విషపు చేప ఉంది జాగ్రత్త! అక్కడ బీచ్‌కి వచ్చేవారికి హెచ్చరికలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అండ్రూ టర్నర్
- హోదా, బీబీసీ న్యూస్
అక్కడ బీచ్‌లకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని, ఇసుకలో ఉండే ఒక విషపు చేప కారణంగా ప్రమాదంలో చిక్కుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బ్రిటన్‌లోని నార్ఫోక్, సఫోక్ తీర ప్రాంతాల్లోని కొందరు తాము సముద్రం ఒడ్డున నిల్చున్నప్పుడు ఒక విషపు చేప కాటు వేసినట్లు చెబుతున్నారు.
ఈ చేప వీపుపై ముళ్లలాంటివి ఉంటాయి. ఇవి ఇసుకలో ఉన్నప్పుడు వాటిపై అడుగు వేస్తే అరికాళ్లకు ఆ ముళ్లు గుచ్చుకుని తీవ్రమైన నొప్పికి గురవుతారు.
సఫోక్‌లోని సౌత్‌వోల్డ్ బీచ్‌లో ఉన్న చేప గుచ్చడం వల్ల చాలా నొప్పికి గురైనట్లు 52 ఏళ్ల మ్యాట్ మోర్ చెప్పారు.
సంవత్సరమంతా ఈ చేప బీచ్‌లలో ఉంటుందని, కానీ, వేసవికాలం స్విమ్మింగ్ సీజన్‌లో మాత్రమే దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారని నార్ఫోక్‌లోని గ్రేట్ యార్మౌత్‌ల ఉన్న సీ లైఫ్ సెంటర్‌కు చెందిన ఎల్రిక్ టర్బెట్ అన్నారు.
ఈ చేప పొడవు కేవలం 7 అంగుళాలు అంటే సుమారు 18 సెంటిమీటర్లు మాత్రమే ఉంటుంది.
ఈ చేప వల్ల ఇబ్బంది పడకూడదంటే రబ్బర్ సోల్స్ ఉన్న బీచ్ షూస్ ధరించాలని టర్బెట్ చెబుతున్నారు. అలాగే, నీటిలో కాళ్లు కదిపితే ఆ చేపలు దూరంగా వెళ్లిపోతాయని చెప్పారు.
తన భార్య ట్రాసీ, కుటుంబంతో కలిసి కారావాన్ హాలిడేకు వెళ్లినప్పుడు బ్రూక్‌లోని నార్ఫోక్‌లో మోర్ ఈ చేప కాటుకు గురయ్యారు.


ఫొటో సోర్స్, Andrew Turner/BBC
తన కొడుకుతో కలిసి నీటిలోకి దిగిన మోర్‌కు ఒక గుండుసూది కాలికి గుచ్చుకున్నట్లు అనిపించింది. అక్కడికి కొన్ని సెకన్లలో నొప్పి ఎక్కువైపోయింది.
‘చేప కాటుకు గురైన తరువాత దగ్గర్లోని ఇసుక దిబ్బలపైకి వెళ్దామనుకున్నాను. కానీ, 10 అడుగులు వేసేసరికి నొప్పి మరింత ఎక్కువైంది. నడవలేక నేలపై పాక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది’’ అని తెలిపారు.
తన కొడుకు ఇంటర్నెట్‌లో దీని గురించి సెర్చ్ చేసినప్పుడు వీవర్ ఫిష్ కాటు అయి ఉంటుందని తెలిసింది.
‘‘వాటి గురించి నేను విన్నాను. ఎన్నో ఏళ్లుగా సౌత్‌వోల్డ్‌లో స్విమ్మింగ్‌కు వస్తున్నాను. కానీ, నాకెలాంటి ఇబ్బంది కలగలేదు’’ అని మోర్ చెప్పారు.
20 నిమిషాల వరకు విపరీతమైన నొప్పి ఉందని.. ఆ తరువాత కొంత తగ్గినా గంటన్నర పాటు నొప్పి ఉందని, ఆ తర్వాతే తగ్గిందని తెలిపారు.

ఫొటో సోర్స్, National Coastwatch Mablethorpe
ఈ నెల ప్రారంభంలో గోర్లెస్టన్ బీచ్‌లో తొమ్మిదేళ్ల తన కొడుకు సిద్‌కు కూడా ఇదే మాదిరి ఒక జీవి కాటు వేసిందని పర్యటకుడు టిమ్ చెప్పారు.
‘‘సిద్ సముద్రంలో నుంచి బయటికి వచ్చి ఏదైనా పదునైన రాయిపై కాలు వేయడంతో గాయమైందని అనుకున్నాడు’’ అని తెలిపారు.
తొలుత దానివల్ల అంత నొప్పిగా అనిపించలేదు. కానీ, కొన్ని నిమిషాల తర్వాత నొప్పి చాలా తీవ్రమైంది. అలా నొప్పి పెరుగుతూ పెరుగుతూ భరించలేని స్థాయికి వెళ్లింది.
తన కాళ్లంతా ఎవరో కాల్చివేస్తున్నట్లు అనిపించిందని తన కొడుకు సిద్ చెప్పినట్లు ఆ పర్యాటకుడు చెప్పారు.
సిద్ కాలి నుంచి రక్తం కారింది. పంక్చర్ వేసినట్లు ఒక గాయమైంది.

ఫొటో సోర్స్, Supplied
సిద్ బొటను వేలి కింద భాగం పూర్తిగా నల్లగా మారిపోయి వాపు వచ్చిందని టిమ్ చెప్పారు.
‘‘తొలుత దీన్ని మేం జెల్లీఫిష్ లేదా సీ అర్చిన్ అనుకున్నాం. కానీ, దీని గురించి గూగుల్‌లో వెతికినప్పుడు అది ‘వీవర్ ఫిష్’ అని తేలింది. దాని గురించి అంతకుముందు ఎన్నడూ వినలేదు’’ అని టిమ్ అన్నారు.
ఈ నొప్పి సుమారు గంట పాటు తీవ్రంగా ఉండి, ఆ తర్వాత తగ్గిపోయినట్లు తెలిపారు.
‘వీవర్ ఫిష్ వల్ల సమస్య అని నేను చెప్పను. కానీ, వాటిపై నిల్చున్నప్పుడు మాత్రమే అవి అతిపెద్ద సమస్యగా మారతాయి’’ అని టర్బెట్ చెప్పారు.
ఎవరైనా దీని కాటుకు గురైనప్పుడు, వైద్య చికిత్స తీసుకోవడం, 30 నిమిషాల పాటు నిలబడిగలిగేంత వేడి నీటిలో పాదాలను ఉంచడం, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చేయాలని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Supplied
బీచ్‌లో సాధారణ సంఖ్యలో వీవర్ ఫిష్‌లు ఉన్నాయని నార్ఫోక్ మెరైన్ ఫిష్ రికార్డర్ రాబ్ స్ప్రే తెలిపారు.
వేసవికాలం చివరిలో చాలా మంది హాలిడే కోసం బీచ్‌లకు వస్తుంటారు.
సముద్రపు నీటిలో, ఒడ్డున నీటి తడి ఉన్న ఇసుకలో ఈ చేపలు తిరుగుతుంటాయి.
‘‘వీవర్ ఫిష్ దాడి చేయదని, కానీ, పైన వాటికి ముళ్లు వంటివి ఉంటాయని, అవే వాటికి రక్షణ’ అని ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














