బంగ్లాదేశ్‌: హిందువులు, మైనారిటీల పరిస్థితేంటి ? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

బంగ్లాదేశ్, మైనార్టీలు

ఫొటో సోర్స్, DEBALIN ROY/BBC

    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బంగ్లాదేశ్ నుంచి బీబీసీ ప్రతినిధి

బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న అను తాలుక్దార్ వారం రోజుల కిందటి వరకూ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు.

అప్పుడు, తాను హిందువుననే విషయం ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. అందరు విద్యార్థులతో తానూ ఒకదానిని అనుకున్నారు. కానీ ఇప్పుడు తాను హిందువుననే విషయం గ్రహించినట్లు ఆమె చెప్పారు.

‘‘మేం సురక్షితంగా లేము. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. నిరసనల సమయంలోనూ మాకేమీ భయంగా అనిపించలేదు.’’ అని రాజధాని ఢాకాలో ఢాకేశ్వరి ఆలయంలో ఉన్న అను తాలుక్దార్ బీబీసీతో చెప్పారు.

''ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నాం. ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేశాం. కానీ, చివరికి మేమే బాధితులమయ్యాం.'' అన్నారామె.

షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరిగిన హింస గురించి అను చెబుతున్నారు.

ఈరోజు దేశంలో అధికార మార్పిడి జరగడానికి తాను, తనలాంటి వారి నిరసనలే కారణమని ఆమె నాతో అన్నారు.

తమలాంటి వారిని కాపాడాల్సిన బాధ్యత తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆమె భావన.

బీబీసీ న్యూస్ తెలుగు

ప్రస్తుతం బంగ్గాదేశ్‌లో రెండు దేశాలు కనిపిస్తున్నాయి.

మొదటి దానిలో, గడచిన రోజుల అనుభవాల నుంచి సాధారణ పరిస్థితులకు తిరిగొస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిరసనలు జరిగాయి. దానికి సంబంధించిన డిమాండ్లు ఇక్కడి గోడలపై ఉన్నాయి. ఈ గోడలకు విద్యార్థులు మళ్లీ పెయింట్ వేస్తున్నారు. అందుకోసం సోషల్ మీడియా ద్వారా నిధులు సమీకరిస్తున్నారు.

ఆఫీసులు, షాపులు, మార్కెట్లు తెరుస్తున్నారు. కస్టమర్లు బాగానే కనిపిస్తున్నారు. ఇంతకుముందు విద్యార్థులు ట్రాఫిక్ బాధ్యతలు చూస్తూ కనిపించారు. క్రమంగా ట్రాఫిక్ పోలీసులు విధుల్లోకి వస్తున్నారు. నిత్యవసరాల ధరలు నిలకడగానే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

షేక్ హసీనా దేశం విడిచి వెళ్లకముందు వందలాది మరణాలకు బాధ్యులు కాలేక విధులకు దూరమైన పోలీసులు నెమ్మదిగా వారి పోలీస్ స్టేషన్లకు తిరిగి వస్తున్నారు.

ఇక రెండోది, దేశంలో ని హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీల పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వీరికి కూడా వర్తిస్తాయి. అయితే, హింస, భయం, అభద్రతాభావం కూడా ఉన్నాయి.

షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయినప్పటి నుంచి దేశంలోని మైనార్టీలపై 52 జిల్లాల్లో 200కిపైగా దాడులు జరిగినట్లు మైనార్టీ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఆయా సంఘాల నేతల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలతో భారత్ సహా ఐక్యరాజ్యసమితి స్పందనలకు కారణమైంది.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ మంగళవారం ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, DEBALIN ROY/BBC

హింసకి గురైన బాధితులు ఏమంటున్నారు?

హిందువులు, ఇంకా మైనారిటీలపై జరిగిన హింసాకాండను అర్థం చేసుకునేందుకు మేం రాజధాని ఢాకా నుంచి కొమిల్లా పట్టణానికి బయలుదేరాం.

ఈశాన్య భారత్‌లోని త్రిపుర రాష్ట్ర సరిహద్దుకి సమీపంలో కొమిల్లా ఉంటుంది. గతంలో ఇక్కడ మతపరమైన హింస చెలరేగింది.

మొదటగా మేం ఢాకాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదన్‌పూర్‌లో ఆగాం.

మదన్‌పూర్‌లోని ఇరుకైన వీధుల్లో నుంచి వెళ్తూ ఓ పెద్ద ఇనుప గేటు ముందు ఆగాం. తలుపు తెరిచిచూస్తే, ఒక కార్యాలయం భయంకరమైన పరిస్థితిలో కనిపించింది.

