కోల్‌కతా డాక్టర్‌‌ అత్యాచారం, హత్య కేసు: నిందితుడు ఎలా దొరికాడో వెల్లడించిన పోలీసులు

కోల్‌కతా రేప్ కేసు, ట్రైనీ పీజీ డాక్టర్, పోలీస్ కమిషనర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినోద్ కుమార్ గోయల్

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆగస్టు 9 ఉదయం ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది.

ఈ ఘటనపై వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు.

ఈ ఘటనపై రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి.

కోల్‌కతా రేప్ కేసు

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులు ఏం చెప్పారు?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అత్యాచారం, హత్య రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగింది.

సంజయ్ రాయ్‌ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

“ఆమె మెడ ఎముక విరిగిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఆమెను గొంతు పిసికి చంపినట్లు అనిపిస్తోంది” అని ఓ పోలీసు అధికారి చెప్పారని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

మృతురాలి గోళ్ల నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు అందులో చర్మం, రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు నిర్థరించారు.

నిందితుడు కోల్‌కతాలో ట్రాఫిక్ పోలీస్ వలంటీర్‌గా పని చేస్తున్నాడు.

సంజయ్ రాయ్ మీద పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(అత్యాచారం) 103/1(హత్య) కింద కేసులు నమోదు చేశారు.

నిందితుడు ఇంటికి వెళ్లిన తర్వాత ఆధారాలను చెరిపివేసేందుకు బట్టలు ఉతికాడని, తర్వాత నిద్రపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

మహిళా డాక్టర్ మృతదేహం శుక్రవారం ఉదయం మెడికల్ కాలేజ్‌లోని సెమినార్ హాల్‍‌లో లభించింది.

అంతకు ముందు రోజు రాత్రి సెమినార్ హాల్‌లో భోజనం చేసిన తర్వాత ఆమె అక్కడే నిద్ర పోయారని పోలీసులు చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

నిందితుడు ఎలా దొరికాడు?

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు.

ఘటనాస్థలంలో సేకరించిన ఆధారాలతో పోలీసులు నిందితుడి దగ్గరికి వెళ్లారు.

సెమినార్ హాల్‌లో విరిగిన బ్లూటూత్ ఇయర్‌ ఫోన్‌ను పోలీసులు గుర్తించారు. అది నిందితుడి ఫోన్‌కు కనెక్ట్ అయ్యి ఉంది.

అంతే కాకుండా నిందితుడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ భవనంలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అప్పుడు నిందితుడు ఇయర్‌ఫోన్‌లు ధరించి ఉన్నాడు. అయితే 40 నిమిషాల తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, అతని చెవుల్లో ఇయర్‌ ఫోన్‌లు లేవు.

డాక్టర్ల ఆందోళన, భోపాల్, కోల్‌కతా, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెడికల్ స్టూడెంట్ రేప్, హత్య కేసులో సత్వర న్యాయం కోసం డాక్టర్లు, విద్యార్థుల ఆందోళన

దేశవ్యాప్తంగా ఆందోళనలు

కోల్‌కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ద ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగస్టు 12న ఆసుపత్రులలో కొన్ని నిర్దేశిత సేవల్ని నిలిపివేయాలని డాక్టర్లకు పిలుపిచ్చింది. ఔట్ పేషెంట్ సేవలు, వార్డుల్లో సేవలు లాంటివి అందులో ఉన్నాయి.

దిల్లీలోని ఎయిమ్స్‌, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రుల్లో డాక్టర్లు ట్రైనీ డాక్టర్ రేప్, హత్యను నిరసిస్తూ ప్రదర్శన చేశారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని నినాదాలు చేశారు.

కోల్‌కతా మెడికో రేప్ కేసు, సంజయ్ రాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పోలీస్ కమిషనర్ ఏమన్నారు?

ఆందోళనకు దిగిన కాలేజ్ విద్యార్ధులు, డాక్టర్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కలిశారు.

తమ డిమాండ్ల విషయంలో పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, కొన్ని డిమాండ్ల పరిష్కారానికి హమీ ఇచ్చారని డాక్టర్ శ్రేయ షా ఏఎన్ఐతో చెప్పారు.

“మేము కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కలిశాం. మా డిమాండ్లలో కొన్నింటికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయడం, పోస్టు మార్టం రిపోర్ట్, సీసీటీవీ ఫుటేజ్ మాకు చూపించాలని అడిగాం. ఆధారాలను మేము పరిశీలిస్తే, విచారణలో వాటిని మార్చకుండా, నిజాయతీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని అనుకుంటున్నాం. వాళ్లు మాడిమాండ్లను అంగీకరించారు. మా డిమాండ్లన్నీ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తాం” అని ఆమె చెప్పారు.

ఈ కేసుపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“జాయింట్ పోలీస్ కమిషనర్ బాధిత కుటుంబాన్ని కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోస్ట్ మార్టం నివేదికను కుటుంబ సభ్యులకు అందించాం” అని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

“మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా, పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సంఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్‌ను విధుల నుంచి తప్పించాలని విద్యార్థులు కోరారు. వారు కోరినట్లే ఆయనను విధుల నుంచి తప్పించాం. ఆందోళన ఎప్పుడు విరమించాలనేది విద్యార్థుల ఇష్టం. వారికి పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారు” అని పోలీస్ కమిషనర్ వినోద్ కుమార్ గోయల్ తెలిపారు.

కోల్‌కతా, బీజేపీ, రేప్, హత్య

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేంద్రమంత్రి సుకాంత్ మజుందార్

సీబీఐ విచారణ జరపాలన్న కేంద్రమంత్రి

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుపై కేంద్రమంత్రి సుకాంత్ మజుందార్ స్పందించారు.

“ఇది సిగ్గు చేటు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలి. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. ఎందుకంటే పోలీసులు మొదట ఇది ఆత్మహత్య అని తర్వాత హత్య అని చెప్పారు” అని ఆయన అన్నారు.

“పీజీ విద్యార్థులు, డాక్టర్లకు తమ కాలేజ్‌లలోనే భద్రత లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా డాక్టర్లంతా ఆందోళన బాటపట్టారు” అని మజుందార్ అన్నారు.

ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు.

“ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సీరియస్‌గా తీసుకోవాలి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నేరాలను రాజకీయం చెయ్యకూడదు” అని ఆమె అన్నారు.

రేప్ కేసుల్లో విచారణ త్వరగా ముగించేలా ఒక చట్టం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)