బంగ్లాదేశ్‌లో పోలీస్‌ స్టేషన్ల నుంచి పోలీసులు ఎందుకు పారిపోతున్నారు?

ఉద్యోగాల్లో కోటా రిజర్వేషన్లు, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, ఢాకాలోని మిర్పూర్ పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టిన ఆందోళనకారులు
    • రచయిత, అక్బర్ హుస్సేన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మంటల్లో కాలిపోయిన ఈ భవనాన్ని చూస్తే ఇదొక పోలీస్ స్టేషన్ భవనమని అర్థం కావడం కష్టం. ఇది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మిర్పూర్ పోలీస్ స్టేషన్. ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో దీని గోడలు నల్లగా మారాయి.

పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసు యూనిఫాంలు, బూట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటు చాలా వస్తువులు గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిలో సగానికి పైగా కాలిపోయాయి. ఇప్పుడవి ఉపయోగించడానికి పనికిరావు.

2024 ఆగస్టు 8 ఉదయం 9.30 గంటలప్పుడు ఢాకాలోని మిర్పూర్ మోడల్ పోలీస్ స్టేషన్‌ దగ్గర పరిస్థితి ఇది. ఈ పోలీస్ స్టేషన్‌లో అన్సార్ (పారామిలిటరీ ఫోర్స్)కు చెందిన ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ప్రజల ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు కాలిపోయిన ఈ పోలీస్ స్టేషన్ భవనం సాక్ష్యంగా నిలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగి కమల్ హుస్సేన్ పోలీస్ స్టేషన్ ముందు నిలబడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

పోలీసులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఉహించలేదని ఆయన బీబీసీతో చెప్పారు.

మిర్పూర్ మాత్రమే కాదు, ఆగస్టు 5 మధ్యాహ్నం నుంచి బంగ్లాదేశ్‌లోని ఏ పోలీసు స్టేషన్‌లోనూ పోలీసులు లేరు.

బంగ్లాదేశ్‌ చరిత్రలో ఎన్నడూ పోలీసు స్టేషన్ల నుంచి పోలీసులందరూ ఒకేసారి పారిపోయిన సంఘటనలు లేవు.

ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని ప్రస్తుత, మాజీ అధికారులు చెబుతున్నారు. అవి కూడా యుద్ధ పరిస్థితుల్లోనే కనిపిస్తాయని తెలిపారు.

పోలీసులకే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది పెద్ద ప్రశ్న.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న పోలీస్ అధికారి

'నిరంకుశంగా కాల్పులు జరిపారు'

ఢాకాలోని భటారా పోలీస్ స్టేషన్ పరిస్థితి కూడా మిర్పూర్ పోలీస్ స్టేషన్ మాదిరిగానే ఉంది. ఆందోళనకారులు తగలబెట్టిన తర్వాత పోలీసు స్టేషన్‌ లోపల శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ఈ పోలీస్ స్టేషన్‌లో అన్సార్ బృందం సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోపల విద్యార్థుల బృందాన్ని బీబీసీ కలిసింది. స్టేషన్‌ బయట ఉన్న చెత్తను తొలగించి, పరిసరాలను శుభ్రం చేసేందుకు వచ్చామని వారు చెప్పారు.

పోలీసుల గురించి ప్రస్తావించగానే వారి గొంతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అయితే పోలీసుల పట్ల సామాన్యులలో ఉన్న ఆగ్రహాన్ని తొలగించి సాధారణ పరిస్థితుల్ని తిరిగి తీసుకు రావడం ఎలా?

"సామాన్య ప్రజలకు అండగా నిలవడం, ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా మాత్రమే పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు" అని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న అబ్దుర్ రజాక్ బీబీసీతో చెప్పారు.

“పోలీసులతో మాట్లాడేందుకు భయపడ్డాను. వారి తీరు చాలా దారుణంగా ఉంది. విద్యార్థులపై, సామాన్యులపై పోలీసులు పాశవిక దాడులకు పాల్పడ్డారు. ఏకపక్షంగా బుల్లెట్లు కాల్చారు” అని ఢాకాలోని న్యూ మోడల్ కాలేజ్ విద్యార్థి షాజలాల్ పట్వారీ చెప్పారు.

బంగ్లాదేశ్, ఢాకా, మీర్పూర్, పోలీసులు
ఫొటో క్యాప్షన్, భటారా పోలీస్ స్టేషన్‌లో జప్తు చేసి ఉంచిన వాహనాలను తగలబెట్టిన ఆందోళనకారులు

పోలీసులపై ప్రజల్లో ఉన్న కోపం గురించి సీనియర్ అధికారులకు తెలుసు.