డాక్యుమెంట్లు కాలిపోయి ఉన్నాయి. ఫర్నీచర్, కిటికీలు ధ్వంసమయ్యాయి.

ఇది క్రిస్టియన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ కార్యాలయం. చిన్నచిన్న రుణాలిచ్చే సంస్థ. కొన్నిసార్లు ఇక్కడ ప్రార్థనలు కూడా జరిగేవి.

మేం ఆ కార్యాలయాన్ని వీడియో షూట్ చేస్తున్నప్పుడు, అక్కడ భయంభయంగా ఉన్న గార్డు మమ్మల్ని హెచ్చరించారు. ''ఇక్కడ ఎక్కువ సేపు ఉండొద్దు. వాళ్లు మనల్ని గమనిస్తుంటారు. ఏ క్షణంలోనైనా ఇక్కడికొస్తారు.'' అని చెప్పారు.

కొద్దిరోజుల కిందట ఈ స్థలాన్ని తగలబెట్టిన వారి గురించి చెబుతూ, ఇప్పటికీ వాళ్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని గార్డు చెప్పారు.

దాడులతో ఆగని దుండగులు పదేపదే ఇక్కడికొచ్చి దొరికిన వాటిని దోచుకుపోయారని గార్డు తెలిపారు.

గార్డు గొంతుతగ్గించి చిన్నగా మాట్లాడుతూ, ''మీరొచ్చే కొద్ది నిమిషాల ముందే వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లారు.'' అని మాతో చెప్పారు.

ఇంకా దాడులు జరిగే అవకాశం ఉందని ఇక్కడ ఉండే మైనార్టీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, ఈ ఆఫీసు మేనేజర్ హైవే దగ్గర మమ్మల్ని కలిసేందుకు అంగీకరించారు.

ఆరోజు సంఘటన గురించి చెబుతూ, ''ఆగస్టు 5వ తేదీ రాత్రి, 10.40 గంటలకు సెక్యూరిటీ గార్డు ఫోన్ చేసి విషయం చెప్పడంతో, వెంటనే మేం అక్కడికి వెళ్లాం. అప్పటికే అంతా బూడిదైపోయింది. డబ్బులు, డాక్యుమెంట్లు, మతగ్రంథాలు అన్నీ కాలిపోయాయి.'' అని ఆయన అన్నారు.

''ఆ తర్వాత, మూడోరోజు ఉదయం 9 గంలకు నేను ఆఫీసుకి వెళ్లగానే, కొంతమంది బలవంతంగా లోపలికి వచ్చి ఇక్కడికెందుకు వచ్చావని అడిగారు. ఇది నా ఆఫీస్ అని నేను చెప్పా. 2020 నుంచి ఈ భవనంలో చర్చి, మతపరమైన కార్యకలాపాలు ప్రారంభించాం. గతంలో ఎప్పుడూ ఇలా దాడులు జరగలేదు. మమ్మల్ని చాలాసార్లు బెదిరించారు.'' అన్నారాయన.

పోలీసులుకు ఫిర్యాదు చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఎక్కడా అందుబాటులో లేరని సదరు క్రిస్టియన్ కమ్యూనిటీ సెంటర్ మేనేజర్ మాతో చెప్పారు.

బంగ్లాదేశ్, మైనార్టీలు

ఫొటో సోర్స్, DEBALIN ROY/BBC

ఫొటో క్యాప్షన్, అల్లరిమూకల దాడికి గురైన షోరూమ్ యజమాని బిమల్ చంద్ర డే

కొమిల్లాలో బిమల్ చంద్ర డేకి చెందిన బైక్ షోరూమ్‌కి వెళ్లాం.

అయితే, ఆగస్టు 5కి ముందు నుంచి తాను భారత్‌‌లో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన మాతో చెప్పారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చిన వెంటనే హింస జరిగే అవకాశం ఉందని ముందే గ్రహించి షోరూమ్ షట్టర్లు వేసేయమని తమ సిబ్బందికి చెప్పినట్లు ఆయన తెలిపారు.

బిమల్ చంద్ర భయం నిజమైంది.

మధ్యాహ్నం సమయంలో, షేక్ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అల్లరిమూక వచ్చి బిమల్ షోరూమ్‌పై దాడికి దిగిందని ప్రత్యక్ష సాక్షులు మాకు చెప్పారు.

కొందరు వ్యక్తులు షోరూమ్‌లోని బైకులను దొంగిలించి, షోరూమ్‌కి నిప్పుపెట్టారు.

