మోదీకి 75 ఏళ్లు నిండాక పదవి నుంచి తప్పుకొంటారా? అప్పుడు ప్రధాని అయ్యేదెవరు

నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
    • రచయిత, వికాస్ త్రివేది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మోదీ తర్వాత ఎవరు?

అది పాన్ షాప్ దగ్గర అయినా, రోడ్డు మీద వెళ్తున్న టెంపోలో అయినా, ఆకాశంలో మేఘాలను తాకే విమానంలో అయినా.. మోదీ మద్దతుదారుల్లో ఏళ్ల తరబడి ఒక్కటే ప్రశ్న.. మోదీ కాకపోతే ఇంకెవరు?

గతంలో మోదీ స్థానాన్ని భర్తీ చేయగల నేత ప్రతిపక్షంలో ఎవరున్నారనే ప్రశ్న వచ్చేది, కానీ ఇప్పుడు బీజేపీలో ఆయన తర్వాత ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ వచ్చే ఏడాది 75వ ఏట అడుగుపెట్టనున్నారు.

ఈ 75 ఏళ్లకు ఉన్న రాజకీయ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడానికి, గతంలో కొన్ని తేదీల్లో వచ్చిన కొన్ని ప్రకటనలను పరిశీలించాల్సి ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు

బెయిల్‌పై బయటికొచ్చినప్పుడు కేజ్రీవాల్ ఏమన్నారు?

ఈ ఏడాది మే నెలలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చినప్పుడు బీజేపీపై పలు వ్యాఖ్యలు చేశారు.

అందులో, మోదీ, అమిత్ షా కూడా తమ బలాన్ని ప్రదర్శించుకోవాల్సి వస్తుందనే ఒక వాదన కూడా ఉంది.

2024 మే 11న కేజ్రీవాల్ మాట్లాడుతూ, ‘‘2025 సెప్టెంబర్ 15కి మోదీ 75వ ఏట అడుగుపెడుతున్నారు. 75 ఏళ్లు నిండినవారు పదవీ విరమణ పొందుతారనే నిబంధనను 2014లో మోదీనే తెచ్చారు’’ అని అన్నారు.

అమిత్ షా ఒక సందర్భంలో మాట్లాడుతూ.. ''నేను అరవింద్ కేజ్రీవాల్‌కి, ఇండియా కూటమికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మోదీకి 75 ఏళ్లు పూర్తవుతాయని సంతోషపడకండి. అది బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మోదీ పదవిలో కొనసాగుతారు. దేశానికి నాయకత్వం వహిస్తారు. ఈ విషయంలో బీజేపీలో ఎలాంటి అనుమానాలు లేవు'' అని చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరవింద్ కేజ్రీవాల్

2024 మే 12న మోదీ మాట్లాడుతూ, ''కుటుంబ పెద్ద తన పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాడు. తన వారసుడికి ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాడు. మరి, మోదీ వారసుడెవరు? నేను ఎవరి కోసం ఆ పని చేయాలి? మీరందరూ నా వాళ్లు, నా వారసులు, మీరే నా కుటుంబం, మీరు నా వారసులు'' అన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేతల ఈ ప్రకనటలన్నీ 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందువి.

గత ఎన్నికల్లో 400 సీట్ల మార్కును దాటాలన్న బీజేపీ కల చెదిరిపోయింది.

దీంతో, ఎన్నికల అనంతరం బీజేపీలో వారసుడి గురించి చర్చ జరుగుతోందా? బీజేపీలో మోదీ వారసుడు ఎవరు కావొచ్చు? ఇందులో ఆర్‌ఎస్ఎస్ పాత్ర ఏంటి?

ఇక్కడ సంఘ్ పాత్ర కూడా కీలకం. ఎందుకంటే, బీజేపీ బలహీనమైనప్పుడు పార్టీలో సంఘ్ పాత్ర పెరుగుతుందన్నది నిపుణుల అభిప్రాయం.

యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య హోరాహోరీ పోరు నడుస్తోందంటూ రాజకీయ నిపుణుల ఊహాగానాలు ప్రచారంలోకి రావడం, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా వాటికి ఆజ్యం పోసేలా ఉండడంతో ఇప్పుడీ ప్రశ్నలు కీలకంగా మారాయి.

