మంకీపాక్స్: ఈ వ్యాధి మళ్లీ భారత్‌లో వ్యాపించే ప్రమాదం ఉందా, సోకకుండా ఎలా నివారించాలి, వ్యాక్సీన్‌లు ఏంటి?

మంకీ పాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంకీపాక్స్ లక్షణాలను గుర్తించే ప్రయత్నంలో నిపుణులు (ఫైల్ ఫోటో )
    • రచయిత, మురారి రవికృష్ణ
    • హోదా, బీబీసీ కోసం

కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో విస్తరిస్తున్న ప్రాణాంతకమైన ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి తీవ్రతను గమనించి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ).

ఎంపాక్స్ ప్రభావిత దేశాలు సమర్పించిన డేటాను సమీక్షించిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (ఐహెచ్‌ఆర్) నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఆగస్టు 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసిస్ ఈ ప్రకటన చేశారు.

ఎంపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జంతువులు మనుషులను కొరకడం, రక్కడం వంటి పనులు చేస్తే వాటి వల్ల, మానవులకు ఎంపాక్స్ సోకే అవకాశం ఉంది.

ఇప్పటివరకు ఎంతమంది మరణించారు?

ఈ ఏడాదిలో ఇప్పటివరకు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 15,664 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, 548 మంది మరణించారు. ఈ వ్యాధి బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్), కెన్యా, రువాండాతో సహా ఇతర ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది.

డబ్యూహెచ్ఓ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మరుసటి రోజే (ఆగస్టు 15న) ఆఫ్రికా వెలుపల స్వీడన్‌లో తొలిసారిగా మంకీపాక్స్ కేసు నమోదైంది. దీనిని ప్రమాదకరమైన క్లేడ్ Iబి వేరియంట్‌గా గుర్తించారు.

పాకిస్తాన్‌లోనూ ఇప్పటివరకు మూడు కేసులు నమోదు అయ్యాయి. వీరు ముగ్గురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చినట్లు ఉత్తర ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

వాట్సాప్
ఎంపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంపాక్స్ వైరస్ (ఎడమ)

భారత్ సంగతేమిటి?

గతంలో భారతదేశంలో మంకీపాక్స్ కేసులు నమోదైనా, తాజాగా ఇప్పటివరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఇంతకు ముందు మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలినపుడు భారతదేశంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి.

గత ఏడాది జులై 28న పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేస్తూ నాటి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ బాఘేల్, 2023 జులై 24 నాటికి దేశంలో 27 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు చెప్పారు. వాటిలో 12 కేసులు కేరళలో, 15 కేసులో దిల్లీలో బయటపడ్డాయి.

భారతదేశంలో మళ్లీ ఈసారి మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందా?

దీనిపై సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ శివరాజును బీబీసీ సంప్రదించగా ఆయన, "ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరిగి, డబ్యూహెచ్‌ఓ ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో, భారతదేశంలోనూ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఆ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన పెంచడంపై దృష్టి సారించాలి’’ అన్నారు.

‘‘విమానాశ్రయాలలో, ఇన్‌కమింగ్ ప్రయాణీకుల ట్రావెల్ హిస్టరీని రికార్డ్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న దేశాల నుంచి వచ్చిన వాళ్ల వివరాలు తీసుకోవాలి. జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలున్నాయేమోనని విమానాశ్రయ ఆరోగ్య అధికారులు ప్రయాణికులను పరీక్షించి చూడాలి.’’ అని అన్నారు.

అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు తమకు ఎలాంటి ఆదేశాలు లేదా సూచనలు రాలేదని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్ సీఎస్‌ఆర్‌ఎమ్‌వో తెలిపారు.

మంకీపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

మంకీపాక్స్ అంటే ఏమిటి?

మంకీపాక్స్ వైరస్ అనేది ఆర్థోపాక్స్ వైరస్. ఇది ఎంపాక్స్‌కు (మంకీపాక్స్) కారణమవుతుంది. దీనిలోనూ మశూచిలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే దీని తీవ్రత తక్కువ. ప్రపంచవ్యాప్తంగా మశూచిని 1980లో నిర్మూలించినా, మంకీపాక్స్ వ్యాధి మాత్రం మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కనిపిస్తూనే ఉంది.