'2012లో పోలీసులు పెద్ద ఎత్తున బలప్రయోగం చేయడం ప్రారంభించినప్పుడు, పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో విపరీతమైన అపనమ్మకం ఏర్పడింది' అని ఓ పోలీస్ సీనియర్ అధికారి బీబీసీతో చెప్పారు. తన పేరు బయటకు వెల్లడించవద్దని ఆయన కోరారు.

పోలీసులంతా తిరిగి విధుల్లో చేరాలని కోరినట్లు ఆయన తెలిపారు.

పోలీసులు త్వరగా విధుల్లో చేరి శాంతి భద్రతలను గాడిన పెడితే, ప్రజల్లో వారిపై నమ్మకం ఏర్పడవచ్చు.

పోలీసుల తీరు వల్ల తమపై సామాన్యుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని ఆ సీనియర్ అధికారి అంగీకరించారు. ఈ ఆగ్రహం చాలా కాలంగా ఉందని, అదిప్పుడు ఆందోళనల సమయంలో బయటపడిందని అన్నారు.

ప్రస్తుతం పోలీసుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందనడంలో సందేహం లేదు.

అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి దోచుకెళ్లారు. చాలా మంది పోలీసులకు యూనిఫాం లేదు. చాలా పోలీస్ స్టేషన్లలో పోలీసులు కూర్చోవడానికి అవసరమైన కుర్చీలు కూడా లేవు.

ఢాకాలోని పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు, కొంతమంది సిటీ కార్పొరేషన్ ఉద్యోగులు అక్కడ చెత్తను తొలగించే పనిలో ఉన్నారు.

ఢాకాలోని పల్లవి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న గుమ్మం దగ్గర కొందరు స్థానికులు నిలబడి ఉన్నారు. వారిలో ఢాకా నార్త్ సిటీ కార్పొరేషన్‌లోని వార్డు నంబర్ 2 కౌన్సిలర్ సజ్జాద్ హుస్సేన్ కూడా ఉన్నారు.

"పోలీసులు పోలీసు స్టేషన్‌కు చేరుకోలేకపోతున్నారు. అందువల్ల, స్థానిక ప్రజలకు సహకారం అందిస్తున్నాం. ఇప్పుడు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అవసరం. వారు మమ్మల్ని సంప్రదిస్తున్నారు” అని సజ్జాద్ బీబీసీతో చెప్పారు.

పోలీసులు, బంగ్లాదేశ్, ఢాకా
ఫొటో క్యాప్షన్, దేశంలోని అనేక పోలీస్ స్టేషన్లలో లేని పోలీసు అధికారులు

పోలీసుల ఉనికి అవసరం

ప్రస్తుతం సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లను సందర్శించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

మిర్పూర్ ప్రాంతంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లను సందర్శించి నష్టాన్ని అంచనా వేస్తున్నామని సబ్-ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ లతీఫ్ బీబీసీతో చెప్పారు.

"పోలీస్‌స్టేషన్లలో ఏ పోలీసు వాహనాన్నీ ఆందోళనకారులు వదల్లేదు. అవన్నీ కాలి బూడిదయ్యాయి" అని ఆయన చెప్పారు.

పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా పోలీసులు రంగంలోకి దిగక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. వారు ఏదో ఒక పాయింట్ నుంచి ప్రారంభించాలి.

"పోలీసులు తమ ఉనికిని చూపించవలసి ఉంటుంది. వివిధ సంస్థలకు వెళ్లి వారి భద్రత కోసం చర్యలు తీసుకోవచ్చు. ఇది కాకుండా, శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరచడంలో వారు ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంటుంది. అప్పుడే పోలీసులపై సామాన్యుల్లో విశ్వాసం తిరిగి వస్తుంది" అని పోలీసు మాజీ చీఫ్ నూరుల్ హుదా బీబీసీతో చెప్పారు.

పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తొలగించేందుకు పోలీసు సంస్కరణలు అవసరం. కానీ అలాంటి సంస్కరణలను తీసుకురావడం, వాటిని అమలు చెయ్యడం, త్వరగా వీలయ్యే పని కాదని నూరుల్ హుదా అభిప్రాయపడ్డారు.