నరేంద్ర మోదీ, ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ, ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి

ఈ 75 ఏళ్ల వాదన ఎక్కడి నుంచి వచ్చింది?

2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి అగ్రనేతలకు పార్లమెంటరీ బోర్డులో కానీ, మంత్రివర్గంలో కానీ చోటు కల్పించలేదు. మార్గదర్శక మండలిలో మాత్రమే ఈ ఇద్దరు నేతలకు చోటుదక్కింది. ఆ సమయంలో అడ్వాణీకి 86 ఏళ్లు కాగా, జోషికి 80 ఏళ్లు.

2016లో మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ 75 ఏళ్లు పైబడిన బాబూలాల్ గౌర్, సర్తాజ్ సింగ్ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే, 80 ఏళ్లు పైబడిన లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కూడా ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కీలక నేత శాంతా కుమార్‌ను కూడా అదేవిధంగా పక్కనబెట్టారు.

అయితే, 75 ఏళ్లు పైబడిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన కానీ, సంప్రదాయం కానీ పార్టీలో లేదని అమిత్ షా గతంలో అన్నారు.

దీనికి కర్ణాటకకు చెందిన యడియూరప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు. 80 ఏళ్లు పైబడినప్పటికీ బీజేపీ రాష్ట్ర బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో 91 ఏళ్ల అడ్వాణీ, 86 ఏళ్ల జోషికి టిక్కెట్లు కేటాయించలేదు.

2019 ఏప్రిల్‌లో 'ది వీక్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ, ''75 ఏళ్లు నిండిన ఎవరికీ టిక్కెట్ ఇవ్వలేదు, ఇది పార్టీ నిర్ణయం'' అన్నారు.

మరో పాత వీడియోలొ ‘75 ఏళ్లు పైబడిన నేతలకు బాధ్యతలు కేటాయించకూడదని నిర్ణయించాం’ అని షా చెప్పారు.

అయితే, గతంలో కల్‌రాజ్ మిశ్రా, నజ్మా హెప్తుల్లా, ఇప్పుడు జితన్‌రామ్ మాంఝీలు 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. వీరిలో మాంఝీ బీజేపీ నేత కాకపోయినా, అధికార కూటమిలో ఆయన పార్టీ కూడా భాగమే.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, GDP

75 ఏళ్ల రూల్ మోదీ పాటిస్తారా?

ఒకప్పుడు మోదీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ''ఈ రూల్ తీసుకొచ్చింది మోదీ కాబట్టి, ఆయన పాటిస్తారా లేదా అనేది ఆయన ఇష్టం'' అన్నారు.

ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాల మద్దతుదారు అయిన డాక్టర్ సువ్రోక్మల్ దత్తా బీబీసీతో మాట్లాడుతూ, ''75 ఏళ్ల నిర్ణయాన్ని పాటించాలా? వద్దా? అనేది ప్రధాన మంత్రి ఇష్టం. ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలనుకుంటే.. అది ఆయన నిర్ణయం. అందులో పార్టీ ఒత్తిడి, లేదా సిద్ధాంతపరమైన ఒత్తిడి కానీ ఉంటుందని నేను అనుకోవడం లేదు'' అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది బీబీసీతో మాట్లాడుతూ, '75 ఏళ్ల తర్వాత మోదీ తన పదవి నుంచి తప్పుకుంటారని కానీ, లేదా సంఘ్ మరొకరిని కోరుకుంటున్నట్లు కానీ కనిపించడం లేదు'' అన్నారు.

విజయ్ త్రివేది బీజేపీ, సంఘ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, యోగి ఆదిత్యనాథ్‌లపై పుస్తకాలు రాశారు.

''ప్రస్తుతం నరేంద్ర మోదీ చాలా యాక్టివ్‌గా ఉన్నారు, 2029 వరకూ పగ్గాలు నరేంద్ర మోదీ చేతిలోనే ఉంటాయని తెలుస్తోంది'' అని సీనియర్ జర్నలిస్ట్ రాకేశ్ మోహన్ చతుర్వేది అంటున్నారు.

కానీ, రాజకీయాల్లో కొంత అనిశ్చితి ఉంది. మరీముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల వ్యవహారంలో దేనికైనా సన్నాహాలు చాలా ముందునుంచే మొదలవుతాయి.