మంకీపాక్స్‌ను మొదట 1958లో కోతులలో గుర్తించారు. తరువాత 1970లో ఇది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మనుషులలోనూ కనిపించింది.

మే 2022 నుంచి, ఆఫ్రికన్ ప్రాంతం వెలుపలా మంకీపాక్స్ కేసులు నమోదు కావడం మొదలైంది. మంకీపాక్స్ వైరస్‌లో రెండు విభిన్న క్లేడ్‌లను గుర్తించారు. అవి- క్లేడ్ I, క్లేడ్ II.

మశూచితో కొన్ని సారూప్యతలున్నా, మంకీపాక్స్ దానికన్నా తక్కువ అంటువ్యాధి. దాని తీవ్రతా తక్కువే. అయినా, దాని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

ఎంపాక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కొంతమందిలో ఎంపాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తే, మరికొంత మందిలో అది వేరే రకంగా బయటపడొచ్చు.

ఎంపాక్స్ లక్షణాలు

ఎంపాక్స్ సంకేతాలు, లక్షణాలు సాధారణంగా ఆ వ్యాధి ఉన్న వాళ్ల సమీపంలోకి వెళ్లిన ఒక వారంలో కనిపిస్తాయి. అయితే, 1-21 రోజుల లోపు ఎప్పుడైనా అవి కనిపించవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా 2-4 వారాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవాళ్లలో ఇంకా ఎక్కువ కాలం ఉండవచ్చు.

ఎంపాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, మనిషి బలహీనపడడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఎంపాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తే, మరికొంతమందిలో అది వేరే రకంగా బయటపడొచ్చు.

దద్దుర్లు పుండుగా ప్రారంభమై, ద్రవంతో నిండిన పొక్కుగా అభివృద్ధి చెందుతుంది. దద్దుర్లు నయమైనప్పుడు, పుండ్లు ఎండిపోయి, పొక్కులు రాలిపోతాయి.

పుండ్లు నయమై, కొత్త చర్మం ఏర్పడే వరకు వాళ్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.

పిల్లలు, గర్భిణీలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఎంపాక్స్‌కు గురయ్యే అవకాశం ఉంది.

ఎంపాక్స్

ఫొటో సోర్స్, Mike Roemer/Getty Images

ఫొటో క్యాప్షన్, ఘనా నుంచి దిగుమతి చేసుకున్న జంతువుల ద్వారా 2003లో అమెరికాలో మంకీ పాక్స్ వ్యాప్తి చెందింది.

ఎలా వ్యాపిస్తుంది?

ఎంపాక్స్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ప్రత్యక్షంగా తాకడం వల్ల లేదా నోటిలో లేదా జననేంద్రియాలపై ఉన్న చర్మగాయాల వల్ల కానీ రావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వాటిలో ఈ కింద చెప్పిన కారణాల వల్ల కూడా వ్యాధి వ్యాపించవచ్చు.

  • ముఖాముఖి (మాట్లాడటం లేదా శ్వాసించడం)
  • చర్మం నుంచి చర్మం (తాకడం లేదా యోని/ ఆనల్ సెక్స్ )
  • నోటి నుంచి నోటికి (ముద్దు)
  • నోటితో చర్మాన్ని తాకడం (ఓరల్ సెక్స్ లేదా చర్మంపై ముద్దు పెట్టుకోవడం)
  • చర్మం పగిలిన ప్రదేశం, శ్లేష్మ ఉపరితలాలు, లేదా శ్వాసనాళం ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎంపాక్స్ ఇంట్లోని ఇతర సభ్యులకు సోకే అవకాశం ఉంది. ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొనే వాళ్లకు ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంది.
  • జంతువులు మనుషులను కొరకడం, రక్కడం వంటి పనులు చేస్తే వాటి వల్ల, మానవులకు ఎంపాక్స్ సోకే అవకాశం ఉంది.

ఎంపాక్స్‌ను ఎలా నిర్ధరిస్తారు?

ఎంపాక్స్ ఇతర అంటువ్యాధులలాగే కనిపిస్తుంది కాబట్టి దీనిని గుర్తించడం కష్టం. అందువల్ల, ప్రజలు వీలైనంత త్వరగా చికిత్స పొందేందుకు, అది మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పరీక్షలు కీలకం.

