షార్క్ కొరికేయడంతో నీళ్లలో కొట్టుకుపోయిన కాలు, తర్వాత ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Phil Gallagher
- రచయిత, హన్నా రిచీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియా బీచ్‌లో సర్ఫింగ్ చేస్తుండగా సొరచేప (షార్క్) కొరికేయడంతో ఒక వ్యక్తి కాలు తెగిపడి నీళ్లలో కొట్టుకుపోయింది. అతని కాలును తిరిగి అతికించలేమని వైద్యులు చెప్పారు.
23 ఏళ్ల కై మెకెంజీ గత మంగళవారం న్యూ సౌత్ వేల్స్‌లోని పోర్ట్ మాక్వేరీ సమీపంలో సర్ఫింగ్ చేస్తుండగా, ఒక భారీ షార్క్ ఆయనపై దాడి చేసి కాలును కొరికేసింది. తాను చూసి అతిపెద్ద షార్క్ అదేనని మెకెంజీ చెప్పారు.
మెకెంజీ ఎలాగోలా ఒడ్డుకు తిరిగి రాగా, అక్కడున్న వాళ్లు తాత్కాలికంగా ఆయన కాలి రక్తస్రావాన్ని ఆపగలిగారు.
కొద్దిసేపటి తర్వాత ఆయన కాలు ఒడ్డుకు కొట్టుకురాగా, స్థానికులు దాన్ని ఐస్‌లో భద్రపరిచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, తెగిపడిన సర్ఫర్ కాలును డాక్టర్లు తిరిగి అతికించలేకపోయారు.

దాడి జరిగిన దాదాపు వారం తర్వాత, మెకెంజీ సోషల్ మీడియాలో తను ఆసుపత్రిలో ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు.
“ఏదో తప్పిపోయింది, దాన్ని గుర్తించారా?" అని ఆ ఫొటోకు వ్యాఖ్యను జోడించారు.
ప్రజలు తన పట్ల చూపిస్తున్న ప్రేమ, అందిస్తున్న మద్దతును మరిచిపోలేనని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన రాశారు. షార్క్ తనపై ఎలా దాడి చేసిందో వివరించారు.
తన వైద్య ఖర్చుల కోసం 1.08 లక్షల డాలర్లు (సుమారు రూ. 9 లక్షలు) విరాళాలు అందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
"నేను మళ్లీ త్వరలోనే నీళ్లలో అడుగు పెడతాను" అని ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Phil Gallagher
కాలును అతికించే శస్త్రచికిత్స చేయడానికి ప్రయత్నించారా? లేదా? అనే అంశంపై మెకెంజీ చికిత్స పొందుతున్న ఆసుపత్రి అధికారులు స్పందించలేదు.
మెకెంజీ ఒక స్పాన్సర్డ్ సర్ఫర్. ఆయనను 3మీ. పొడవున్న ఒక షార్క్ కొరికిందని అధికారులు చెప్పారు. గాయపడిన మెకెంజీని ఒక పోలీసు అధికారి కాపాడారని వెల్లడించారు.
వెంటనే ఒక స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి, తర్వాత 200కి.మీ దూరంలోని న్యూక్యాజిల్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఆయన కాలును కూడా జాగ్రత్తగా భద్రపరిచి అక్కడికి తీసుకెళ్లారు.
మెకెంజీ మెడకు ఇటీవలే బలమైన గాయం తగలడంతో చాలాకాలం పాటు సర్ఫింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆ గాయం నుంచి కోలుకొని ఈ మధ్యే తిరిగి సర్ఫింగ్ మొదలుపెట్టారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














