బంగ్లాదేశ్: మైనారిటీల భద్రతపై కొత్త ప్రభుత్వం ఏం చెప్పింది, హిందూ నేతలు ఏమంటున్నారు?

బంగ్లాదేశ్ మైనారిటీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఢాకాలో ఆందోళన చేస్తున్న హిందూ మహిళ

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఆగస్టు 5న షేక్ హసీనా రాజీనామాతో ముగిశాయి. నిరసనల్లో వందల మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.

షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత, దేశంలోని మైనారిటీ హిందువులు, వారి దేవాలయాలపై దాడులు జరిగినట్లు కథనాలు వచ్చాయి.

అయితే మైనారిటీల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్న అక్కడి కొత్త ప్రభుత్వం, మైనారిటీలపై దాడులు చేయవద్దంటూ విజ్ఞప్తులు చేస్తోంది.

సోమవారంనాడు తాత్కాలిక ప్రభుత్వంలో హోం వ్యవహారాల సలహాదారు షెఖావత్ హుస్సేన్ మైనారిటీలకు క్షమాపణలు చెప్పారు. మంగళవారం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్యసలహాదారు మొహమ్మద్ యూనస్ ఢాకాలోని సుప్రసిద్ధ ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.

బంగ్లాదేశ్, ఢాకా, హింస, అల్లర్లు, షేక్ హసీనా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఢాకేశ్వరి ఆలయం

ఆలయానికి మొహమ్మద్ యూనస్

నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు. ఒకరకంగా ఆయన ఈ ప్రభుత్వానికి అధినేత.

మైనారిటీలకు సంఘీభావం తెలుపుతూ ఆయన దేశంలోని ప్రధాన హిందూ దేవాలయమైన ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు.

ఢాకేశ్వరి ఆలయంలో మాట్లాడుతూ “విమానాశ్రయంలో దిగిన తర్వాత నేను ఒక విషయం చెప్పాను. బంగ్లాదేశ్ మొత్తాన్ని ఒక కుటుంబంగా మార్చేందుకు మేము కృషి చేస్తున్నాం. కుటుంబాల మధ్య విభేదాలు ఉండకూడదు. మనమంతా బంగ్లాదేశ్ పౌరులం. బంగ్లాదేశ్ మనది” అని అన్నారు.

“మన సమస్యలన్నింటికీ కారణం మనం ఏర్పాటు చేసుకున్న సంస్థాగత ఏర్పాట్లన్నీ ధ్వంసం కావడమే. న్యాయం అస్థిత్వంలో ఉంటే కచ్చితంగా న్యాయం జరుగుతుంది. మనం ప్రజాస్వామ్యం, హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛను నెలకొల్పాలి. మనం మానవ హక్కులను స్థాపించాలి. ఇదే మన ప్రధాన లక్ష్యం." అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ, ప్రజలు సహనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో అందరి సహకారం అవసరమన్నారు.

“మీరు సహనంతో ఉన్నారు. అది మాకు సాయపడుతోంది. నేను ఏం చేస్తాను, ఏం చేయలేను అనేది తర్వాత ఆలోచిద్దాం. నేనేదైనా చెయ్యలేకపోతే నేను విఫలమైన తర్వాత నన్ను నిందించండి. ఇప్పుడు కాదు.” అని యూనస్ వ్యాఖ్యానించారు.

బంగ్లాదేశ్, ఢాకా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, విష్ణుసుర్, ప్రధాన కార్యదర్శి, యూత్ యూనిటీ కౌన్సిల్, ఢాకా

హిందూ సమాజం ఏమంటోంది?

మహ్మద్ యూనస్ ఆలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత, యూత్ యూనిటీ కౌన్సిల్ ఢాకా జనరల్ సెక్రటరీ విష్ణు సుర్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. మాకు అండగా ఉంటామని తాత్కాలిక ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు.

“ఢాకేశ్వరి ఆలయం దేశంలోని జాతీయ దేవాలయమని మీ అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా జరిగిన హింసాకాండపై నిజానిజాలు వెలికి తీస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో పాటు తాత్కాలిక ప్రభుత్వం మా వెంట ఉందని భరోసా ఇచ్చారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వారికి ఫోన్ చేయవచ్చు. దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం” అని విష్ణు సుర్ చెప్పారు.

