దేశంలో ప్రముఖ నగరాల్లోని ఆసుపత్రుల్లో భద్రత ఎలా ఉంది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఉస్మానియా ఆస్పత్రి
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రాత్రి విధుల్లో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశంలోని ప్రముఖ నగరాల్లో వైద్యులు, వైద్య విద్యార్థుల నిరసనలకు దారితీసింది.

ఆ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు పూర్తయ్యే దాకా కొన్ని రకాల ఆరోగ్య సేవలను నిలిపివేస్తామని కోల్‌కతా, దిల్లీ, ముంబయి తదితర నగరాల్లోని వైద్యులు చెప్పారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఫెడరల్ చట్టాన్ని తీసుకురావాలని వారు కోరుతున్నారు.

"2007 నుంచి 2019 వరకు దేశంలో హెల్త్‌కేర్ వర్కర్లపై హింసాత్మక దాడులకు సంబంధించి 153 కేసులు నమోదయ్యాయి" అని లాన్సెట్ నివేదిక పేర్కొంది.

"భారత్‌లో హెల్త్ కేర్ వర్కర్ల మీద హింసపై 2020లో 225 సంఘటనలు, 2021లో 110 సంఘటనలను మా ఇన్‌సెక్యూరిటీ ఇన్‌సైట్ (II) ద్వారా రిపోర్టు చేశాం" అని లాన్సెట్ తెలిపింది.

వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడే వారిని శిక్షించే 2020 ఫెడరల్ చట్టం, ఎపిడెమిక్ డిసీజెస్ (సవరణ) ఉనికిని ఆ రిపోర్టు హైలైట్ చేసింది.

ఈ నేపథ్యంలో బీబీసీ రిపోర్టర్లు దేశంలోని కొన్ని అగ్రశ్రేణి, ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రులను, వైద్య కళాశాలలను పరిశీలించారు. రాత్రి షిఫ్టులలో పని చేసే మహిళా సిబ్బందికి భద్రత ఎలా ఉంది? వారికి ఉన్న భయాలు ఏంటి? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.

వాట్సాప్
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణం
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జూనియర్ డాక్టర్ల నిరసన

'నేను సురక్షితంగా లేను'

హైదరాబాద్

బళ్ల సతీష్, బీబీసీ తెలుగు

కోల్‌కతా బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు నిరసన తెలిపారు.

సోమవారం రాత్రి 11:40 నుంచి 12:50 సమయంలో డ్యూటీలో ఉన్న మహిళా సిబ్బందితో నేను మాట్లాడాను.

"క్యాంపస్‌లో కొన్ని అసురక్షిత ప్రాంతాలు ఉన్నాయి" అని డాక్టర్ హరిణి చెప్పారు.

“మేము నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే, ఒక డిపార్ట్‌మెంట్ భవనం నుంచి మరొక భవనానికి వెళ్లాలి. ఆ దారిలో భద్రత ఉండదు, కాపలాదారులు ఉండరు” అని ఆమె చెప్పారు.

ఆస్పత్రి నుంచి పీజీ హాస్టల్‌కు మధ్య ఉన్న రోడ్డులో సరిపడా వీధిలైట్లు లేకపోవడంపై అసంతృప్తి నెలకొంది.

పురుష, మహిళా వైద్యులకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక గదులు లేవని ఓ మహిళా వైద్యురాలు తెలిపారు.

"పురుషులు, మహిళా వైద్యుల పడకలు పక్కపక్కనే ఉన్నాయి. నాకు అది సౌకర్యంగా లేదు. సురక్షితంగా అనిపించదు. అందుకే, రాత్రి హాస్టల్‌కు వెళ్లిపోతాను" అని ఆమె చెప్పారు.

“ఒకసారి ఉదయం నా బైక్‌ మీద హాస్టల్‌కి వెళుతుండగా కొంతమంది అబ్బాయిలు నన్ను ఫాలో అయ్యారు. అప్పుడు భయమేసింది" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

క్యాజువాలిటీ వార్డులో పోలీసులు కనిపించారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను మోహరించారు.

వైద్యుల ఆరోపణలపై ఆసుపత్రి ఉన్నతాధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం, వారు అందుబాటులోకి రాలేదు.

విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రి

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రి

విశాఖపట్నం

లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

రాత్రి 11.30 గంటల నుంచి 1.00 వరకు విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో భద్రత ఎలా ఉందో పరిశీలించాం.

కేజీహెచ్ అంతా తిరగడంతో పాటు కేన్సర్, ప్రసూతి, కార్డియాలజీ విభాగంతో పాటు రాజేంద్రప్రసాద్ వార్డ్, ఓపీ వద్ద పరిస్థితిని గమనించాం.

సెక్యూరిటీ విషయానికి వస్తే ఆసుపత్రిలో వివిధ విభాగాల వద్ద మహిళలే అధిక సంఖ్యలో విధుల్లో కనిపించారు.

వార్డులు, వివిధ వ్యాధుల విభాగాలలో అవసరాన్ని బట్టి ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఇద్దరు డాక్టర్లు, మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఉండటం కనిపించింది. వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. వారితో మేం మాట్లాడాం. కోల్‌కతా ఆసుపత్రి సంఘటన అందోళన కలిగించిందని, అయితే కేజీహెచ్‌లో సెక్యూరిటీ విషయంలో సంతృప్తిగానే ఉన్నట్లు ఒక జూనియర్ డాక్టర్ తెలిపారు.

విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రి

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రి

కోల్‌కతా ఘటన తర్వాత వరుసగా రెండు రోజులుగా పోలీసులు, కేజీహెచ్ ఉన్నతాధికారులు రాత్రులు రౌండ్లు వేస్తున్నారని చెప్పారు. మేము ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా వారు రౌండ్లు వేయడాన్ని గమనించాం.

వైద్యులపై అక్కడక్కడ జరుగుతున్న దాడులతో పాటు కోల్‌కతా ఘటన వంటివి జరుగుతున్న నేపథ్యంలో మరింత సెక్యూరిటీ పెంచితే బాగుంటుందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీసులు గస్తీని ఏర్పాటు చేయడం వంటివి చేయడం తమకు ధైర్యాన్ని ఇస్తుందని ఒక వైద్యురాలు అన్నారు.

దిల్లీ లోక్ నాయక్ ఆసుపత్రి
ఫొటో క్యాప్షన్, దిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి

‘తాగి వస్తుంటారు’

దిల్లీ

ఉమాంగ్ పొద్దార్, బీబీసీ హిందీ

దిల్లీ నడిబొడ్డున లోక్ నాయక్ హాస్పిటల్, జీబీ పంత్ హాస్పిటల్, లేడీ హార్డింజ్ కాలేజ్ ఆసుపత్రులు ఉన్నాయి. మొదటి రెండు దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుండగా, మూడవది కేంద్ర ప్రభుత్వం నిర్వహణలో ఉంది.

లోక్ నాయక్ ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి. “కానీ అవి పని చేయడం లేదు. ఎవరైనా లోపలికి రావచ్చు” అని అక్కడి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఒకరు ఫిర్యాదు చేశారు.

మూడు ఆసుపత్రుల్లోనూ కొన్నిచోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ, అవి సరిపోవని వైద్యులు అభిప్రాయపడ్డారు.

రోగుల బంధువుల బెదిరింపులకు వైద్యులు, నర్సులు భయపడుతున్నారు.

"తరచుగా కొందరు తాగి వస్తుంటారు" అని లోక్ నాయక్ హాస్పిటల్‌లోని ఒక నర్సు చెప్పారు.

‘‘ఆసుపత్రిలో కొన్ని ప్రాంతాల్లో లైట్లు లేవు. చాలామంది ఆసుపత్రి ఆవరణలో నేలపై పడుకుంటారు” అని లోక్ నాయక్ హాస్పిటల్‌లోని పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు చెప్పారు.

దిల్లీ లోక్ నాయక్ ఆసుపత్రి
ఫొటో క్యాప్షన్, దిల్లీ లోక్ నాయక్ ఆసుపత్రి

మూడు ఆసుపత్రుల్లోనూ రాత్రిపూట భద్రత అంతంత మాత్రంగానే ఉంది. నేను ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు ఎవరూ తనిఖీ చేయలేదు. గైనకాలజీ అత్యవసర వార్డులలో మహిళా గార్డులు ఉన్నారు. ఇక్కడికి ఎందుకొచ్చారని మాత్రమే అడిగారు. నా గురించి మిగతా వివరాలను వారు తెలుసుకోలేదు.