అయితే, దుండగులు బిమల్ చంద్ర డే షోరూమ్ చుట్టుపక్కల ఉన్న మరే దుకాణం జోలికీ పోలేదు.

బిమల్ చంద్ర డే వీడియో కాల్‌లో బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ దేశంలో మైనారిటీలుగా ఉండడం వల్లే మాపై దాడి జరిగింది. బంగ్లాదేశ్‌లో హిందువుగా పుట్టడమే నేను చేసిన పెద్ద తప్పు.'' అని ఆయన అన్నారు.

తాము ప్రతీకార దాడులు చేయలేమని వాళ్లకి తెలుసని, అందుకే వాళ్లు ఏమైనా చేయగలరని అన్నారాయన.

షేక్ హసీనా ప్రభుత్వానికి మద్దతుదారులనే ఉద్దేశంతోనే మీరు టార్గెట్ అయ్యారా అని మేం బిమల్‌ను అడిగాం.

''నిజం చెప్పాలంటే, బంగ్లాదేశ్‌లో మేం (హిందువులం) అవామీ లీగ్‌కి కానీ, మరే ఇతర పార్టీకి కానీ మద్దతివ్వడం లేదని చెప్పినా ఎవరూ నమ్మరు.'' అన్నారు.

''బిజినెస్ పనిమీదు అవామీ లీగ్‌తో పాటు ఇతర పార్టీల నాయకులనూ కలుస్తుంటా, అది తప్పా?'' అని బిమల్ ప్రశ్నిస్తున్నారు.

తిరిగి బంగ్లాదేశ్ వెళ్లడమే ప్రస్తుతం తన తొలి ప్రాధాన్యమని, అక్కడి తాత్కాలిక ప్రభుత్వాన్ని తాను అడిగేది ఒక్కటేనని బిమల్ అన్నారు.

''నాకు న్యాయం కావాలి. నాకు చాలా నష్టం జరిగింది. ఇలా చేసిన వారిని శిక్షించాలి.'' అన్నారు.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, DEBALIN ROY/BBC

ఫొటో క్యాప్షన్, అల్లరిమూక దాడి చేసి షోరూమ్‌ను ధ్వంసం చేసింది

ధ్వంసమైన బైక్ షోరూమ్ నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో, కొమిల్లాలోని ప్రధాన ఆలయం దగ్గర అనిర్బన్ సేన్‌గుప్తాను కలిశాం. తాను రోజూ గుడికి వస్తున్నానని, హిందువులపై హింసాకాండ వంటి పరిస్థితులు ఇక్కడ పెద్దగా లేవని ఆయన అన్నారు.

''విద్యార్థుల ఉద్యమం తర్వాత పోలీసులు కనిపించకుండా పోయారు. అయితే, సమాజంలో మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. నిజానికి, ప్రతిరోజూ రాత్రి 5 నుంచి 10 మంది ముస్లింలు మా ఆలయానికి కాపలాగా ఉంటున్నారు'' అన్నారాయన.

ఇక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని అనిర్బన్‌తో పాటు కొమిల్లా పట్టణానికి చెందిన కొందరు, చుట్టపక్కల గ్రామాల్లోని హిందువులు మాతో చెప్పారు. అయితే భయాందోళనలో ఉన్నామన్నారు.

''హిందువులపై దాడులు, దోపిడీలు, దహనం చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.'' అని వారిలో ఒకరు అన్నారు.

వారి ఆందోళనలకు గత అనుభవాలు కూడా కారణం.

2021లో కొమిల్లాలో వ్యాప్తి చెందిన వదంతులు దేశవ్యాప్తంగా హిందువులపై హింసను ప్రేరేపించాయి. ఫలితంగా ముస్లింల మూక దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోగా, హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి.

బంగ్లాదేశ్‌లో తరతరాలుగా హిందూ ముస్లింలు కలిసి ఉన్నప్పటికీ, స్వతంత్రం కోసం కలిసి పోరాడినప్పటికీ ఇక్కడ మతపరమైన హింసకు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని నౌఖాలీ ప్రాంతంలో స్వాతంత్య్రానికి ముందు దారుణ మారణకాండ జరిగింది. వేల సంఖ్యలో హత్యలు, సామూహిక అత్యాచారాలు జరిగాయి.

ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు తప్పుడు సమాచార వ్యాప్తి జరుగుతోంది.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ వెరిఫై పరిశీలనలో ఏం తేలిందంటే..