పాలీమరేస్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ద్వారా వైరల్ డీఎన్ఏను గుర్తించడం అనేది ఎంపాక్స్‌ను నిర్ధరించడానికి ఒక సమర్థమైన విధానం. దీనిలో రోగనిర్ధరణ కోసం చర్మం, ద్రవం లేదా పొక్కుల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు.

అయితే వ్యాధి నిర్ధరణ కోసం రక్తపరీక్షను సిఫారసు చేయడం లేదు. వివిధ ఆర్థోపాక్స్ వైరస్‌ల మధ్య తేడాను గుర్తించవు కాబట్టి యాంటీబాడీ డిటెక్షన్ పద్ధతులు ఉపయోగపడకపోవచ్చు.

ఎంపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంపాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు.

ఎంపాక్స్‌కు చికిత్స ఏమిటి?

డబ్యూహెచ్‌ఓ ప్రకారం ఎంపాక్స్‌కు మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏ-బీఎన్, ఎల్‌సీ16, ఆర్థోపాక్స్‌వ్యాక్స్ మూడూ ఆమోదించిన వ్యాక్సిన్లు.

ఎంపాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఎంపాక్స్ సోకినవాళ్లతో పరిచయం ఏర్పడిన 4 రోజులలోపు (లేదా లక్షణాలు లేకుంటే 14 రోజులలోపు) వ్యాక్సిన్ ఇవ్వాలి.

ఎంపాక్స్ సంక్రమణను నివారించడానికి, అది సోకే అవకాశం ఉన్న వ్యక్తులకు, అంటే - వ్యాధి సోకే అవకాశం ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, పురుషులతో సెక్స్‌లో పాల్గొనే పురుషులు, బహుళ లైంగిక భాగస్వాములు ఉన్న వ్యక్తులు, సెక్స్ వర్కర్లులాంటి వాళ్లకి టీకాలు వేయాలని డబ్యూహెచ్ఓ సిఫార్సు చేసింది.

మంకీపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎంపాక్స్ నివారణ

ఎంపాక్స్ ఉన్న చాలామంది వ్యక్తులు 2-4 వారాలలో కోలుకుంటారు.

ఎంపాక్స్ లక్షణాలను తగ్గించడానికి, ఇతరులకు సోకకుండా నిరోధించడానికి వీలైతే ఇంట్లో, ప్రత్యేకమైన గదిలో ఉండాలి. సబ్బు నీరు లేదా హ్యాండ్ శానిటైజర్‌తో తరచుగా చేతులు కడుక్కోవాలి.

ముఖ్యంగా పుండ్లు తాకడానికి ముందు లేదా ఆ తర్వాత. దద్దుర్లు నయమయ్యే వరకు మాస్క్ ధరించాలి, చుట్టుపక్కల ఇతర వ్యక్తులు ఉన్నప్పుడు గాయాలను కప్పి ఉంచాలి. నోటిలో పుండ్లు ఉంటే ఉప్పునీటితో పుక్కిలించాలి. నొప్పిగా ఉంటే పారాసిటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను తీసుకోవాలని డబ్యూహెచ్‌ఓ సూచించింది.

అలాగే, బొబ్బలను పగలగొట్టవద్దని, పుళ్లను గీరవద్దని, దీనివల్ల అవి నయం కావడం ఆలస్యం అవుతుందని, దద్దుర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించేలా చేస్తుందని తెలిపింది. పైపొక్కులు రాలిపోయే వరకు పుండ్లు ఉన్న ప్రాంతాలను షేవ్ చేయకపోవడం మంచిదని సూచించింది.

వీడియో క్యాప్షన్, ఈ కొత్త వేరియంట్ కోవిడ్ లాంటిదేమీ కాదని స్పష్టం చేసిన నిపుణులు

ఎంపాక్స్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ఎంపాక్స్ ఉన్న వ్యక్తులను ఇంట్లో లేదా అవసరమైతే ఆసుపత్రిలో, వ్యాధి తగ్గిపోయేంత వరకు ఒంటరిగా ఉంచాలి. ఇతరుల సమక్షంలో మెడికల్ మాస్క్ ధరించి అది వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. సెక్స్ సమయంలో కండోమ్‌లను ఉపయోగించి, అది సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)