హనియె మరణం: గాజాలో కాల్పుల విరమణ పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, పాల్ ఆడమ్స్
- హోదా, బీబీసీ న్యూస్
హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియెను ఎలా చంపారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. తెహ్రాన్‌లో ఆయన బస చేస్తున్న ఇంటిపై రాకెట్ దాడి జరగడంతో ఆయనతోపాటు ఆయన బాడీగార్డులు కూడా చనిపోయారని ప్రాథమిక కథనాలు తెలిపాయి.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి దాదాపు 1,200 మంది ఇజ్రాయెలీలను, విదేశీయులను చంపిన తరువాత హమాస్ నేతలందరినీ వేటాడి, శిక్షిస్తామని ప్రతినపూనిన ఇజ్రాయెల్‌పైనే ఇప్పుడు అనివార్యంగా అందరి కళ్ళు పడుతున్నాయి.
సాధారణంగా విదేశాలలో తన కార్యకలాపాలపై ఇజ్రాయెల్ ఎటువంటి వ్యాఖ్యానాలు చేయదు. కానీ ఏప్రిల్ 19న నటాన్జ్ అణుకేంద్రం చుట్టూ ఉన్న ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ లక్ష్యంగా ఏ పద్ధతిలో దాడి చేసిందో, అదే పద్ధతిని ఇక్కడా అనుసరించి ఉండొచ్చు.
ఇరాన్ గగనతలం వెలుపల నుంచి ఇజ్రాయెల్ జెట్లు రాకెట్లను ప్రయోగించినట్టు భావిస్తున్నారు.
అయితే, ఈ దాడికి సంబంధించిన వివరాలు బయటకు వస్తున్న తరుణంలో, దాని రాజకీయ పరిణామాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
గాజాలో కాల్పుల విరమణపై చర్చల కోసం జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గాజాలో జరిగే రోజువారీ కార్యకలాపాలకు ఇస్మాయిల్ హనియె బాధ్యత వహించకపోవచ్చు. అది మిలటరీ కమాండర్ యోహా సిన్వర్ వ్యవహారం.
అయితే, ప్రవాసంలో ఉన్న హమాస్ నాయకుడిగా ఆయన ఖతార్, అమెరికా, ఈజిప్ట్‌ల మధ్యవర్తిత్వంలోని చర్చలలో కీలకంగా ఉన్నారు.
గాజాలో కాల్పుల విరమణపై చర్చలు త్వరలోనే విజయవంతమవుతాయని అమెరికా అధికారులు ఇటీవలే చెప్పారు. కానీ గత వారాంతంలో రోమ్‌లో జరిగిన సమావేశంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు.
కానీ, ఇస్మాయిల్ హనియె హత్య నేపథ్యంలో దీని పురోగతి ఎలా ఉంటుందనే విషయం అంచనా వేయడం అంత తేలిక కాదు.


ఫొటో సోర్స్, Reuters
ఇప్పుడే ఎందుకు?
అందరూ అనుకుంటున్నట్లు, ఇది ఇజ్రాయిల్ ఆపరేషన్ అయితే, ఆ పని ఎందుకు చేశారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.
హమాస్‌తో సంబంధం ఉన్న ఎవరిపైనైనా ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికకు మించి ఇజ్రాయెల్ ఏం సాధించాలని అనుకుంటోంది?
తుర్కియే విదేశాంగ శాఖ ఇప్పటికే తన ప్రతిస్పందనను ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలోని అనేకమంది ప్రతిస్పందనలు కూడా ఇలాగే ఉండొచ్చు.
‘‘నెతన్యాహు ప్రభుత్వానికి శాంతిస్థాపన ఉద్దేశం లేదని మరోసారి ఈ చర్య రుజువు చేసింది’’ అని తుర్కియే వ్యాఖ్యానించింది.
పాలస్తీనా అథారిటీ ప్రధాన కార్యాలయం ఉన్న రమాల్లాలో హనియె మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.
‘‘ఇది నరకం తలుపులు తెరవడమే’’ అని అధికార పార్టీ ఫతా సెంట్రల్ కమిటీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ సబ్రీ సైదామ్ బీబీసీకి చెప్పారు.
తనకు కోపం, దిగ్భ్రాంతి కలగలసిన భావోద్వేగాలు కలుగుతున్నాయని సైదామ్ చెప్పారు.
‘‘ఇస్మాయిల్ హనియె జీవితాన్ని లక్ష్యం చేసుకోవడమే కాదు, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత ఆశలను ఇజ్రాయెల్ చిదిమేసింది. శాంతి ప్రయత్నాలను ప్రమాదంలో పడేసింది’’ అని అన్నారు.
ఫతా, హమాస్ ఎప్పటి నుంచో శత్రువులు. కొన్నిసార్లు రక్తాన్ని చిందించుకునేంతటి శత్రువులు కూడా. కానీ హమాస్ నేత మరణం నుంచి ఫతా ప్రయోజనం పొందొచ్చనే సూచనను సైదామ్ గట్టిగా తిరస్కరించారు.
‘‘చంపడమే నాయకత్వం ముందున్న విధానమనేది పాలస్తీనా రాజకీయాలలో ఎప్పడూ లేదు. అలాంటిది ఏదైనా ఉంటే, అది మరింత ఆగ్రహాన్ని, ఘర్షణను సృష్టిస్తుంది’’ అని అన్నారు.
రమల్లా, వెస్ట్‌బ్యాంక్ అంతటా నిరసనలకు పిలుపునిచ్చారు.
దుకాణాలను మూసి వేసి, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, రమల్లాలోని పాలస్తీనా అథారిటీకి ఇబ్బంది కలిగించేవే.
పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కంటే ఇస్మాయిల్ హనియెకు ఎక్కువ ప్రజాదరణ ఉందని ఇటీవల ఒపినియన్ పోల్ తెలిపింది.
ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో శనివారం 12 మంది పిల్లలు, యువకులను చంపిన హిజ్బుల్లా రాకెట్ దాడికి హనియె హత్య జరిగిన సమయం ఇజ్రాయెల్ ప్రతీకారంలో విస్తృత భాగమని చెపుతోంది. ఆ ప్రతీకారంలో బేరూత్‌లో హిజ్బొల్లా సీనియర్ కమాండర్ హత్య కూడా ఉంది.
గోలన్ హైట్స్ దాడిపై తమ ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా, గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్, యెమెన్‌లోని హూతీలతో కూడిన మధ్యప్రాచ్యంలోని "ఆర్క్ ఆఫ్ రెసిస్టెన్స్"తో ఇరాన్‌కు అనుబంధం ఉందని ఇజ్రాయెల్ అధికారులు ఎప్పుడూ ఎత్తిచూపుతుంటారు.
బేరూత్‌లోని హిజ్బుల్లాకు (ఇటీవల హొదైదాలోని హౌతీలకు) దెబ్బ తగిలిన తరువాత, ఇరాన్‌లో హమాస్ నాయకుడిని చంపడం మిలిటెంట్ గ్రూపులకు, ఇరాన్ మద్దతుదారులకు ‘మీరు ఎక్కడ ఉన్నా ఇజ్రాయెల్ మీ వెంట రావచ్చు, వస్తుంది’ అనే ఒక స్పష్టమైన, భయంకరమైన సందేశాన్ని పంపుతుంది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














