‘పొట్టిగా ఉన్నానన్న ఫీలింగ్‌తో ఎత్తు పెరగాలని కాళ్లకు సర్జరీ చేయించుకున్నాను.. కానీ’

ఫొటో సోర్స్, Elaine Foo/Supplied
- రచయిత, టామ్ బ్రాదా
- హోదా, బీబీసీ న్యూస్
(హెచ్చరిక: ఈ కథనంలో వైద్యానికి సంబంధించిన కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)
ఎలైన్ ఫూ కాళ్లపై పెద్దపెద్ద చారలు కనిపిస్తున్నాయి. ఈ చారలన్నీ ఆమె తన కాళ్ల పొడవు పెంచుకునేందుకు చేయించుకున్న చికిత్స మిగిల్చిన బాధను గుర్తు చేస్తాయి.
2016 నుంచి ఎలైన్ 5 సర్జరీలను, మూడు బోన్ గ్రాఫ్ట్‌లను చేయించుకుంది. జీవితాంతం ఆమె పొదుపు చేసుకున్న డబ్బులన్నీ ఈ సర్జరీలకే ఖర్చయిపోయాయి. ఆమెకిప్పుడు 49 ఏళ్లు.
ఈ దారుణమైన చికిత్సను చేసిన సర్జన్‌పై ఎలైన్ జరిపిన నాలుగేళ్ల న్యాయ పోరాటం జులైలో ముగిసింది. సర్జన్‌కు, దీనికి సంబంధం లేదని తేల్చారు.
కాళ్ల పొడవు పెంచుకునేందుకు సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ఎన్నో బాధలను అనుభవించారు. కాళ్ల లోపల ఎవరో మెలిపెడుతున్నట్లుగా తీవ్రమైన బాధను ఆమె అనుభవించారు.
‘‘నా ప్రయాణం నిప్పుపై నడిచినట్లు సాగింది. కానీ, చివరికి కోలుకున్నాను’’ అని తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ మాత్రం తన నిర్లక్ష్యాన్ని అంగీకరించడం లేదు అన్నారామె.

ఎలైన్ తన ఎత్తు విషయంలో నిత్యం అసంతపృిగా ఉండేవారు.
‘‘12 సంవత్సరాల వయసులో చాలా మంది అమ్మాయిల కంటే నేను పొడవు. 14 ఏళ్లు వచ్చే సరికి ఒక్కసారిగా అందరికంటే పొట్టిగా అనిపించాను. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టా. పొడవుగా ఉంటే ఎక్కువ అందంగా ఉంటామనే ఫీలింగ్ ఉండేది. ఎత్తుగా ఉన్న వారికి ఎక్కువ అవకాశాలుంటాయని భావించేదాన్ని’’ అని ఎలైన్ చెప్పారు.
యవ్వనంలోకి వచ్చేసరికి ఆ ఆలోచనలు మరింత పెరిగిపోయాయని తెలిపారు.
తనకు బాడీ డిస్మార్ఫియా ఉందని ఎలైన్ భావించారు. ఇదొక మానసిక పరిస్థితి. ఇతరులు తమల్ని ఎలా చూస్తున్నారనే విషయంతో సంబంధం లేకుండా, తమలో తామే లోటుపాట్లను వెతుక్కుంటారు. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Elaine Foo/Supplied
ఎలైన్‌కు 25 ఏళ్లు వచ్చినప్పుడు ఒక చైనీస్ క్లినిక్ కథనం ఆమె కంటపడింది. అక్కడ కాళ్ల ఎముకలను పొడవుగా చేసేందుకు సర్జరీలు చేస్తున్నారని ఎలైన్ తెలుసుకున్నారు.
ఈ కథనంలో ఉన్న వివరాలు చదివిన తర్వాత ఎలైన్ తొలుత భయపడినా దానిపై ఆమెకు ఆసక్తి మాత్రం పెరిగింది.
