ఎలక్ట్రిక్ పల్సెస్: మెడ విరిగి, వెన్నెముక దెబ్బతిని పక్షవాతానికి గురైన రోగుల కాళ్లూచేతులు మళ్లీ పనిచేసేలా చేస్తున్న చికిత్స

ఫొటో సోర్స్, BBC News/Tony Jolliffe
- రచయిత, పల్లబ్ ఘోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
పద్నాలుగేళ్ల కిందట గుర్రపు స్వారీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన మెడ విరిగినప్పటి నుంచి మెలానీ రీడ్ ఎడమ చేయి సరిగా పనిచేయడం మానేసింది.
కానీ ఇప్పుడామె మళ్లీ తన ఎడమ చేతితో స్మార్ట్‌ఫోన్ వాడగలుగుతున్నారు, సీటుబెల్ట్ అందుకోగలుగుతున్నారు.
ఇదంతా ఆమె తీసుకుంటున్న ఆధునిక చికిత్స వల్ల సాధ్యమైంది.
ఫిజియోథెరపీతో పాటు ఎలక్ట్రికల్ పల్సెస్ ఉపయోగించి చేస్తున్న ఈ అధునాతన చికిత్స తీసుకోవడంతో ఆమె పక్షవాతం నుంచి కోలుకుని తన చేతిని కదపగలుగుతున్నారు.
మెడ విరిగిన తరువాత ఆమె ఎడమ చేయి పక్షవాతానికి గురైంది.
60 మంది రోగులకు ప్రయోగాత్మకంగా అందించిన ఈ చికిత్సతో వారిలో 43 మందిలో కొంత మార్పు కనిపించింది.
వారి చేతులు, అరచేతుల్లో కదలికలు కనిపించాయి. తమంతట తామే వారు చేతులను కదపగలుగుతున్నారు.


అమెరికాలోని ఆస్పత్రులలో రోగులకు చికిత్స అందించేందుకు ఈ విధానాన్ని వాడేలా అనుమతించాలని ఈ విధానాన్ని అభివృద్ధి చేసిన బృందం దరఖాస్తు చేసుకుంది.
ప్రభావిత శరీర భాగం చుట్టూ ఎలక్ట్రోడ్స్‌ను జోడించడం ద్వారా ఇది పనిచేస్తుంది.
అధిక పౌనఃపున్యం ఉన్న విద్యుత్ పుంజాలు నరాలు, సంకేతాల ద్వారా మన చేతుల్లోకి ప్రేరణలను పంపించేలా మెదడును ఉత్తేజపరుస్తాయి.
మెలానీ కేసులో ఆమె మెడకు, వెన్నుకు తగిలిన గాయం వల్ల మెదడు నుంచి చేతికి సంకేతాలు అందక అది పనిచేయడం మానేసింది.
67 ఏళ్ల మెలానీ టైమ్స్ ఆఫ్ లండన్‌లో జర్నలిస్టు. ఈ కొత్త విధానాన్ని ప్రయత్నించిన రోగులలో ఆమె ఒకరు.
ఈ చికిత్సకు ముందు ఆమె చేతులు, అరచేతులు అయితే ఏమాత్రం కదిలేవి కావు.
ముఖ్యంగా ఎడమ చేయి, దాన్నైతే అసలు కదిల్చేందుకు వీలుపడేది కాదు.
ఆమె ఫిజియోథెరపీతో పాటు రెండు నెలల పాటు ఎలక్ట్రికల్ పల్సస్ చికిత్స కూడా తీసుకున్నారు.
ఈ చికిత్స తన దైనందిన జీవితంలో అతిపెద్ద మార్పును తీసుకొచ్చిందని తెలిపారు మెలానీ.
‘‘నా ఎడమ చేయి బొటన వేలితో సీటుబెల్ట్‌ను తీసేయగలుగుతున్నా. ఇప్పుడు నా చేతితో కాఫీ కప్ పట్టుకోగలుగుతున్నా. చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా. వేడినీళ్లలో బియ్యాన్ని వేయడం వంటి పనులు చేసుకోగలుగుతున్నా’’ అని ఆమె అన్నారు.
‘‘ఈ విధానంలో కొన్ని నెలలపాటు చికిత్స అందిస్తే వారిలో చెప్పుకోదగిన మెరుగుదల కనిపిస్తుంది’’ అని ఈ పరిశోధన బృందంలో ఒకరైన యూనివర్సిటీ కాలేజీ లండన్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్, సర్జన్ ప్రొఫెసర్ రాబర్ట్ బ్రౌన్‌స్టోన్ అన్నారు.

