తంగలాన్ మూవీ రివ్యూ: బంగారంతో బానిసత్వం పోయిందా, విక్రమ్ ఖాతాలో హిట్ పడిందా?

తంగలాన్ సినిమాలో విక్రమ్

ఫొటో సోర్స్, [email protected]

ఫొటో క్యాప్షన్, పా.రంజిత్ మార్క్ సినిమా తంగలాన్
    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

తంగలాన్ సినిమా రివ్యూలోకి వెళ్లేముందు చిన్న ప్రీ లోగ్. ఎందుకంటే ఇది పా. రంజిత్ సినిమా.

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఇలా ఉంది, దర్శకత్వం అలా ఉంది, పాత్రధారులు ఇలా నటించారు, డైలాగులు అట్లా, యాక్షన్ సీక్వెన్స్ ఇట్లా అని అలవాటైన పరిభాషలో చెప్పుకునే సినిమాలు కావు అతనివి.

భారతీయ సినిమాలో అతనిదొక ప్రత్యేక పంథా. అధికారం, పెత్తనం కాళ్ల కింద నలిగే వాళ్ల తలలు నిటారుగా నిలబడి ప్రశ్నించడం మొదలెడితే ఎలా ఉంటుంది అనేది అతని సినిమాలన్నింటా కనిపించే ధార.

మరి రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ సినిమా ఎలా ఉంది?

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది ‘కేజీఎఫ్’ సినిమా. మళ్లీ అదే గోల్డ్ హంట్ నేపథ్యంలో చియాన్ విక్రమ్ హీరోగా తంగలాన్‌ను తెరకెక్కించారు పా. రంజిత్.

హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ సినిమాగా వచ్చిన ‘తంగలాన్’ ఎలా ఉందో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
తంగలాన్ మూవీ

ఫొటో సోర్స్, [email protected]

ఫొటో క్యాప్షన్, తంగలాన్ సినిమాలో సామాజికవివక్షను ఎత్తిచూపారు.

కథ ఏంటి?

స్వాతంత్య్రం పూర్వం ఉత్తర ఆర్కాట్‌లో జరిగే ఈ కథలో దేశంలోని బానిసత్వం, అంటరానితనం తదితర సామాజిక వివక్షలను చూపించారు.

శిస్తు కట్టలేదన్న నెపంతో ఉత్తర ఆర్కాట్‌లో ఉండే తంగలాన్ కుటుంబ ఆస్తులను జమీను(ఆంగ్ల ప్రభుత్వ సాయంతో) స్వాధీనం చేసుకుని, వారిని వారి పొలంలోనే వెట్టి బానిసలుగా మారుస్తారు. అక్కడున్న అందరిదీ ఇదే పరిస్థితి.

ఆ సమయంలో అక్కడ బంగారం కోసం వెతుకుతూ వచ్చిన క్లిమెన్ దొరకు బంగారం వెతకడంలో సాయం చేస్తే తమకు బానిసత్వం నుండి విముక్తి కలుగుతుందని వెళ్తాడు తంగలాన్.

బంగారంతో తమ బానిసత్వం పోతుందన్న ఆశతో వెళ్లిన ఆ గ్రామ ప్రజలు విముక్తులయ్యారా? ఈ పయనంలో వారికి ఏ అనుభవాలు ఎదురయ్యాయి? అన్నదే కథ.

తంగలాన్ సినిమాలో నటులు

ఫొటో సోర్స్, [email protected]

ఫొటో క్యాప్షన్, బానిసత్వం పోగొట్టుకోవడానికి తంగలాన్ బంగారం వేటకు బయల్దేరతాడు

విక్రమ్ నటన ఎలా ఉంది?

తంగలాన్ (చియాన్ విక్రమ్):

వైవిధ్య పాత్రల్లో మెప్పించే చియాన్ విక్రమ్ 'తంగలాన్' కోసం కొత్త మేకోవర్‌లో చక్కగా ఇమిడిపోయారు.

పాత్ర పరిధిలో యాక్షన్ సీక్వెన్స్‌లలో బరిసెలతో, ఈటెలతో, నాటి ఆయుధాలతో ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు.

పార్వతి తిరువోతు:

విక్రమ్‌కి జంటగా, భర్త గురించి, పిల్లల గురించి తాపత్రయపడే పాత్రలో పార్వతి బాగా నటించారు.

విక్రమ్‌కి సమానంగా ఉన్న పాత్ర ఇది.డైలాగ్స్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎనర్జీతో పార్వతి తన పాత్రకు న్యాయం చేశారు.

మాళవిక మోహనన్:

స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నా యాక్షన్ సీక్వెన్స్‌లోనే ఎక్కువ నటించడం వల్ల మాళవిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.

యాక్షన్ సీక్వెన్స్‌లో విక్రమ్‌తో పోటీ పడి నటించారామె.

తంగలాన్ సినిమా

ఫొటో సోర్స్, [email protected]

ఐడెంటిటీ - ఐడియాలజీ

పా. రంజిత్ సినిమాల్లో నిమ్న కులాల జనం ఎదుర్కొనే సమస్యలు, ఆ నేపథ్యంలో వచ్చే సామాజిక అసమానతలు ఒక మార్క్‌గా ఏదో ఒక రూపంలో ఉంటాయి.

