కెన్యా: సముద్రంలో మునిగిపోతున్న గ్రామం, తీరం పొడవునా గోడ కట్టడం సాధ్యమేనా?

కెన్యా తీరప్రాంత గ్రామమైన కిపినిలో రాబర్టో మాక్రి తన విలాసవంతమైన హోటల్‌ను నిర్మించినప్పుడు,అది చూడముచ్చటైన హిందూ మహాసముద్ర జలాలకు 100మీ (330 అడుగులు) దూరంలో ఉంది.
దాదాపు రెండు దశాబ్దాలుగా పర్యటకులు అందమైన బీచ్,వెచ్చటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి తరలిరావడంతో ఆయన వ్యాపారం అభివృద్ధి చెందింది.
ఇసుక తిన్నెల పైన నిర్మించిన తానా లాడ్జ్ హోటల్ నుంచి చూస్తే సముద్రం అత్యద్భుతంగా కనిపిస్తుంది.
కానీ తీరప్రాంతం మార్పులకు గురవడాన్ని 2014లో ప్రజలు గమనించారు. నెమ్మదిగా సముద్ర మట్టం పెరగడం ప్రారంభమై, ఐదేళ్లలోనే ఆ హోటల్‌కి చెందిన తొమ్మిది కాటేజీలను ఒకదాని తర్వాత ఒకటిగా తనలో కలిపేసుకుంది.
"సముద్రంలో క్రమంగా మార్పు మొదలై, హోటల్‌ను ఆక్రమించడం ప్రారంభించింది....చివరకు 2019లో మిగిలిన ఒక్క కాటేజీ కూడా సముద్రంలో కలిసిపోవడంతో అద్భుతమైన నా హోటల్ నామరూపాల్లేకుండా పోయింది"అని ఇటాలియన్ వ్యాపారవేత్త మాక్రి బీబీసీకి చెప్పారు.


ఫొటో సోర్స్, Roberto Macri
హిందూ మహా సముద్ర జలాల్లో మునిగిపోయిన రాబర్ట్ మాక్రి హోటల్ వెనుకే కిపినీ గ్రామ ప్రజలు ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు వారు కూడా తమకూ అటువంటి పరిస్థితే ఎదురవుతుందేమోనని బెంగపడుతున్నారు.
కెన్యాలో తానా నది హిందూ మహాసముద్రంలో కలిసే చోట కిపిని గ్రామం ఉంది.
నెమ్మదిగా కనుమరుగవుతున్న అనేక తీర గ్రామాలలో కిపిని కూడా ఒకటి.
"సముద్రం రోజురోజుకూ ముందుకు వస్తోంది.దీంతో మా ఇళ్ళు బలహీనమవుతున్నాయి. మేం భయపడుతున్నాం,చాలా బాధగా ఉంది,కానీ దీనిని ఆపడానికి మేమేమీ చేయలేం,"అని స్థానిక కమ్యూనిటీ నాయకురాలు సైదా ఇద్రిస్ బీబీసీకి చెప్పారు.
సముద్రమట్టం పెరిగి,బలమైన గాలులు,భారీ ఆటుపోట్లతో పాటు, రాత్రి వేళ అనేక మంది అలల ధాటికి కొట్టుకుపోయి మరణించారని,చాలామంది కనిపించకుండాపోయారని ఆమె అన్నారు.
తీరప్రాంతం వెంబడి ఉన్న మడ అడవుల క్షీణత, తీరప్రాంతం కోతకుగురికాకుండా రక్షణ చర్యలు లేకపోవడమే దీనికి కారణం.
మడ అడవులన్నీ ఉప్పునీటిని తట్టుకోగల చెట్లు,పొదలతో నిండి ఉంటాయి.ఇవి మట్టిని స్థిరీకరించడం ద్వారా సముద్రపు నీటిని వ్యవసాయ భూములలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.లేకపోతే వ్యవసాయ భూములు నీటిపాలయ్యే ప్రమాదం ఉంటుంది.
అయితే ఇప్పుడు మడ అడవులు కూడా అంతరించిపోతున్నాయి. దృఢమైన చెక్క కోసం స్థానికులు చెట్లను నరకడం,వాతావరణ మార్పుల ఫలితంగా సముద్రపు నీటి మట్టాలు పెరగడమే అవి అంతరించిపోవడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
"కిపిని తీరప్రాంతంపై బలమైన గాలులు, ఎగసిపడే సముద్రపు అలలు ప్రభావం చూపుతున్నాయి"అని ప్రకృతి పరిరక్షణకు పాటుపడే ఫౌనా అండ్ ఫ్లోరా సంస్థకు చెందిన శాస్త్రవేత్త జార్జ్ ఒడెరా వివరించారు.

