బంగ్లాదేశ్ ఆందోళనల్లో మహిళలు ఎలాంటి పాత్ర పోషించారో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అక్బర్ హుస్సేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాని షేక్ హసీనా 15 ఏళ్ళ పరిపాలన ముగిసేలా వేలాదిమంది ప్రజలు బంగ్లాదేశ్ వీధుల్లోకి వచ్చినప్పుడు, గతంలో నేనెప్పుడూ చూడనివిధంగా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ప్రదర్శనకు దిగారు. నినాదాలు చేశారు.
మహిళలు, యువతులు ఈ స్థాయిలో నిరసనకు దిగడం అనూహ్యమైందని ఢాకాలోని నార్త్ సౌత్ యూనివర్సిటీలో సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ నిపుణుడు డాక్టర్ బుల్‌బుల్ సిద్దిఖీ చెప్పారు.
పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనకపోతే, షేక్ హసీనాను పదవి నుంచి దింపే ఉద్యమం అంత విజయం సాధించకపోయేదని ఒంటరి తల్లి, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ ఫర్జానా లియో అన్నారు. కొన్ని ఆందోళనలు చేపట్టేందుకు కూడా ఆమె సాయపడ్డారు.
ఆమె వయసు 43 ఏళ్లు. అంతకుముందెన్నడూ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనలేదు. కానీ, యువ నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఫుటేజీ చూసిన తర్వాత తాను చాలా షాక్‌కు గురైనట్లు ఫర్జానా చెప్పారు.


‘తల్లి చెబితే వింటారు’
‘‘వీధుల్లోకి వెళ్లి, వారిని కాపాడటం నా నైతిక బాధ్యత అనిపించింది’’ అని ఆమె అన్నారు. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో ఉన్న తన జిమ్‌లో ఆమె మాతో మాట్లాడారు. నిరసనలకు ఈ ప్రాంతం కూడా ఒక కేంద్ర బిందువుగా ఉంది.
వీధుల్లోకి వచ్చిన ఎంతో మంది యువత వల్ల ఆమె స్ఫూర్తి పొందారు. ఆందోళనల్లో మహిళలు చేరడం మొదలైన తర్వాత, ఇతరుల్లో ధైర్యం పెరిగిందన్నారు.
‘‘తల్లుల నుంచి పిల్లలకు మద్దతు లభించినప్పుడు, వారు ధైర్యంగా మారతారు’’ అని ఫర్జానా తెలిపారు. ‘‘మీరు నిరసన తెలపకపోతే, దేశాన్ని ఎవరు కాపాడతారు? అని తల్లి చెబితే పిల్లలు వింటారు. ఆ ధైర్యం ఇంటి నుంచే రావాలి’’ అని ఫర్జానా చెప్పారు.
ఆందోళనల్లో తాము పాలుపంచుకోవడం వల్ల ఇతరులు కూడా వీధుల్లోకి వచ్చేందుకు ప్రోత్సాహం లభించిందని కొందరు మహిళలు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అమ్మతనమంటే అదే’
సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో కోటా రద్దు చేయాలనే డిమాండ్‌తో జులై నెల మొదట్లో యూనివర్సిటీ విద్యార్థులు ఈ నిరసన మొదలుపెట్టారు. అది తరువాత ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా విస్తృత రూపం దాల్చింది.
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం (ఓహెచ్‌సీహెచ్‌ఆర్) ప్రాథమిక నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం జులై 16 నుంచి ఆగస్టు 11 వరకు సమారు 650 మంది ఈ నిరసనల్లో చనిపోయారు.
చనిపోయిన వారిలో ఆందోళనకారులు, జర్నలిస్టులు, భద్రతా బలగాలకు చెందినవారు ఉన్నారని ఆ నివేదిక తెలిపింది.
షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందిన సాయుధ గ్రూపులు తనని, తన స్నేహితుల్ని వెంబడించి, దాడి జరిపాయని 16 ఏళ్ళ రిదిమా అహ్మద్ తెలిపారు. అయినా వారు వీధుల్లో నిరసన తెలపడం మానలేదు. వీరిని ఆపడానికి బదులుగా రిదిమా తల్లి సైమా కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. ‘‘ప్రతి బిడ్డా, మా బిడ్డే, అమ్మతనమంటే అదే ’’ అని ఆమె చెప్పారు.

