గుర్రాలకూ బుర్ర ఉందట

గుర్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాక్వలిన్ హోవార్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లొచ్చు కానీ నీరు తాగించలేమన్నది సామెత. కానీ, దానికి ఏదైనా ప్రతిఫలం చూపిస్తే తాగించొచ్చట. పరిశోధకులు తాజాగా కనుగొన్న విషయం ఇది.

ఇంతవరకు గుర్రాలపై ఉన్న అభిప్రాయానికి భిన్నంగా అవి చాలా తెలివైనవని.. ఏదైనా ప్రతిఫలం ఇస్తే చెప్పినట్లు వినడానికి అవి అలవాటుపడతాయని కొత్త అధ్యయనం ఒకటి గుర్తించింది.

నాటింగ్‌హామ్ ట్రెండ్ యూనివర్సిటీ(ఎన్‌టీయూ)కి చెందిన పరిశోధకులు గుర్రాలపై అధ్యయనం చేశారు.

గుర్రాల మెదడు తక్షణ చర్యలకు మాత్రమే ప్రతిస్పందిస్తుందని.. వ్యూహరచన చేసేంత ఆలోచనాశక్తి వాటికి ఉండదన్న గత సిద్ధాంతాలను తోసిపుచ్చుతూ వీరి అధ్యయనంలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.

ప్రతిఫలం అందిస్తూ వాటితో ఆడే ఆటలో తరచూ గేమ్ రూల్స్ మార్చినా కూడా అవి తొందరగా అర్థం చేసుకుంటున్నట్లు గుర్తించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
గుర్రం

ఫొటో సోర్స్, Getty Images

ఈ కొత్త పరిశోధనలు.. మనుషులు వాటికి మరింత మెరుగ్గా శిక్షణ ఇవ్వడానికి, వాటి సంక్షేమానికి పనికొస్తాయని అధ్యయనకర్తలు తెలిపారు.

20 గుర్రాలపై జరిపిన ఈ అధ్యయనంలో మొదట వాటికి ఇచ్చిన టాస్క్.. ముక్కుతో ఒక కార్డును తాకడం. అలా తాకితే వాటికి మంచి ఆహారం బహుమతిగా లభిస్తుంది.

రెండో దశలో ‘స్టాప్ లైట్’ తీసుకొచ్చారు.. ఇప్పుడు కూడా ముక్కుతో కార్డును తాకాలి. కానీ, ఆ లైట్ ఆర్పేసి ఉన్నప్పుడు అలా తాకిన గుర్రాలకు మాత్రమే ఆహారం అందుతుంది.

కానీ, ఇలా రూల్ మార్చిన తరువాత కూడా గుర్రాలు లైట్ ఆఫ్‌లో ఉందా? ఆన్‌లో ఉందా? అనేదాంతో సంబంధం లేకుండా తమ ముక్కుతో కార్డును తాకాయి.

అయితే, చివరి దశలో రూల్ కొంత మార్చి చూశారు. ఇప్పుడు లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు గుర్రాలు కనుక కార్డును తాకితే 10 సెకన్ల పాటు వాటిని ఆడనివ్వకుండా ఆపేస్తారు.

ఇలా చేయడంతో గుర్రాలలో మార్పు వచ్చింది. పరిశోధకులు చేసిన ఈ మార్పును అవి పసిగట్టి లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు కార్డును తాకడం మానేసినట్లు పరిశోధకులు గుర్తించారు.

గుర్రాలు

ఫొటో సోర్స్, Getty Images

‘మేం ఇచ్చిన గడువులోగా కార్డ్ పట్టుకోవాలని వాటికి సూచించినప్పుడు అవి నెమ్మదిగా ఆ పని చేస్తాయని అనుకున్నాం. కానీ, అవి క్షణాల్లో మేం చెప్పినట్లు చేయడం చూసి ఆశ్చర్యపోయాం’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన లూయిస్ ఇవాన్స్ చెప్పారు.

స్టాప్ లైట్ తీసుకొచ్చి రూల్ మార్చినప్పుడు వాటికి విషయం అర్థమైనా, తప్పు చేసినా దాని వల్ల ఇబ్బంది లేదని కూడా తెలియడం వల్ల అప్పుడవి రూల్ పాటించలేదని.. కానీ, 10 సెకన్ల పాటు ఆడనివ్వకపోయినప్పుడు అవి రూల్ పాటించడం ప్రారంభించాయని పరిశోధకులు భావిస్తున్నారు.

అప్లయ్డ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం... గుర్రాలు అంతకుముందు అనుకున్నదాని కంటే ఎక్కువ తెలివైనవని తెలుస్తోందని ఎన్‌టీయూలో గుర్రాలకు సంబంధించిన సీనియర్ పరిశోధకురాలు డాక్టర్ క్యారీ ఇజిచి చెప్పారు.

జంతువుల తెలివితేటలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని ఈ అధ్యయనంతో అర్థమైందని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)