హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియె ఎలా చనిపోయారు? ఇరాన్ ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, మ్యాట్ మర్ఫీ, జెన్నీ హిల్
- హోదా, బీబీసీ న్యూస్
హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియె ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో తాను ఉంటున్న గెస్ట్ హౌజ్ వెలుపల ‘షార్ట్-రేంజ్ ప్రొజెక్టైల్’ పేలడం ద్వారా చనిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది.
ఈ ప్రొజెక్టైల్ (చిన్న క్షిపణి) బరువు 7 కిలోల వరకు ఉంటుందని, భారీ పేలుడు సంభవించడంతో హనియె, ఆయన బాడీగార్డు బుధవారం మరణించారని ఐఆర్‌జీసీ చెప్పింది.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్మాయిల్ హనియె తెహ్రాన్‌కు వెళ్లారు. ఆయన ఓ గెస్ట్ హౌజ్‌లో ఉండగా ఈ దాడి జరిగిందని ఇరాన్ అధికారులు తెలిపారు.
అమెరికా అండతో ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌ను పక్కాగా ప్లాన్ చేసి, అమలు చేసిందని ఐఆర్‌జీసీ ఆరోపించింది. అయితే, హనియె మరణంపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న రోజు, దాడి జరగడం, హనియె చనిపోవడం ఇరాన్, ఐఆర్‌జీసీ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.
హనియె మరణించిన నాటి నుంచి పలువురు ఐఆర్‌జీసీ అధికారులు అరెస్ట్ అయ్యారు లేదా డిస్మిస్ అయ్యారని న్యూయార్క్ టైమ్స్ శనివారం ప్రచురించిన ఒక కథనంలో పేర్కొంది.
ఈ సంస్థకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హనియె మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తోందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాసింది. హనియె గెస్ట్ హౌజ్ సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. వారి ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారని ఆ కథనం పేర్కొంది.
ఈ దాడి తర్వాత, ఇరాన్ రాజకీయ నేతల భద్రతను సమీక్షించి, మార్పులు చేశారు. హనియె అంత్యక్రియల కార్యక్రమం గురువారం తెహ్రాన్‌లో జరిగింది. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఆ ప్రార్థనలకు నేతృత్వం వహించారు.
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్‌కు చెందిన ఏజెంట్లు హనియె గెస్ట్ హౌజ్‌లోని గదుల్లో బాంబులు పెట్టారని, అవి పేలడంతో ఆయన మరణించారని బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ టెలిగ్రాఫ్ రిపోర్టు చేసింది. ఆ తర్వాత శనివారం ఐఆర్‌జీసీ ఈ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ.. ఇద్దరు మొసాద్ ఏజెంట్లు గెస్ట్ హౌజ్‌లోకి ప్రవేశించారని, మూడు గదుల్లో పేలుడు పదార్థాలు పెట్టారని టెలిగ్రాఫ్ పేర్కొంది. బాంబులు పెట్టిన తర్వాత ఆ ఇద్దరు ఏజెంట్లు ఇరాన్‌ను విడిచి వెళ్లారని, ఆ తర్వాత వేరే దేశం నుంచి వాటిని పేల్చారని టెలిగ్రాఫ్ వివరించింది.
గదిలో ఉన్న పేలుడు పదార్థాలు పేలడం ద్వారా హనియె చనిపోయినట్లు, వాటిని రెండు నెలల క్రితమే అక్కడ పెట్టి ఉండొచ్చని న్యూ యార్క్ టైమ్స్ కథనం కూడా పేర్కొంది. అయితే, ఈ వివరాలను బీబీసీ వెరిఫై చేయలేదు.
2017లో హమాస్ రాజకీయ విభాగ అధిపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హనియె15 సార్లు ఇరాన్‌ను సందర్శించారు.

ఫొటో సోర్స్, Reuters
ఒకవేళ వార్తాపత్రికలలో వస్తున్న ఈ కథనాలు నిజమైతే, ఐఆర్‌జీసీ అతిపెద్ద వైఫల్యంగా దీన్ని చూడొచ్చు. ఇరాన్‌లో సుదీర్ఘకాలంగా అంతర్గత భద్రతను ఈ సంస్థనే అందిస్తోంది.
ఇరాన్‌లో మొసాద్ ఏ స్థాయిలో నిర్భయంగా పనిచేయగలదో కూడా ఇది తెలియజేస్తుందని నిపుణులు అంటున్నారు.
హనియె మరణం తర్వాత, ఇరాన్, హమాస్‌లు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాయి.
‘‘సరైన సమయంలో, సరైన ప్రాంతంలో తగిన విధంగా గుణపాఠం చెబుతాం. ఇజ్రాయెల్ కఠిన శిక్షను ఎదుర్కోనుంది’ అని ఐఆర్‌జీసీ తెలిపింది.
ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సైతం ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.
హిజ్బుల్లా టాప్ కమాండర్లలో ఒకరు ఫువాద్ షుక్ర్ గత మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చనిపోయారు.
‘‘మున్ముందు మరింత సవాళ్లు ఎదరవుతాయి. అన్నివైపుల నుంచీ ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
దేశ సమాచార వ్యవస్థపై ఒకవేళ దాడి జరుగుతుందేమోన్న అనుమానంతో ఇప్పటికే ఇజ్రాయెల్ మంత్రుల ఇళ్లకు శాటిలైట్ ఫోన్లను అధికారులు పంపించారు.
ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేశాయి.

ఫొటో సోర్స్, EPA
ఇరాన్, దాని మిత్ర దేశాల దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్‌కు రక్షణగా, దానికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలో అదనపు యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను మోహరించినట్లు అమెరికా వెల్లడించింది.
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నాయని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ కూడా తమ పౌరులను హెచ్చరించారు.
అక్కడ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతుండటంతో ఎంత వీలైనంత త్వరగా లెబనాన్‌ను విడిచిపెట్టి వెళ్లాలని బేరూత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది.
కాగా, గాజాలో నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్న ఒక స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 17 మంది మరణించినట్లు శనివారం హమాస్ అధికారులు తెలిపారు.
గాజా నగరంలోని షేక్ రాద్వాన్ పక్కన ఉన్న హమామా స్కూల్‌ను మిలిటెంట్ల కోసం కమాండ్ సెంటర్‌గా వాడుతున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను హమాస్ ఖండించింది.
మరోవైపు, తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడేందుకు మొసాద్ డైరెక్టర్లు, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ షిన్ బెట్‌తో సహా ఇజ్రాయెల్ అధికారులు కైరో చేరుకున్నారు.
ఈజిప్టియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కామెల్, ఇతర సీనియర్ సైన్య అధికారులను వారు కలవనున్నారు. కానీ, హనియె మరణం ఈ చర్చలను దెబ్బతీసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కాల్పుల విరమణ చర్చలలో హనియె కీలకంగా వ్యవహరించేవారని బైడెన్ చెప్పారు.
2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన అనూహ్య దాడితో యుద్ధం మొదలైంది. ఆ దాడిలో దాదాపు 1,200 మంది మరణించగా.. 251 మందిని హమాస్ బందీలుగా గాజాకు తీసుకెళ్లింది.
ఆ తర్వాత ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతీకార దాడుల్లో, గాజాలో 39,550 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ నడుపుతున్న ఆరోగ్య శాఖ చెప్పింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














