తెలంగాణ అసెంబ్లీ: దానం నాగేందర్ ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ సభ్యుల వాదనేంటి?

దానం నాగేందర్

ఫొటో సోర్స్, Telangana Assembly

ఫొటో క్యాప్షన్, దానం నాగేందర్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అభ్యంతకరంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లో తిరగనివ్వను.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పదాలతో హెచ్చరించారు. కొన్ని ఈ వార్తలో రాయలేని పదాలను వాడారు. దానం నాగేందర్ మాట్లాడిన మాటలు మైకులో స్పష్టంగా వినిపించాయి.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆయన వ్యాఖ్యలు ఎదుటి వ్యక్తిని అసభ్య పదజాలంతో తిడుతున్నట్లుగా రికార్డు అయ్యాయి.

దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఎంఐఎం కూడా దానం నాగేందర్ వ్యాఖ్యలను ఖండించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఏం జరిగిందంటే...

తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం సాయంత్రం ‘‘హైదరాబాద్ మెట్రో సిటీలో స్థిరమైన పట్టణాభివృద్ధి కార్యకలాపాలు’’ అనే అంశం లఘు చర్చను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.

ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఖాళీల వివరాలు ప్రకటించలేదంటూ ఆందోళనకు దిగారు.

తాను మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడటంపై దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని వ్యాఖ్యలు తల్లిని దూషించేలా ఉండటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం నాగేందర్ ను వారించకపోవడం దారుణమని వారు చెబుతున్నారు.

స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..‘‘ఈ సభలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉంది…’’ అంటూ దానం నాగేందర్‌కు మరోసారి మాట్లాడే అవకాశం ఇచ్చారు.

అక్బరుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Akbaruddin Owaisi/FB

ఫొటో క్యాప్షన్, అక్బరుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ అభ్యంతరం

ఈ వ్యవహారంపై ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.

‘‘సభలో దానం నాగేందర్ అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడారు. ఎవరు తప్పు చేశారు.. ఎవరు రెచ్చగొట్టారు.. ఎలా జరిగింది.. అనే విషయాలకు నేను వెళ్లదలచుకోలేదు. కానీ దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా.’’ అన్నారు.

ఆ తర్వాత దానం నాగేందర్ మాట్లాడుతూ తనపైనా పరుష పదజాలం వాడటం వల్లే , తాను అలా అన్నానని చెప్పారు.

‘‘నన్ను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నారు. నేను నా కోపాన్ని అదుపులో ఉంచుకుంటాను. గతంలో మంత్రిగా పనిచేశాను. ఆరోసారి ఎమ్మెల్యేగా సభలోకి వచ్చా. ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు, ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే.. విచారం వ్యక్తం చేస్తున్నా.’’ అని దానం నాగేందర్ అన్నారు.

అదే సమయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. అన్ పార్లమెంటరీ పదాలు వాడి ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు.

ఆ సమయంలో దానం నాగేందర్ కలగజేసుకుని.. ‘‘అది హైదారాబాద్‌లో సాధారణంగా వాడే భాష’’ అని సమర్థించుకున్నారు.

అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యవహారంపై మాట్లాడారు.

బీఆర్ఎస్ సభ్యులు రెచ్చగొడుతున్నారని, వారిని అదుపులో పెట్టాలని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ

ఫొటో సోర్స్, Kalvakuntla Taraka Rama Rao - KTR/FB

ఫొటో క్యాప్షన్, కేటీఆర్

బీఆర్ఎస్ నేతలు ఏమన్నారు?

ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు.

‘‘తెలంగాణ శానస సభలో ఇది చీకటి రోజు. వాళ్ల బజారు భాష వినలేక మేం బయటకు వచ్చేశాం.’’ అని అన్నారు.

ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ ‘‘దానం నాగేందర్ భాష సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉంది.హైదరాబాద్ సిటీపై చర్చ జరుగుతుంటే...కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక గురించి అడుగుదాం అనుకున్నాం. స్పీకర్ నిన్న మాకు చాలా నీతులు చెప్పారు. దానం నాగేందర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తాం.’’ అని అన్నారు.

మరో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే దానం నాగేందర్ నిండు సభలో వ్యవహరించిన తీరు జుగుప్సాకరం. విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగారు. సభా మర్యాదలను, సభా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంట గలిపింది.’’ అని అన్నారు.

అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు

దానం నాగేందర్ ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ స్థానం నుంచి గెలిచారు.

ఈ ఏడాది మార్చి 17న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)