సోమాలియా: ఓవైపు బాంబు పేలుళ్లు, మరోపక్క అందాల పోటీలు...ఈ ముస్లిం దేశంలో ఏమిటీ వైరుధ్యం...

సోమాలియా అందాల పోటీలు

ఫొటో సోర్స్, SHUKRI MOHAMED ABDI

    • రచయిత, క్విన్ హసన్ ఫకత్ , మేరీ హార్పర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

సోమాలియాలో ఓ రోజు రాత్రి వేలమంది ప్రజలు కేఫ్‌లు, ఇళ్లలోనూ యూరో ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారు. మరోపక్క దేశంలో సంపన్నులు, ఫ్యాషన్ పట్ల అభిరుచి ఉన్న ప్రజలు రాజధాని మొగదిషులోని విలాసవంతమైన బీచ్‌ హోటల్లో మరో షోను చూడటానికి చేరుకున్నారు. అయితే ఆ ప్రదర్శన మిస్ సోమాలియా కోసం ఏర్పాటు చేసింది.

మొగదిషు శివారులో ఫుట్‌బాల్ అభిమానులతో కిక్కిరిసిన ప్రసిద్ధ కాఫీ రెస్టారెంట్ బయట కారుబాంబు పేలడం సోమాలీయుల జీవితాల్లోని వెలుగునీడలను ప్రతిబింబిస్తుంది.

అందాల పోటీల్లో పాల్గొన్న మహిళలు ర్యాంప్‌పై నడవడంలో బిజీగా ఉన్న సమయంలోనే, ఆ ప్రదేశానికి సమీపంలోనే బాంబు పేలుడు జరిగి ఐదుగురు చనిపోగా, 20 మంది గాయపడ్డారు.

సోమాలియాను 15 ఏళ్ళుగా నియంత్రిస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అల్-షబాబ్ ఆ దాడికి తనదే బాధ్యత అని ప్రకటించుకుంది.

ఇస్లామిక్ తీవ్రవాదంతో నలిగిపోతున్న దేశంలో హనీ అబ్డీ గాస్ అనే మహిళ 2021లో మిస్ సోమాలియా పోటీలను ప్రారంభించడం ఓ సాహసోపేతమైన అడుగు.

ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో సోమాలియా ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది.

కరవు, యుద్ధం కారణంగా సోమాలియాను వదిలి శరణార్థులుగా కెన్యాకు చేరుకుని, అక్కడి శరణార్థి శిబిరంలో పెరిగారు గాస్. 2020లో ఆమె స్వదేశానికి తిరిగొచ్చారు.

వాట్సాప్ చానల్
సోమాలియా అందాల పోటీలు

ఫొటో సోర్స్, SHUKRI MOHAMED ABDI

ఫొటో క్యాప్షన్, పోటీల్లో పాల్గొన్న మహిళలు విమర్శల ముప్పుకు సిద్ధపడ్డారు.

ఐక్యత, మహిళా సాధికారతే లక్ష్యం

‘‘ఈ పోటీలు ఐక్యతను, మహిళా సాధికారికతను పెంచుతాయి’’ అని గాస్ అన్నారు. అందాల ప్రదర్శనల విషయంలో మిగతా ప్రపంచంతో సోమాలియా చేరాల్సిన సమయం ఇదేనని ఆమె నమ్ముతున్నారు.

‘‘భిన్న నేపథ్యాల మహిళల ఆశలు, కలలను నేను పండుగలా జరపాలనుకుంటున్నాను. వారిలో విశ్వాసాన్ని ప్రోదిచేసి, సోమాలియా సంస్కృతిని మిగతా ప్రపంచానికి చూపే అవకాశం వారికి ఇవ్వాలనేది నా కోరిక.’’ అని ఆమె అన్నారు.

ఈ ఏడాది పోటీలో వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిలో ఓ మహిళా పోలీసు అధికారి కూడా ఉన్నారు.

అందాల ప్రదర్శన అనే ఆలోచనే భయంకరమైనదిగా చాలామంది సోమాలియా ప్రజలు భావిస్తుంటారు. అలాంటి ప్రదర్శనలు సోమాలియా సంస్కృతికి, ఇస్లాంకు అవమానమని మరికొందరు భావిస్తుంటారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని లింగ వివక్షకు పాల్పడటానికి ఇది మరోదారి అని కొందరి వాదన.

‘‘ఇలాంటి భయంకరమైన పోటీలలో మహిళలు పాల్గొనడాన్ని నేను వ్యతిరేకిస్తా.’’ అని గిరిజన నేత అహ్మద్ అబ్ది హలానే చెప్పారు.

‘‘అలాంటి విషయాలు మన సంస్కృతికి, మన మతానికి వ్యతిరేకం. బిగుతైన బట్టలతో ఓ యువతి వేదికపై వస్తే, అది ఆమె కుటుంబానికి, ఆమె తెగకు అప్రతిష్ఠ. మహిళలు అనేవారు ఇంట్లోనే ఉండి, మర్యాదకరమైన దుస్తులు ధరించాలి.’’ అని చెప్పారు.

కొందరు మహిళలు కూడా అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు.

అందాల పోటీలు

ఫొటో సోర్స్, SHUKRI MOHAMED ABDI

ఫొటో క్యాప్షన్, అయిషా యూనివర్సిటీ విద్యార్థిని, మేకప్ ఆర్టిస్ట్.

మిస్ సోమాలియా ఏం చెప్పారు?

