టైప్ 2 డయాబెటిస్‌ ‘ప్రభావం తగ్గించే’ సూప్, షేక్‌ డైట్

షేక్స్, సూప్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేక్స్, సూప్స్‌లో సమతుల్యమైన పోషకాలు
    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్

ఆరోగ్యకరమైన ఆహారంతో టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధనల్లో తేలింది.

కఠినమైన ఆహారపు అలవాట్లతో టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని బ్రిటన్ జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్‌హెచ్‌ఎస్) తెలిపింది.

రోజుకు మొత్తంగా 900 క్యాలరీల శక్తినిచ్చే ద్రవ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చని ఎన్‌హెచ్ఎస్ సూచిస్తోంది.

ఈ డైట్ పాటించడం కష్టమైనప్పటికీ ప్రయోజనం ఉంటుందని ఫలితాలు చెబుతున్నాయి.

ఈ డైట్ ప్లాన్ పాటించేవాళ్లు కొన్ని నెలల పాటు ఘన ఆహారానికి ప్రత్యామ్నాయంగా షేక్స్, సూప్స్, బార్స్ తినాలి. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా మునుపటిలా మళ్లీ ఘన ఆహారాన్ని తీసుకోవచ్చు.

ఎన్‌హెచ్ఎస్ సూచించిన ఈ డైట్ ప్లాన్ పాటించడానికి వేల మందిని ఆహ్వానించినప్పటికీ కొన్ని వందల మంది మాత్రమే ఇది పూర్తి చేయగలిగారు.

వారిపై జరిపిన అధ్యయనం వివరాలను ‘ద లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రినాలిజీ జర్నల్‌’లో ప్రచురించారు.

ఈ డైట్ ప్లాన్ పూర్తిస్థాయిలో పాటించినవారిలో మూడింట ఒక వంతు మంది సుమారు 16 కేజీల బరువు తగ్గారు. మధుమేహ సమస్యల నుంచి వారికి ఉపశమనం కూడా లభించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఆహార నియమావళిని కఠినంగా పాటిస్తేనే..

బరువు తగ్గించే ఇంజెక్షన్‌ వెగోవ్య్‌కు, బ్రిటన్‌లో పరిశీలించిన ఈ ఆరోగ్య కార్యక్రమానికి సంబంధం లేదు.

వెగోవ్య్ ఇంజెక్షన్‌ను ఎన్‌హెచ్‌ఎస్‌ వెయిట్ లాస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అందిస్తోంది.

షేక్, సూప్ డైట్ ప్రోగ్రామ్‌కు మొత్తం నిధులు ఎన్‌హెచ్‌ఎస్ సమకూరుస్తుంది.

ఈ డైట్ తీసుకునే వారిపై వ్యక్తిగతంగా ఎలాంటి భారం మోపదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్‌లో సెషన్లు నిర్వహిస్తారు. వారికి అవసరమైన వైద్య సహకారం అందుబాటులో ఉంటుంది.

ప్రజలు ఈ ఆహార నియమావళిని కఠినంగా పాటించగలిగితే టైప్-2 డయాబెటిస్ ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.

డయాబెటిస్‌ను నియంత్రించుకోలేకపోతే.. ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కళ్లు, నరాలు దెబ్బతింటాయి.

‘‘యూకేలో ప్రజల ఆరోగ్యానికి ఊబకాయం అతిపెద్ద ప్రమాదంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలకు ఖర్చుపరంగా అతిపెద్ద సవాళ్లలో ఊబకాయం ఒకటి. మా కార్యక్రమం ద్వారా కలిగే ప్రయోజనాలను గమనిస్తే, ఊబకాయాన్ని నియంత్రించవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది’’ అని ఊబకాయం, మధుమేహం విభాగ ఎన్‌హెచ్‌ఎస్ నేషనల్ క్లినికల్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ క్లేర్ హ్యాంబ్లింగ్ చెప్పారు.

ఈ హెల్త్ ప్రోగ్రామ్‌కు ఎవరిని తీసుకుంటారు

  • 18 నుంచి 65 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి
  • గత ఆరేళ్లలో టైప్ 2 డయాబెటిస్ బారిన పడినవారు అయి ఉండాలి.
  • వైట్స్ అయితే బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్‌ఐ) 27 కేజీ/ఎం2 కంటే ఎక్కువ ఉండాలి. బ్లాక్స్, ఆసియా, ఇతర గ్రూపులకు చెందిన వారయితే 25 కేజీ/ఎం2 కంటే ఎక్కువ ఉండాలి.