‘ప్రజలు ఈ చికిత్స సామర్థ్యం, నాణ్యతను ప్రశ్నిస్తారని నాకు తెలుసు’’ అని ఆమె అన్నారు.
‘‘కానీ, నువ్వు బాడీ డిస్మార్ఫియాతో బాధ పడుతున్నప్పుడు ఎందుకింత ప్రతికూలంగా ఆలోచిస్తున్నావు అన్నదానికి కచ్చితమైన సమాధానం ఉండదు’’ అని తెలిపారు.
16 ఏళ్ల తర్వాత లండన్‌లో ఇలాంటి చికిత్స విధానాన్ని అందించే ఒక ప్రైవేట్ క్లినిక్ గురించి ఎలైన్‌కు తెలిసింది.
ఆర్థోపెడిక్ సర్జన్ జీన్-మార్క్ గీషెట్ ఈ చికిత్సను అందిస్తున్నారు. ఈయన అవయవాల పొడవు పెంచే నిపుణుడు. ‘గీషెట్ నైల్’ అనే అవయవాల పొడవు పెంచే డివైస్‌ను ఈయన తయారుచేశారు.
ఇది నిజంగా అద్భుతమైన క్షణం, ఎందుకంటే లండన్‌లో ఆపరేషన్ చేయించుకుని, ఇక్కడే తన ఇంట్లోనే రికవరీ కావొచ్చని ఆమె అనుకున్నట్టు గుర్తుకు చేసుకున్నారు.
‘‘ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ముందుగానే డాక్టర్ గీషెట్ చెప్పారు. నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం, దెబ్బతిన్న ఎముకలు మళ్లీ తిరిగి యథాస్థితికి రాకపోవడం’’ వంటి వాటిపై ఆయన హెచ్చరించారని ఎలైన్ చెప్పారు.
‘‘కానీ, నా పరిశోధనను నేను చేశాను. ఖరీదైన వైద్యునికి దగ్గరికి వెళ్తున్నా కాబట్టి తగిన వైద్య సంరక్షణ ఉంటుందని ఆశించాను. నా కల 5 అడుగుల 2 అంగుళాల నుంచి 5 అడుగుల 5 అంగుళాలు పెరగడం’’ అని తెలిపారు.
సుమారు 50 వేల పౌండ్ల(సుమారు రూ.53,55,027)తో సర్జరీ చేయించుకున్నారు ఎలైన్. ఈ చికిత్స ఆమె జీవితాన్ని మార్చివేసింది.

ఫొటో సోర్స్, Elaine Foo/Supplied
అవయవాలు పొడవు పెంచుకునే చికిత్సలు చాలా అసాధారణం. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రైవేట్ క్లినిక్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సకు అయ్యే ఖర్చు 15 వేల పౌండ్ల నుంచి 1,50,000 పౌండ్ల వరకు ఉంటుంది.
‘‘సర్జరీ తరువాత లేచిచూసే సరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, నాకెలాంటి నొప్పి లేదు. కానీ, 90 నిమిషాల తర్వాత నా కాళ్లను ఎవరో మెలిపెడుతున్నట్లు అనిపించింది. లోపల ఎవరో కాల్చుతున్నట్లు అనిపించింది. ఆ రాత్రి నేను ఉదయం 6 గంటల వరకు ఏడ్చాను. ఏడ్చుకుంటూనే నిద్రపోయాను’’ అని ఎలైన్ ఆ రోజును గుర్తుకు చేసుకున్నారు.
ఈ ప్రొసీజర్‌లో కొంత నొప్పి ఉంటుందని ఊహించాం. కానీ, ఆపరేషన్ సమయంలో కాళ్ల ఎముకలు రెండుగా చీల్చారు. లోహపు కడ్డీలు లోపల పెట్టారు.