‘‘సోమాలియా యువతను ప్రోత్సహించడం మంచి విషయం. కానీ మా మతానికి వ్యతిరేకమైన పద్ధతిలో కాదు’’ అని సబ్రీనా అనే విద్యార్థి చెప్పారు.

‘‘పబ్లిక్‌లో మెడపై ఆచ్ఛాదన లేకుండా కనిపించడం మహిళకు గౌరవం కాదు. కానీ మిస్ సోమాలియా పోటీదారు ఆ పనిచేశారు’’ అని అన్నారామె.

సోమాలియా మహిళలు ఎక్కువగా ధరించే ముసుగులాంటి దుస్తులకు భిన్నంగా మిస్ సోమాలియా పోటీదారులు శరీర సౌష్టవం తెలిసేలా బిగుతైన గౌనులు ధరించారు.

మిస్ సోమాలియా కిరీటాన్ని 24 ఏళ్ళ అయిషా ఇకోవ్ గెలుచుకున్నారు. బంగారు వర్ణంలో ఉన్న పొడవైన డ్రెస్‌ను ఆమె ధరించారు. ఈ పోటీ గెలిచిన ఆమెకు 1,000 అమెరికన్ డాలర్ల నగదు (సుమారు 85వేల రూపాయలు) బహుమతి కూడా ఇచ్చారు.

అయిషా ఓ యూనివర్సిటీ విద్యార్ధిని. మేకప్ ఆర్టిస్ట్ కూడా. ఈ పోటీలలో ఆమె నైరుతి రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించారు.

సోమాలియా అందాల పోటీలు

ఫొటో సోర్స్, SHUKRI MOHAMED ABDI

ఫొటో క్యాప్షన్, హనీ అబ్డీ గాస్ (కుడి) అందాల పోటీలు నిర్వహించినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.

సోమాలియాలో మహిళల పరిస్థితేంటి?

విలాసవంతమైన సముద్రతీర హోటల్లో జరిగిన ఈ అందాల పోటీ సోమాలియాలోని చాలామంది ప్రజలకు, ముఖ్యంగా మహిళల జీవితాలకు దూరంగా ఉంది.

సోమాలియా జనాభాలోని నాలుగో వంతు అంటే 40 లక్షలమంది బలవంతంగా ఇళ్ళను వదిలి దేశంలో ఏదో ఒక మూల తలదాచుకుంటున్నారు. వారిలో 70 నుంచి 80 శాతం మంది మహిళలే అని ఐక్య రాజ్యసమితి అంచనా వేసింది. గడిచిన మూడు దశాబ్దాలలో మొదటిసారిగా 2024లో ఐక్య రాజ్య సమితి మానవ అభివృద్ధి సూచీలో సోమాలియాను కూడా చేర్చడానికి తగినంత సమాచారాన్ని సేకరించారు. కానీ ఆ సూచీలో సోమాలియా అట్టడుగున ఉంది.

లింగ అసమానత సూచీలో సోమాలియా కింద నుంచి నాలుగోస్థానంలో నిలిచింది. సోమాలియాలోని మహిళల్లో 52శాతం మంది హింసబారినపడతున్నారని సహాయక గ్రూపులు చెబుతున్నాయి. అదే సమయంలో 98శాతం మంది మహిళలు సున్తీ చేయించుకుంటున్నారు.

ఎవరైనా పురుషుడు రేప్ చేస్తే అతనికి శిక్షగా రేప్ చేసిన మహిళనే వివాహం చేసుకోవాలనే సంప్రదాయం ఉంది.

మహిళలపై అత్యాచారం, ఇతర రూపాల్లోని హింస గురించి వారి తీరుతెన్నులలో పెద్దగా మార్పేమీ రాలేదు.

సోమాలియా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కొన్నేళ కిందటివరకూ సోమాలియాలో అందాల పోటీ అనే మాట కనీసం ఊహలోకి కూడా వచ్చే విషయం కాదు.

సోమాలియా నిజంగా మారిందా?

స్వయం ప్రకటిత సోమాలీలాండ్ మతపెద్దలు 2018లో లైంగిక నేరాల చట్టం ఆమోదం పొందగానే రద్దు చేశారు.

సవరించిన చట్టం కనీసం బాల్య వివాహాల నుంచి మహిళలను రక్షించలేకపోతోంది. బలవంతపు పెళ్ళిళ్లు, అత్యాచారం తదితర రూపాల్లో లైంగిక హింస ఉంది.

నిజానికి మొగదిషులో బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి ఓ కిలోమీటరు దూరంలో మిస్ సోమాలియా పోటీలు నిర్వహించడమనేది సోమాలియా దాని స్వభావంలోనూ, భద్రతలోనూ మారుతోందని చెప్పడానికి సంకేతం.

కొన్నేళ్ళ కిందటివరకూ సోమాలియాలో అందాల పోటీలు నిర్వహించడమనేది కనీసం ఊహించను కూడా ఊహించలేని అంశం. ప్రత్యేకించి రాజధాని నగరం మొగదిషు ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అల్-షబాబ్ నియంత్రణలో ఉన్న సమయంలో అసలే ఊహించలేని విషయం.

అందాల పోటీలు చూడటానికి విలాసవంతమైన హోటల్ ఎలైట్‌కు చేరుకున్న జనం తెల్లవారేదాకా అక్కడి నుంచి కదల్లేదు. అక్కడి హిందూ మహాసముద్రపు అలల హోరులో వారికి బాంబుపేలుళ్ళు వినిపించలేదు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)