మొహమ్మద్ డేఫ్: తమ వైమానిక దాడిలో చనిపోయారని ఇజ్రాయెల్ చెబుతున్న ఈ 'ఒంటి కన్ను' హమాస్ లీడర్ ఎవరు?

మొహమ్మద్ డేఫ్, హమాస్, గాజా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హమాస్ సైనిక కమాండర్ మొహమ్మద్ డేఫ్ (ఫైల్ ఫోటో )

హమాస్ మిలిటరీ లీడర్ మొహమ్మద్ డేఫ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వర్గాలు చెప్పాయి. జులై 13న యూనిస్‌ఖాన్‌పై జరిపిన మిలిటరీ దాడిలో ఆయన చనిపోయారని ఇజ్రాయెల్ వెల్లడించింది.

అయితే, డేఫ్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించలేదు.

గాజాలోని అల్-మవాసీ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో డజన్ల సంఖ్యలో గాజా నిరాశ్రయులు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

‘‘మాకున్న సమాచారం ప్రకారం అక్కడ హమాస్ తీవ్రవాదులు తప్ప సామాన్య ప్రజలు ఎవరూ లేరు.’’ అని ఇజ్రాయెల్ మిలిటరీ వర్గాలు పేర్కొన్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ వైమానిక దాడుల్లో ఖాన్‌యూనిస్ బ్రిగేడ్‌కు చెందిన కమాండర్ రఫా సలామా కూడా మరణించారని ఇజ్రాయెలీ ఆర్మీ వెల్లడించింది. రఫా సలామా మొహమ్మద్ డేఫ్‌కు సన్నిహితుడని, అక్టోబర్ 7 నాటి దాడులకు సూత్రధారి అని ఇజ్రాయెల్ చెబుతోంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఇజ్రాయెల్ సైన్యం, గాజా, పాలస్తీనా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ డేఫ్

మొహమ్మద్ డేఫ్ ఎవరు?

డేఫ్‌ గురించిన సమాచారం ఎక్కువగా ఇజ్రాయెల్, పాలస్తీనా మీడియాల నుంచే వస్తుంది. మీడియా కథనాల ప్రకారం డేఫ్‌1965లో గాజాలోని ఖాన్‌యూనిస్ శరణార్ధి శిబిరంలో పుట్టారు.

డేఫ్ అసలు పేరు మొహమ్మద్ దయాబ్ ఇబ్రహిం అల్-మస్రి. ఇజ్రాయెల్ నిఘా నుంచి తప్పించుకునేందుకు వివిధ ప్రదేశాలకు తిరుగుతున్న క్రమంలో తన పేరును డేఫ్‌గా మార్చుకున్నారు. డేఫ్‌ అంటే "అతిథి లేదా సందర్శకుడు" అని అర్థం.

మొహమ్మద్ డేఫ్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి సైన్స్‌లో డిగ్రీ తీసుకున్నారు. యూనివర్సిటీలో ఎంటర్‌టైన్‌మెంట్ కమిటీకి నాయకుడిగా ఉన్నారు.

స్టేజ్ మీద హాస్య ప్రదర్శనలు ఇచ్చేవారు. యూనివర్సిటీలో ఉన్న సమయంలోనే డేఫ్ ముస్లిం బ్రదర్‌హుడ్‌లో చేరారు.

హమాస్ సైనిక విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ‌సహ వ్యవస్థాపకుడు డేఫ్. వెస్ట్‌బ్యాంక్‌లో ఖస్సామ్ బ్రిగేడ్స్ ప్రారంభించడం, దాని నిర్వహణ వ్యవహారాలన్నీ డేఫ్ పర్యవేక్షించేవారు.

2002లో ఖస్సామ్ బ్రిగేడ్స్‌ అధిపతిగా ఉన్న సలాహ్ షెహదేహ్‌ను ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత ఖస్సామ్ బ్రిగేడ్స్ నాయకత్వ బాధ్యతలు డేఫ్‌ చేతిలోకి వచ్చాయి.

2015లో అమెరికా, 2023లో యూరోపియన్ యూనియన్ డేఫ్‌ను నిషేధిత అంతర్జాతీయ టెర్రరిస్టుల జాబితాలో చేర్చాయి.

హమాస్ పుట్టే నాటికి డేఫ్‌ యువకుడు. 1987లో ఆవిర్భవించిన హమాస్‌లో చేరారు. ఇజ్రాయెల్‌పై ద్వేషాన్ని నరనరాన నింపుకొన్న డేఫ్‌, హమాస్ సైన్యంలో వేగంగా ఎదిగారు.

''హమాస్‌లో ఆయనొక అతివాది'' అని అమెరికా కౌంటర్ టెర్రరిజం మాజీ సలహాదారు లెవిట్ ఓ సందర్భంలో అన్నారు. హమాస్‌ కీలక నేతలకు ఆయన చాలా సన్నిహితుడు. ముఖ్యంగా బాంబ్ మేకర్, ఇంజినీర్ అనే పేరున్న అయ్యాష్‌‌కు డేఫ్ సన్నిహితుడు.

1989లో ఇజ్రాయెల్ అధికారులు డేఫ్‌ను అరెస్ట్ చేశారు. హమాస్ సైన్యం కోసం పని చేస్తున్నారనే అభియోగాల మీద ఆయనకు 16 నెలల జైలుశిక్ష విధించారు.