"మాకు మెరుగైన భద్రత అవసరం, బహుశా రౌడీలను అదుపుచేసే బౌన్సర్లు కూడా అవసరం కావచ్చు" అని రాజ్ ఘాట్ సమీపంలో ఉన్న జీబీ పంత్ హాస్పిటల్‌లోని ఒక నర్సు చెప్పారు.

లోక్ నాయక్ హాస్పిటల్‌లో 24 గంటల క్యాంటీన్ ఉన్నప్పటికీ దాని దగ్గరికి వెళ్లే సమయంలో తమకు భద్రత ఉండదని ఇద్దరు మహిళా వైద్యులు చెప్పారు.

"నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తాను" అని అక్కడి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ చెప్పారు.

రాత్రిపూట వైద్య పరీక్షల కోసం ఆవరణలోని సుదూరంగా ఉన్న ల్యాబ్‌లకు వెళ్లాలని లేడీ హార్డింజ్ కాలేజ్‌లోని సీనియర్ రెసిడెంట్ తెలిపారు.

"కొన్నిసార్లు పురుషుల వార్డులలో రోగిని చెక్ చేయడానికి మహిళా డాక్టర్‌ను పంపిస్తారు, అది నిలిపివేయాలి" అని లేడీ హార్డింగ్ కాలేజీలోని ఒక ఇంటర్న్ తెలిపారు.

కొన్ని విభాగాలలో పురుష, మహిళా వైద్యులకు కలిపే విశ్రాంతి గదులు ఉన్నాయని లేడీ హార్డింజ్ కళాశాలలో ఒక ఇంటర్న్ చెప్పారు.

వైద్యులు, వైద్య విద్యార్థుల ఆరోపణలపై అధికారుల స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది, వారు అందుబాటులో లేరు.

'బయటి వ్యక్తులు తిరగొచ్చు'

లఖ్‌నవూ

సయ్యద్ మోజిజ్ ఇమామ్, బీబీసీ హిందీ

నేను లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కేజీఎంయూ) క్యాంపస్‌ని సందర్శించాను.

అక్కడి ప్రధాన ద్వారం వద్ద ఇద్దరు గార్డులున్నారు, కానీ ప్రవేశంపై ఎలాంటి నిబంధనలు లేవు. రోగుల వార్డులో ఇద్దరు పురుష గార్డులు, ఒక మహిళా గార్డు ఉన్నారు.

డ్యూటీ డాక్టర్లతో పేషెంట్ బంధువులు దురుసుగా ప్రవర్తించారని సీనియర్ రెసిడెంట్ డాక్టర్ నీత తెలిపారు.

అక్కడి హాస్టల్ ప్రాంతం చీకటిగా ఉంది, సరైన వెలుతురు లేదు.

ఆ మెడికల్ కాలేజీలో డాక్టర్ హర్షిత, డాక్టర్ నీతులు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదవుతున్నారు. బయటి వ్యక్తులు తరచూ తిరుగుతూ అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని వారు తెలిపారు.

కొన్ని నెలలుగా పోలీసుల పెట్రోలింగ్ పెరగడంతో క్యాంపస్ కొంచెం సురక్షితంగా ఉందని వైద్యురాలు హర్షిత తెలిపారు.

బాలికల హాస్టల్‌కు ఎదురుగా ఉన్న ట్రామా సెంటర్ వెలుపల కూడా వేధింపులు ఎదురవుతున్నాయని అక్కడి వైద్యులు ఫిర్యాదు చేశారు.

మరింత మంది సెక్యూరిటీ గార్డులు, లైట్లు, సీసీటీవీ కెమెరాలు కావాలని డాక్టర్ ఆకాంక్ష కోరారు.

వైద్య విద్యార్థుల ఆరోపణలపై కేజీఎంయూ ప్రతినిధి డాక్టర్ సుధీర్ సింగ్ స్పందించారు.

“క్యాంపస్‌, హాస్టల్స్, వార్డుల లోపల తగినంత భద్రత ఉంది. హాస్టల్ లోపల మాకు ప్రొక్టోరియల్, ప్రొవోస్ట్ టీంలు ఉన్నాయి. వార్డుల వద్ద సెక్యూరిటీ గార్డులున్నారు. క్యాంపస్‌లో దుర్ఘటనలపై మాకు ఎలాంటి నివేదిక లేదు. ముఖ్యమైన జంక్షన్లలో సీసీటీవీలతో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాం’’ అని తెలిపారు.