ఈ లోహపు కడ్డీలు వాటి పొడవును పెంచుకునేందుకు క్రమంగా విస్తరిస్తాయి. ఈ సమయంలో ఎముక రెండు భాగాలు వేరువేరుగా అవుతాయి. ఈ ప్రక్రియ మెల్లగా రోగి ఎత్తును పెంచేందుకు ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలు తిరిగి క్రమంగా అతుక్కోవాలి. వాటి మధ్యలో ఉన్న గ్యాప్‌ను పూడ్చుకోవాలి. ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైంది.
‘పొడవు పెంచుకునే విధానానికి రెండు నుంచి మూడు నెలలు పడుతుంది’ అన్నారు బ్రిటిష్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ మాజీ కౌన్సిల్ మెంబర్ హమీష్ సింప్సన్. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చేందుకు కనీసం ఆ సమయానికి రెండింతలు పడుతుందని అన్నారు.
సర్జరీ తర్వాత, ఎలైన్ కాళ్లు పొడవు పెరగడం మొదలైంది. చాలాసార్లు ఆమెకు అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించేది.
రెండు వారాల తరువాత తనకు తీవ్ర బాధాకరంగా అనిపించినట్లు ఎలైన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Elaine Foo/Supplied
ఎలైన్ స్కాన్ కోసం వెళ్లినప్పుడు తన ఎడమ కాలిలోని లోహపు కడ్డీ ముక్క ఆమె తొడ ఎముక నుంచి విరిగిపోయిందని తెలిసింది. మనిషి శరీరంలో అత్యంత బలమైన ఎముక తొడ ఎముకే.
అయితే.. ‘ఇప్పుడు మీరేమీ ఆందోళన చెందకండి’ అని డాక్టర్ తనతో చెప్పినట్లు ఎలైన్ తెలిపారు.
‘ఈ నొప్పి తగ్గేంత వరకు ఆగండి. ఒకసారి నొప్పి తగ్గాక, మళ్లీ ప్రాసెస్ ప్రారంభిద్దాం’’ అని చెప్పినట్లు ఎలైన్ తెలిపారు.
ఎలైన్ కుడి కాలి పొడవు పెంచే ప్రాసెస్‌ను ప్రారంభించారు. ఆమె ఎడమ కాలి కోసం మరో ఆపరేషన్‌ను కూడా షెడ్యూల్ చేశారు. కుడి, ఎడమ కాళ్లను సమానంగా పొడిగించేందుకు ప్రయత్నించారు.
మరో అదనపు ఆపరేషన్ కోసం వేల పౌండ్లు ఖర్చవుతుందని చెప్పినట్లు ఎలైన్ తెలిపారు. సెప్టెంబర్ నాటికి కుడి కాలు 7 సెంటిమీటర్ల మేర పెరిగింది. కానీ, అంతా అనుకున్నట్లు జరగలేదు. కుడి, ఎడమ కాళ్ల పొడవులో తేడా వచ్చింది. అది ఆమెకు సమస్యగా మారింది. ఆమె వెన్నుముక వంకర్లు తిరిగింది.
ఆరు వారాల తరువాత, ఆమె కుడి కాలును స్కాన్ చేసినప్పుడు ఎముకల పెరుగుదల తక్కువగా ఉన్నట్లు తెలిసింది.
మళ్లీ డాక్టర్ గీషెట్‌ను ఆశ్రయించారు ఎలైన్. మిలాన్‌లో తాను పనిచేసే క్లినిక్‌లో గీషెట్ మరో ఆపరేషన్ చేశారు. 2017 ఏప్రిల్‌లో ఎలైన ఎడమ కాలు పొడవు పెరగడం మొదలైంది. అలాగే ఎముకను పెంచేందుకు కుడి కాలిలోకి బోన్ మారోను ఇంజెక్ట్ చేశారు. ఆపరేషన్ తరువాత ఎలైన్‌కు మరింత భయంకరమైన వార్త తెలిసింది.
లోహపు కడ్డీ ముక్కను బయటికి తీస్తున్నప్పుడు అది విరిగిపోయిందని డాక్టర్ గీషెట్ చెప్పారని ఎలైన్ తెలిపారు.
