దువ్వాడ కుటుంబ వివాదంలో రాజకీయ వివాదం ఏంటి ?

వాణి, శ్రీనివాస్, మాధురి

ఫొటో సోర్స్, Duvvada Vani/X Srinivas/UGC/Madhuri/FB

ఫొటో క్యాప్షన్, వాణి, శ్రీనివాస్, మాధురి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి ఈ మూడు పేర్లు గత వారం రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇది రెండు కుటుంబాలు, ముగ్గురు వ్యక్తుల మధ్య వ్యవహారంలా కనిపిస్తుండగా...ఇప్పుడు ఈ వివాదంలోకి రాష్ట్ర అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేరాయి.

రాష్ట్రంలోని ఒక మూలనున్న శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్కలిలో మొదలైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే రాజకీయ వ్యవహారంగా మారింది.

భార్యాభర్తల వివాదంపై రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయి? రాజకీయ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలపై ఆయా పార్టీలు ఎలాంటి వైఖరి తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు? అసలు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Duvvada Srinivas/FB

ఫొటో క్యాప్షన్, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు

అసలేం జరిగింది?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం నివాసముంటున్న టెక్కలిలోని ఇంటి ముందు ఆయన కుమార్తెలు (హైందవి, నవీన), భార్య వాణి ఆగష్టు 8న నిరసనకు దిగారు. ఇప్పటికీ ఆ నిరసన కొనసాగుతోంది.

‘‘కొత్తగా నిర్మించిన ఆ ఇంటిలో దువ్వాడ శ్రీనివాస్... దివ్వెల మాధురి అనే మరో మహిళతో ఉంటున్నారని, ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్న తమ తండ్రి తమతో ఇంటికి రావాలని ’’ ఆయన కుమార్తెలు కోరుతున్నారు.

అయితే ఆమె కుమార్తెలకు, భార్యకు ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి ప్రవేశం దొరకలేదు.

“దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయి. గత ఎన్నికలకు నెల రోజులు ముందు వరకు ఇదంతా ప్రచారమనే అంతా భావించినా, ఆ తర్వాత వైకాపా పెద్దలు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో పంచాయితీ నిర్వహించినప్పుడు విషయం సీరియస్‌నెస్ తెలిసింది” అని సీనియర్ జర్నలిస్ట్ రమణ బీబీసీతో అన్నారు.

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్ పై, ఆయన భార్య వాణి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది.

నాలుగు రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిలోకి ప్రవేశించేందుకు కుమార్తెలు, భార్య ప్రయత్నించినప్పుడు ఆయన వారిపై పైపులతో దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో కనిపించాయి.

‘వాణీ ద్వారానే పార్టీలోకి వచ్చా’

‘‘నేను వైసీపీలో ఉన్నాను, నేను రాజకీయాల్లో కొనసాగుతున్నాను. నన్ను వైకాపాలోకి 2022లో ఆహ్వానించింది దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణీనే’’ అని దివ్వెల మాధురి చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగానే దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి పని చేశానని ఆమె చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆమె తనపై తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదని మాధురి అంటున్నారు.

దువ్వాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని, తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన తరుణంలో తనను ఆ పరిస్థితి నుంచి తప్పించి...తనకు అండగా ఉంటున్నారని చెప్పారామె.

“మూడంతస్థుల భవనంలో కింద ప్లోర్ లో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారు, రెండో ఫ్లోర్ లో నేను ఉంటున్నాను. అది నా డబ్బులతో నేను కొనుక్కున్న ఇల్లు. పార్టీ ఆఫీసుకు ఉపయోగించుకోవచ్చునని కొన్నాను. అంతే కానీ ఇద్దరం ఒకే ఇంటిలో ఉండటం అనేది వాస్తవం కాదు.” అని దివ్వెల మాధురి బీబీసీతో చెప్పారు.

“నా భార్యపై ఎవరెన్ని చెప్పినా నేను నమ్మను. ఆమెకు ఈ కష్టసమయంలో తోడుగా ఉంటా” అని అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్వెల మహేష్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు.

ఈ కుటుంబ పంచాయతీ రాజకీయ రంగు పులుముకుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, దువ్వాడ శ్రీనివాస్

ఫొటో సోర్స్, YCP/X

ఫొటో క్యాప్షన్, దువ్వాడ వ్యవహారంపై సోషల్ మీడియాలో టీడీపీ- వైసీపీ పరస్పర ఆరోపణలు

ఆగష్టు 12న దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ ఎపిసోడ్‌పై టీడీపీ ట్వీట్ చేయగా, వైసీపీ దానికి కౌంటర్ ట్వీట్ పెట్టింది. ఆ తరువాత వరుసగా రెండు పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఈ ఎపిసోడ్ పై ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా, పార్టీపరంగా ట్వీట్లు పెట్టడం ప్రారంభించారు. దీంతో ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది.

