సముద్రంలో మునిగిపోతున్న నౌక నుంచి దూకేశారు.. బతికి ఒడ్డుకు చేరింది నలుగురే, ప్రాణాలు ఎలా కాపాడుకున్నారంటే

ఫొటో సోర్స్, Taiwanese Coast Guard
- రచయిత, జాయ్ చియాంగ్, కెల్లీ ఎన్జీ
- హోదా, తైపీ, సింగపూర్ నుంచి బీబీసీ ప్రతినిధులు
సముద్రంలో ఆ నౌక మునిగిపోతోంది.. అందులో ఉన్న 9 మంది సిబ్బంది ప్రాణాలు కాపాడుకోవాలంటే సముద్రంలోకి దూకేయడం తప్ప వేరే మార్గం లేదని అర్థం చేసుకున్నారు. అందుకే... రెండు బృందాలుగా ఏర్పడి ఒకరినొకరు పట్టుకుని నౌక నుంచి దూకేశారు.
వీరంతా టాంజానియా జెండా ఉన్న జనరల్ కార్గో షిప్ ఫు షున్‌లో ప్రయాణిస్తున్నారు.
గేమీ టైఫూన్ తైవాన్ తీరాన్ని తాకే సమయంలో సృష్టించిన విధ్వంసానికి ఈ నౌక గతవారం సముద్రంలో మునిగిపోయింది.
నౌకలోంచి దూకేసిన తొమ్మిది మందిలో నలుగురు మియన్మార్ దేశస్థులు ఉన్న ఒక గ్రూప్ ప్రాణాలతో బయటపడిందని తైవాన్ కోస్ట్ గార్డ్ గురువారం ప్రకటించింది.
ఆ తర్వాత శుక్రవారం రాత్రి నౌక కెప్టెన్ మృతదేహం తైవాన్ కోస్ట్‌గార్డ్‌కు దొరికింది.
మరో నలుగురు ఇంకా కనిపించలేదు.

ప్రాణాలతో తైవాన్ కోస్ట్‌గార్డ్‌కు దొరికిన నలుగురు చెప్పిన ప్రకారం... తొమ్మిది మందిలో నలుగురు ఒక బృందంగా, నౌక కెప్టెన్‌తో కలిపి అయిదుగురు ఇంకో బృందంగా విడిపోయి సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
వారందరూ కూడా లైఫ్ జాకెట్లు వేసుకున్నారు.
అయితే అయిదుగురు ఉన్న బృందంలో ముగ్గురు వేసుకున్న లైఫ్ జాకెట్లు అలల ధాటికి కొట్టుకుపోయాయని చెప్పారు.
శుక్రవారం 6.55 గంటల సమయంలో నౌక కెప్టెన్ మృతదేహాన్ని తాము గుర్తించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు.
నౌక కెప్టెన్ గ్రూప్‌లోని మరో నలుగురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
నలుగురు ఉన్న బృందంలో ఇద్దరు తైవాన్‌లోని కౌషియాంగ్ బీచ్‌కు కొట్టుకువచ్చారు. మరో ఇద్దరిని తైవాన్ కోస్ట్ గార్డు రక్షించింది.
సముద్రంలోకి దూకిన తరువాత తన పాస్‌పోర్టు ఉన్న బ్యాగ్ కోసం మళ్లీ వెనక్కి ఈదుకుంటూ వెళ్లానని బతికి బయటపడ్డ వారిలో ఒకరు చెప్పారు.
నౌక మునిగిపోయిన వార్త చూసి తాను చనిపోయి ఉంటానని అమ్మ, తన భార్య అనుకున్నట్లు ప్రాణాలతో బయటపడ్డ ఒకరు కోస్ట్‌గార్డుకు తెలిపారు.
ఎగసిపడుతున్న అలల కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలిగిందని అంతకుముందు అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Taiwanese Coast Guard
కోస్ట్ గార్డ్ షేర్ చేసిన ఫోటోలలో... బతికి బయటపడ్డ వారిని టవళ్లతో తుడుస్తూ, వారిని వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నించడం కనిపించింది.
వారి చేతులకు, కాళ్లకు అయిన గాయాలకు కోస్ట్ గార్డు సిబ్బంది మందులు రాస్తున్నారు.
వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో, ఇతర 8 కార్గో షిప్‌లు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. వాటిలోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని తైవాన్ ఓషన్ అఫైర్స్ కౌన్సిల్ తెలిపింది.
నౌకల నుంచి చమురు బయటకు లీకవకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది.
తైవాన్, ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించిన ఈ టైఫూన్ ధాటికి 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ టైఫూన్ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో రెండోసారి తీరాన్ని దాటింది.
దీని ప్రభావానికి గురైన సుమారు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














