రష్యాలోకి 30 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లిన యుక్రెయిన్ బలగాలు, అక్కడేం జరుగుతోందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మట్ మర్ఫీ
- హోదా, బీబీసీ న్యూస్
యుక్రెయిన్ బలగాలు రష్యాలో 30 కిలోమీటర్ల దూరం దాకా చొచ్చుకెళ్లాయి. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత, రష్యాలో యుక్రెయిన్ సైన్యం ఇంత లోపలికి చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి.
టొల్పినో, కొలొడెజ్ వద్ద తమ బలగాలు యుక్రెయిన్ బలగాలను అడ్డుకున్నాయని రష్యా రక్షణ మంత్రి చెప్పారు. కుర్క్స్ ప్రాంతంలో యుద్ధం ఆరో రోజుకు చేరింది.
“రష్యాలో ప్రశాంతంగా ఉంటున్న ప్రజలను భయపెడుతున్నారు” అని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి జఖరోవా కైవ్ ఆరోపించారు.
కుర్స్క్ ప్రాంతంలో సరిహద్దు వెంట రష్యా దాదాపు 2,000 చోట్ల దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియన్‌స్కీ చెప్పారు. రష్యాపై యుక్రెయిన్ దాడులను తన తాజా ప్రసంగంలో ధ్రువీకరించారు.
యుక్రెయిన్ దాడి చిన్న చొరబాటని రష్యన్ సరిహద్దు దళాలు తెలిపాయి. అయితే ఇది చాలా పెద్దదని వేలమంది సైనికులు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని యుక్రేనియన్ సీనియర్ అధికారి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
యుక్రెయిన్ బలగాలు అప్పుడప్పుడూ రష్యా సరిహద్దులపై దాడులు చేసినప్పటికీ, కుర్క్స్ దాడి మాత్రం రష్యా భూభాగంలో యుక్రేనియన్ సంప్రదాయ బలగాలు చేసిన అతి పెద్ద దాడిని సూచిస్తోంది.
“మేము ఎదురు దాడి చేశాం. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లడం, వారికి వీలైనంత ఎక్కువగా నష్టం కలిగించడం, రష్యన్లు తమ సరిహద్దుల్ని రక్షించుకోలేని పరిస్థితి సృష్టించి వారిని అస్థిరపరచడమే మా దాడుల లక్ష్యం” అని యుక్రేనియన్ సీనియర్ సైనికాధికారి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
“రష్యన్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ఆయుధాలు, వాహనాలతో వచ్చిన శత్రు మూకల ప్రయత్నాలను భగ్నం చేశాం” అని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
రష్యా- యుక్రెయిన్ సరిహద్దుకు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యన్ గ్రామాలు టొల్పినో, ఓషి కొలొడెజ్‌లలో యుక్రేనియన్ బలగాలు రష్యన్ సేనలతో తలపడుతున్నట్లు యుక్రెయిన్ రక్షణశాఖ తెలిపింది. కుర్స్క్ ప్రాంతంలో తమ బలగాలు ముందంజ వేసినట్లు కీయెవ్ ప్రకటించింది.
సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవ్‌షెంకా గ్రామ సమీపంలో రష్యన్ దళాలు దాడి చేసినట్లు ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న దృశ్యాలను బీబీసీ ధృవీకరించింది.
కుర్క్స్ ప్రాంతంలో తమ బలగాలు అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని యుక్రెయిన్ చెబుతోంది.
సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యన్ గ్రామం గుయెవోలోని పాలనా భవనం మీద నుంచి రష్యన్ జెండాను తొలగించి యుక్రెయిన్ జెండాను ఎగరవేయడాన్ని యుక్రెయిన్ సైనికులు చిత్రీకరించారు.
స్వెరిడ్లికొవొ, పొరొజ్‌లో పరిపాలన భవనాలను యుక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి. అయితే 5 వేల మంది నివసిస్తున్న సుజా పట్టణంలో తీవ్రమైన పోరాటం జరుగుతున్నట్లు కథనాలు వచ్చాయి.
సుజా పట్టణం వెలుపల తాము ఉన్నట్లు యుక్రెయిన్ బలగాలు చిత్రీకరించిన దృశ్యాలు కనిపించాయి. రష్యా నుంచి యుక్రెయిన్ గుండా యూరోపియన్ యూనియన్ దేశాలకు గ్యాస్ సరఫరా చేయడానికి సుజా కీలకమైన పట్టణం.
కుర్క్స్ సరిహద్దు సమీపంలోని సుమీ ప్రాంతంలో యుక్రెయిన సైన్యం ఆయుధాలు, ట్యాంకులతో రష్యా వైపు వెళ్లడాన్ని బీబీసీ బృందం ప్రత్యక్షంగా చూసింది.
యుక్రెయిన ఆయుధాల కాన్వాయ్ మీద తెల్లటి త్రిభుజకారా చిహ్నాలు ఉన్నాయి. వీటిని యుక్రెయిన్‌లోనే తయారు చేసినట్లు కనిపించింది. యుక్రెయిన్ యుద్ధ ట్యాంకులు రష్యా లోపల యుద్ధంలో చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోలు లభించాయి.
