక‌రంగా చెప్పాలి. ప్రేక్ష‌కులను చివ‌రి వ‌ర‌కూ థియేట‌ర్లో కూర్చోబెట్ట‌గ‌ల‌గాలి.

ఇక్క‌డే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఆధారప‌డి ఉంటుంది. రీమేకులు తీసి హిట్లు కొట్ట‌డం హ‌రీష్ శంక‌ర్‌కు బాగా తెలుసు. గ‌బ్బ‌ర్ సింగ్‌, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ రెండూ రీమేకులే. అయితే ఆయా మూల క‌థ‌ల్లో, స‌న్నివేశాల్లో హ‌రీష్ చేసిన 'మార్పులు' ర‌క్తి క‌ట్టాయి.

ఆ చిత్రాలు ఘ‌న విజ‌యాలు సాధించ‌డంలో హ‌రీష్ మార్కు తెలివితేట‌లు, క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో హిందీలో ఘ‌న విజ‌యాన్ని అందుకొన్న 'రైడ్‌' చిత్రాన్ని ర‌వితేజ‌తో `మిస్ట‌న్ బ‌చ్చ‌న్‌`గా రీమేక్ చేశారు.

మ‌రి ఈ రీమేక్ ఎలా సాగింది? హ‌రీష్ శైలి మార్పులు దోహ‌దం చేశాయా? 'రైడ్‌'ని రీమేక్ చేయాల‌నుకొన్న హ‌రీష్ నిర్ణ‌యం రైటా? రాంగా..?

బీబీసీ వాట్సాప్ చానల్
బచ్చన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, @RaviTeja_offl

బచ్చ‌న్ నిజాయితీ

బ‌చ్చ‌న్ (ర‌వితేజ‌) ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస‌ర్‌. నిజాయ‌తీగా ప‌ని చేస్తాడు. ఓ రైడ్ లో అధికారుల మాట విన‌నందుకు స‌స్పెండ్ అవుతాడు. ఆ త‌ర‌వాత సొంత ఊరుకి వెళ్లిపోతాడు.

అక్క‌డ జిక్కీ (భాగ్య‌శ్రీ‌)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె వెంటప‌డి, జిక్కీని కూడా త‌న ప్రేమ‌లో ప‌డేటట్టు చేసుకొంటాడు. ఇద్ద‌రి పెళ్లికి ఇంట్లో వాళ్లు అంగీక‌రిస్తారు. ఈలోగా ఐటీ డిపార్ట్‌మెంట్ బ‌చ్చ‌న్‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ని ఎత్తేస్తుంది.

పెళ్లి మ‌రో నాలుగు రోజులు ఉంద‌న‌గా... బ‌చ్చ‌న్ ఓ రైడ్‌కి వెళ్లాల్సివ‌స్తుంది. ముత్యం జ‌గ్గ‌య్య (జ‌గ‌ప‌తిబాబు) ఇంటిపై రైడ్‌కి వెళ్తాడు బ‌చ్చ‌న్‌. జ‌గ్గ‌య్య ఓ ఎం.పీ.

త‌న అధికారంతో అంద‌ర్నీ హ‌డ‌లెత్తిస్తాడు. ముఖ్య‌మంత్రిని సైతం భ‌య‌పెట్టే స‌త్తా ఉన్న‌వాడు. అలాంటి జ‌గ్గ‌య్య ఇంటికి రైడ్‌కు వెళ్లిన బ‌చ్చ‌న్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఈ రైడ్ ఎలా సాగింది? జ‌గ్గ‌య్య అధికారబలాన్ని బ‌చ్చ‌న్ ఎలా అణిచివేశాడు ? అనేది మిగిలిన క‌థ‌.

రవితేజ

ఫొటో సోర్స్, @RaviTeja_offl

సైడ్ ఏ.. సైడ్ బీ

2018లో బాలీవుడ్ లో విడుద‌లైన 'రైడ్‌' చిత్రానికి రీమేక్ ఇది. 'రైడ్‌' క‌ల్పిత క‌థ కాదు. వాస్త‌వ సంఘ‌ట‌న‌.

1981లో లఖ్‌నవూలో ఓ బ‌డా ఆసామి ఇంట్లో ఏకంగా 18 రోజుల పాటు ఇన్‌క‌మ్ టాక్స్ అధికారులు సోదా చేశారు. ఐటీ శాఖ చ‌రిత్ర‌లోనే ఆ రైడ్‌ ఓ సంచ‌ల‌నం. అప్ప‌ట్లో ఆ రైడ్ ఎలా జ‌రిగి ఉంటుంది ? అనే పాయింట్ చుట్టూ అల్లుకొన్న క‌ల్పిత గాథ‌.