'సంఘం శరణం గచ్ఛామి' పుస్తక రచయిత విజయ్ త్రివేది మాట్లాడుతూ, "నంబర్ వన్ స్థానం కోసం ఇప్పటికీ పోటీలేదు. అయితే, ఆ దిశగా అన్వేషణ ప్రారంభించి ఉంటారని అనుకుంటున్నా. సంఘ్‌ని మనం పరిశీలిస్తే, వారు దీర్ఘకాలం మనగలిగే విధానాలు, నిర్ణయాలకే మొగ్గుచూపుతారు. దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలో వారు నిమగ్నమయ్యారు. ప్రధాన మంత్రి మోదీతో పాటు మరో నాయకత్వం కోసం సంఘ్ చూస్తోంది'' అన్నారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోహన్ భాగవత్

ఆర్ఎస్ఎస్‌కీ, మోదీకి మధ్య దూరం పెరిగిందా?

2024 మే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మొదట్లో మేమంత బలంగా లేము. కొద్దిగా వెనకబడ్డాం. అప్పుడు ఆర్ఎస్ఎస్ అవసరం ఉంది. కానీ, ఈ రోజు వేరు, బీజేపీ ఎదిగింది. మనం సొంతంగా చేసుకోగలిగినప్పుడు, పార్టీ స్వతంత్రంగానే నడుస్తుంది."

నడ్డా చేసిన ఈ ప్రకటన సంఘ్‌లో తీవ్ర దుమారం రేపిందని నిపుణులు అంటున్నారు.

ఒక న్యూస్‌పేపర్ ఎడిటర్ బీబీసీతో మాట్లాడుతూ, "నడ్డా ప్రకటనతో ఆర్‌ఎస్‌ఎస్ కలత చెందింది. ఎన్నికల వేళ ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాన్ని కూడా వాయిదా వేయలేదు. ఎవరైనా ఆర్ఎస్ఎస్ వ్యక్తితో మాట్లాడితే, వాళ్లు దాదాపు పట్టించుకోవడం లేదని మీకు చెబుతారు. వాళ్లు మధ్యప్రదేశ్‌లో చాలా కష్టపడ్డారు, ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ వారితో ఎప్పుడూ సఖ్యతతో ఉండేవారు'' అన్నారు.

అయితే, ఆ కోపం దీనికే పరిమితం కాదు.

2024 జూన్ 7న పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో నితీశ్ కుమార్ మాట్లాడుతూ, భారత ప్రధాని పదవికి బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత నరేంద్ర మోదీకి మా పార్టీ మద్దతునిస్తోందన్నారు.

అయితే, అసలు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిందా?

బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ వ్యవహారాలను కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఒకరు బీబీసీతో మాట్లాడుతూ ఇలా అన్నారు. ''జూన్ 4వ తేదీ సాయంత్రం బీజేపీ సీనియర్ నేత ఒకరు, కేబినెట్‌లో సీనియర్ మంత్రి ఒకరు ఆర్ఎస్ఎస్ నేతలను కలిసేందుకు దిల్లీలోని వారి కార్యాలయానికి వెళ్లారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి, మీ పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకోవాలని ఆర్ఎస్ఎస్ సూచించింది. చాలా సింపుల్‌గా ఆర్ఎస్ఎస్ అలా చెప్పడంతో, అసలు విషయం బోధపడింది.''

ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగలేదు, కానీ ఎన్డీయే సమావేశం జరిగింది.

2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, బీజేపీ వెబ్‌సైట్‌లో ఎన్డీయే సమావేశానికి సంబంధించిన పత్రికా ప్రకటన కనిపించింది, కానీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానిది కాదు. అయితే, 2019లో 303 సీట్లు గెలిచినప్పుడు, ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే 24న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది కానీ, ఎన్డీయే సమావేశం కాదు.

కొన్నివర్గాల వాదనల ప్రకారం, ''గెలిచిన 240 మందిలో 140 మంది ఎంపీలు తమవాళ్లేనని సంఘ్ నేతలు అనధికారికంగా చెబుతూనే ఉన్నారు. ఒకవేళ బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగితే ఇప్పుడున్న వాళ్లను ఎన్నుకోకపోవచ్చు. అందుకే వాళ్లు సమావేశం ఏర్పాటు చేయలేదు. ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు, నితీశ్‌తో సమావేశమై లేఖలు తీసుకుని ఎన్డీయే పేరుతో వ్యవహారం నడిపించారు. ఇది కూడా సంఘ్‌కు నచ్చలేదు.''

రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్

నేతల కోసం అన్వేషణ, సిద్ధం చేయడం..

ఒకవైపు నరేంద్ర మోదీపై సంఘ్ ఆగ్రహంగా ఉందన్న సంకేతాలు, మరోవైపు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతల ఎదుగుదల, మోదీకి వయసు పైబడుతుండడం, ప్రజల సెంటిమెంట్‌లో మార్పు, మిత్రపక్షాల మద్దతుతో మోదీ ప్రభుత్వం నడుస్తుండడం వంటి విషయాలు ఇప్పటికే ఉన్నాయి.

అయితే, ఈ కారణాలతో ఇప్పుడిప్పుడే మోదీని పక్కన బెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. కానీ, ఆయన తర్వాత ఎవరనే దానికోసం అన్వేషణ, నేతలను తయారు చేయడం వంటివాటిపై ఇప్పటికే చర్చలు సాగుతున్నాయి.

ఇటీవలి కాలంలో యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ గురించి వెలువడుతున్న ఊహాగానాలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

యూపీకి చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే బీబీసీ హిందీతో మాట్లాడుతూ, ''ఇవాళ బాగా (యోగి) ఏదైనా ఒక పనిచేస్తే, దిల్లీలో నంబర్ 2 (షా) ఇబ్బంది పెడతారని ఇక్కడ చౌరస్తాలో నిల్చున్న వ్యక్తికి కూడా తెలుసు'' అన్నారు.

అలహాబాద్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ పంకజ్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, ''యోగిని తప్పించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు సరైన అవకాశం దొరకడం లేదు. అమిత్ షాకు అధికారాలు ఉండి ఉండొచ్చు కానీ, ప్రజల దృష్టిలో ఆయన అంత గొప్పగా ఏమీ లేరు'' అని చెప్పారు.

''బీజేపీని ఇష్టపడే ఓటర్లలో మోదీ తర్వాత యోగి రెండోస్థానంలో నిలిచారు. యూపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అమిత్ షా కంటే యోగికే ఆదరణ ఎక్కువ. ఆ విషయం యోగికి కూడా తెలుసు'' అని బీజేపీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండే సీనియర్ జర్నలిస్ట్ అన్నారు.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకరు. నాథ్ సంప్రదాయంలో కీలక మఠం అయిన గోరఖ్‌ధామ్ మఠాధిపతి కావడం వల్ల కూడా యోగి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుపరిచితులు.

సంఘ్‌ సానుభూతిపరులైన డాక్టర్ దత్తా ''డైనమిక్‌గా ఉండే ఏ పార్టీలో అయినా దీనిని పోరాటం అనరు, ఆరోగ్యకరమైన పోటీ అంటారు. అది అవసరం, మంచి విషయం కూడా'' అని అభిప్రాయపడ్డారు.

అమిత్ షా, యోగి

ఫొటో సోర్స్, YEARS

ఫొటో క్యాప్షన్, అమిత్ షా, యోగి

యోగి వర్సెస్ షా

మేము సంఘ్, బీజేపీతో పాటు కొన్ని వర్గాలు, సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడాం. వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం షా, యోగి మధ్య వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు.

మరి ఇలాంటి పరిస్థితుల్లో, సంఘ్ ఎవరి వైపు నిలుస్తుంది?

ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ బీబీసీతో మాట్లాడుతూ, ''సంఘ్ యోగి వైపే ఉంది. యోగి దిగిపోతే, పోటీ కూడా లేకుండా పోతుందని నంబర్ 2 కోరుకుంటున్నారు. కానీ, యోగికి సంఘ్ మద్దతు బలంగా ఉంది, కాబట్టి యోగిని దించేయడం అంత సులభం కాదు'' అని చెప్పారు.

బీజేపీ అనుబంధ సంస్థలకు చెందిన కొన్ని వర్గాలు, ''తన తర్వాత అమిత్ షా ఆ స్థానాన్ని భర్తీ చేయాలని మోదీ కోరుకుంటున్నారు. ఒకవైపు యోగి వ్యవహారాల్లో షా జోక్యం చేసుకుంటున్నారు. మరోవైపు యోగి తన వారికే షాకిచ్చాడు'' అని పేర్కొంటున్నాయి.

సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారుల విషయంలో వార్, యూపీలో స్మార్ట్ మీటర్ల వ్యవహారం, అదానీ టెండర్ రద్దు వంటివి యోగికి, మోదీ ప్రభుత్వానికి మధ్య దూరాన్ని ఎత్తిచూపిన కొన్ని ఘటనలు.

రాకేశ్ మోహన్ చతుర్వేది మాట్లాడుతూ, ''ప్రస్తుతం బయటికొస్తున్న పేర్లలో యోగి, షా ఉన్నారు. హిందుత్వకు యోగి సింబల్‌గా ఉన్నారు. మోదీ ప్రణాళికలను అమలు చేయడంలో షా కీలక పాత్ర పోషించారు'' అన్నారు.

2009లో నితిన్ గడ్కరీని బీజేపీ అధ్యక్షుడిని చేయడం, యోగిని యూపీ ముఖ్యమంత్రిని చేయడం, మహ్మద్ అలీ జిన్నాను సెక్యులర్ అని వ్యాఖ్యానించిన అడ్వాణీ నుంచి 2005 జూన్‌లో బీజేపీ అధ్యక్ష పదవిని లాక్కోవడం వంటి బీజేపీ ప్రధాన నిర్ణయాల వెనక సంఘ్ హస్తం ఉంది.

యోగి, అమిత్ షా‌ గురించి మాట్లాడుతూ జర్నలిస్ట్ త్రివేది ఇలా అన్నారు, ''ఏ నిర్ణయం తీసుకున్నా సంఘ్ మద్దతు, మార్గదర్శకాలు, పరస్పర చర్చల ద్వారానే ఉంటుందని భావిస్తున్నా.''

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోహన్ భాగవత్

సంఘ్ మొగ్గు ఎటువైపు..

ఇలాంటి పరిస్థితుల్లో, యోగి వర్సెస్ షా అంటూ వస్తున్న ఊహాగానాలు కనుక నిజమని భావిస్తే అప్పుడు సంఘ్ మొగ్గు ఎటువైపు ఉంటుందనేదే ఇక్కడ ప్రశ్న.

అయితే, ఇలాంటి విషయాలపై అధికారికంగా లేదా బహిరంగంగా సంఘ్ స్పందించదు.

తన వివరాలు బయటకు వెల్లడించకూడదన్న షరతుతో సంఘ్‌లో కీలక పదవిలో ఉన్న ఒకరు మాట్లాడుతూ, ''అలాంటి సమయం వచ్చినప్పుడు, ఏకాభిప్రాయం మేరకు బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఇలాంటి విషయాల్లో బీజేపీకి మద్దతు అవసరమైతే, సంఘ్ నేతలతో టచ్‌లో ఉంటారు. వారు ఎలాంటి సలహాలు ఇచ్చినా బీజేపీనే తుది నిర్ణయం తీసుకుంటుంది'' అని చెప్పారు.

''ఏవో మార్పులు జరుగుతాయని మేం అనుకోవడం లేదు. ఎవరికి వారు ఏదో మాట్లాడుకుంటూ, వాళ్లకి వాళ్లు అంచనాలు వేసుకుంటూ ఉంటారు'' అన్నారాయన.

దీని గురించి సంఘ్ మద్దతుదారు డాక్టర్ దత్తాను అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ ''ప్రధానంగా చూస్తే యోగి ఆదిత్యనాథ్ అని నేను భావిస్తున్నా. ఆయనతో పాటు హిమంత బిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, పీయూష్ గోయెల్, అనురాగ్ ఠాకూర్ వంటి చాలా మంది నాయకులు ఉన్నారు'' అన్నారు.

మీరు చాలా పేర్లు చెప్పారు కానీ అమిత్ షా పేరు లేదు?

ఈ ప్రశ్నకు "మోదీ తర్వాత షా రెండో స్థానంలో ఉన్నారని అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనకు ఇమేజ్ ఉంది. ఆయన్ను మిగిలిన వారితో కలిపి చూడడం సరికాదు" అని డాక్టర్ దత్తా బదులిచ్చారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, NARENDRAMODI.IN

హిందుత్వ లేదా కులం ప్రభావం

2024 లోక్ సభ ఎన్నికల్లో కులం ఒక ముఖ్యమైన అంశంగా మారింది. రాహుల్ గాంధీతో సహా చాలామంది ప్రతిపక్షనేతలు ఇప్పటికీ కుల గణన సమస్యను లేవనెత్తుతూనే ఉన్నారు.