ఫొటో సోర్స్, Roberto Macri
కిపిని గ్రామంలోకి ప్రవేశించగానే అందమైన పామ్ చెట్లు పర్యటకులకు స్వాగతం పలుకుతాయి.మసాలా దినుసులు,కాల్చిన మాంసం,చేపల కూరలతో కమ్మటి విందు...ఇవ్వన్నీ కెన్యా తీరప్రాంతంలోని జీవితాన్ని ప్రతిబింబిస్తుంటాయి.
కానీ పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు ఇటువంటి ప్రశాంత జీవనానికి ముప్పుగా మారాయి.
స్థానిక అధికారి ఒమర్ హల్కీప్రకారం,గత 10 సంవత్సరాలలో దాదాపు 10కిలోమీటర్లమేర (6.2 మైళ్ళు) భూభాగాన్ని సముద్రం తనలో కలిపేసుకుంది.
"ఈ ప్రాంతం మొత్తం నీటిలో మునిగిపోవడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు" అని ఆయన బీబీసీకి చెప్పారు.
కిపినిలో దాదాపు 4,000 మంది జనాభా ఉన్నారు.
సముద్ర మట్టాలు పెరుగుతున్నందున ఇకపై ఇళ్ల నిర్మాణం కోసం బలమైన పునాదులు నిర్మించడం సాధ్యం కాదని స్థానికులు బీబీసీకి తెలిపారు.
గత దశాబ్ద కాలంలో 1,000 మందికి పైగా ప్రజలు ఇతర గ్రామాలకు మకాం మార్చారని అంచనా.
మంచినీటిని అందించే చాలా బావులు,బోర్లు ఇప్పుడు ఉప్పునీటితో నిండిపోవడంతో తాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన పరిస్థితి నెలకొంది.
భూగర్భ జలాల్లో ఉప్పు పెరగడం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
స్థానికులకు పీతలు,రొయ్యల విక్రయమే జీవనాధారం.కానీ ఇప్పుడు వాటి సంతానోత్పత్తి స్థలాలు మడ అడవుల్లోని చిత్తడి నేలల కిందకు వెళ్ళిపోతుండటంతో ,తమ జీవనోపాధి పోతుందని అని వారు భయపడుతున్నారు.

పెరుగుతున్న సముద్ర మట్టాలు ప్రజల జీవితంపై అన్నీ కోణాల్లోనూ ప్రభావం చూపిస్తున్నాయి. చివరకు వారి ఖననాలపై కూడా... "సమాధులను లోతుగా తవ్వలేం.ఎందుకంటే, ఆరు అడుగులు తవ్వితే చనిపోయినవారిని నీటిలో పాతిపెట్టాలి"అని ఒక స్థానికుడు బీబీసీకి చెప్పారు.
కిపిని గ్రామం తానా రివర్ కౌంటీ పరిధిలో ఉంది.ఇది రకరకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొన్ని చోట్ల తీవ్రమైన కరువు,నీటి కొరత ఉంటే మరికొన్ని చోట్ల వరదలు సంభవిస్తున్నాయి.
సముద్ర మట్టాలు పెరిగి ఒక గ్రామాన్ని మింగేయడమే... ఇలా జరిగిందనడానికి మొదటి ఉదాహరణ.
తానా నది తన మార్గాన్ని మార్చుకోవచ్చు అని మరికొందరు అంటున్నారు.
"అసలైన జలమార్గం ఎక్కడికి వెళుతుందో మా పూర్వీకులు మాకు చూపించారు" అని అక్కడ నివసించే రిషాది బడి బీబీసీకి చెప్పారు.
కొన్ని తరాల కిందట ఈ నది కిపిని గ్రామం మీదుగా ప్రవహించేదని తనకు చెప్పారని ఆయన వివరించారు.