హిందీ 'రైడ్‌' వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డితే... రీమేక్ 'రైడ్‌' మాత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌లో సాగింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు (ర‌వితేజ‌, భాగ్య‌శ్రీ‌) క్యాసెట్ భాష‌లో మాట్లాడుకుంటుంటారు.

ఏ సైడు, బీ సైడు అని. అదే భాష‌లో చెప్పాలంటే 'ఏ' సైడు హ‌రీష్ శంక‌ర్ తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌లో సాగితే, 'బి' సైడు మాతృక‌లోని క‌థాంశాన్ని టచ్ చేశారు.

అంటే స‌గం సినిమా హ‌రీష్ మార్పులతో నిండిపోతే, రెండో స‌గంలో మాత్ర‌మే అస‌లు క‌థ‌లోకి వెళ్లాడు ద‌ర్శ‌కుడు.

భారీ యాక్ష‌న్ స‌న్నివేశంతో హీరో ఎంట్రీ, పెళ్లి చూపుల పేరుతో ఓ ఇంట్లో రైడ్ చేయ‌డం... ఇవ‌న్నీ ప‌క్కా ర‌వితేజ మార్క్ మీట‌ర్‌లో సాగిపోయే స‌న్నివేశాలు.

ఆ త‌ర‌వాత హీరో స‌స్పెండ్‌ కావడంతో క‌థ సామ‌ర్ల‌కోట‌కు షిఫ్ట్ అవుతుంది. అక్క‌డ్నుంచి హ‌రీష్ శంక‌ర్ త‌న‌ మార్కు కామెడీ స‌న్నివేశాల‌తో కాల‌క్షేపం చేశాడు.

స‌త్య కామెడీ టైమింగ్ ఆక‌ట్టుకొంటుంది. స‌త్య వ‌ల్ల కొన్ని సంభాష‌ణ‌లు, త‌ద్వారా స‌న్నివేశాలు పేలాయి. అయితే అక్క‌డ‌క్క‌డ ముత‌క జోకులు కాస్త వెగ‌టు పుట్టిస్తాయి.

కిషోర్ కుమార్‌, కుమార్ సాను పాత హిందీ పాట‌లు వినిపించి, ప్రేక్ష‌కులకు రెట్రో ఫీల్ క‌లిగించాడు హ‌రీష్‌. మాస్ పాట‌ల‌తో కాస్త హుషారు క‌లుగుతుంది. అయితే ఎంత సేప‌టికీ అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌క‌పోవ‌డం ప్ర‌ధాన‌మైన లోపం.

కామెడీ కోసం స‌ర‌దా స‌న్నివేశాలు, టైమ్ పాస్ ఎపిసోడ్లు ఎన్న‌యినా రాసుకోవచ్చు. కానీ చెప్పాల‌నుకొంటున్న క‌థలోకి వీలైనంత త్వ‌ర‌గా వెళ్లిపోవాలి. అది జ‌ర‌గ‌లేదు.

ఇంటర్వెల్ ముందు రైడ్ మొద‌ల‌వుతుంది. ఆ ప‌ది నిమిషాలూ మిన‌హాయిస్తే.. మిగిలిన‌దంతా క‌థ‌కు అవ‌స‌రం లేని స‌న్నివేశాలే.

మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/People Media Factory

క‌థ‌కు బ్రేకులు ప‌డ్డాయి

ముత్యం జ‌గ్గ‌య్య ఇంట్లో రైడ్ ఎలా జ‌రిగింది? అనే పాయింట్‌తో సెకండాఫ్ సాగాలి. ఒకే ఇంట్లో, కొన్ని ప‌రిమిత పాత్ర‌ల మ‌ధ్య ఆయా స‌న్నివేశాలు తెర‌కెక్కించాల్సివచ్చిన‌ప్పుడు మొనాటినీ వ‌చ్చేస్తుంది. చూసిన స‌న్నివేశ‌మే మ‌ళ్లీ మ‌ళ్లీ చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌' విష‌యంలోనూ అదే జ‌రిగింది. క‌థ ఎంత‌కీ ముందుకు క‌ద‌ల‌దు. ఫ‌స్టాఫ్‌లో స‌త్య కామెడీ కాస్త ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. సెకండాఫ్‌లో అది కూడా లేదు.

చమ్మక్ చంద్ర ట్రాక్‌, అన్న‌పూర్ణ‌మ్మ ల‌వ్ స్టోరీ మ‌రింత విసిగిస్తాయి. సీరియ‌స్‌గా సాగాల్సిన రైడ్‌కి...అన‌వ‌స‌ర‌పు కామెడీ, పాట‌లూ అడ్డుగోడ‌ల్లా మారాయి.