లోతుగా చూస్తే... ఈ సినిమా కూడా స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం, భూమి కోసం జరిగే పోరాట నేపథ్యమే. కాకపోతే దానికి ఫ్యాన్సీ ఎలిమెంట్ అయిన గోల్డ్ హంటింగ్ తోడైంది.

అలాగే పా. రంజిత్ సినిమాల్లో ఎక్కడో ఓచోట కనిపించే బుద్ధుడిని ఈ సినిమాలో కూడా దర్శకుడు చూపిస్తాడు.

ఇప్పటి వరకు గోల్డ్ హంట్ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో ఎక్కువ శాతం మైనింగ్ ద్వారా నాగరికంగా ఆ ప్రక్రియను చూపించినవే.

కానీ తంగలాన్‌లో ఈ బంగారాన్ని నీళ్లలో పారే బంగారంగా, భూమిలో దొరికేదిగా రెండు రకాలుగా చూపించారు.

నీళ్లలో దొరికే కొద్దిపాటి బంగారం అవసరాలను తీరుస్తుంది, అది మనిషి అవసరాలను సూచిస్తుంది. ఇక భూమి లోపల ఉండే బంగారం... మనిషి అత్యాశకు చిహ్నంగా పరోక్షంగా ఉంది.

మనుషుల్లో అత్యాశ వల్లే ఒక వర్గం వారు అధికారులుగా మారితే, ఇంకో వర్గం వారు బానిసలుగా మారుతారు.

బానిసత్వం నుండి బయటపడి, మామూలు మనుషులుగా సమానత్వం అనుభవించడానికి వేప్పూర్ జిల్లా ప్రజలు గోల్డ్ హంటింగ్‌లో భాగమయ్యారు తప్ప వ్యక్తిగత సంపదలు కూడబెట్టుకోవడానికి కాదు. ఈ అంశాన్ని చెప్పడంలో పా. రంజిత్ సక్సెస్ అయ్యారు.

అత్యాశతో బంగారం కోసం పరుగులు పెడుతున్న మనుషుల పతనానికి సాక్ష్యంగా బుద్ధుడిని సింబాలిక్‌గా చూపించడం కూడా పా. రంజిత్ స్టైల్‌ని చూపిస్తుంది.

పాటలు ఎలా ఉన్నాయి?

జీవీ ప్రకాశ్ ‘తంగలాన్’‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు. సినిమాలోని ట్రైబల్ వాతావరణానికి తగ్గట్టు ‘తంగలాన్’ పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు ప్రకాశ్.

‘తంగలాన్’లో పాటలు ట్రైబల్స్ జీవితాన్ని, వారి అనుబంధాలను, వారు మనుగడ కోసం చేసే పోరాటాల నేపథ్యంతో ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు పాటలు ప్లస్ పాయింట్.

లిరిక్స్, కంపోజిషన్‌లో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్ కాంబినేషన్, ట్రైబల్స్ జీవితానికి దగ్గర ఉండే నేపథ్యం, చక్కటి కొరియోగ్రఫీతో పాటలు ఈ సినిమాకు బలంగా మారాయి.

తంగలాన్ సినిమాలో విక్రమ్

ఫొటో సోర్స్, [email protected]

ఫొటో క్యాప్షన్, విక్రమ్ తన పాత్రలో ఒదిగిపోయారు.

ప్లస్ పాయింట్స్

1) గోల్డ్ హంట్‌ని, సామాజిక అసమానతలను కొత్తగా కనెక్ట్ చేయడం

2) ఆర్టిస్టుల మేకోవర్

3) పాటలు, సినిమాటోగ్రఫీ

4) ఫైట్ సీన్స్

5) టైం ఎలిమెంట్స్‌ను చక్కగా కనెక్ట్ చేయడం

తంగలాన్ సినిమాలో విక్రమ్

ఫొటో సోర్స్, [email protected]

ఫొటో క్యాప్షన్, ఒకరిది ఆశ.. మరొకరిది ఆత్మగౌరవ సమస్య

మైనస్ పాయింట్స్

1) కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్‌గా లేకపోవడం

2) కథలో సామాజిక అసమానతల నేపథ్యం ఉన్నా, దాన్ని బలంగా నిలబెట్టే సన్నివేశాలు సాధారణంగా ఉండటం

3) విక్రమ్-పార్వతి మధ్య మొరటు సరసం కూడా కొంత ఎబ్బెట్టుగా ఉండటం

మనుషుల మంచి, చెడులతో ప్రమేయం లేకుండా ఆశ అనే జాడ్యం ఒకరి నుండి ఒకరికి ఎలా వ్యాపిస్తుందో చూపించే ఫిలాసఫీ నోట్ ఉన్న సినిమా ఇది.

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

వీడియో క్యాప్షన్, తంగలాన్ మూవీ రివ్యూ: విక్రమ్ ఖాతాలో హిట్ పడిందా? పా. రంజిత్ మెప్పించాడా?

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)