కాలిఫోర్నియా కార్చిచ్చు: మండుతున్న కారు దాదాపు 4 లక్షల ఎకరాలు తగలబడటానికి కారణమైందా?

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బ్రాండన్ లివ్సే, గ్రేమ్ బేకర్, శామ్ కబ్రల్, క్రిస్టల్ హయెస్
    • హోదా, బీబీసీ న్యూస్

గంటకు 5 వేల ఎకరాలు భస్మం. కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు తీవ్రత ఇది. అతివేగంగా వ్యాపిస్తున్న ఈ కార్చిచ్చు స్థానిక కాలమానం ఉదయం 6 గంటల సమయానికి 3.97 లక్షల ఎకరాాలను బుగ్గిచేసిందని కాలిఫోర్నియా అగ్నిమాపక సంస్థ కాల్ ఫైర్ ప్రకటించింది.

గంటకు వేలాది ఎకరాలను దహించి వేస్తున్న ఈ దావానలం కారణంగా వందల ఇళ్లు బూడిదకాగా, 8 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

ఒక వ్యక్తి చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ కార్చిచ్చు మొదలైందంటూ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, అధికారులు ఆ వ్యక్తిని బలిపశువును చేస్తున్నారంటూ ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు.

కాలిఫోర్నియా చరిత్రలోనే నాలుగో అతిపెద్ద కార్చిచ్చుల్లో ఒకటిగా భావిస్తున్న ఈ అగ్నికీలలు ఎలా మొదలయ్యాయి, ఎంతవేగంగా విస్తరిస్తున్నాయి?

బీబీసీ న్యూస్ తెలుగు
అమెరికా

ఫొటో సోర్స్, Reuters

గంటగంటకూ విస్తరిస్తూ..

ఈ భయంకరమైన కార్చిచ్చు కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలో గంటకు 20 చదరపు కిలోమీటర్ల మేర కాలిబూడిదయ్యాయి. 4,000 అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

గాలులు వేగంగా వీస్తుండటం, ఈ ప్రాంతం ప్రయాణానికి అనువుగా లేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత బుధవారం ప్రారంభమైన ఈ కార్చిచ్చును నియంత్రించడం కష్టంగా మారింది.

మంటలు చెలరేగిన ప్రధాన ప్రాంతానికి చేరుకునే క్రమంలో చాలాచోట్ల పెద్దపెద్ద మంటలను ఆర్పాల్సి వస్తుండడంతో కార్చిచ్చును అదుపులోకి తీసుకురావడం సవాల్‌గా మారిందని ఫైర్ కెప్టెన్ రాబర్ట్ ఫాక్స్‌వర్తీ చెప్పారు.

గంటకు 5 వేల ఎకరాలు తగలబడుతున్న పరిస్థితులు ఉన్నాయని కాల్ ఫైర్ ఇన్సిడెంట్ కమాండర్ బిల్లీ సీ చెప్పారు.

కార్చిచ్చు ప్రభావంతో బుట్టె, తెహామా కౌంటీల్లో కాలిఫోర్నియా గవర్నర్ ఇప్పటికే అత్యవసర పరిస్థితి విధించారు.

అమెరికా

ఫొటో సోర్స్, Reuters

కార్చిచ్చు ఎలా ప్రారంభమైంది.?

బుట్టే కౌంటీలోని అలిగేటర్ హోల్ దగ్గర, మంటల్లో చిక్కుకున్న కారును రోన్నీ స్టౌట్ అనే 42 ఏళ్ల వ్యక్తి లోయలోకి నెట్టడంతో కార్చిచ్చు మొదలైందని అనుమానిస్తున్నారు.

మంటలు చెలరేగిన మరుసటి రోజు ఆయన్ను అరెస్టు చేసి బుట్టే కౌంటీ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన్ను జైలుకు తరలించారు.

ఈ వ్యవహారంపై స్టౌట్ కోర్టులో ఏమీ మాట్లాడలేదు. కానీ, ఆయన కుటుంబంలోని ఓ మహిళ శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్‌తో మాట్లాడుతూ స్టౌట్‌ను బలిపశువును చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ ప్రమాదానికి కారణమైనట్లు విచారణ జరుపుతున్న అధికారులు ఆరోపణలు చేశారని, అది సరికాదని ఆమె అన్నారు.

