హిండెన్‌బర్గ్: సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి, ఆమె భర్త ధావల్ చేసిన ప్రకటనలో ఏముంది, రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అనుమానాలేంటి ?

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా నివేదికను విడుదల చేసిన హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ, తాజాగా భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు చేసింది.
‘‘అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో సంబంధం ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీలలో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయి’’ అని విజిల్‌బ్లోయర్ పత్రాలను ఉటంకిస్తూ హిండెన్‌బర్గ్ శనివారం తెలిపింది. ఆ పత్రాలను బీబీసీ చూడలేదు, స్వతంత్రంగా ధ్రువీకరించడంలేదు.
హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను మాధవి పురి, ఆమె భర్త ఖండించారు. తాము పెట్టిన పెట్టుబడుల వివరాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపారు.
హిండెన్‌బర్గ్ తాజా నివేదికపై ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించాయి.

ఫొటో సోర్స్, X profile of the Hindenburg
హిండెన్‌బర్గ్ నివేదికలో ఏముంది?
‘’అదానీ కంపెనీలలో ఆర్థిక అవకతవకల కోసం వాడిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో సెబీ చైర్‌పర్సన్‌కు వాటాలు ఉన్నాయి’’ అని హిండెన్‌బర్గ్ రీసర్చ్ నివేదిక ఆరోపించింది. ఇండియా ఇన్ఫోలైన్ ఈఎం రీసర్జెంట్ ఫండ్, ఎమర్జింగ్ ఇండియా ఫోకస్ ఫండ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అదానీకి చెందిన ఇతర అనుమానాస్పద షేర్ హోల్డర్ కంపెనీలపై ఇప్పటివరకు సెబీ ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్కొంది.
మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ (సెబీ) పారదర్శకత ప్రశ్నార్థకంగా మారిందని నివేదిక ఆరోపించింది.
‘‘అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆఫ్‌షోర్ నిధులు అస్పష్టంగా, సంక్లిష్టంగా ఉన్నాయి’’ అని హిండెన్‌బర్గ్ తెలిపింది.
ఈ నివేదిక మాధవి పురి బుచ్ వ్యక్తిగత ఆసక్తులు, సెబీ చీఫ్‌గా ఆమె పాత్రపై ప్రశ్నలను లేవనెత్తింది. అదానీ గ్రూప్‌కు సంబంధించి సెబీ నిర్వహించిన దర్యాప్తును క్షుణ్ణంగా సమీక్షించాలని సూచించింది.
సెబీ చైర్‌పర్సన్‌గా మాధవి నియామకానికి కొన్ని వారాల ముందు ఆమె భర్త ధావల్ బుచ్ గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్(జీడీవోపీ)లో పెట్టుబడుల గురించి మారిషస్‌కు చెందిన ఫండ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ట్రైడెంట్ ట్రస్ట్‌కు ఈమెయిల్ చేశారని హిండెన్‌బర్గ్ రీసర్చ్ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Linkedin
మాధవి పురి, ఆమె భర్త ప్రకటనలో ఏముంది?
హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండిస్తున్నట్లు మాధవి, ధావల్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశారని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
'మా జీవితం, మా ఆర్థిక ఖాతాలు తెరిచిన పుస్తకం వంటివి. గత కొన్నేళ్లుగా సెబీకి అవసరమైన సమాచారం అంతా అందించాం' అని ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ విషయంలో పూర్తి పారదర్శకత కోసం తగిన సమయంలో పూర్తి ప్రకటన విడుదల చేస్తామని మాధవి పురి అంతకు ముందు ప్రకటించారు. తర్వాత ఆ ప్రకటనను విడుదల చేశారు.
‘హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ విడిగా స్పందిస్తుంది, కానీ మాపై చేసిన ఆరోపణలకు మేము స్పందిస్తున్నాము’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.
ఆ ప్రకటన ప్రకారం, మాధవి ఐఐఎం అహ్మదాబాద్‌లో చదువుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలలో వివిధ హోదాలలో పనిచేశారు. ధావల్ బుచ్ దిల్లీలోని ఐఐటీలో చదివి 35 ఏళ్లపాటు ఒక పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు.
వారి స్టేట్‌మెంట్ ప్రకారం, ‘‘ఉద్యోగాలు చేసుకునే సమయంలో ఇద్దరూ తమ జీతాలు, బోనస్‌లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదించారు. మాధవి పురి ఆర్ధిక స్థితిని ఆమె ప్రస్తుత హోదాతో ముడిపెట్టి చూడటం సరికాదు. ఇది కచ్చితంగా దురుద్దేశ పూరితం’’ అని ఆ ప్రకటనలో ఉంది.
‘‘హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం 2015 సంవత్సరంలో తీసుకున్నది. ఆ సమయంలో ఇద్దరూ సామాన్య పౌరులు. సింగపూర్‌లో నివసించారు. ఈ పెట్టుబడులు పెట్టిన దాదాపు రెండేళ్ల తర్వాత మాధవి పురి సెబీలో పని చేయడం ప్రారంభించారు.’’ అని ఆ ప్రకటన పేర్కొంది.
"ఫండ్‌కు చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అనిల్ అహుజా, ధావల్‌కు చిన్ననాటి నుంచి ఐఐటీలో చదివే వరకు స్నేహితుడు. అందుకే ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. 2018లో అహుజా ఆ ఫండ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో వారు ఆ ఫండ్ నుంచి డబ్బును వాపసు తీసుకున్నారు.’’ అని అందులో పేర్కొన్నారు.
"భారతదేశంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు హిండెన్‌బర్గ్‌కి షోకాజ్ నోటీసు జారీ చేశాం. ఆ నోటీసులకు జవాబు ఇవ్వకుండా సెబీ విశ్వసనీయతపై దాడి చేసేందుకు, సెబీ చైర్ పర్సన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది.’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంతకు ముందు మాధవి పురి భర్త ధావల్ మాట్లాడుతూ ‘‘మేము ప్రైవేట్ పౌరులైనప్పటికీ, మా ఆర్ధిక పత్రాలను బహిర్గతం చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని అన్నారు.
ధావల్ బుచ్ నేపథ్యం ఏమిటి?
ధావల్ బుచ్ ప్రస్తుతం ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్లాక్‌స్టోన్, అల్వారెజ్ & మార్సల్ సంస్థలకు సలహాదారుగా ఉన్నారు. ఆయన గిల్డాన్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.
ధావల్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఐఐటీ దిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు.
ఆయన యూనిలీవర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. తరువాత కంపెనీకి చీఫ్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాహుల్ గాంధీ ఆరోపణలు
ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం సాయంత్రం స్పందించారు.
2 నిమిషాల 19 సెకన్ల నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆయన.. ఇటీవలి కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ మంది తమ డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారని, ప్రతిపక్ష నేతగా వారిని సరైన చోట పెట్టుబడులు పెట్టేలా చూడటం తన బాధ్యతని, ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరంగా మారిందని ఆయన అన్నారు.
స్టాక్ మార్కెట్‌ను నియంత్రించే భారతీయ సంస్థ సెబీపై ఆరోపణలు వెల్లువెత్తడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.
లక్షలాది మంది ప్రజల సొమ్ము ప్రమాదంలో ఉందని, కాబట్టి ఈ విషయంపై విచారణ జరపాలని ఆయన అన్నారు.
"ఇది మూడు పెద్ద అనుమానాలకు తావిస్తోంది. మొదటిది, ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా మాధవి పూరి ఎందుకు రాజీనామా చేయలేదు?"
"రెండవది, మార్కెట్‌లో ఏదైనా తప్పు జరిగి పెట్టుబడిదారులు తమ డబ్బును పోగొట్టుకున్నట్లయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, సెబీ చీఫా, ప్రధాని నరేంద్ర మోదీయా, లేక అదానీయా."
"మూడవది, ఈ విషయం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దానిని సుమోటోగా స్వీకరిస్తుందా?"
ఈ మొత్తం వ్యవహారాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారించేందుకు ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారో ఇప్పుడు స్పష్టమైందని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
అదానీ గ్రూప్ ఏం చెప్పింది?
హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.
హిండెన్‌బర్గ్ నివేదిక కుట్రపూరితమని, వ్యక్తిగత లాభం కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ మదుపరులను తప్పుదోవ పట్టించేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని అదానీ గ్రూప్ ఆరోపించింది.
"అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను మేం పూర్తిగా ఖండిస్తున్నాం. అవన్నీ నిరాధారమైనవి. ఈ ఆరోపణలను 2024 జనవరిలోనే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది" అని ప్రకటన పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్షాల ఆరోపణలు..
హిండెన్‌బర్గ్ రీసర్చ్ నివేదికపై ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి.
'అదానీ స్కామ్ గురించి తెలుసుకోవడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి' అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
సెబీ చైర్‌పర్సన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
"2022లో మాధవి సెబీ చైర్‌పర్సన్ అయిన వెంటనే ఆమెతో గౌతమ్ అదానీ రెండు సమావేశాలు జరపడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ సమయంలో అదానీ లావాదేవీలపై సెబీ దర్యాప్తు చేస్తోందని గుర్తుంచుకోండి" అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు.