రాజకీయాల్లో ఉన్న ఒక కుటుంబానికి చెందిన వ్యవహారాన్ని రచ్చచేయడం, దానికి రాజకీయాలు ముడి పెట్టడం సరైనది కాదని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న ఈ వ్యవహారాలకు పార్టీలే ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుతున్నారు.

“వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తే...ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలు సెంట్రిక్ గా ఉన్న అంశాలపై వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏ రాజకీయ పార్టీలోనైనా మహిళల విషయాలపై స్పందించేందుకు ఒక మెకానిజం ఉండాలి. మహిళలను ఇబ్బంది పెట్టే అంశాలపై చర్యలు తీసుకునేందుకు పార్టీలలో ఒక కమిటీ ఉండాలి. మన రాష్ట్రంలోని పార్టీలకు అలాంటిదేమీ ఉన్నట్లు కనిపించడం లేదు.” అని పొలిటికల్ ఎనలిస్ట్ ఊహ మహంతి బీబీసీతో అన్నారు.

దువ్వాడ వాణి

ఫొటో సోర్స్, screengrab

ఫొటో క్యాప్షన్, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదురుగా దీక్షకు దిగిన వాణి

కేసు నమోదు

టెక్కలిలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య వాణి చేపట్టిన నిరసన దీక్ష నేటికి (ఆగస్టు 15) కొనసాగుతోంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ వాణి, పెద్దకుమార్తె హైందవి శ్రీనివాస్ ఇంటి ఎదురుగా ఉన్న కారు షెడ్డులోనే దీక్ష కొనసాగిస్తున్నారు. దివ్వెల మాధురితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని వాణి ఆరోపిస్తున్నారు.

సమస్య పరిష్కారానికి రెండు కుటుంబాల మధ్య న్యాయవాదుల సమక్షంలో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా...దువ్వాడ శ్రీనివాస్ తనకు తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తన రక్షణ కోసం తుపాకి లైసెన్స్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.

దువ్వాడ వాణి కూడా తనకు, తన బిడ్డలకు ప్రాణహాని ఉందంటూ ఆమె కూడా పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరువురి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూలో వైకాపా నాయకులెవ్వరు వ్యతిరేకిస్తూ కానీ, సపోర్ట్ చేస్తూ కానీ మాట్లాడలేదు. కానీ అధిష్టానం దీనిపై సీరియస్‌గానే ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని దువ్వాడ శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు. అలాగే పార్టీ నుంచి తనకు ఎటువంటి సూచనలు, ఆదేశాలు రాలేదని...ఇదంతా తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారమని తెలిపారు.

మాధురి ప్రయాణించిన కారు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద మాధురి ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొంది.

మాధురి ఆత్మహత్యాయత్నం

దివ్వెల మాధురిపై సోషల్ మీడియాలో వారం రోజులుగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.

దువ్వాడ వాణి కూడా మాధురి క్యారెక్టర్‌ను తప్పుబడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం టెక్కలి నుంచి పలాసకు వెళ్తూ...లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో హైవేపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి మాధురి తన కారుతో ఢీ కొట్టారు.

ఆ ప్రమాదంలో మాధురి గాయపడ్డారు.

వాణీ తన భర్తతో ఉన్న విబేధాలను తొలగించుకోవాలని, కానీ అందులో తనను బలి పశువును చేయడం మంచిది కాదని మాధురి అన్నారు.

తనపై వస్తున్న ఆరోపణలతో తీవ్ర మనస్థాపం చెందానని, తనకి డ్యాన్స్‌పై ఉన్న ఇష్టంతో చేసిన రీల్స్‌కు ఇప్పుడు వేరే విధంగా క్యాప్షన్లు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారని...వీటన్నింటినీ తట్టుకోలేక చనిపోవాలనుకున్నానని మాధురి చెప్పారు.

‘పార్టీలు పట్టించుకోవాలి’

తమ నాయకులు, ప్రజా ప్రతినిధులపై వచ్చే విమర్శలను పార్టీ అధిష్టానాలు పట్టించుకోవాలి. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పొలిటికల్ ఎనలిస్ట్ ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

“వైకాపా అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పని చేసిన అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వచ్చిన వివాదాలను పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కూడా. ఇది కుటుంబ వ్యవహారమే అయినప్పటీకి గతంలో ఆయన కూటమి నేతలపై చేసిన వ్యాఖ్యలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లుగా టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలు పెట్టింది.” అని యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

మొత్తంగా ఒక కుటుంబ పంచాయితీ, వారి వ్యక్తిగత విషయాలలో రాజకీయాలు చేరి, తెలుగునాట సోషల్ మీడియా, మీడియాలో ప్రధానాంశంగా మారాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)