కేంద్రం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి, ఇది ఉద్యోగులకు లాభమా, నష్టమా?

ఫొటో సోర్స్, Getty Images
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం (ఆగస్టు 24న) వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రత పట్ల ఆందోళనలు పెరిగాయని, అందులో ముఖ్యమైన అంశం పెన్షన్ అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తున్నారని, అందువల్లే ఈ సామాజిక వ్యవస్థ నడుస్తోందని, సమాజంలో వారికి ముఖ్యమైన స్థానం ఉందన్నారు.
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో సంస్కరణలు తీసుకురావాలనే ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించి, తమ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
యూపీఎస్ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

2025 నుంచి అమలు
వచ్చే ఆర్థిక సంవత్సరం, అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది.
‘‘ఇది ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే పథకం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
డాక్టర్ సోమనాథన్ (ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి) నేతృత్వంలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు యూపీఎస్ పథకాన్ని తీసుకొచ్చామని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
"ఆ కమిటీ దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కార్మిక సంఘాలతో మాట్లాడింది. ఇతర దేశాలలో ఉన్న వ్యవస్థలను కూడా అధ్యయనం చేసింది. ఆ తర్వాత, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను సిఫార్సు చేసింది. దానిని ప్రభుత్వం ఆమోదించింది" అని ఆయన వివరించారు.
ఈ పథకంలో ఉద్యోగులపై ఎలాంటి అదనపు భారం పడదని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రభుత్వం చెల్లించే కంట్రిబ్యూషన్ శాతం పెరుగుతుందన్నారు.
ఉద్యోగులు NPS, UPSలలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐదు ప్రధాన అంశాలు
యూపీఎస్‌లో ఐదు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1. ఉద్యోగ విరమణకు ముందు 12 నెలల కాలంలో అందుకున్న మూల వేతనం (బేసిక్ పే) సగటులో 50 శాతం పెన్షన్‌గా వస్తుంది. దీనికి షరతు ఏంటంటే, ఆ ఉద్యోగి 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేయాలి. అంతకంటే తక్కువ కాలం సర్వీస్ చేసి ఉంటే దామాషా ప్రకారం వారికి తక్కువ పెన్షన్ వస్తుంది.
2. పెన్షన్ రావాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేయాలి. ఈ అర్హత సాధించిన వారికి నెలకు కనీసం రూ.10,000 పెన్షన్‌గా అందుతుంది.
3. పదవీ విరమణ పొందిన తర్వాత చనిపోతే, వారి కుటుంబానికి (భార్య/ భర్తకు) పెన్షన్‌లో 60 శాతం వస్తుంది.
4.పెన్షన్ ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. అంటే, ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ లాంటి ప్రయోజనాలు అందుతాయి.
5. ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వం ఏక మొత్తం చెల్లిస్తుంది. ఇది గ్రాట్యుటీకి అదనం. ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు నెలవారీ వేతనం (మూల వేతనం+ డీఏ)లో 10వ వంతు లెక్కగట్టి చెల్లిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌పీఎస్‌పై వ్యతిరేకత ఎందుకు?
2004 జనవరి 1న వాజ్ పేయీ ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. అయితే, అంతకు ముందున్న పెన్షన్ విధానంతో పోలిస్తే, ఈ పథకం కింద ఉద్యోగులకు సరైన ప్రయోజనం దక్కడంలేదనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఎన్‌పీఎస్‌లో ఉద్యోగులు తమ మూల వేతనంలో 10 శాతాన్ని పెన్షన్ కోసం చెల్లించాలి. ప్రభుత్వం కూడా తన వంతుగా 10 శాతం మొత్తాన్ని జమ చేస్తుండేది. 2019లో ప్రభుత్వం తన వాటాను 14 శాతానికి పెంచింది.
అలా జమ చేసిన డబ్బుతో ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు చెందిన ఫండ్ మేనేజర్లు వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడి ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి, ఇంత రాబడి వస్తుందన్న గ్యారంటీ ఉండదు. అందుకే, ఉద్యోగులు ఎన్‌పీఎస్‌ను వ్యతిరేకించారు.
ఇప్పుడు, తీసుకొచ్చిన యూపీఎస్ ద్వారా పెన్షనర్లకు స్థిరమైన ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగుల చెల్లించే వాటా మారదని, ప్రభుత్వ వాటా మాత్రం 18.5 శాతానికి పెరుగుతుందని తెలిపింది.
యూపీఎస్ 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. 2025 మార్చి 31 దాకా ఎన్‌పీఎస్ కింద ఉద్యోగ విరమణ పొందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని, వారి బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని డాక్టర్ సోమనాథన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఆప్షన్ ఎందుకు ఇవ్వలేదు?
ప్రభుత్వ తాజా ప్రకటనపై నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జాతీయ అధ్యక్షుడు విజయ్ కుమార్ స్పందించారు. ఎన్‌పీఎస్ కంటే ముందున్న విధానం ప్రకారం పెన్షన్ ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.
"ఎన్‌పీఎస్, యూపీఎస్‌లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చనే ఆప్షన్‌ను ప్రభుత్వం ఇవ్వగలిగినప్పుడు, పాత పెన్షన్ స్కీమ్ (OPS) ఆప్షన్ ఇవ్వడంలో సమస్య ఏంటి?’’ అని విజయ్ అడుగుతున్నారు.
ఈ కొత్త విధానం ఎన్‌పీఎస్ కంటే అధ్వాన్నంగా ఉంటుందని నేషనల్ మిషన్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జాతీయ అధ్యక్షుడు మంజిత్ సింగ్ పటేల్ వ్యాఖ్యానించారు.
"ఇది ఎన్‌పీఎస్ కంటే అధ్వాన్నమైన వ్యవస్థ అవుతుంది. ఎందుకంటే, ఎక్కువ కాలం పని చేసేవారు యూపీఎస్ కంటే ఎన్‌పీస్‌లోనే ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు" అని ఆయన సోషల్ మీడియాలో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