కిపిని ఎదుర్కొంటున్న విపత్తును అధ్యయనం చేసిన ఒడెరా, వాతావరణ మార్పులే దీనికి పూర్తి కారణమని అంటున్నారు.
"కిపినిలో జరుగుతున్నది చరిత్ర కాదు,ఇది ఇటీవల జరిగిన సంఘటన,చేదు నిజం,ఇది మెరుగుపడే పరిస్థితి లేదు" అని ఆయన చెప్పారు.
సముద్రం మరింత చొరబడకుండా గ్రామాన్ని రక్షించడానికి స్థానిక అధికారులు 72 కిమీ (45 మైళ్లు) తీరప్రాంతంలో సముద్రపు గోడను నిర్మించాలనుకుంటున్నారు.
పరిస్థితి విషమంగా ఉందని అధికారులు గుర్తించినప్పటికీ,నిధుల కొరత కారణంగా వాల్ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదని కౌంటీలోని సీనియర్ ల్యాండ్ అధికారి మ్వానాజుమా హిరిబే చెప్పారు.
"సముద్రం ముందుకు రావడం అనేది సుమారు 15 గ్రామాలపై ప్రభావం చూపే సమస్య. దీనిని పరిష్కరించడం కేవలం కౌంటీ ప్రభుత్వానికి సాధ్యం కాదు" అని ఆమె బీబీసీకి చెప్పారు.
యుఎన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్,యుఎన్ హాబిటాట్ సంస్థలు వాల్ ప్రాజెక్టుకు మద్దతు తెలిపాయని ఆమె చెప్పారు.
సముద్రపు మట్టం పెరుగుదల వల్ల పర్యటక అందాలకు ముప్పు వాటిల్లడంతో, మొంబాసాలోని ఫోర్ట్ జీసస్,మలిండిలోని వాస్కో డా గామా స్తంభం వంటి చారిత్రక ప్రదేశాలలో కూడా ఇలాంటి గోడలను నిర్మించారు.
అయితే వాతావరణ నిపుణులు కిపినిలో గోడను నిర్మించడం "తాత్కాలిక పరిష్కారం" అని, మడ అడవుల పునరుద్ధరణ వంటి పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టడం అవసరమని ఒడెరా అన్నారు
"సముద్ర జలాలను ఆపడం అనేది ప్రభుత్వం అనుకున్న వెంటనే జరిగిపోయే విషయం కాదు, ఈ వాతావరణ పరిస్థితి మెరుగుపడడానికి అనుకూలమైన మార్పులు చేసుకుంటూ ముందుకు సాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని"ఆయన అన్నారు.

సముద్రం ఎంతమేర ముందుకు చొచ్చుకొచ్చిందో చూసేందుకు రోజూ వెళుతున్నామని,ఇలా రోజూ సముద్రపు తీరాన్ని సందర్శిస్తోంటే మా ఊరిలో మేమే పర్యటకులుగా మారినట్టు అనిపిస్తోంది అని స్థానికులు చెబుతున్నారు.
"ఇక్కడ పరిస్థితి వినాశనకరంగా మారింది" అని మాక్రి అన్నారు. ఈ పరిస్థితులకు భయపడి ఆయన కిపిని నుంచి 170 కిమీ (100 మైళ్ళు) దూరంలో ఉన్న మాలిండిరోని మరో తీర నగరానికి మకాం మార్చారు.
"ఈ ప్రాంతం బంగారంలా ఉండేది - కొబ్బరి చెట్లు, బీచ్ పక్కనే చారిత్రక భవనాలు, చుట్టూ అందమైన ఇసుక తిన్నెలతో ప్రశాంతమైన గ్రామం" అని ఆయన అన్నారు. ఆయనకు తన పెట్టుబడిలో మిగిలింది మేనేజర్ ఇల్లు మాత్రమే. దాన్ని కూడా సముద్రం మింగేస్తుందేమో అని ఆయన అన్నారు.
తన హోటల్ ఉన్న 10 ఎకరాల్లో...నాలుగు ఎకరాలు పూర్తిగా నీట మునిగాయి.
మిగిలిన ఆరు ఎకరాలను సముద్రం మింగకుండా ఉంటే మళ్లీ అక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టాలని మాక్రి అనుకుంటున్నారు.
ఆయన మాజీ మేనేజింగ్ డైరెక్టర్,జోసెఫ్ గచాంగో కూడా అంతే దీనస్థితిలో ఉన్నారు.
"ఇటలీ నుండి కూడా వచ్చే పర్యటకులకు కూడా ఆతిథ్యం ఇచ్చే ఆహ్లాదకరమైన హోటల్‌లో దాదాపు 50 మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోవడాన్ని చూడటం నా మనసును వికలం చేసింది" అన్నారు ఆయన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














