వక్ఫ్ చట్టంలో ఏముంది? ఇందులో ఎలాంటి మార్పులు చేయాలని మోదీ ప్రభుత్వం అనుకుంటోంది?

ఇస్లాం, వక్ఫ్ బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

వక్ఫ్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదిత సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు గురువారం తెలిపారు.

ఈ బిల్లులో ప్రతిపాదించిన సవరణలతో ధాతృత్వం అనే భావనను నిర్వీర్యం చేసి ఆక్రమణదారులను ఆస్తులకు యజమానులుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వచ్చాయి.

వక్ఫ్ చట్టాన్ని 'ఇంటిగ్రేటెడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్‌'గా పేర్కొన్నారు. అయితే, ప్రతిపాదిత సవరణలకు, ఆ పేరుకు పొంతన లేదని నిపుణులు భావిస్తున్నారు.

కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు నేతృత్వంలోని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లు ప్రతులను పార్లమెంట్ సభ్యులందరికీ పంపిణీ చేశారు. వక్ఫ్ చట్టంలోని లోపాలను సరిచేసి, వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్‌, వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఈ సవరణలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది.

వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఆస్తులు భారీగా ఉన్నాయి. దాదాపు 9.4 లక్షల ఎకరాల్లో వక్ఫ్ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. దేశంలో రక్షణ శాఖ, రైల్వే శాఖ తర్వాత వక్ఫ్ వద్దనే భారీగా ఆస్తులున్నాయి. దేశంలో ఈ మూడింటికే అత్యధిక భూ యాజమాన్య హక్కులు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు

వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు

గత రెండేళ్లలో, దేశంలోని వివిధ హైకోర్టుల్లో వక్ఫ్‌కు సంబంధించి దాదాపు 120 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఈ చట్టానికి సవరణ ప్రతిపాదనలు వచ్చాయి.

జైనులు, సిక్కులు వంటి ఇతర మైనారిటీలతో సహా.. ఇతర మతాల వారికి ఇలాంటి చట్టాలు వర్తించనప్పుడు, వక్ఫ్ చట్టం ఎలా చెల్లుబాటవుతుందంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో వారు సవాల్ చేశారు.

''మత ప్రాతిపదికన ఏ ట్రైబ్యునల్ ఉండకూడదు. ఒక దేశం, రెండు చట్టాలు సరికాదు. ఒక దేశం, ఒకే ఆస్తి చట్టం ఉండాలి. కోర్టుల్లో దాఖలైన 120 పిటిషన్లలో ముస్లింల పిటిషన్లు దాదాపు 15 ఉన్నాయి. దాతృత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఎప్పుడూ మతం ఆధారంగా ఉండకూడదు'' అని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ బీబీసీతో అన్నారు.

రాజకీయ విశ్లేషకులు ఖుర్బాన్ అలీ మాట్లాడుతూ, ''ఈ సవరణలు వక్ఫ్ పరిధిలోని విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం హిందూ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే ప్రయత్నమే. అది కూడా నిజమే.. ప్రస్తుత వక్ఫ్ చట్టంలో లోపాలున్నాయి. వక్ఫ్ బోర్డుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. సరైన నిర్వహణ కూడా లేదు'' అన్నారు.

వక్ఫ్ చట్టానికి కేంద్రం ఈ 44 సవరణ ప్రతిపాదనలు చేయకముందే, అనేక చిన్నచిన్న నగరాలు, పట్టణాలతోపాటు మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కనిపించాయి.

వక్ఫ్ బోర్డు

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇది దిల్లీ దర్యాగంజ్‌లోని దిల్లీ వక్ఫ్ బోర్డు కార్యాలయం. ఈ బోర్డు గతంలో వివాదాల్లో చిక్కుకుంది.

సవరణల్లో పేర్కొన్న ప్రధాన మార్పులు ఏమిటి?

సవరణ బిల్లులో పేర్కొన్న దాని ప్రకారం, వక్ఫ్ అంటే.. కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తి తన యాజమాన్యంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వడం.

ప్రతిపాదిత సవరణ ప్రకారం, వక్ఫ్ భూమిని సర్వే చేసే అధికారం అడిషనల్ కమిషనర్ నుంచి ఆ జిల్లా కలెక్టర్, లేదా డిప్యూటీ కమిషనర్‌కు బదలాయించారు.

సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతర ప్రతినిధులు ఉంటారు. కొత్త నిబంధనల ప్రకారం, బోహరాలు, అగాఖానీ వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డు ఏర్పాటు ప్రస్తావన ఉంది.

వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సెంట్రల్ పోర్టల్, డేటాబేస్ ద్వారా జరుగుతుంది. ఈ పోర్టల్‌లో ముత్వల్లీ (వక్ఫ్ ఆస్తుల పరిరక్షకులు) వక్ఫ్ ఆస్తుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. దానితో పాటు ఏడాదికి 5 వేల రూపాయల్లోపు ఆదాయం మాత్రమే ఉన్న ఆస్తులకు సంబంధించి వక్ఫ్ బోర్డుకి చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా 7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

ఒక ఆస్తి వక్ఫ్‌కి చెందినదా? కాదా? అని నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం, ప్రస్తుతమున్న ముగ్గురు సభ్యుల వక్ఫ్ ట్రైబ్యునల్ ఇద్దరు సభ్యులకే పరిమితం కానుంది. ఈ ట్రైబ్యునల్ నిర్ణయాలు కూడా అంతిమం కావు. ఏవైనా అభ్యంతరాలుంటే ట్రైబ్యునల్ నిర్ణయాలను 90 రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయొచ్చు.

కొత్త బిల్లుతో, వక్ఫ్ చట్టంలోని లిమిటేషన్ యాక్ట్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం లేదు. అంటే, వక్ఫ్ భూమిని ఆక్రమించుకుని 12 ఏళ్లుగా అనుభవిస్తున్న వ్యక్తులు ఈ సవరణతో ఆ భూమికి యజమానులుగా మారుతారు.

ఇస్లాం, వక్ఫ్ బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుత చట్టంలోని లోపాలేంటి?

2013లో కె.రెహమాన్ ఖాన్ కమిటీ సిఫార్సుల మేరకు 'వక్ఫ్ చట్టం 1995'కి మార్పులు జరిగాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఆ తర్వాత రాజ్యసభ సెలెక్ట్ కమిటీలో చర్చించిన అనంతరం ఈ మార్పులు జరిగాయి. అయితే, యాదృచ్ఛికంగా ఆ కమిటీకి బీజేపీ సభ్యుడు హెడ్‌గా ఉన్నారు.

వక్ఫ్ బోర్డు ప్రక్షాళన కోసం కృషి చేస్తున్న యాక్టివిస్టులు, న్యాయవాదులు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది రవూఫ్ రహీం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

''అవసరమైన కొన్ని సెక్షన్లను చేర్చడం, అవినీతిపరులైన వక్ఫ్ బోర్డు సభ్యులను కటకటాల వెనక్కి పంపడం మినహా పాత చట్టానికి ఎలాంటి మార్పులూ చేయాల్సిన అవసరం లేదు'' అని రహీం బీబీసీతో చెప్పారు.

అయితే, వక్ఫ్ చట్టాన్ని కోర్టులో సవాల్ చేసిన పిటిషనర్లలో ఒకరు, వక్ఫ్ చట్టంలోని లోపాలను కూడా ఎత్తిచూపారు.

ఫకీర్ కమ్యూనిటీకి చెందిన 90 బిఘాల భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుందంటూ రాజస్థాన్‌లోని బుండీ నివాసి షాజాద్ మహహ్మద్ షా కోర్టును ఆశ్రయించారు.

''400 ఏళ్ల కిందట ఫకీర్ కమ్యూనిటీకి మహారాజు ఆ భూమి ఇచ్చారు. అందుకు తామ్రపత్రం కూడా ఉంది. వారు చట్టాన్ని ఉల్లంఘించారు'' అని షా బీబీసీతో అన్నారు.

రాజస్థాన్‌లోని కోటా, బరన్ జిల్లాల్లో నివసిస్తున్న తమ వర్గానికి చెందిన మరికొందరు కూడా కోర్టులో ఇలాంటి పిటిషన్లు వేశారని ఆయన చెప్పారు. ''వక్ఫ్ బోర్డు కారణంగా మధ్యప్రదేశ్‌లో ముజావర్ సేన కూడా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విన్నాం" అని ఆయన చెప్పారు.

''అందుకే చారిటబుల్ ట్రస్టులు, ట్రస్టీలకు ఒకే చట్టం ఉండాల్సిన అవసరం ఉందని మేం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా, రాజ్యాంగంలోని 14, 15 అధికరణలను ఉల్లంఘించేలా ఉన్న వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చాయి'' అని షా అన్నారు.

షా, బీజేపీ ముస్లిం రాష్ట్రీయ మంచ్ సభ్యుడిగా ఉన్నారు. అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ తరహాలోనే ఈయన పిటిషన్ కూడా ఉంది.