మానిటరింగ్ టూల్ ‘బ్రాండ్‌వాచ్’ ప్రకారం, ఆగస్టు 4, ఆగస్టు 9 తేదీల్లో 'ఎక్స్'లో ఒక హ్యాష్‌ట్యాగ్‌‌తో తప్పుడు కథనాలు పోస్టు అయ్యాయి. ఈ హ్యాష్ ట్యాగ్‌ను దాదాపు 7,00,000 సార్లు మెన్షన్ చేశారు.

హిందూ క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిని తగలబెట్టినట్లు చేసిన ఒక తప్పుడు పోస్టు వైరలైంది. ‘ఇస్లామిస్టులు’ దానికి నిప్పంటించారంటూ ఇతర అకౌంట్లు ఆ పోస్టును షేర్ చేశాయి.

స్థానికంగా వచ్చిన రిపోర్టులను బీబీసీ వెరిఫై పరిశీలించింది. వాస్తవానికి ఈ ఇల్లు బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మష్రఫే బిన్ మోర్తజాకి చెందినదని గుర్తించింది.

మోర్తజా అధికార అవామీ లీగ్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ఆయనొక ముస్లిం.

మరో వైరల్ పోస్టులో బంగ్లాదేశ్‌లోని ఇస్లామిస్ట్ మూకలు ఆలయంపై దాడి చేస్తున్నట్లు ఉంది. చిట్టాగాంగ్‌లోని నవగ్రహ ఆలయానికి సమీపంలో మంటలు కనిపిస్తున్నాయి. కానీ ఆలయం మంటల్లో చిక్కుకున్నట్లు అందులో లేదు.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, DEBALIN ROY/BBC

ఫొటో క్యాప్షన్, హిందువులలో అభద్రతా భావం బీజేపీ, అవామీ లీగ్‌ను దగ్గర చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అష్రఫ్ కైజర్ అభిప్రాయపడ్డారు

‘అవి బీజేపీ, అవామీ లీగ్‌ను ఒక్కటి చేస్తాయి’

రాజకీయ విశ్లేషకుడు అష్రఫ్ కైజర్‌ను ఢాకాలోని గుల్ఫన్ ప్రాంతంలో ఉన్న ఆయన కార్యాలయంలో కలిశా.

''అలాంటి(మైనార్టీలపై) దాడులు జరుగుతున్నాయి. ఆ విషయంలో చాలా చింతిస్తున్నాం. అలా జరగకూడదని కోరుకుంటున్నాం. అయితే, ఇక్కడ మరో విషయం ఉంది.. మదర్సా విద్యార్థులు ఆలయాలకు రక్షణగా ఉంటున్నారు. ఒక ముస్లిం కుటుంబం హిందూ కుటుంబానికి భోజనం సమకూరుస్తోంది. ముస్లిం కుటుంబం హిందువుల ఇంటిని కాపాడుతోంది. కానీ ఇలాంటి మంచి విషయాలు ఎక్కడా ప్రసారం కావడం లేదు. పొరుగు దేశం భారత్‌ను ఇందులో భాగస్వామిని చేసేందుకు ఇప్పటి వరకూ ఇక్కడ అధికారంలో ఉన్న వారు పన్నిన భారీ వ్యూహంగా ఇది అనిపిస్తోంది. ఇవి ప్రపంచం మొత్తం వ్యాపించి, దేశాన్ని ఇస్లామిస్టులు స్వాధీనం చేసుకున్నారని, దేశం సురక్షితంగా లేదనే భావనను చిత్రీకరించేందుకు దోహదం చేస్తాయి.'' అన్నారాయన.

హిందువులలో అభద్రతా భావం బీజేపీ, అవామీ లీగ్ ఒక్కటయ్యేందుకు ఎలా కారణమవుతుందో ఆయన చెబుతూ, “బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించడం కూడా బీజేపీకి ఒక పెద్ద రాజకీయాంశం. అవావీ లీగ్ రాజకీయాలకు ఇదెలా ఉపయోగపడుతుందంటే, ఆ పార్టీ లౌకికవాదం తమ ఆదర్శంగా చెబుతుంది. నేను చెప్పినట్లుగా, దేశంలోని 8 శాతం లేదా 9 శాతం హిందూ జనాభా అవామీ లీగ్‌కి పెద్ద ఓటు బ్యాంకు.'' అన్నారు.

బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశమా? లేక లౌకిక ప్రజాస్వామ్యమా? అనే ప్రాథమిక ప్రశ్నపై చాలా గందరగోళం ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ రాజ్యాంగంలో లౌకికవాదం ప్రస్తావన ఉంది. కానీ, 1980లో ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు.

