భారత్ నుంచి వేల మంది విద్యార్థులు బంగ్లాదేశ్‌కు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఏం చదువుకుంటారు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సుభోజిత్ బాగ్చి
- హోదా, బీబీసీ కోసం
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల కోరిక మేరకు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
విద్యార్థుల ఉద్యమంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇది బంగ్లాదేశ్ విద్యార్థులు రాజకీయంగా చైతన్యవంతులని తెలియజేస్తోంది.
అయితే, చదువుకోవడం కోసం బంగ్లాదేశ్‌కు వెళ్లిన భారతీయ విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు దిగజారుతున్న సమయంలో భారత విద్యార్థులు వెనక్కి వచ్చేశారు. ఆ దేశంలో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని వారు కోరుకుంటున్నారు, తద్వారా తమ చదవులకు పెద్దగా ఇబ్బంది ఉండదనేది వారి ఆకాంక్ష.

జులై చివరి నాటికి, సుమారు 7 వేల మంది విద్యార్థులు భారత్‌కు తిరిగొచ్చారు.
ఇటీవల భారత్‌కు తిరిగొచ్చిన సుమారు డజను మంది విద్యార్థులు బీబీసీతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ చదువుల కోసం బంగ్లాదేశ్‌కు వెళ్తారు?
''బంగ్లాదేశ్‌లో చదవుకయ్యే ఖర్చు తక్కువ'' అని తూర్పు బంగ్లాదేశ్‌లోని అబ్దుల్ హమీద్ మెడికల్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న సుదీప్తా మైతీ తెలిపారు.
''బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు మొదలైనప్పుడు అఖౌరా - అగర్తలా బోర్డర్ దాటి భారత్‌లోకి వచ్చేశాం'' అని ఆమె చెప్పారు.
బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్‌లో ఉన్న మెడికల్ కాలేజీ దగ్గరి నుంచి 3 గంటల వ్యవధిలో అగర్తలా చేరుకోవచ్చు.
అక్కడి నుంచి ఒక గంట విమాన ప్రయాణంతో కోల్‌కతాకు రావొచ్చు.
ఆ తర్వాత 3 గంటల్లో సుదీప్తా మైతీ పశ్చిమ బెంగాల్‌లోని, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఉన్న తన ఇంటికి చేరుకోవచ్చు.
''భారత్ - బంగ్లాదేశ్ మధ్య రవాణా సౌకర్యం బావుంది. కొద్దిగంటల్లోనే కోల్‌కతా చేరుకోవచ్చు. బంగ్లాదేశ్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు'' అని ఆమె అన్నారు.
భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2022లో భారత్ నుంచి 13 లక్షల మంది చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్లగా, వారిలో 9,308 మంది బంగ్లాదేశ్‌కు వెళ్లారు.
మెరుగైన రవాణా సౌకర్యాలు, భారత్‌కు చేరువలో ఉండడం, అక్కడి సంస్కృతి కూడా దగ్గరగా ఉండడం, భారత్‌లో పరిమిత సీట్లు, అధిక ఖర్చు వంటి కారణాలతో భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ వైపు మొగ్గు చూపుతున్నారు.
కశ్మీర్‌కు చెందిన కాజీ.. బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం చదువుతున్నారు.
వైద్య విద్యకు భారత్‌లో కోటి రూపాయలకు పైగా ఖర్చవుతోందని, బంగ్లాదేశ్‌లో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు మాత్రమే అవుతుందని కాజీ చెప్పారు.
''2019లో నేను కశ్మీర్ నుంచి ఢాకాలోని అడ్-దిన్ మెడికల్ కాలేజీకి వెళ్లిన సమయంలో కశ్మీర్‌లో కేవలం 2 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవు. కానీ, బంగ్లాదేశ్‌లో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి'' అని కాజీ వివరించారు.
భారత కరెన్సీలో రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల్లో బంగ్లాదేశ్‌లో వైద్య విద్య అభ్యసించవచ్చని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తక్కువ ఖర్చుతోపాటు ఇతర ప్రయోజనాలు..
భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు బదులు బంగ్లాదేశ్‌కు వెళ్లడానికి గల కారణాలను పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా, జాయ్ నగర్‌కి చెందిన ఒక ప్రధానోపాధ్యాయుడి కుమారుడు బాసిత్ అన్వర్ వివరించారు.
''తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించవచ్చని భారతీయ విద్యార్థులు ఎక్కువ మంది రష్యా, యుక్రెయిన్ వెళ్తుంటారు, ఇప్పటికీ వెళ్తున్నారు. కానీ, బంగ్లాదేశ్‌లో చదువుకోవడం వల్ల పెద్ద ప్రయోజనమే ఉంది'' అని ఆయన అన్నారు.
కొన్ని పాశ్చాత్య దేశాలు మినహా, మిగిలిన దేశాల్లో ఎక్కడ వైద్య విద్యను అభ్యసించినా భారత్‌లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిలో బంగ్లాదేశ్‌లో మెడిసిన్ చదివిన భారతీయ విద్యార్థుల శాతం చాలా ఎక్కువ.
''భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ వెళ్లడానికి ఇదొక కారణం కావొచ్చు. రెండు దేశాల్లో సిలబస్ కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అలాగే, భారత్‌లో ఏ పుస్తకాలతో అయితే బోధిస్తారో వాటినే మేం కూడా చదువుతాం'' అన్నారు బాసిత్.
''అక్కడి లెక్చరర్లు కూడా కోల్‌కతాలో చదువుకున్నవారే కాబట్టి, మేము ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని వారికి తెలుసు. అక్కడ 19 సబ్జెక్టుల్లో 300 మార్కులకు 150 మార్కులు తెచ్చుకోవడం తప్పనిసరి. అందులో ఎలాంటి కటాఫ్ ఉండదు. కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకోవాల్సిందే'' అని అన్నారాయన.
