మియన్మార్‌లో మారణకాండ: ‘‘నేను ఊపిరి బిగబట్టి చనిపోయినట్టు నటించా, నాపై శవాలు కుప్పలుగా వచ్చి పడ్డాయి’’

ఫొటో సోర్స్, Students' Revolutionary Force
జూన్ తొలినాళ్లలో ఓ సోమవారపు ఉదయం, నిన్‌సీ బాగా ఆనందంగా ఉన్న రోజు అది. వాయువ్య మియన్మార్‌లోని మటా గ్రామంలో ఆమె వివాహం జరుగుతోంది.
ఆ సమయంలో వంద మంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా వేడుక చేసుకుంటున్నామని ఆమె చెప్పారు. అంతలోనే ఓ విమానం బాగా కిందకు వచ్చి బాంబులు వెయ్యడంతో మహిళలు, పిల్లలు సహా 33 మంది చనిపోయారని అన్నారు.
“మేడమీద ఆశీస్సులు తీసుకోవడం పూర్తయిన తర్వాత ఫ్యామిలీ ఫొటోలు తీసుకునేందుకు మేమంతా కిందకు వచ్చాం. వివాహ వేదిక ముందు మా కుటుంబాలన్నీ నిల్చున్నాయి. మా ఎదురుగా మరి కొంతమంది ఉన్నారు. ఇంతలో ఓ బాంబు రెండు గ్రూపుల మధ్య వచ్చి పడింది” అని నిన్‌సీ వివరించారు.
ఆ వెంటనే మరో బాంబు తమ ఇంటికి ఎదురుగా పెళ్లి కొడుకు ఉంటున్న ఇంటి మీద పడిందని ఆమె చెప్పారు. అక్కడకు దగ్గర్లో ఉన్న నదికి ఆవలి ఒడ్డున మియన్మార్ సైనికులు బాంబుల వర్షం కురిపించారని, ఆ దాడిలో చనిపోయిన వారి మృతదేహాలను, గాయపడిన వారిని కాపాడేందుకు ప్రజలు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మగ్వే, మాండలేతో పాటు సగైంగ్‌తో కలిసిన మూడు ప్రాంతాలు సెంట్రల్ మియన్మార్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని డ్రై జోన్‌గా పిలుస్తారు.
2021లో సైనిక కుట్ర ద్వారా అంగ్‌సాన్ సూచీని తొలగించి జుంటా అధికారంలోకి వచ్చే వరకు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండేది.


ఫొటో సోర్స్, Students' Revolutionary Force
‘కూలిన కొబ్బరి చెట్ల కింద దాక్కున్నాం’
మూడేళ్ల తర్వాత ఈ ప్రాంతం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా పిలిచే ప్రతిపక్ష సాయుధ దళాలకు కంచుకోటగా మారింది. మియన్మార్ సరిహద్దుల్లో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న జుంటా సైన్యం, డ్రై జోన్ ప్రాంతంలో పీడీఎఫ్‌కు మద్దతిస్తున్నారనే పేరుతో తరచుగా పౌరుల మీద విరుచుకుపడుతున్నాయి.
వివాహా వేడుక మీద బాంబు దాడిలో చనిపోయిన వారి శరీరాల మీద టార్పాలిన్ కప్పిన దృశ్యాలు, విరిగిపోయిన చెట్లు, కూలిపోయిన ఇళ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి.
కొత్తగా పెళ్లయిన జంట కూలిపోయిన కొబ్బరి చెట్ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకుంది. బాంబు దాడిలో తెగిపడిన శరీర అవయవాలు ఆమె కళ్ల ముందే అటు ఇటు ఎగిరి పడటంతో నిన్‌సీ స్పృహ కోల్పోయారు.
తర్వాత రోజు ఉదయానికి కానీ ఆమె సాధారణ స్థితికి రాలేకపోయారు.
“ఏం జరిగిందో నా చుట్టు పక్కల ఉన్న వారు చెప్పిన తర్వాతే నాకు తెలిసింది” అని ఆమె అన్నారు.
ఈ దాడి గురించి మియన్మార్ సైన్యం ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. గ్రామంలో వివాహ వేడుక మాటున పీడీఎఫ్ మద్దతుదారులు సమావేశం అవుతున్నారనే సమాచారం రావడంతో దాడి చేసినట్లు సైన్యం అధికార ప్రతినిధి జనరల్ జా మిన్ టున్ బీబీసీకి చెప్పారు.
పీడీఎఫ్ మద్దతుదారులు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నందు వల్లనే గ్రామంపై దాడి జరిగిందని సైన్యానికి మద్దతిస్తున్న టెలిగ్రామ్ ఛానల్స్ చెప్పాయి.
తన భర్త సాధారణ పౌరుడని, గతంలో తాను పీడీఎఫ్ సభ్యురాలినని, ప్రస్తుతం పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ తరపున పని చేస్తున్నానని నిన్‌సీ చెప్పారు.