పోలీసుల ప్రస్తుత పరిస్థితికి రాజకీయ నాయకత్వమే కారణమని హుదా అభిప్రాయపడ్డారు. ఇంతకాలం పోలీసులను రాజకీయంగా వాడుకోవడమే ఇందుకు కారణమన్నారు.

మరోవైపు పోలీసు శాఖలో పెద్ద ఎత్తున మార్పులు రావడం ఖాయమని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

"అన్ని పోలీసు స్టేషన్‌ల ఇన్‌చార్జ్‌లకు, జిల్లాల ఎస్పీలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి" అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఆందోళనల సమయంలో పోలీసులు అత్యధికంగా బలప్రయోగం చేసిన ప్రాంతాల్లో ముందుగా మార్పులు చేస్తామన్నారు.

అదనపు బలగాలను ఉపయోగించాలని పోలీసులను ఆదేశించిన పోలీసు అధికారులు గతంలో మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని ఆయన అంటున్నారు.

అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించకపోతే పోలీసులపై సామాన్యులకు నమ్మకం పెరగడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఇవన్నీ వెంటనే చేయడం సాధ్యం కాదు.

బంగ్లాదేశ్ అల్లర్లు, ట్రాఫిక్ పోలీసులు, షేక్ హసీనా
ఫొటో క్యాప్షన్, పోలీసులు లేకపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్న విద్యార్థులు

పోలీసుల డిమాండ్లు

ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దేశంలోని పోలీస్ స్టేషన్ల ఓసీలు, సబ్-ఇన్‌స్పెక్టర్లతో ఏర్పాటైన పోలీసు సంఘం చెబుతోంది.

రెండు రోజుల కిందట ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘం సమావేశంలోనూ కొన్ని డిమాండ్లు వినిపించారు.

ఆ సమావేశంలో పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ జహీదుల్‌ ఇస్లాం మాట్లాడుతూ.. 'పోలీసులను రాజకీయంగా వినియోగించుకోవడం, సీనియర్‌ అధికారులు ఇష్టానుసారంగా ఇచ్చే ఆదేశాల వల్లే పోలీసులకు ఈ పరిస్థితి తలెత్తింది' అన్నారు.

'సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసే, సూచనలు ఇచ్చే నాయకత్వం మాకు కావాలి’’ అన్నారు.

‘‘విద్యార్థులు, సామాన్యులు కోరుకునే పోలీసు అధికారులు డిపార్ట్‌మెంట్‌లో అందుబాటులో ఉన్నారు. అలాంటి అధికారులను గుర్తించి బాధ్యతలు ఇవ్వాలి. వారు డిపార్ట్‌మెంట్‌ను సక్రమంగా నడపగలరు" అని ఇస్లాం చెప్పారు.

షేక్ హసీనా, మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ జహీదుల్ ఇస్లాం

పోలీస్ అసోసియేషన్ డిమాండ్లు

  • పోలీసులు రాజకీయ ప్రభావానికి దూరంగా ఉండాలి.
  • పోలీసులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలి.

"పోలీసులు, విద్యార్థులు మరియు సాధారణ ప్రజల మరణాలకు కారణమైన అవినీతి, దళారీ పోలీసు అధికారులను వెంటనే అరెస్టు చేసి బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం విచారించాలి" అని జహీదుల్ అన్నారు.

  • అవినీతిపరులైన అధికారుల అక్రమ ఆస్తులన్నీ జప్తు చేసి బంగ్లాదేశ్ పోలీసుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.
  • హింసాకాండలో మరణించిన పోలీసుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం అందించాలి.
  • ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా ఆయుధాలు ప్రయోగించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తప్పవు.
  • బంగ్లాదేశ్ కార్మిక చట్టం ప్రకారం, పోలీసులకు ఎనిమిది గంటల డ్యూటీ ఉండేలా చూడాలి.
  • అదనపు పని గంటలకు ఓటీ చెల్లించాలి.
  • పోలీసు యూనిఫాం రంగు మార్చాలి. కానిస్టేబుల్ నుంచి ఐజీ వరకు అందరికీ యూనిఫాం డ్రెస్ కోడ్‌ను నిర్ణయించాలి.

సమావేశంలో జహీదుల్ ఇస్లాం ఈ డిమాండ్లను చదువుతుండగా, అక్కడ ఉన్న పోలీసులందరూ చప్పట్లు కొడుతూ మద్దతు పలికారు.

(బీబీసీ తెలుగు కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)