ఒకవేళ మీ డాక్టర్ సూచిస్తే చాలా తక్కువ క్యాలరీలున్న ఆహారం మాత్రమే తీసుకోవాలి.

మారీ లైంగ్

ఫొటో సోర్స్, MARIE LAING

జీవన విధానంలో మార్పు

ఎన్‌హెచ్‌ఎస్ సూచిస్తున్నట్లు సూప్‌లు, షేక్‌లు ఆహారంగా తీసుకోవడం వల్ల తాను 19 కేజీలకు పైగా బరువు తగ్గానని సోమర్‌సెట్‌లోని ఫ్రోమ్‌కు చెందిన మారీ లైంగ్ బీబీసీతో చెప్పారు.

‘‘డయాబెటిస్‌ను నియంత్రించేందుకు సొంతంగా కొన్ని విధానాలు ప్రయత్నించాను. అవి ఫలించలేదు. ఆ తర్వాత వైద్యుని సలహా మేరకు నేనిది ప్రయత్నించాను. నిజంగా చాలా ఉపయోగపడింది’’ అని సోమర్‌సెట్ బీబీసీ రేడియోకి లైంగ్ చెప్పారు.

‘‘ఇది డైట్ కాదు. జీవన విధానంలో మార్పు. ఆహారం మన శరీరం మీద చూపించే ప్రభావం తెలుసుకోవడం, ఆహారం మనం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం, ఎలాంటి వ్యాయామం చేయాలి వంటివన్నీ అర్థమవుతాయి’’ అని తెలిపారు.

‘‘జీవన విధానం మార్చుకోవడం వల్ల నా పిల్లలు, కుటుంబంతో కలిసి సమయం గడపగలుగుతున్నాను. నాకిష్టమైన పనులన్నీ చేసుకుంటున్నాను’’ అని లైంగ్ చెప్పారు.

‘‘అది అంత తేలిక కాదు. దీనివల్ల మన జీవితం తిరిగి వెనక్కి వస్తుంది’’ అని ఆమె చెప్పారు.

ఆహారపు అలవాట్లు అంతా పూర్తిగా మార్చుకునే దశలో.. బాగా ఆకలవుతుందేమోనని అనుకున్నాను, కానీ అలా జరగలేదన్నారు.

‘నా దగ్గర ఉన్న వాటినే తిన్నాను. మామూలుగా రెడ్ థాయ్ సూప్, మాంసం, బంగాళాదుంప కలిపి చేసిన ఆహారం నాకు ఇష్టమైనప్పటికీ... డైట్‌లో సూచించిన వాటిని తినడం కూడా నాకు ఇష్టంగానే అనిపించింది’’ అని తెలిపారు.

‘‘మార్చుకున్న జీవన విధానంతో ఎంతకాలం డయాబెటిస్ 2 నుంచి ఉపశమనం లభిస్తుందో, భవిష్యత్తులో డయాబెటిస్ 2 ప్రభావం పడకుండా ఈ జీవన విధానం ఎలా రక్షిస్తుందో తెలియదు. కానీ, బరువు తగ్గడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మాత్రం అర్థమైంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది’’ అని యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో డైట్, ఒబెసిటీ అసోసియేట్ ప్రొఫెసర్‌ డాక్టర్ నెరిస్ ఆస్ట్‌బరీ చెప్పారు.

టైప్ 2 డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి?

రక్తంలో గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉండటమే టైప్ -2 డయాబెటిస్‌.

శరీరం సరిపడా ఇన్సులిన్ అనే హార్మోన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేసుకోలేకపోయినా, ఆ హార్మోన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోయినా, రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువవుతుంది.

శరీరంలోని ఇన్సులిన్ బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది.

కొన్ని కేసుల్లో బరువు బాగా పెరుగుతారు. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమం చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో ఇలా జరుగుతుంది. బరువు తగ్గడం ద్వారా దీన్ని నివారించవచ్చు.

అలాగే ఆటోఇమ్యూన్ టైప్-1 డయాబెటిస్‌కు, అధిక బరువుకు సంబంధం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)