1990లలో ఇజ్రాయెల్ మీద బాంబులతో విరుచుకు పడిన వారిలో అయ్యాష్ కీలకమైన వ్యక్తి. 1996లో అయ్యాష్‌ను ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి.

1996లో బస్సుల మీద బాంబు దాడులు చేసి, పదుల మంది ప్రాణాలు తీసిన సంఘటనల వెనుక ప్రణాళిక, పర్యవేక్షణ డేఫ్ కనుసన్నల్లోనే జరిగిందని, 1990లలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికుల్ని పట్టుకుని చంపడం వెనుక కూడా డేఫ్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

తన ఎత్తుగడలతో హమాస్‌లో ఆయన వేగంగా అగ్రస్థాయికి చేరుకున్నారు. 2002లో హమాస్ మిలిటరీ వింగ్‌ నాయకుడిగా మారారు.

కస్సామ్ అనే రాకెట్‌‌ను తయారు చేయడంలో డేఫ్‌ కీలక పాత్ర పోషించారు. దీనిని హమాస్ అత్యంత విలువైన ఆయుధంగా చెబుతారు.

ఇజ్రాయెల్ మిలిటరీ దాడుల నుంచి తప్పించుకోవడానికి డేఫ్‌ గాజాలోని సొరంగ మార్గాలలో నివసించేవారు. అక్కడి నుంచి తన సైన్యానికి ఆదేశాలిచ్చేవారు.

ఇజ్రాయెల్, గాజా, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జులై 13న గాజా మీద వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది.

‘క్యాట్ విత్ నైన్ లైవ్స్’

ఇజ్రాయెల్ రాడార్ నీడలో డేఫ్‌ నిత్యం మృత్యువుతో యుద్ధం చేస్తుండేవారు. 2000 సంవత్సరం నుంచి ఆయనపై అనేకమార్లు ఇజ్రాయెలీ దళాలు దాడికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఆయన కన్ను, ఎముక దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది.

''ఆయన ఇక మిలిటరీ నాయకుడిగా పని చేయడం అసాధ్యమని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన కోలుకుని తిరిగి విధుల్లో చేరారు.'' అని ఇజ్రాయెల్‌కు చెందిన మిలిటరీ మాజీ జనరల్ ఒకరు బీబీసీతో అన్నారు.

అనేకమార్లు ఆయన ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడంతో హమాస్ వర్గాల్లో డేఫ్‌ అంటే క్రేజ్ పెరిగింది. అందరూ ఆయనను 'క్యాట్ విత్ నైన్ లైవ్స్' అని అనే వారు.

2014లో ఆయనపై 5వ సారి హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ''డేఫ్‌ జీవించే ఉన్నారు. మిలిటరీ ఆపరేషన్‌లలో పాల్గొంటున్నారు.'' అని హమాస్ ప్రకటించింది.

ఆయన ఇలా పలుమార్లు తప్పించుకోవడం ఇజ్రాయెల్ గూఢచార సాంకేతిక పరిజ్ఞానం మీదనే అనుమానాలు పెరిగేందుకు కారణమైంది.

''మీరు ఫోన్ వాడకపోతే, కంప్యూటర్ ఉపయోగించకపోతే, మీరు ఎక్కడున్నారన్నది కనుక్కోవడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కూడా చాలా కష్టం.'' అని లెవిట్ అన్నారు.

''హమాస్ తవ్విన టన్నెల్స్ లోతు, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న కొంత పాత తరం టెక్నాలజీ కారణంగా డేఫ్‌ను గుర్తించి చంపడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేకసార్లు విఫలమవుతోంది'' అని ఇజ్రాయెల్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒకరు అన్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా స్ట్రిప్, ఖాన్ యూనిస్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 1990ల్లో ఇజ్రాయెల్ బస్సులపై హమాస్ బాంబుదాడుల్లో పదుల సంఖ్యలో ఇజ్రాయెలీలు చనిపోయారు.

‘విలక్షణ నాయకుడు’

ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు కాల్పుల విరమణతో ముగియడానికి ఒక రోజు ముందు హమాస్ సీనియర్ అధికారి ఒకరు డేఫ్‌ నాయకత్వంలోనే గాజా మిలిటరీ ఆపరేషన్స్ జరిగాయని అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు.

డేఫ్‌ను అంతమొందించడానికి తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.

డేఫ్‌ మీద ఇజ్రాయెల్ తన దృష్టినంతా కేంద్రీకరించడం విశేషమేమీ కాదని, అయితే ఆయన మీద జరుగుతున్న విఫల హత్యా యత్నాలన్ని ఆయన ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయని లెవిట్ వ్యాఖ్యానించారు.

''హమాస్‌లో ఉన్న పాతతరం నాయకుల్లో ఆయన ఒకరు. ఉద్యమం ఆరంభం నుంచి ఉన్న నాయకులు చాలా తక్కువమంది ఉన్నారు. ఒక రకంగా ఆయన వారిలో కాస్త విలక్షణమైన నాయకుడు'' అన్నారు లెవిట్.

వీడియో క్యాప్షన్, మురుగుకాలువలే కారణమంటున్న స్థానికులు

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)