ఫొటో సోర్స్, Arvind Yadav/Hindustan Times via Getty Images
“సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని, సెబీ చైర్‌పర్సన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఆమె, భర్త దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలు, ఇంటర్‌పోల్స్‌లో లుకౌట్ నోటీసు జారీ చేయాలి" అని టీఎంసీ అధికార ప్రతినిధి ఒకరు డిమాండ్ చేశారు.
హిండెన్‌బర్గ్ నివేదికపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందిస్తూ 'సెబీ చైర్‌పర్సన్ కూడా అదానీ గ్రూపులో పెట్టుబడిదారే. ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం స్పష్టంగా కనిపిస్తోంది, సీబీఐ, ఈడీ మీరు పీవోసీఏ, పీఎంఎల్ఏ కేసులు పెడతారా?' అని ప్రశ్నించారు.
ఈ చైర్‌పర్సన్ నేతృత్వంలో అదానీపై సెబీ చేస్తున్న ఏ విచారణను విశ్వసించలేమని మహువా అన్నారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆమె ఎక్స్(ట్విటర్) వేదికగా కోరారు.
18 నెలల అనంతరం..
అదానీ గ్రూపు కంపెనీలపై 2023 జనవరిలో వచ్చిన హిండెన్‌బర్గ్ నివేదిక భారతదేశంలో ‘రాజకీయ తుపాను’ సృష్టించింది.
అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ చేసిందని, అకౌంటింగ్ ఫ్రాడ్‌కు పాల్పడిందని అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ ఆ ఆరోపణలను ఖండించింది.
అదే సమయంలో సీబీఐ లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
తాజాగా హిండెన్‌బర్గ్ రెండో నివేదిక విడుదల చేయడంతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