ప్ర‌ధానమంత్రి ఫోన్ చేసి చెప్పినా, హీరో మాట విన‌క‌పోవ‌డం, రైడ్‌కి వ‌చ్చిన ఆఫీస‌ర్లు 'ఇంత పెద్ద ఇంటిని ఎప్పుడూ చూడ‌లేదు. ఈ ఇంట్లో ఎంత పెద్ద మంచం ఉందో' అంటూ మురిసిపోవ‌డం, 'ఈ రైడ్ లో దొరికిన బంగారం నాకే సొంతం అనుకొన్నా' అంటూ దీర్ఘాలు తీయడం అతిగా అనిపిస్తాయి.

క్లైమాక్స్ కూడా రొటీన్‌గా సాగుతుంది. మ‌ధ్య‌లో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ఎంట్రీ ఇచ్చి, కాస్త హుషారు తెప్పించాడు. అయితే అది కూడా చివ‌ర్లో వేసిన అతుకులానే అనిపిస్తుంది త‌ప్ప‌, క‌థ‌లో కలిసిపోయే అంశంలా ఉండ‌దు.

మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/People Media Factory

అమితాబ్‌ని దింపేశాడు

స‌న్నివేశంలో విష‌యం లేక‌పోయినా త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఏదో మాయ చేయ‌డం ర‌వితేజ‌కు బాగా తెలుసు. త‌న ఎన‌ర్జీతో చాలా సినిమాల్ని కాపాడాడు కూడా. అయితే 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌' విష‌యంలో ఆయ‌న కూడా ఏమీ చేయ‌లేక‌పోయాడు.

ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌, అమితాబ్‌ని అనుక‌రిస్తూ చెప్పిన డైలాగులు, యాక్ష‌న్ సీన్ల‌లో ఆ దూకుడు న‌చ్చేస్తాయి. భాగ్య‌శ్రీ చాలా అందంగా క‌నిపించింది. స్టెప్పులు కూడా బాగా వేసింది. త‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు దొర‌క‌డం ఖాయం.

జ‌గ‌ప‌తిబాబుది రొటీన్ పాత్రే. ఆ గెట‌ప్ కూడా చాలా సినిమాల్లో చూసేయ‌డం వ‌ల్ల ఏ కోణంలోనూ కొత్త‌గా అనిపించ‌దు.

స‌త్య కామెడీ టైమింగ్ మ‌రోసారి ఆక‌ట్టుకొంటుంది. త‌న వ‌ల్లే ఫ‌స్టాఫ్ కాస్త నిల‌బ‌డింది. చాలా రోజుల త‌ర‌వాత బాబూ మోహ‌న్ తెర‌పై క‌నిపించారు.

పాత హిందీ సినిమా పాట‌ల్ని సంద‌ర్భానుసారం వాడుకొన్న విధానం బాగుంది. కొన్ని ఆల్ టైమ్ క్లాసిక్ పాట‌లు వింటూ... ఆ రోజుల్లోకి వెళ్లిపోతారు ప్రేక్ష‌కులు. మిక్కీ ఈసారి త‌న శైలి వ‌దిలి మాస్ పాట‌లు చేశాడు. పాట‌ల‌కు కొరియోగ్ర‌ఫీ కూడా బాగా కుదిరింది.

హ‌రీష్ శంకర్ చేసిన కొన్ని మార్పులు మాస్‌కు న‌చ్చుతాయి. అయితే చాలా చోట్ల క‌థ‌ని విడిచి సాము చేసిన‌ట్టు అనిపిస్తుంది. ర‌చ‌యిత‌గా అక్క‌డ‌క్క‌డ మెరిసిన హ‌రీష్‌, చాలా చోట్ల దొరికిపోయాడు.

ముఖ్యంగా సెకండాఫ్‌లో. కామెడీ ట్రాకులు స‌రిగా పండ‌క‌పోవ‌డం, సినిమాటిక్ లిబ‌ర్టీ మ‌రీ ఎక్కువ అయిపోవ‌డం ఈ సినిమాకు ప్ర‌ధాన అవ‌రోధాలుగా మారాయి.

ర‌వితేజ క‌ష్ట‌ప‌డినా, టెక్నిక‌ల్‌గా మంచి స‌పోర్ట్ దొరికినా, 'రైడ్‌' లాంటి హిట్ క‌థ‌ను జ‌న‌రంజ‌కంగా మ‌ల‌చ‌లేక‌పోయాడు హ‌రీష్‌.

ర‌వితేజ వీరాభిమానుల‌కు ఈ సినిమా కాస్త న‌చ్చొచ్చేమో కానీ, 'రైడ్‌'ని దృష్టిలో ఉంచుకొని హ‌రీష్‌ మ‌రో 'గ‌బ్బ‌ర్ సింగ్' లాంటి రీమేక్ ఇస్తాడేమో అని ఆశ‌ప‌డిన వాళ్ల‌కు మాత్రం అన్ని విధాలా నిరాశే ఎదుర‌వుతుంది.

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)

(బీబీసీ కోసం కలెక్టివ్‌‌న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)