“1971 నుండి, అధికారం మారినప్పుడల్లా, మామీదే మొదట దాడులు జరుగుతున్నాయి. పార్టీలన్నీ మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మేము మీ వెంటే ఉన్నామని అన్ని పార్టీలు చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకు మాపై జరిగిన ఏ నేరాన్ని తీవ్రంగా పరిగణించలేదు” అన్నారు విష్ణు సుర్.

“దేవాలయాలను తగలబెడతారు, చర్చ్‌లను తగలబెడతారు, హిందువుల దుకాణాల మీద దాడులు చేస్తారు, హిందూ బాలికలను కిడ్నాప్ చేస్తారు. ఈ నేరాలన్నింటికీ ఎవరు బాధ్యులో తెలియదు. ఎవరికీ శిక్ష పడదు. మమ్మల్ని శిక్షించకండి, మేము బంగ్లాదేశీయులం. ఈ దేశం మాది.” అని విష్ణుసుర్ అన్నారు.

షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, బంగ్లాదేశ్ పూజ ఉద్యాపన్ పరిషత్ పేర్కొంది.

“తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్‌కు మేము ఒక దరఖాస్తు అందించాము. దాని కాపీని ఇతర సలహాదారులకు కూడా ఇచ్చాం.” అని బంగ్లాదేశ్‌లోని మైనారిటీ కమ్యూనిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల కార్యకర్త రాణా దాస్‌గుప్తా చెప్పారు.

“తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. గుడి బయట మళ్లీ కాపలా ఉండాల్సిన అవసరం లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ఆయన అన్నారు. ఆయన చెప్పేది నిజమవుతుందని ఆశిస్తున్నాం. అందరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని ఆయన అన్నారు. ఇది సరైన మాట.” అని మరో నేత అన్నారు.

బంగ్లాదేశ్ అల్లర్లు, షేక్ హసీనా
ఫొటో క్యాప్షన్, రిటైర్డ్ బ్రిగేడియర్ షెకావత్ హుస్సేన్, బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారు

మైనారిటీలకు క్షమాపణలు

మైనారిటీలకు భద్రత కల్పించడంలో విఫలమైనందుకు తాత్కాలిక ప్రభుత్వంలో హోం వ్యవహారాల సలహాదారు రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ షెఖావత్ హుస్సేన్ క్షమాపణలు చెప్పారు.

మైనారిటీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మిగతా అన్ని వర్గాలపై ఉందని, అయితే వారు భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని అన్నారు.

“మీరు మసీదుకు వెళ్లి ఐదుసార్లు నమాజ్ చేస్తారు. కానీ మీరు మైనారిటీలకు భద్రత కల్పించలేకపోయారు. మైనార్టీలకు భద్రత కల్పించడం మీ బాధ్యత. మీరు విఫలమయ్యారు. దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.” అని ఆయన అన్నారు.

“నేను మైనారిటీ సోదరులకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. సోదరులారా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక్కడ పరిస్థితి ఇప్పటికీ అస్థిరంగా ఉంది. మేము మీకు భద్రతను అందించలేక పోయాము. కొన్ని చోట్ల ప్రజలే మైనారిటీలకు అండగా నిలిచారు. పోలీసులు, భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. కానీ పరిస్థితి మెరుగుపడుతుంది.’’ అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఢాకా, హిందువులపై దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో హిందువులకు మద్దతుగా కోల్‌కతాలో ఆందోళనలు

కృష్ణాష్టమి, దుర్గాపూజకు భద్రత కల్పిస్తామని హామీ

శ్రీకృష్ణ జన్మాష్టమి, దుర్గాపూజకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తామని షెఖావత్ హుస్సేన్ హామీ ఇచ్చారు.

దుర్గాపూజ సెలవులను మూడు రోజులు పొడిగించాలని సూచించారు.

‘‘పోలీసులు, భద్రతా బలగాలు, సరిహద్దు జవాన్లు పండగ సమయంలో మీకు కావాల్సినంత భద్రత కల్పిస్తారు. ఈ విషయంలో జిల్లా పాలనాధికారి బాధ్యత వహించాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరినీ రక్షించడమే మన పని. నా మాటను వారు నిలబెడతారని ఆశిస్తున్నాను.” అని హుస్సేన్ చెప్పారు.

“మరో దేశం మన ప్రతిష్టను తగ్గిస్తూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని మేము కోరుకోవడం లేదు. మేము అక్కడకు( ఇండియా) వెళతామని అనేకమంది చెబుతున్నారు. అయితే ఎవరూ ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాలని కోరుకోరు.” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్‌‌న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)