బంగ్లాదేశ్: సుప్రీంకోర్టు ముట్టడికి విద్యార్థుల ప్రయత్నం, రాజీనామా చేసిన ప్రధాన న్యాయమూర్తి...

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖ తమ మంత్రిత్వ శాఖకు అందిందని న్యాయమంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ వెల్లడించారు.
ఈ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 1 గంటకల్లా చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్‌తోపాటు అప్పిలేట్ డివిజన్ న్యాయమూర్తులంతా రాజీనామా చేయాలంటూ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు అల్టిమేటం ఇచ్చారు.
న్యాయశాఖ సలహాదారుతో మాట్లాడిన తర్వాత తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఒబైదుల్ హసన్ విలేఖరులతో చెప్పారు.
ఆ తర్వాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అష్ఫాకుల్ ఇస్లాం నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టడానికి ముందు ఆయన అప్పిలేట్ డివిజన్ న్యాయమూర్తిగా పని చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు ఏం జరిగింది?
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ విద్యార్థుల నిరసననలు కొనసాాగాయి.
శనివారంనాడు బంగ్లాదేశ్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులు సుప్రీంకోర్టును చుట్టుముట్టారు.
బీబీసీ బంగ్లా సర్వీస్ కరస్పాండెంట్ అక్బర్ హుస్సేన్ అందించిన సమాచారం ప్రకారం, వేలమంది విద్యార్థులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామాను డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టును చుట్టుముట్టారు.
ఈ నిరసనలో వందలమంది న్యాయవాదులు కూడా పాల్గొన్నారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాకు అనుకూలంగా న్యాయవ్యవస్థ తిరుగుబాటుకు ప్రధాన న్యాయమూర్తి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే శనివారంనాడు ఫుల్ కోర్ట్ సెషన్ ఏర్పాటు చేశారని విద్యార్థులు ఆరోపించారు.
ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ ఒక ఫాసిస్ట్ అని ఆరోపించిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమ కన్వీనర్ ఆసిఫ్ మెహమూద్, ఫుల్ కోర్ట్ సెషన్‌ను తక్షణం రద్దు చేసి న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫుల్ కోర్టు సెషన్ అంటే ఏమిటి?
బంగ్లాదేశ్‌కు పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి శనివారం ఉదయం ఫుల్ కోర్టు సెషన్ నిర్వహించేందుకు సంకల్పించారు. అయితే, విద్యార్థి ఉద్యమకారుల తీవ్ర నిరసనల నేపథ్యంలో ఈ సెషన్ రద్దయింది.
బంగ్లాదేశ్ రాజ్యాంగానికి సుప్రీంకోర్టును సంరక్షకురాలని, వ్యాఖ్యాత అని చెబుతారు. ఆ దేశ న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నతమైంది.
ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యవస్థకు అధిపతిగా వ్యవహరిస్తారు.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం రెండు విభాగాల్లో న్యాయ విచారణను నిర్వహిస్తుంది.
అప్పిలేట్ డివిజన్, హైకోర్టు డివిజన్ అన్నవి ఈ రెండు విభాగాలు.
ఈ రెండు విభాగాల న్యాయమూర్తులందరూ పాల్గొనే సమావేశాన్ని 'ఫుల్ కోర్ట్ సెషన్’ అంటారు.
న్యాయవ్యవస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రధాన న్యాయమూర్తికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది.
బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టులోని రెండు విభాగాల్లో ఇప్పటివరకు 90 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
వీరిలో అప్పిలేట్ విభాగంలో ఏడుగురు, హైకోర్టు డివిజన్‌లో 83 మంది విచారణను నిర్వహిస్తున్నారు.
'ఫుల్ కోర్టు' సెషన్‌లో న్యాయవ్యవస్థలోని పలు అంశాలపై, కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించేందుకు ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్ట్ సెషన్ నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, President office
ఒబైదుల్ హసన్ ఎవరు ?
ఒబైదుల్ హసన్ బంగ్లాదేశ్ 24వ ప్రధాన న్యాయమూర్తి. 2023 సెప్టెంబర్ 12న రాష్ట్రపతి సహబుద్దీన్ ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. సెప్టెంబర్ 26న ప్రమాణ స్వీకారం చేశారు. .
లా చదివి బంగ్లాదేశ్ బార్ కౌన్సిల్ లైసెన్స్ పొందిన తర్వాత ఒబైదుల్ హసన్ 1986లో జిల్లా బార్ కమిటీలో చేరారు.
తర్వాత 1988లో బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు హైకోర్టు విభాగంలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 17 సంవత్సరాల తర్వాత 2005లో, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు అప్పీలేట్ విభాగంలో న్యాయవాదిగా లిస్ట్ అయ్యారు.
అతను 1996 నుండి 2001 వరకు వరుసగా ఐదు సంవత్సరాలు అసిస్టెంట్ అటార్నీ జనరల్, డిప్యూటీ అటార్నీ జనరల్‌గా పనిచేశారు.
2009లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులోని హైకోర్టు విభాగంలో అదనపు న్యాయమూర్తిగా చేరారు.
బంగ్లా విమోచన ఉద్యమ సమయంలో అమానవీయ ఘటనలకు కారకులైన వారిని విచారించేందుకు 2012లో ఏర్పాటైన ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్-IIలో నియమితులయ్యారు. ఆ సంవత్సరం చివరిలో దానికి చైర్మన్ అయ్యారు.
సెప్టెంబర్ 15, 2015 వరకు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్-IIకి ఇంచార్జ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆయన 11 తీర్పులను ప్రకటించారు.
సెప్టెంబరు 2020లో సుప్రీంకోర్టు అప్పీలేట్ విభాగానికి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ఏర్పాటు కోసం విచారణ కమిటీ, 2022 అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ఢాకా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన ఆయన, ఆర్ధిక శాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను కూడా పొందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)