Omandurar Government Medical College, Chennai
ఫొటో క్యాప్షన్, చెన్నైలోని ఓమండురార్ ప్రభుత్వ వైద్య కళాశాల

'విశ్రాంతి తీసుకోవడానికి గదులు లేవు'

చెన్నై

శారదా వెంకటసుబ్రమణియన్, బీబీసీ తమిళ్

చెన్నై నగరం నడిబొడ్డున ఉన్న వాలాజా రోడ్‌లోని ఓమండురార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో రాత్రి 9.30 గంటలకు నా వాహనంతో క్యాంపస్‌లోకి ప్రవేశించినప్పుడు, నా గుర్తింపును విచారించడానికి ఒక సెక్యూరిటీ గార్డు వచ్చారు.

అడ్మిషన్ బ్లాక్ పక్కన మెట్ల మీద పేషెంట్ బంధువులు కూర్చున్నారు. అత్యవసర ద్వారం వద్ద ఇద్దరు పోలీసులు నిలబడ్డారు. కోల్‌కతా దుర్ఘటన మహిళా సిబ్బందిలో భయాందోళనలకు గురి చేసిందని నైట్ డ్యూటీలో ఉన్న ఇంటర్న్ ఎస్ అబర్నా తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రతా సమస్యలపై చర్చించేందుకు ఆసుపత్రి యంత్రాంగం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని ఆమె చెప్పారు.

ఆ సమావేశంలో ఇంటర్న్‌లు స్టాఫ్ రూమ్‌లను ఉపయోగించాలని కోరారు, తలుపులకు తాళం వేయాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ సమయంలో ‘కవలన్’ సిటీ పోలీస్ యాప్‌ని ఉపయోగించాలని వారికి సలహా ఇచ్చారు, కానీ “ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు” అని ఆమె భయపడుతున్నారు.

వార్డులలో ఇంటర్‌కామ్ సౌకర్యం, అత్యవసర బటన్ సహాయకరంగా ఉంటుందని అబర్నా తెలిపారు.

ప్రముఖ ఒమండురార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రాత్రి 10 గంటల సమయంలో డ్యూటీలో ఉన్న ఒక స్టాఫ్ నర్సు విశ్రాంతి తీసుకోవడానికి గదులు లేవని అన్నారు.

పోలీసు అవుట్‌పోస్టు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఉందని, పోలీసుల నంబర్‌లు ఉన్నాయని ఆమె చెప్పారు.

వైద్యుల ఆరోపణలపై ఒమందూరర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డీన్ డాక్టర్ ఎ అరవింద్ స్పందించారు.

"లెక్చర్ హాల్స్‌ బయటకు వెళ్లడానికి రెండు దారులున్నాయి, వాటి దగ్గర కాపలా ఉంది. క్యాంపస్‌లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతున్నాం. రాత్రి డ్యూటీలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అసిస్టెంట్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ క్యాంపస్‌లో 24 గంటలూ ఉంటారు, తక్షణమే చర్యలు తీసుకుంటారు’’ అని అన్నారు.

చంఢీగఢ్
ఫొటో క్యాప్షన్, చంఢీగఢ్

‘ఇక్కడ పర్వాలేదు’

చండీగఢ్

సరబ్‌జిత్ సింగ్ ధాలివాల్, బీబీసీ పంజాబీ

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGI)లో రెసిడెంట్ డాక్టర్లు న్యాయం కోరుతూ సమ్మె చేయడంతో సేవలపై ప్రభావం పడింది.

నేను రాత్రి 11 గంటలకు క్యాంపస్‌కి వెళ్లాను. ట్రామా సెంటర్ బయట ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. రోగులు, సందర్శకుల వివరాలు, ఐడీలను అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రవేశ ద్వారం వద్ద చండీగఢ్ పోలీసుల సహాయ కేంద్రం ఉంది. మహిళా పోలీసులు విధుల్లో ఉన్నారు. వార్డులలో వైద్యులు, నర్సులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ట్రామా సెంటర్ దగ్గర ‘మాకు న్యాయం కావాలి’ అనే బ్యానర్ ఉంది.

