ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన బీబీసీ ‘ఇండియా ఐ’ డాక్యుమెంటరీ ‘ది ట్రాప్’

బీబీసీ ఇండియా ఐ డాక్యుమెంటరీ ‘ది ట్రాప్: ఇన్‌సైడ్ ద బ్లాక్‌మెయిల్ స్కామ్ డిస్ట్రాయింగ్ లైవ్స్ అక్రాస్ ఇండియా’ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయింది. భారత్‌లో ప్రజల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన లోన్ యాప్‌ల కుంభకోణాన్ని ఈ డాక్యుమెంటరీ వెలుగులోకి తెచ్చింది.
ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారతీయ డాక్యుమెంటరీ ఇది.
బీబీసీ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ‘ఇండియా ఐ’ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.
రుణాలు అవసరమైన వారికి ఉచ్చు వేసి, వారికి అప్పులిచ్చిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తున్న పెద్ద కుంభకోణాన్ని ఆధారంగా చేసుకుని ఈ డాక్యుమెంటరీ చిత్రీకరించారు.
భారత్‌లో లక్షల మంది ప్రజలు ఈ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నారు. కానీ, ఈ ఊబిలో చిక్కుకుపోయి చాలా మంది తీవ్ర వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
‘‘బీబీసీ ఇండియా ఐ(వరల్డ్ సర్వీస్) నుంచి భారత్‌కు ఎంపికైన తొలి నామినేషన్ ఇది. లోన్ యాప్‌ల కోసం పని చేస్తున్న రికవరీ ఏజెంట్ల తిట్లు, వేధింపులు భరించలేక దాదాపు 60 మంది భారతీయులు ప్రాణాలు తీసుకున్నారని ఈ ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి తీసుకొచ్చింది’’ అని ఎమ్మీ అవార్డ్స్ జారీ చేసిన పత్రిక ప్రకటన తెలిపింది.


ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు సాగిస్తున్న ఇలాంటి స్కాములకు సంబంధించిన ఆధారాలు బీబీసీకి దొరికాయి.
లోన్ యాప్‌ల వేధింపుల వల్ల భారత దేశంలోనే 60 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. అందులో 50 శాతానికి పైగా బాధితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే ఉన్నారు.
ఆత్మహత్య చేసుకున్న వారిలో ఎక్కువ మంది 20, 30 ఏళ్ల వయసు వారే. అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు, అవార్డు గెలుచుకున్న సంగీతకారుడు ఒకరు, మూడేళ్లు, ఐదేళ్ల పిల్లలున్న ఓ యువ జంట, ఓ తాతయ్య, ఓ మనవడు...ఇలా అనేకమంది ఇలాంటి లోన్‌యాప్‌ల వలలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఈ 60 మందిలో ఎంతో భవిష్యత్ ఉన్న నలుగురు కుర్రాళ్లు కూడా ఉన్నారు.
బీబీసీ ఇండియా ఐ రిపోర్టర్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.

తొలి నామినేషన్
ఎమ్మీ అవార్డ్స్ 2024లో న్యూస్, కరెంట్ అఫైర్స్ కేటగిరీలో ఈ డాక్యుమెంటరీ నామినేట్ అయింది.
భారత్‌లో రూపొందిన ఒక డాక్యుమెంటరీలో ఈ కేటగిరీలో నామినేట్ కావడం ఇదే తొలిసారి.
ఈ అవార్డు కోసం 6 దేశాల నుంచి మొత్తం 8 సినిమాలు నామినేట్ అయ్యాయి.
ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన డాక్యుమెంటరీల్లో భారత్‌తో పాటు బ్రెజిల్, బల్గేరియా, ఇజ్రాయెల్, ఖతార్, బ్రిటన్‌లో రూపొందినవి కూడా ఉన్నాయి.
బీబీసీ ఇండియా ఐ డాక్యుమెంటరీతో పాటు, ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన మారణహోమంపై చిత్రీకరించిన డాక్యుమెంటరీ, మియన్మార్‌లో అంతర్యుద్ధం సమయంలో రహస్యంగా నడిపిన ఆస్పత్రిపై తీసిన డాక్యుమెంటరీ, హమాస్ చేతిలో బందీలైన ఇద్దరి తోబుట్టువుల కథనం కూడా ఉన్నాయి.
అమెరికా వెలుపల చిత్రీకరించిన సినిమాలకు, టీవీ ప్రొగ్రామ్‌లకు ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ అందిస్తుంది.
ఏటా ఈ అవార్డుల కార్యక్రమం న్యూయార్క్‌లో నవంబర్‌లో జరుగుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














