జోగి రమేశ్ కుమారుడి అరెస్ట్‌కు కారణమేంటి? అగ్రిగోల్డ్ భూముల గొడవేంటి

జోగి రమేశ్, ఆయన కుమారుడు రాజీవ్

ఫొటో సోర్స్, Facebook/Jogi Ramesh

ఫొటో క్యాప్షన్, జోగి రమేశ్, ఆయన కుమారుడు రాజీవ్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. భూముల లావాదేవీలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం‌పట్నంలోని జోగి రమేశ్ నివాసంలో తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.

కేసు ఏమిటి?

విజయవాడకు చెందిన అగ్రిగోల్డ్ సంస్థ అధిక రిటర్న్స్ వస్తాయని చెప్పి పలు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది నుంచి రూ.6,385 కోట్లు సేకరించి, వారికి తిరిగి డబ్బులు ఇవ్వడంలో విఫలమైంది.

ఇందుకు సంబంధించి చాలా కాలంగా అగ్రిగోల్డ్ సంస్థ ప్రమోటర్ల మీద కేసులు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 2017 నాటికి ఆంధ్రపదేశ్ సీఐడీ విభాగం ఆ సంస్థకు చెందిన భూములను అటాచ్ చేసింది.

ఇలా అటాచ్ చేసిన భూములను నిబంధనలకు విరుద్ధంగా జోగి రమేశ్ కుటుంబం సొంతం చేసుకుంది అనేది ఆరోపణ.

ఎన్టీఆర్ జిల్లాలోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్‌ భూములున్నాయి. ఇవి ప్రస్తుతం సీఐడీ విభాగం ఆధీనంలో ఉన్నాయి. అయితే అందులోని సర్వే నెం. 69/2, రీసర్వే నం.87లో ఉన్న 2,300 గజాల భూమిని ‘‘అక్రమంగా కొనుగోలు చేశారు’’ అని ఏసీబీ తెలిపింది.

2,300 గజాల్లో జోగి రాజీవ్ పేరు మీద 1,086 గజాలు, జోగి వెంకటేశ్వర రావు(రమేశ్ సోదరుడు) పేరు మీద 1,074 గజాల భూమి రిజిస్టర్ అయింది.

ఇదంతా 2024 ఏప్రిల్, మే నెలలో జరిగింది. అయితే జూన్ నెలలో దీని మీద అగ్రిగోల్డ్ కేసు నిందితుల్లో ఒకరైన అవ్వా వెంకట శేషు నారాయణ విజయవాడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత మీడియాతో తెలిపారు.

వాట్సాప్
అగ్రిగోల్డ్

ఫొటో సోర్స్, Agrigold

ఏసీబీ అధికారులు ఏం చెప్పారు?

ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం...

‘‘అవ్వా వెంకట శేషు నారాయణ ఫిర్యాదు మేరకు సంబంధిత ఎమ్మార్వో నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం భూముల లావాదేవీలలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లుగా తేలింది. దాంతో ఏసీబీ విచారణ మొదలు పెట్టింది. ప్రాథమిక ఆధారాలు దొరకడంతో కేసు నమోదు చేసి, జోగి రాజీవ్, అంబాపురం రూరల్ మండల సర్వేయర్ రమేశ్‌లను అదుపులోకి తీసుకున్నాం.

ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు నిందితులున్నారు.

తాము కొనుక్కున్న భూమి సర్వే నంబరు 88లో లేదు 87లో ఉందంటూ దరఖాస్తు చేసుకుని రెక్టిఫికేషన్ చేయించుకున్నారు.

దాంతో మళ్లీ సర్వే చేయించుకొని, సర్వే నెంబరు 88లోని భూమి 87లో ఉన్నట్లు చూపించారు. ఇందుకు అధికారులు కూడా సహకరించారు. అందువల్ల పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం’’ అని అడిషనల్ ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు.

ప్రస్తుతం అంబాపురంలో ఎకరం భూమి రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు పలుకుతోంది.

జోగి రమేశ్

ఫొటో సోర్స్, Facebook/Jogi Ramesh

ఫొటో క్యాప్షన్, మాజీ మంత్రి జోగి రమేశ్

కక్షసాధింపు: జోగి రమేశ్

‘‘నన్ను వేధించడానికి నా కుమారుడిని అక్రమంగా కేసుల్లో ఇరికించి, అరెస్ట్ చేశారు'' అని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.

"నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు. డెలాయిట్‌లో ఉద్యోగం చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్న యువకుడిని వేధించి కక్ష సాధించాలనుకుంటున్నారు. రాజకీయంగా అడ్డుకోవడం కోసం ఇది కుట్రపూరితంగా వేధించే ప్రయత్నమే. చట్ట పరిధిలోనే భూములు కొనుగోలు చేసి, రిజిస్టర్ చేయించుకుంటే దానికి వక్రభాష్యాలు చెబుతున్నారు. న్యాయబద్ధంగా పోరాడుతాం" అని జోగి రమేశ్ అన్నారు.

జోగి రమేశ్‌కు మద్దతుగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆయన ఇంటికి వచ్చారు.

అగ్రిగోల్డ్ భూములను కాజేసిన వాళ్లంతా టీడీపీలోనే ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.

టీడీపీ నేత దేవినేని ఉమ

ఫొటో సోర్స్, X/DevineniUma

ఫొటో క్యాప్షన్, టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ

నిబంధనల ప్రకారమే చర్యలు: టీడీపీ

నిబంధనలకు అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో కక్షసాధింపు లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

"సీఐడీ జప్తులో ఉన్న భూములు కాజేసి ఇప్పుడు కక్ష సాధింపు అనడం తగదు. ప్రజలకు చెందాల్సిన సంపదను దోచుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దానిని రాజకీయం చేయడం, కులం కోణంలో మాట్లాడటం తగదు. చట్టబద్ధంగా కొని ఉంటే నిజాయితీ నిరూపించుకోవాలి" అని ఆయన అన్నారు.

ఆరోపణలు తొలిసారి కాదు

అగ్రిగోల్డ్ కి చెందిన ఆస్తులు సీఐడీ జప్తులో ఉండగానే అక్రమంగా కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలారోజులుగా ఉన్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి మంత్రులు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావుల మీద కూడ ఆరోపణలు వచ్చాయి.

సీఐడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను ప్రత్తిపాటి పుల్లారావు భార్య కొన్నారని ఆరోపణలు రావడంతో 2017లో విచారణ జరిపిన సీఐడీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆమె కొన్న భూములు అగ్రిగోల్డ్‌వి కావని తెలిపారు.

అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని నారా లోకేశ్ మీద నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను నారా లోకేశ్ ఖండించారు.

వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా జగన్ మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా వ్యవహరించిన జోగి రమేశ్ తన అధికారాన్ని ఉపయోగించి అగ్రిగోల్డ్ భూములను కుటుంబీకుల పేరుతో రాయించుకున్నారంటూ కొంతకాలంగా టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)