‘ఆమె నల్లజాతీయురాలా, భారతీయురాలా?’- కమలా హారిస్ జాతి గుర్తింపుపై ట్రంప్ ప్రశ్నలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేచల్ ల్యూకర్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా ఉపాధ్యక్షురాలు, వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిత్వానికి రేసులో ఉన్న కమలా హారిస్ జాతిపరమైన గుర్తింపుపై మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన నల్లజాతి పాత్రికేయుల సదస్సులో కమలా హారిస్ నల్లజాతి, భారతీయ గుర్తింపును ట్రంప్ ప్రశ్నించారు.
‘‘డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి రేసులో ఉన్న కమలా హారిస్ ఇటీవల దాకా తన ఆసియా- అమెరికన్ వారసత్వాన్ని నొక్కి చెప్పారు. ఇప్పుడు ఆమె నల్లజాతీయురాలిగా మారిపోయారు’’ అని ట్రంప్ అన్నారు.
‘‘కొన్నేళ్ళ కిందటి దాకా ఆమె నల్లజాతీయురాలని నాకు తెలియదు. ఇప్పుడు ఆమె తనకు తాను నల్లజాతీయురాలినని చెప్పుకుంటున్నారు’’ అని షికాగోలో జరిగిన నల్లజాతి జర్నలిస్టుల జాతీయ సంఘం సదస్సులో ట్రంప్ చెప్పారు.
‘‘ఆమె భారతీయురాలా, నల్లజాతీయురాలా? నాకు తెలియదు’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై కమలా హారిస్ స్పందించారు.
‘‘ట్రంప్‌ది పాతకాలపు విభజనపూరిత, అగౌరవ ప్రవర్తన’’ అని కమల అభివర్ణించారు.
అమెరికా ప్రజలు మరింత మెరుగ్గా ఉండాలని కమలా హారిస్ అన్నారు.
నల్లజాతి మహిళల సంస్థ సిగ్మా గామా రో సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మన విభేదాలు మనల్ని విడదీయవని అర్థం చేసుకునే నాయకుడు మనకు అవసరం’’ అని వ్యాఖ్యానించారు.
కమలా హారిస్ నల్లజాతి, ఆసియా వారసత్వం రెండింటినీ కలిగి ఉన్న తొలి అమెరికన్ ఉపాధ్యక్షురాలు.
ఆమె మూలాలు భారత్‌లోనూ, జమైకాలోనూ ఉన్నాయి.
కమల హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
అమెరికాలో నల్లజాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి.
కమలా హారిస్ 2017లో సెనేట్‌కు వెళ్లిన తర్వాత కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్ (సీబీసీ) సభ్యురాలిగా ఎన్నికయ్యారు.


ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ జాతి ప్రాతిపదికన దాడి
షికాగో సదస్సులో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ కార్యక్రమ మోడరేటర్లలో ఒకరైన ఏబీసీ న్యూస్ కరస్పాండెంట్ రాచెల్ స్కాట్‌తో తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి.
కమలా హారిస్ జాతి గుర్తింపుపై ట్రంప్ మాట్లాడుతూ, "నేను రెండింటిలో దేనినైనా గౌరవిస్తాను. ఇప్పటి వరకు ఆమె భారతీయ గుర్తింపుతో ఉన్నారు. కానీ అకస్మాత్తుగా తనను తాను నల్లజాతీయురాలిగా ప్రకటించుకున్నారు’’ అన్నారు.
దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియరీ మాట్లాడుతూ.. ఎవరి గుర్తింపు గురించి వ్యాఖ్యానించే హక్కు గానీ, ఒకరి గుర్తింపు ఏమిటో చెప్పే హక్కు గానీ ఎవరికీ లేదన్నారు. ‘‘అది ఎవరికీ సరైనది కాదు’’ అని చెప్పారు.
రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడికి జాతి ప్రాతిపదికన ప్రత్యర్థులపై దాడి చేసే చరిత్ర ఉంది.
దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలో పుట్టలేదని ఆయన నిరాధారమైన ఆరోపణలు చేశారు.
ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి, రిపబ్లికన్ ప్రైమరీ ప్రత్యర్థి నిక్కీహేలీ పై కూడా ట్రంప్ నిరాధార ఆరోపణలు చేశారు. ఆమె పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు అమెరికన్లు కారని, ఆమె అధ్యక్షురాలు కాలేరని ఆరోపించారు.

ఫొటో సోర్స్, @KamalaHarris
కమలా హారిస్ ఎంపికపై విమర్శలు
డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి ఆమె వరుస దాడులను ఎదుర్కొంటున్నారు. కేవలం ఆమె జాతి కారణంగానే ఆమెను ఎంపిక చేశారని రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు.
టేనస్సీకి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు టిమ్ బర్చెట్ ఆమెను "DEI vice-president" అని పిలిచారు. ఆమె సమర్థత, అర్హతల ఆధారంగా కాకుండా విభిన్నమైన ఆమె గుర్తింపు కారణంగానే ఎంపిక చేశారని విమర్శించారు.
అయితే ‘‘కమలా హారిస్ రంగును బట్టి ఆమెను ఎంపికచేశారని భావిస్తున్నారా? ఇది స్పష్టంగా చెప్పండి’’ అని ట్రంప్‌ను స్కౌట్ అడిగారు. ‘‘నిజంగా నాకు తెలియదు. అయి ఉండొచ్చు’’ అని ట్రంప్ సమాధానమిచ్చారు.
తన భారతీయ వారసత్వంతో మమేకమై పెరిగానని, తరచూ ఆ దేశాన్ని సందర్శిస్తున్నట్టు కమలా హారిస్ వివరించారు.
ఆమె తల్లి తన ఇద్దరు కూతుళ్లను కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ నల్లజాతి సంస్కృతిలో పెంచారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కమలా హారిస్ లా డిగ్రీ పూర్తి చేయలేదు’
న్యాయవాద వృత్తి ప్రారంభంలోనే బార్ ఎగ్జామ్‌లో హారిస్ ఫెయిలయ్యారని చర్చ సందర్భంగా ట్రంప్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై జనం గుసగుసలాడటం కనిపించింది.
"నేను మీకు నిజాలు చెబుతున్నాను. ఆమె బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. పాసవుతానని ఆమె కూడా అనుకోలేదు. కానీ ఏం జరిగిందో నాకు తెలియదు. బహుశా ఆమె పాస్ అయి ఉండొచ్చు'’ అని ట్రంప్ అన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా హేస్టింగ్స్ కాలేజీ ఆఫ్ లా నుంచి కమలా హారిస్ 1989లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఆమె తన మొదటి ప్రయత్నంలో విఫలమై, రెండోసారి ఉత్తీర్ణత సాధించారని న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది.
పరీక్ష రాసేవారిలో సగం కంటే తక్కువ మంది మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధిస్తారని కాలిఫోర్నియా స్టేట్ బార్ చెబుతోంది.
షికాగో చర్చ స్కాట్, మాజీ అధ్యక్షుడి మధ్య వివాదాస్పదంగా ప్రారంభమైంది.
నల్లజాతి ప్రజలపై గతంలో ట్రంప్ చేసిన విమర్శలను ప్రశ్నిస్తూ చర్చను ప్రారంభించినప్పుడు స్కాట్ తనను చాలా దురుసుగా పరిచయం చేశారని ట్రంప్ ఆరోపించారు.
నల్లజాతి జర్నలిస్టుల ప్రశ్నలను ట్రంప్ మూర్ఖత్వం, జాత్యహంకారంతో పోల్చారని స్కాట్ ఉదహరించారు.
'నేను ఈ దేశంలోని నల్లజాతీయులను ప్రేమిస్తున్నాను. ఈ దేశంలోని నల్లజాతీయుల కోసం నేను చాలా చేశాను' అని ట్రంప్ బదులిచ్చారు.
ఈ సంభాషణను ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. "ప్రశ్నలు మొరటుగా, అసహ్యంగా ఉన్నాయి. ఎక్కువగా స్టేట్‌మెంట్లలా ఉన్నాయి. కానీ మేం వాటికి గట్టిగా బదులిచ్చాం!" అని ఆయన అన్నారు
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