ఎఫ్ఎంజీఈ పరీక్షకు హాజరయ్యేందుకు ఎలాంటి కాలపరిమితి లేదని బాసిత్ స్నేహితులు చెబుతున్నారు. అయితే, బంగ్లాదేశ్‌లో చదువుకున్న విద్యార్ధులు తరచూ ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వైద్య విద్యార్థులే ఎక్కువ..
దేశంలో రాజకీయ అస్ధిరత, ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నప్పటికీ పేదరికాన్ని తగ్గించడంలో, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించడంలో బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంది.
అయితే, ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి తర్వాత ఆర్థికంగా కోలుకోవడానికి బంగ్లాదేశ్ ఇంకా కష్టపడుతోంది.
గత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7.1 శాతం నుంచి 5.8 శాతానికి పడిపోయింది.
ఆర్థికపరమైన సవాళ్లు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ మారకద్రవ్యం నిల్వలు తగ్గిపోవడం వంటివి బంగ్లాదేశ్‌లో తాజా ఉద్రిక్తతలకు కారణాలుగా చెబుతున్నారు.
దేశ జనాభా 17 కోట్ల మందిలో సుమారు 3.2 కోట్ల మంది యువత ఉపాధికి, విద్యకు దూరంగా ఉన్నారు.
బంగ్లాదేశ్‌లోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించే కోల్‌కతాకు చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకులు కాజీ మహ్మద్ హబీబ్ మాట్లాడుతూ, ''బంగ్లాదేశ్‌లో కొద్దికాలంలోనే దాదాపు 70 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ 70 కాలేజీల్లో 3100 సీట్లు ఉన్నాయి. వాటిలో గరిష్టంగా 45 శాతం వరకూ మాత్రమే విదేశీ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవచ్చు'' అన్నారు.
వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే.
బంగ్లాదేశ్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏప్రిల్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023-24 ఏడాదికి గానూ 1,067 మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యలో అడ్మిషన్లు పొందారు.
నేపాల్ నుంచి 264 మంది, భూటాన్ నుంచి 12, పాకిస్తాన్ నుంచి ఇద్దరు విద్యార్థులతో పాటు ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా నుంచి కూడా ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు బంగ్లాదేశ్‌లో వైద్య విద్యలో చేరారు.
సార్క్ దేశాలకు చెందిన విద్యార్థుల కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 220 సీట్లు రిజర్వ్ చేశారు. వీటిలో భారత్ నుంచి 22 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
పెద్దయెత్తున ప్రైవేట్ కాలేజీల ఏర్పాటు సార్క్ దేశాల విద్యార్థులకు మంచి అవకాశం కాగా, మరోవైపు భారతీయ విద్యార్థుల ద్వారా భారీగా ఆదాయం కూడా వస్తున్నట్లు హబీబ్ అంటున్నారు.
బంగ్లాదేశ్‌లో వైద్య విద్యకు సగటున రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఖర్చవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికీ రోగులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు...
బంగ్లాదేశ్ నుంచి రోగులు చికిత్స కోసం భారత్‌కు, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు ఇప్పటికీ వస్తుంటారు.
చికిత్స అక్కడ ఖరీదైన వ్యవహారం కావడం, మెడికల్ ట్రావెల్ ఏజెన్సీల పెరుగుదలే దీనికి కారణంగా భావిస్తున్నారు.
దక్షిణ కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దాదాపు 30 శాతం నుంచి 40 శాతం మంది రోగులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే ఉంటారని అంచనా.
దీని గురించి హబీబ్ మాట్లాడుతూ, ''వైద్య విద్య, వైద్య సదుపాయాలు రెండు వేర్వేరు విషయాలు. వైద్య విద్యారంగంలో బంగ్లాదేశ్ మెరుగ్గా పనిచేసింది. అయితే, వైద్య సదుపాయాలు మాత్రం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది'' అన్నారు.
దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యతో పాటు విజువల్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ వంటి కోర్సుల కోసం కూడా బంగ్లాదేశ్ వస్తుంటారు. అలాంటి కోర్సుల్లోనూ భారతీయ విద్యార్థులు ఉన్నారు.
ఫోటోగ్రఫీ, టీవీ, ఫిల్మ్‌లో శిక్షణనిచ్చే అలాంటి ఒక స్కూల్ ''పాఠశాల.''
ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఒక ప్రత్యేకమైన ఇన్‌స్టిట్యూట్‌గా అభివర్ణించారు గతంలో అక్కడ చదువుకున్న సుపర్ణ నాథ్.
దక్షిణాసియా, ఆగ్నేయాసియాలో ఒక ముఖ్యమైన విద్యాకేంద్రంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పటికీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
స్నేహపూర్వక వాతావరణం ఉండే దేశంలో కొద్దిరోజులుగా అశాంతి రేగడం బాధాకరమని విద్యార్థులు అంటున్నారు.
దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తన రాజకీయ ప్రత్యర్థులే కారణమని షేక్ హసీనా ఆరోపిస్తున్నారు. కానీ, షేక్ హసీనా ఆరోపణలను విపక్షాలు నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాయి.
అయితే, ఇటీవల జరిగిన హింసాత్మక పరిణామాలతో బంగ్లాదేశ్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు త్వరలో ముగిసిపోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు, తద్వారా వారి విద్యాసంవత్సరం మరింత ప్రభావితం కాకుండా ఉంటుందన్న ఆశ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