ఫొటో సోర్స్, BBC News
చికిత్స జరుగుతున్న సమయంలో పల్సస్ ఆన్‌లో ఉన్నప్పుడు ముఖంపై ఉన్న నీటిని తానే స్వయంగా తుడుచుకోవడం, కొన్ని వస్తువులను ఎత్తగలగడం వంటి పనులు చేసుకోగలుగుతున్నట్లు మెలానీ చెప్పారు.
ఈ చికిత్స తనకున్న శక్తిలో శాశ్వతమైన మెరుగుదల కలిగించిందని మెలానీ భావిస్తున్నారు.
‘‘ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారానే నాలో ఈ మెరుగుదలంతా కనిపించిందని చెప్పలేను. కానీ, దీని వల్ల నాలో ఉత్సాహం కలిగింది’’ అని ఆమె చెప్పారు.
‘‘వెన్నెముక విరిగిన తరువాత ఎలాంటి అద్భుతాలు జరగవు. కానీ ఈ డివైస్ సాయంతో నా చేత్తో నేను ఆహారాన్ని తినగలిగినా, నీళ్లు తాగగలిగినా అంతకన్నా కావాల్సింది ఏం ఉంటుంది’’ అని మెలానీ అన్నారు.
ఎలక్ట్రికల్ పల్స్ టెక్నిక్‌ను వాడటం ద్వారా అంతకుముందు నడుముకు గాయాలై పెరాలసిస్‌కు గురైన వ్యక్తులు తిరిగి నడవగలిగారు.
వెన్నెముకకు గాయాలైన రోగులలో ఈ చికిత్స తర్వాత మెరుగుదల కనిపించింది.
ఏడాది నుంచి 34 ఏళ్ల క్రితం వరకు ప్రమాదాలకు గురై, తమలో ఎలాంటి చిన్న కదలిక లేదా మెరుగుదల కనిపించిన రోగులను ఈ చికిత్సకు, అధ్యయనానికి ఎంపిక చేశారు.
14 ఏళ్ల క్రితం మెలానీకి గాయమైనప్పటి నుంచి మారిల్ పర్సెల్ ఆమెకు చికిత్స చేస్తున్నారు.
గ్లాస్గోలోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీలో స్కాటిష్ సెంటర్ ఫర్ ఇన్నొవేషన్‌కు రీసెర్చ్ డైరెక్టర్‌గా మారిల్ పర్సెల్ పనిచేస్తున్నారు.
ఈ రంగంలో ప్రపంచంలోనే ప్రముఖ పరిశోధన కేంద్రం అయినందున ఆమె యూనిట్‌కు కూడా ఈ అధ్యయనంలో భాగస్వామ్యం కల్పించారు.
ఎంతో కాలంగా గాయాలతో బాధపడుతున్న వారిలో ఈ పురోగతిని తాను మునుపెన్నడూ చూడలేదని ఆమె చెప్పారు.
లౌసాన్‌లోని ఈపీఎఫ్‌ఎల్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టిన్ నేతృత్వంలో స్విస్ టీమ్ తాజాగా అభివృద్ధి చేసిన పరికరమే ఇది.
ఇప్పటి వరకు వీరు వెన్నెముక గాయాలతో బాధపడుతున్న 26 మందికి సర్జికల్ ఇంప్లాంటెడ్ డివైజ్‌ల ద్వారా వెన్నును ఉత్తేజపరిచి మళ్లీ నడవగలిగేలా చేశారు.
మెడ విరగడం వల్ల చేతుల కదలికలు కోల్పోయిన వారికి చికిత్స చేసేందుకు ఈ అధ్యయన బృందం చేసిన తొలి ప్రయత్నమే ఈ కొత్త విధానం.
ఫిజియోథెరపీతో పాటు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ చికిత్సతో దెబ్బతిన్న నరాలను కాస్త బాగుచేయవచ్చని ప్రొఫెసర్ కోర్టిన్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఆధారాలలో వెల్లడించారు.
‘‘ఇలాంటి రోగుల జీవితాలను మార్చే టెక్నాలజీని తీసుకురావడంలో మేం చాలా ప్రగతి సాధించాం’’ అని బీబీసీ న్యూస్‌కు తెలిపారు.
నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన క్లినికల్ అధ్యయనంలోని డేటాను అమెరికా నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) పరిశీలిస్తోంది. ఈ విధానం సురక్షితమైనదేనా? దీని ప్రయోజనాలు గణనీయంగా ఉన్నాయా? అని అంచనావేస్తోంది.
ఒకవేళ ఈ విధానంపై నియంత్రణ సంస్థ సంతృప్తి వ్యక్తం చేస్తే, టెక్నాలజీని ఆధారం చేసుకుని ఈ మెడికల్ డివైజ్‌కు లైసెన్స్ మంజూరు చేస్తారు.
అమెరికాలో దీనికి ఆమోదం లభిస్తే, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని వాడేందుకు ఈ టెక్నాలజీ రూపొందించిన బృందం లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