ముప్పై ఏళ్ల తర్వాత 2010లో దేశ అత్యున్నత న్యాయస్థానం 1972 నాటి రాజ్యాంగంలో రాసిన సెక్యులరిజం భావన ఇప్పటికీ అలాగే ఉందని పేర్కొంది.

ప్రస్తుతం ఈ రెండు భావనలు బంగ్లాదేశ్‌లో ఉన్నాయి. అయితే, లౌకికవాదంపై ప్రభుత్వ నిబద్ధత ప్రశ్నార్థకంగానే ఉంది.

షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్‌ను 'పాక్షిక స్వేచ్ఛ' కలిగిన దేశంగా గత ఏడాది అంతర్జాతీయ సంస్థ ఫ్రీడమ్ హౌస్ పేర్కొంది.

''హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, షియా, అహ్మదీయ ముస్లింలతో సహా మైనారిటీలు వేధింపులు, హింసను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు వారి ప్రార్థనా మందిరాలపై మూక దాడులు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా మైనారిటీలపై హింసను రెచ్చగొడుతున్నారు. ఇటీవల సంవత్సరాల్లో హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, ఆలయాలకు నిప్పు పెట్టడం లేదా ధ్వంసం చేశారు. ఈ దాడులు 2023లోనూ కొనసాగాయి.'' అని ఫ్రీడమ్ హౌస్ తన నివేదికలో పేర్కొంది.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, DEBALIN ROY/BBC

ఫొటో క్యాప్షన్, మా భద్రతకు హోం మంత్రి హామీ ఇచ్చారని గోపాల్ దేబ్‌నాథ్ చెప్పారు

మేం మళ్లీ ఢాకేశ్వరి ఆలయం వద్ద, చాలామంది హిందూ సంఘాల నాయకులను కలిశాం.

వారిలో గోపాల్ చంద్ర దేబ్‌నాథ్ ఒకరు.

ప్రభుత్వ హామీ, నెమ్మదిగా మెరుగుపడుతున్న పరిస్థితులు వారి ఆందోళనలను కొంతవరకూ తగ్గించినట్లు కనిపిస్తోంది.

''నా రక్తం, మీ రక్తం ఒక్కటే. మరెందుకు మీకు భయం అని నిన్న హోం మంత్రి నాతో అన్నారు. మీతో పాటు మీ వర్గానికి చెందిన వారెవరైనా ఏ సమయంలోనైనా సాయం కావాలంటే నన్ను అడగమన్నారు. ఇక్కడి హిందూ సమాజం చాలా ప్రశాంతంగా ఉంది, మేం సురక్షితంగా ఉన్నాం. ఒకవేళ మేం దేశం విడిచి వెళ్లిపోతే మా భూములు, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలతో కొంతమంది ఉన్నారు. రాజకీయ కారణాలతో వారు ఇలా చేస్తున్నారు.'' అని దేబ్‌నాథ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, దాడులపై బాధితులేమంటున్నారు?

దేశం నుంచి పెద్దయెత్తున హిందువులు వలస వెళ్లిపోతారనే భయాల గురించి దేబ్‌నాథ్ మాట్లాడుతూ, చాలా మందిలానే నేను కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

గేటు దాటి బయటికి వచ్చినప్పుడు, అక్కడ చేతిలో కర్రలతో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

వారిలో చిన్నవాడు మహ్మద్ సైఫుజ్ జమాన్, వృత్తి రీత్యా మతబోధకుడు.

ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగాను.

“పోలీసులు లేకపోవడంతో ఇక్కడి వారిలో తమకు రక్షణ లేదన్న భావన వ్యక్తమవుతోెంది. అది నాకు తెలిసినప్పటి నుంచి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కోసం, నేనిక్కడ ఉన్నా. బంగ్లాదేశ్ మతం పేరుతో విడిపోలేదని నేను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా. నేను మాత్రమే కాదు, చాలా ముస్లిం సంస్థలు ఈ ఆలయ భద్రతకు కట్టుబడి ఉన్నాయి.'' అని ఆయన చెప్పారు.

"మేం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం."

('బీబీసీ గ్లోబల్ డిస్‌ఇన్ఫర్మేషన్ టీమ్', 'బీబీసీ వెరిఫై' ల సహాయంతో ప్రచురించిన కథనం)

(ఈ కథనాన్ని ఆగస్ట్ 21 ఉదయం 11.04 గంటలకు అప్‌డేట్‌ చేశాం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)