తాను పని చేస్తున్న సంస్థ పీడీఎఫ్ స్వాధీనం చేసుకున్న ప్రాంతంలోని పాలనా వ్యవహారాల్లో భాగస్వామి అని వివరించారు.నిన్ సీ ఆమె నిజమైన పేరు కాదు. సైనిక కుట్ర జరిగిన సమయంలో తిరుగుబాటు దళాలలో చేరిన తర్వాత ఆమె పెట్టుకున్న పేరు.
జుంటా అనుకూల ఇన్‌ఫార్మర్ ఇచ్చిన సమాచారంతోనే తమ వివాహ వేడుకపై దాడి జరిగిందని ఆమె అనుమానిస్తున్నారు.
“నా మీద కక్ష ఉన్న వాళ్లు ఉండవచ్చు. మొదట నుంచి నేను విప్లవంలో పాల్గొంటూనే ఉన్నాను” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
జుంటా సైనిక ప్రభుత్వ పాలనలో వైమానిక దాడుల సంఖ్య పెరిగిందని న్యాన్ లిన్ తిట్ అనలిటికా( ఎన్‌ఎల్‌టీఏ) చెబుతోంది. మియన్మార్‌లో శాంతి, భద్రతలను స్థాపించేందుకు కొంతమంది విద్యార్థులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
2024లో మొదటి నాలుగు నెల్లలో 819, అందులోనూ సగైంగ్ ప్రాంతం మీద 119 బాంబుదాడులు జరిగియాని, రఖైన్ తర్వాత ఎక్కువ వైమానిక దాడులు జరిగిన ప్రాంతం ఇదేనని ఎన్ఎల్‌టీఏ తెలిపింది
వైమానిక దాడుల్లో వందకు పైగా పాఠశాలలు, 200కి పైగా మతపరమైన భవనాలు ధ్వంసమైనట్లు ఈ సంస్థ అంచనా వేసింది.
2023 నుంచి డ్రైజోన్ ప్రాంతంలో జుంటా ప్రభుత్వ వ్యూహాలు మారుతూ వచ్చాయని ఇంటర్‌నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ అనే సంస్థ చెబుతోంది. సైనిక ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎక్కువ బలగాలను మోహరించిన తర్వాత సైనికులు గ్రామాల మీద దాడులు చేసి విచక్షణా రహితంగా ఇళ్లను తగలబెట్టారు.
సైన్యం మీద పీడీఎఫ్ దాడులు చెయ్యడంతో పరిస్థితులు హింసకు దారి తీశాయని జులై 2023లో ఐఐఎస్ఎస్ నివేదిక తెలిపింది. ఇవన్నీ ‘దౌర్జన్యాలేనని’ సంస్థ అభివర్ణించింది.
“కొన్ని సందర్భాలలో, సైనికులు గ్రామాల్లోకి వచ్చి పీడీఎఫ్ ఫైటర్లుగా అనుమానం ఉన్న గ్రామస్తుల పేర్ల జాబితాను తీసుకొచ్చి వారిని గుర్తించి తమకు అప్పగిస్తే గ్రామాలను తగలబెట్టకుండా ఉంటామని” చెప్పినట్లు ఐఐఎస్ఎస్ రిపోర్ట్ వెల్లడించింది.
2024 మొదటి నాలుగు నెలల్లో సైన్యం 46 మారణకాండలను కొనసాగించినట్లు ఎన్ఎల్‌టీఏ చెప్పింది.
ఈ నివేదికల గురించి బీబీసీ సైన్యాన్ని ప్రశ్నించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అయితే పీడీఎఫ్ కూడా గ్రామాలను తగులబెట్టి గ్రామస్తులను హత్య చేసింది. డ్రైజోన్ ప్రాంతంలోని గ్రామాలు పీడీఎఫ్ లేదా జుంటాకు మద్దతుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తల ఎత్తినందుకు తుపాకీ మడమతో పొడిచారు
మే 9న మాండలే ప్రాంతంలోని సొనేవా గ్రామంపై కొన్ని పీడీఎఫ్ బృందాలు సంయుక్తంగా దాడి చేశాయి. ఈ గ్రామాన్ని ప్యి సాటీ అని పిలిచే జుంటా అనుకూల మిలీషియా ఆక్రమించుకుంది. ఈ దాడిలో 31 మంది పౌరులు మరణించారు.
రెండు రోజుల తర్వాత, జుంటా సైనికులు సైగాంగ్ ప్రాంతంలోని లెట్ టొకెటా గ్రామం మీద దాడి చేసి నరమేధం చేశారు.
యాన్ నయింగ్ ( పేరు మార్చాం) తెల్లవారు జామున నిద్ర లేచే సరికి గ్రామంలో తుపాకీ మోతలు, భారీ మందుగుండు పేలుళ్లు వినిపించాయి.