‘ఆ దారుణాన్ని చూస్తూ ఇంట్లో ఉండటం ఎలా?’
శాంతియుతంగా లేదా రాళ్లు, కర్రలు వంటి ఆయుధాలతో నిరసనకు దిగిన వారిపై పోలీసులు, పారామిలటరీ బలగాలు తరచూ కాల్పులు జరపడం, బర్డ్‌షాట్ పెల్లెట్లను విచక్షణారహితంగా ఉపయోగించినట్లు కనిపించిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
చట్టవ్యతిరేకంగా హత్యలు చేయడం, ఏకపక్షంగా అరెస్ట్‌లు, అదుపులోకి తీసుకోవడం, జాడ తెలియకుండా చేయడం, హింసించడం తదితర ఆరోపణలపై కూడా నివేదికలు వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.
బీబీసీ ఇంటర్వ్యూ చేసిన చాలా మంది తల్లులు తమ పిల్లలు కూడా పోలీసు కస్టడీలో చాలా బాధపడ్డారని చెప్పారు.
కేవలం స్వీయ రక్షణ కోసం లేదా ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకే పోలీసు అధికారులు కాల్పులు జరిపారని గత ప్రభుత్వం తెలిపింది. ఆందోళనకారులను హింసించినట్టు వస్తున్న ఆరోపణలను ఖండించింది.
ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్ ఏజెన్సీ, యూనిసెఫ్ ప్రకారం, 32 మంది పిల్లలు ఈ నిరసనల్లో చనిపోయారు. వారిలో చాలా మంది టీనేజర్లే ఉన్నారు. బంగ్లాదేశీ వార్తా పత్రిక ఈ సంఖ్యను 66గా పేర్కొంది.
‘‘వారు హింసకు గురవుతున్న, చనిపోతున్న తీరును చూస్తే తల్లిగా నేనెలా ఇంట్లో ఉండగలను’’ అని సైమా అన్నారు.

‘వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది’
సోదరులను, కొడుకులను రక్షించేందుకు చాలా మంది మహిళలు, యువతులు ఉద్యమానికి ముందు వరుసలో నిల్చున్నారని డాక్టర్ బుల్‌బుల్ సిద్దిఖీ అన్నారు.
నిరసన సందర్భంగా విద్యార్థినులపై బహిరంగంగా దాడులు జరగవనే భావనే దీనికి కారణమని తెలిపారు. కానీ, ఆ వ్యూహం పనిచేయలేదు.
చాలా మంది మహిళలపై దాడులు జరిగాయి. జులై మధ్యలో ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
రాజకీయ ఉద్యమాల్లో మహిళలు పాల్గొనే వారసత్వం ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉందని, బ్రిటీష్ పాలనలో ఈ దేశం భారత్‌లో భాగమైనప్పుడు వలసవాద వ్యతిరేక ఉద్యమం, 1952ల్లో బెంగాలీ భాష గుర్తింపు కోసం జరిగిన ప్రదర్శనలలో వీరు పాల్గొనట్లు డాక్టర్ సిద్దిఖీ చెప్పారు.
మనుపటి ఉద్యమాలతో ప్రస్తుత ఉద్యమాన్ని పోల్చలేమని, ఎందుకంటే ఇప్పటి ఉద్యమంలో చాలా మంది మహిళలుభాగమయ్యారని తెలిపారు.
‘‘కుటుంబాల్లో అమ్మాయిలకు మద్దతు పెరిగింది. పెద్ద సంఖ్యలో యువతులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పొందుతున్నారు. ఇవ్వన్నీప్రస్తుత తరం మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాయి’’ అని చెప్పారు.
షేక్ హసీనా ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి సంబరాలు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మా గొంతుకా వినాలి’
షేక్ హసీనా రాజీమానా చేసి, భారత్‌లో ఆశ్రయం పొందాక.. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ఆ దేశ తాత్కాలిక నేతగా ఎంపికయ్యారు.
ఢాకాలో పరిస్థితులు దాదాపు సాధారణ స్థితికి వచ్చాయి. కానీ, కొంతమంది విద్యార్థులు ఇంకా వీధుల్లోనే ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని, మత సామరస్యాన్ని, న్యాయాన్ని కోరుతూ కొందరు కుడ్యచిత్రాలు గీస్తున్నారు.
‘‘మాకు అవినీతి రహిత దేశంకావాలి. మా అభిప్రాయాలను గౌరవించాలి’’ అని 24 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థిని సల్వా సారా చెప్పారు.
బాలెట్ బాక్స్ ద్వారా తన నేతలను ఎంచుకోగలగాలని మరో విద్యార్థిని తాంజినా అఫ్రిన్ తెలిపారు. ‘‘నిర్ణయాల రూపకల్పన విధానంలో మా గొంతుకలను కూడా వినాలి. యువతరం ఆశలను, ఆశయాలను ప్రస్తుత ప్రభుత్వం తప్పక పట్టించుకోవాలి’’ అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