అమెరికా

ఫొటో సోర్స్, EPA

కార్చిచ్చులో ఫైర్ డెవిల్స్

కార్చిచ్చు తీవ్రస్థాయిలో ఉండడంతో అందులో ఫైర్ డెవిల్స్ కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు గాలులు తోడవడంతో అవి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున బూడిద ధూళి కూడా జత కావడంతో ఇవి ఫైర్ టోర్నడోలా కనిపిస్తాయి. వీటినే స్థానికులు ఫైర్ డెవిల్స్ అని పిలుస్తారు. కాలిఫోర్నియా కార్చిచ్చులో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కాలిఫోర్నియా చరిత్రలోనే నాలుగో అతిపెద్ద కార్చిచ్చుగా అధికారులు భావిస్తున్నారని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. కాలిఫోర్నియా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు హెచ్చరించారు. మంటలను ఆర్పేందుకు 41 హెలికాప్టర్లు శ్రమిస్తున్నాయి. భారీగా ఎయిర్ ట్యాంకర్లు ఆకాశం నుంచి నీళ్లు కుమ్మరిస్తున్నాయి.

బుటే కౌంటీలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2018లో ఈ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా 80 మంది చనిపోయారు. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమై బుటే ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఒరెగాంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న విమానం ప్రమాదానికి గురవడంతో పైలట్ మృతి చెందారు.

అమెరికా

ఫొటో సోర్స్, Butte County Sheriff via Facebook

ఫొటో క్యాప్షన్, ట్రెవర్ స్కాగ్స్‌ హెలికాప్టర్‌లో సమీప ప్రదేశానికి వెళ్లి, అక్కడి నుంచి కుక్కలను రక్షించేందుకు పరిగెత్తారు

కుక్క పిల్లల కోసం రెండున్నర కిలోమీటర్ల ప్రయాణం

మంటలు చెలరేగిన ప్రాంతాల నుంచి ఆవులు, గుర్రాలు సహా అనేక చిన్నా పెద్ద జంతువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కార్చిచ్చు చెలరేగిన రోజు ఆ ప్రాంతం నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి తన రెండు కుక్కలను, వాటి పిల్లలను తీసుకుని ట్రక్కులో వెళ్తుండగా...అది ప్రమాదానికి గురైంది. అగ్నిమాపక సహాయక సిబ్బంది ఆ కుక్కలను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు.

బుట్టే కౌంటీలోని షెరీఫ్ ఆఫీసుకు చెందిన రెస్క్యూ టీమ్..ఈ ఆపరేషన్ నిర్వహించింది. కుక్కలను వెతుకుతూ రెస్క్యూ టీమ్ ఈ అగ్నికీలల ప్రాంతంలో దాదాపు రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు గత శనివారం నాడు వాటిని గుర్తించగలిగారు. అవి అప్పటికి ఆకలి, దప్పికతో అలమటిస్తున్నాయి. వాటిని హెలికాప్టర్‌లో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

అమెరికా

కార్చిచ్చులు సర్వసాధారణం

ప్రస్తుతం అమెరికాలో 102 చోట్ల కార్చిచ్చులు చెలరేగాయి. నేషనల్ ఇంట్రాజెన్సీ ఫైర్ సెంటర్ ఈ కార్చిచ్చులను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా, కెనడాల్లో కార్చిచ్చులు చెలరేగుతుంటాయి. కాలిఫోర్నియా ప్రాంతంలో ఇవి సర్వసాధారణం.

జూన్/జూలై నుంచి అక్టోబర్ లేదా నవంబర్ వరకు అడవులు, చెట్లు చాలా పొడిగా ఉంటాయి. దీంతో మంటలు అతివేగంగా వ్యాపిస్తుంటాయి.

తెలిసీతెలియక కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల, మరికొందరు ఉద్దేశపూర్వకంగా చేయడం వల్ల, కొన్నిసార్లు సహజంగా కూడా చెలరేగిన మంటలు కార్చిచ్చులకు కారణమవుతాయి.

ఈ ఏడాది కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని, కార్చిచ్చులు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నప్పటికీ.. వాతావరణ మార్పులు వల్ల కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయని, ఎక్కువ రోజులు కొనసాగుతున్నాయని పరిశోధనల్లో తేలింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)