“నేను పారిపోయేందుకు త్వరగా నా మోటార్ బైకును స్టార్ట్ చేశాను. అయితే గ్రామంలోకి రెండు వైపుల నుంచి సైనికులు రావడం చూశాను” అని 30 ఏళ్ల వ్యక్తి చెప్పారు.
దీంతో పారిపోయే ఆలోచన వదిలేసి గ్రామంలోని బౌద్ధాశ్రమానికి పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ సమయంలో గ్రామస్తులంతా ఆశ్రయం కోసం అక్కడికే చేరుకున్నారు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన రెండు సైనిక బృందాలు, ఆశ్రమంలోని పురుషులంతా బయటకు రావాలని , మోకాళ్ల మీద నిల్చుని, తల వంచుకోవాలని ఆదేశించినట్లు యాన్ నయింగ్ చెప్పారు.
“మిమ్మల్నందర్నీ చంపేస్తాం అని వారిలో కొందరు అరుస్తున్నారు” అని అతను చెప్పారు.
పీడీఎఫ్ దళాలకు ఆశ్రయం ఇస్తున్నారని గ్రామస్తులపై సైన్యం ఆరోపణలు చేసింది. వారిని తమకు అప్పగించాలని కోరింది.
తన పక్కన మోకాళ్ల మీద నిల్చున్న ఓ వ్యక్తి తల పైకెత్తి సైనికుల వైపు చూశాడని యాన్ నైయింగ్ చెప్పారు.
“అతను తలపైకెత్తి చూడటాన్ని ఓ సైనికుడు చూశాడు. అంతే వేగంగా వచ్చి బూట్లతో తన్నాడు తుపాకీ మడమతో పొడిచాడు” అని యాన్ నయింగ్ గుర్తు చేసుకున్నారు.

‘చనిపోయినట్టు నటించా’
“వాళ్లు అందర్నీ కాల్చడం మొదలు పెట్టారు. అందరూ నేల మీద పడిపోయారు”
యాన్ నయింగ్ తనంతట తాను నేల మీద పడిపోయారు. తనకు తూటా తగిలి చనిపోయనట్లు నటించానని చెప్పారు. తర్వాత తనపై అనేక మృతదేహాలు పడ్డాయని అన్నారు.
కింద పడిపోయిన తర్వాత యాన్ నయింగ్ కళ్లు కొద్దిగా తెరిచి చూసినప్పుడు గాయాలతో కింద పడి ఉన్న గ్రామస్తుల్లో కొంత మంది చనిపోయారని, మరి కొంతమంది తీవ్ర గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆయన చెప్పారు.
“పడిపోయిన వాళ్లు చనిపోయారని నిర్థరించుకునేందుకు వారిని మరోసారి కాల్చారు. నా పక్కన ఉన్న వ్యక్తి కొద్దిగా ముందుకు కదిలాడు. దీంతో సైనికుడు అతడి తల మీద కాల్చాడు. ఆ బుల్లెట్ అతడి తలలో నుంచి దూసుకు వచ్చి నా ఛాతీకి తగిలింది. ఆ సమయంలో నేను కదలలేక పోయాను. గట్టిగా ఊపిరి బిగబట్టాను. చనిపోయినట్లు నటించాను. కళ్లు తెరిచే ధైర్యం కూడా చెయ్యలేదు” అని నయింగ్ చెప్పారు.
సైనికుల బూట్ల శబ్ధం తగ్గిపోయిన తర్వాత కళ్లు తెరిచి నెమ్మదిగా ఊపిరి తీసుకున్నాను. ఛాతీ మీద చిన్న గాయం అయింది. ఆ సంఘటనలో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
నయింగ్ చెప్పిన సంఘటనల గురించి సైన్యం అధికార ప్రతినిధి జనరల్ జా మిన్ టున్‌ను బీబీసీ అడిగినప్పుడు ఆయన “ నో కామెంట్స్” అని స్పందించారు. పీడీఎఫ్ ఏదైనా పోరాటంలో గెలిచినప్పుడు అది తన గొప్పదనంగా ప్రచారం చేసుకుంటుందని, ఓడిపోతే మాత్రం నయింగ్ లాంటి బాధితుల్ని ముందుకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పారు.
ఈ సంఘటన తర్వాత ఊళ్లోకి వెళ్లేందుకు ఎవరికీ ధైర్యం చాలడంలేదని, గ్రామంలో ఏమీ మిగల్లేదని యాన్ నయింగ్ చెప్పారు. సైనికులు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇళ్లను కూడా తగలబెట్టారని అన్నారు.
“ అమాయకుల్ని చంపేశారు, తల్లులు బిడ్డల్ని కోల్పోయారు. కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. వాళ్లను నేను ఎన్నటికీ క్షమించను. మేం పడుతున్న కష్టాలు వాళ్లకు కూడా ఎదురవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ నయింగ్ కన్నీటి పర్యంతం అయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