ఈ ఫోటోలను బీబీసీ వెరిఫై బృందం విశ్లేషించింది. ఇందులో కుర్స్క్ అణు విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద రష్యన్ బలగాలు ఆత్మ రక్షణ శ్రేణిని ఏర్పాటు చేస్తున్నట్లుగా కనిపించింది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఓషీ కొలొడెజ్ వద్ద యుక్రెయిన్ బలగాలు పోరాడుతున్నాయి.
ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో తీసిన శాటిలైట్ ఇమేజ్ చిత్రాలు, ప్రస్తుత శాటిలైట్ చిత్రాలతో పోల్చినప్పుడు ఇక్కడ ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న ట్రెంచ్ లైన్లు కనిపిస్తున్నాయి. ఈ ట్రెంచ్ లైన్లు పవర్ ప్లాంట్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, EPA
కుర్స్క్ ప్రాంతం నుంచి 76 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా చెబుతోంది. స్థానిక అధికారులు ఈ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
కుర్క్స్ ప్రాంతీయ రాజధాని కుర్క్స్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనం మీద యుక్రేనియన్ క్షిపణి శకలాలు పడటంతో 15 మందికి గాయాలు అయ్యాయని స్థానిక తాత్కాలిక గవర్నర్ అలెక్లీ స్మిర్నోవ్ చెప్పారు.
“ఇది మమ్మల్ని శాంతికి దగ్గరగా తీసుకెళుతోంది” అని రష్యా భూభాగంలో తమ బలగాలు చేపట్టిన ఆపరేషన్ గురించి యుక్రేనియన్ ఎంపీ ఒలెక్సీ గోచెరెంకో చెప్పారు.
"రష్యా తమ సొంత భూభాగంలో పోరాడాల్సి రావడం, రష్యన్లు పరుగులు తీస్తూ ఉండటం, భయంతో దాక్కోవడం లాంటివి మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపడానికి వాళ్లకు చూపించే ఏకైక మార్గం" అని గొచెరొంకో బీబీసీతో చెప్పారు.
తూర్పు యుక్రెయిన్‌లో రష్యా సైన్యం వరుసగా గ్రామాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో కుర్క్స్ మీద దాడి జరిగింది.
తూర్పు యుక్రెయిన్ మీద రష్యన్ సేనల్ని ఉపసంహరించుకోవడం, తమ రక్షణ వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గించేందుకే యుక్రెయిన్ కుర్క్స్ మీద దాడి చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే తూర్పు యుక్రెయిన్‌లో రష్యా పురోగతి చాలా తక్కువగా ఉందని యుక్రెయిన్ అధికారి ఒకరు ఏఎఫ్‌పీతో చెప్పారు.
“కుర్క్స్ మీద దాడి రెచ్చగొట్టే చర్య” అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు.
కీయెవ్ మీద రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఓ వ్యక్తితో పాటు అతని నాలుగేళ్ల కుమారుడు మరణించారని అత్యవసర సేవల అధికారి ఒకరు చెప్పారు.
కీయెవ్ మీద రష్యా ప్రయోగించిన 57 డ్రోన్లలో 53 డ్రోన్లను యుక్రెయిన్ రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయని ఎయిర్‌ఫోర్స్ అధికారి ఒకరు చెప్పారు. రష్యన్ బలగాలు డ్రోన్లతో పాటు ఉత్తర కొరియా తయారు చేసిన నాలుగు క్షిపణులను ప్రయోగించాయని అయన తెలిపారు.
ప్యాంగాంగ్ (ఉత్తర కొరియా) నుంచి రష్యా భారీ మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. కీయెవ్ మీద రష్యన్ సేనలు ఉత్తర కొరియా తయారు చేసిన క్షిపణులు ప్రయోగించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
రష్యన్ సేనల స్వాధీనంలో ఉన్న జపోరిజియా అణు విద్యుదుత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున ప్లాంట్‌లోని మంటలు ఆరిపోయాయని రష్యన్ అధికార వార్తా సంస్థ టాస్ ప్రకటించింది.
“జపోరిజియా అణు విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్తరం నుంచి దట్టమైన పొగ వస్తున్నట్లు చూశాం. అయితే దాని వల్ల ఎలాంటి ప్రభావం లేదు” అని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇన్‌స్పెక్టర్లు చెప్పారు.
ప్లాంట్ భూభాగంలో రష్యన్ సేనలు కాల్పులు జరిపాయని అధ్యక్షుడు జెలియన్ స్కీ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
జపోరిజియా అణు విద్యుదుత్పత్తి కేంద్రం 2022 నుంచి రష్యన్ దళాల ఆధీనంలో ఉంది.
రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ఆపేశారు. ప్లాంట్‌లోని మొత్తం ఆరు రియాక్టర్లను 2022 ఏప్రిల్ నుంచి మూసివేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