''ఆలయాల నుంచి లక్ష కోట్ల రూపాయలు సేకరిస్తున్న ప్రభుత్వం దర్గా, మసీదుల నుంచి అలా చేయడం లేదు. అదే సమయంలో, వక్ఫ్ అధికారులు, కార్యాలయ సిబ్బంది మొత్తానికి జీతాలు చెల్లిస్తోంది. మతపరమైన అన్ని ఆస్తులకు సంబంధించి సివిల్ ప్రొసీజర్ కోడ్‌ నిబంధనలను అనుసరించి తీర్పులు ఇవ్వాలి కానీ, వక్ఫ్ ట్రైబ్యునల్ కాదు అని మేం పిటిషన్‌లో కోరాం'' అని అశ్విని ఉపాధ్యాయ చెప్పారు.

కిరెణ్ రిజిజు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిరెణ్ రిజిజు

నూతన సవరణలపై అభ్యంతరాలేంటి?

రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ రెహమాన్ ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ, ''మొదటిదేంటంటే, ప్రతిపాదిత సవరణ వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత గందరగోళంగా మారుస్తుంది. దానితోపాటు ఇప్పటికే అనేక బాధ్యతలతో సతమతమవుతున్న కలెక్టర్లు, లేదా డిప్యూటీ కమిషనర్లకు ఈ బాధ్యతలను అప్పగించారు'' అని ఆయన అన్నారు.

''వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులకు రెండు పదవులను రిజర్వ్ చేయడం ఫర్వాలేదు. అయితే, హిందూ దేవాలయాల బోర్డుల్లోనూ ముస్లింలకు అలాంటి రిజర్వేషన్లు కల్పిస్తారా? మరో చెత్త విషయం ఏంటంటే, వక్ఫ్ చట్టంలోని లిమిటేషన్ యాక్ట్ నిబంధనలను ఉపసంహరించుకోవడం'' అన్నారాయన.

''ఈ సవరణలను చట్టంగా ఆమోదిస్తే వక్ఫ్ ఆస్తులు భారీగా తగ్గిపోతాయి. ఎందుకంటే, 99 శాతం వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలోనే ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలు, మరీముఖ్యంగా హరియాణా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఆక్రమణకు గురైన వేలాది ఎకరాలకు ఆక్రమణదారులే యజమానులు అవుతారు'' అని రెహమాన్ ఖాన్ బీబీసీతో చెప్పారు.

కానీ, నూతన సవరణల్లోని సానుకూల అంశాలను ప్రస్తావించారు పుణెకి చెందిన రిటైర్డ్ ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ జబ్బార్ ఖాన్. ''సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులపై ముస్లిం ఎంపీలు, ఎమ్మెల్యేల గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టినందుకు సంతోషిస్తున్నా. వారు గుత్తాధిపత్యం సాగిస్తున్నారు. సామాన్య ప్రజలకు వాళ్లు చేసిందేమీ లేదు. వాళ్ల వల్ల సామాన్యులకు కలిగిన ప్రయోజనం కూడా లేదు. అంతేకాకుండా బోర్డుల్లో అవినీతి పెరిగిపోయింది'' అన్నారు.

''అలాగే, పార్లమెంట్‌లో సెలెక్ట్ కమిటీని మార్చకపోతే వక్ఫ్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లుతుంది'' అన్నారాయన.

''వక్ఫ్ ఆస్తులను సరిగ్గా అభివృద్ధి చేస్తే.. దుకాణాల రూపంలో, ఇంకా ఎన్నో విధాలుగా ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. దుకాణాలు పెరిగితే వ్యాపారం కూడా పెరిగి పన్నులు కూడా వస్తాయి'' అన్నారు జబ్బార్ ఖాన్.

ప్రత్యేక దర్గా బోర్డు ఏర్పాటు చేయాలన్న అసోసియేషన్ సూచనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రతినిధుల బృందానికి హామీ ఇచ్చినట్లు ఆల్ ఇండియా సజ్జదానాషిన్ అసోసియేషన్ అధ్యక్షులు, అజ్మేర్‌కి చెందిన సయ్యద్ నసీరుద్దీన్ చిస్తీ బీబీసీతో చెప్పారు.

''ఇది చాలాకాలంగా ఉన్న డిమాండ్. వక్ఫ్ ఆస్తుల్లో దర్గాలు అతిపెద్ద వాటాదారులు. కొత్త సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం దర్గా బోర్డును కూడా చేరుస్తుందని ఆశిస్తున్నాం'' అని ఆయన అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)