‘సరిచేయడానికి మరింత ఖర్చవుతుందన్నారు’ అని ఎలైన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Elaine Foo/Supplied
మూడు రోజుల తర్వాత కదలలేని పరిస్థితి. ఇంటికి వెళ్లాలనే కోరికతో ఎలాగో అలా లండన్‌కు తిరిగి వచ్చారు. డాక్టర్ గీషెట్‌తో ఇక ఇది నయం కాదని ఆమె అనుకున్నారు. ఆ తర్వాత వారిద్దరికీ మధ్య డాక్టర్-పేషెంట్ సంబంధం కూడా ముగిసిపోయింది. తరువాత ఎక్కడికి వెళ్లాలో తెలియదు.
2017 జులైలో ఎన్‌హెచ్ఎస్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలిస్ట్‌ను ఆమె కలిశారు. దీని నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని ఆ డాక్టర్ చెప్పినట్లు తెలిపారు.
‘‘పూర్తిగా నయం చేసుకునేందుకు కనీసం ఐదేళ్ల చికిత్స అవసరమవుతుందని చెప్పారు. దానికి నేను సిద్ధం కావాల్సి ఉంది’’ అని తెలిపారు.
తొలి సర్జరీ అయిన ఎనిమిదేళ్లకు కూడా ఎలైన్ ఇంకా మానసిక, శారీరక సమస్యల నుంచి కోలుకోలేకపోతున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆమెకు బాగా ఇబ్బంది అవుతుంది. పీటీఎస్‌డీ(పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)తో ఇబ్బంది పడుతున్నారు.
2017 నుంచి 2020 మధ్య కాలంలో ఆమె ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఒంటరిగా, ఎలాంటి ఉపాధి లేకుండా గడపాల్సి వచ్చింది.
ఆ తర్వాత డాక్టర్ గీషెట్‌పై ఆమె న్యాయపోరాటానికి దిగారు. నాలుగేళ్ల ఈ న్యాయపోరాటం చివరికి జులైలో సెటిల్ అయింది. ఆయనపై ఎలైన్ వేసిన దావాను పరిష్కరించుకునేందుకు గీషెట్ కొంత మొత్తం ఆమెకు చెల్లించేందుకు అంగీకరించారు.
కానీ, ఆ సర్జన్ న్యాయవాది మాత్రం డాక్టర్ గీషెట్ నిర్లక్ష్యానికి పాల్పడ్డారనే దాన్ని ఖండించారు.

ఫొటో సోర్స్, Elaine Foo/Supplied
‘‘ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదు. ఫ్రాక్చర్, ఆలస్యంగా ఎముకలు కోలుకోవడానికి నిర్లక్ష్యమేమీ కారణం కాదు. వీటి గురించి సర్జరీకి ముందే ఎలైన్‌ను హెచ్చరించారు.
అంతేకాక, గీషెట్ సూచనను అనుసరించడంలో ఆమె తరచూ విఫలమయ్యారు. ఆమె రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించారు’’ అని సర్జన్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.
ఈ ఆరోపణలన్నింటిన్నీ ఎలైన్ ఖండించారు. ఆమె తీసుకున్న యాంటీ-డిప్రెసెంట్స్‌కు ఈ ప్రతికూల ప్రభావాలకు సంబంధం లేదన్నారు.
తనకు జరిగిన దానికి డాక్టర్‌నే బాధ్యత వహించాలన్నారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నందుకు తాను సురక్షితంగానే ఉంటానని అనుకున్నానని ఎలైన్ అన్నారు. కానీ, చాలాసార్లు డబ్బు చెల్లించాల్సి వచ్చిందన్నారు.
‘నా జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోయాను. ముందే ఇదంతా తెలిస్తే నువ్వు ఈ సర్జరీ చేయించుకుంటావా? అని ఇప్పుడు ఎవరైనా అడిగితే చేయించుకోననే చెబుతాను’’ అన్నారు ఎలైన్.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