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ విజయంలో బీసీ, దళిత, మైనారిటీల కూటమిని ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుంది.

గత 10 ఏళ్లలో రాజకీయాలు హిందుత్వ అజెండాపై నడవడం కనిపించింది, కానీ ఇప్పుడు పంథా మారినట్లు కనిపిస్తోంది.

బీబీసీ హిందీ షో 'ది లెన్స్‌'లో సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదరి మాట్లాడుతూ రాజకీయ అంశాల్లో ఇప్పుడు మతం వెనకబడి, కులం ముందుకు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, లోక్ సభ ఎన్నికల తరహాలో కరుడుగట్టిన హిందుత్వవాదం తగ్గి బీజేపీ పతనం కొనసాగితే, మోదీ, యోగి ఆదరణ కూడా తగ్గడం మొదలవుతుంది. ఒకవేళ పరిస్థితులు అలా మారిపోతే, సంఘ్ మూడో వ్యక్తిని కూడా తెరమీదకు తీసుకురావొచ్చు.

మరి మోదీ, యోగి, షా కాకపోతే ఇంకెవరు?

రాకేశ్ మోహన్ చతుర్వేది మాట్లాడుతూ, ''ఒకరు గడ్కరీ, మరొకరు రాజ్‌నాథ్ సింగ్. వీళ్లిద్దరూ గతంలో పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. రాజ్‌నాథ్‌ది మోదీ వయసు. గడ్కరీ వయసులో కాస్త చిన్న. ఆయనకు ప్రజాదరణ, సంఘ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా చాలాకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఆయన కూడా ఉంటారు'' అన్నారు.

అయితే, ''బీజేపీని మోదీ, షా తమ మనుషులతో నింపేశారు. వాళ్లు గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ముందుకు వెళ్లనీయరు'' అని ఆ పార్టీ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

"రాజకీయాల్లో హిందుత్వ ప్రభావం కొనసాగుతుందా? లేక బీసీ, ఓబీసీల ప్రభావం ఉంటుందా? అనేది ప్రధాన ప్రశ్న. ఇవి వారసుడి పేరును కూడా ప్రభావితం చేస్తాయి. కుల రాజకీయాలు తెరపైకి వస్తే, అప్పుడు వారిలో శివరాజ్ సింగ్ చౌహాన్‌ పేరు ముందుంటుంది'' అన్నారు జర్నలిస్ట్ విజయ్ త్రివేది.

బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ, అమిత్ షా, నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్

2029, ఆర్ఎస్ఎస్, బీజేపీ, వారసులు

సాధారణంగా ఒకరి తర్వాత మరొకరు, వారి సొంత మనుషులే వారసులు అవుతారు. అయితే, రాజకీయాల్లో ఈ సొంత మనుషులు అనేదానికి నిర్వచనం మారుతుంటుంది.

జర్నలిస్ట్ పూర్ణిమా జోషి మాట్లాడుతూ, మోదీ లాంటి నాయకులు మరెవరినీ ముందుకు రానీయరు.

అయితే, ఇక్కడ సంఘ్ పాత్ర మొదలైంది, సన్నాహాలూ ప్రారంభమయ్యాయి.

2024 జులై 27న దిల్లీలో ముఖ్యమంత్రుల కౌన్సిల్ సమావేశం జరిగింది.

అనుకోకుండా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఒకరికొకరు దగ్గరగా వచ్చారు.

ఇద్దరి మధ్య నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూర్చుని ఉన్నారు.

ఆ దృశ్యం చూసిన కొంతమందికి రేసు ప్రారంభమైనట్లుగా అనిపించొచ్చు, ఆ తర్వాత పెద్ద శబ్దం వచ్చి, నంబర్ వన్ అయ్యేందుకు రేసు మొదలవుతుందని కూడా అనిపించి ఉండొచ్చు.

అయితే, ఈ రాజకీయ ఒలింపిక్స్‌లో రేసులో కనిపించని క్రీడాకారులు కూడా బంగారు పతకాలు సాధిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)