ఇతర నగరాలతో పోలిస్తే క్యాంపస్ మరింత భద్రత ఉందని పీఐజీలో పనిచేస్తున్న, బెంగళూరుకు చెందిన డాక్టర్ పూజ అన్నారు.

రోగి కుటుంబ సభ్యులు వైద్యులపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని, అయితే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారని పూజ పేర్కొన్నారు.

చండీగఢ్
ఫొటో క్యాప్షన్, చండీగఢ్ ఆసుపత్రి ట్రామా సెంటర్ వద్ద చీకటి

డాక్టర్ గగన్‌దీప్ సింగ్ చండీగఢ్‌కు ఆనుకుని ఉన్న మొహాలీ నగరంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అక్కడ భద్రత సరిపోవడం లేదని ఆయన చెప్పారు.

‘పాటియాలా సమీపంలో ఆగస్ట్ 6న ఒక శిశువైద్యునిపై రోగి కుటుంబం దాడి చేసింది. పోలీసు కేసు నమోదైంది. ఆసుపత్రిలో భద్రత లేదు’ అని డాక్టర్ సింగ్ చెప్పారు.

‘‘ఆసుపత్రిలో తగిన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీలు ఉన్నాయి. వైద్యుల ఆందోళనలు ఏవైనా ఉంటే పరిష్కరిస్తాం’’ అని పీజీఐ జాయింట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పంకజ్ అరోరా బీబీసీతో తెలిపారు.

అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రి
ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రి

సీసీ కెమెరాలు లేవు

అహ్మదాబాద్

లక్ష్మీ పటేల్, బీబీసీ గుజరాతీ

“మేము ఎక్కువగా రాత్రి షిఫ్టుల కోసం పీజీ హాస్టల్ నుంచి హాస్పిటల్ వరకు నడిచి వెళ్తాం. రోడ్డుపై ఎక్కువ వీధిలైట్లు లేవు. రహదారిపై భద్రత లేదు ” అని అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న మహిమా రామి అన్నారు.

" 24 గంటల షిఫ్ట్ ఉన్నందున భద్రత కల్పించాలని ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్‌ను కోరాం" అని ఆమె చెప్పారు.

“కొన్నిసార్లు రోగి బంధువులు డాక్టర్ గదిలోకి ప్రవేశించి దురుసుగా ప్రవర్తిస్తారు. డాక్టర్ల గదుల్లో సీసీ కెమెరాలు లేవు’’ అని మరో మహిళా వైద్యురాలు తెలిపారు.

సివిల్ హాస్పిటల్‌లోని ట్రామా సెంటర్ క్యాంపస్‌లోని అత్యంత ముఖ్యమైన వార్డులలో ఒకటి. ట్రామా సెంటర్ వెలుపల ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కానీ వారు రాత్రిపూట వార్డును సందర్శించే వ్యక్తులను తనిఖీ చేయడం లేదు, ప్రశ్నించడం లేదు.

నేను వార్డులోకి ప్రవేశించాను, ఆసుపత్రిలోని ఇతర వార్డులకు వెళ్లాను, నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగలేదు.

ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని అదనపు సూపరింటెండెంట్ సివిల్ ఆసుపత్రి డాక్టర్ రజనీష్ పటేల్ బీబీసీకి తెలిపారు. వెలుతురు సరిగా లేకపోవడాన్ని జూనియర్ డాక్టర్ల సంఘం లేవనెత్తిందని ఆయన అన్నారు.

“వారు ఇతర సమస్యలను కూడా లేవనెత్తారు. ఆ సమస్యలపై పనులు ప్రారంభించాం' అని రజనీష్ పటేల్ చెప్పారు.

JJ Hospital, Mumbai

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ముంబయిలోని జేజే ఆసుపత్రి

'సహాయం చేయడానికి చుట్టూ ఎవరూ ఉండరు'

ముంబయి

దీపాలి జగ్తాప్, బీబీసీ మరాఠీ

సోమవారం సాయంత్రం ముంబయిలోని జేజే ఆసుపత్రి ప్రవేశద్వారం వద్ద సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. మనం అనుమతి లేకుండా హాస్పిటల్ క్యాంపస్ లోపలికి వెళ్ళవచ్చు కానీ మెడికల్ వార్డులలోకి వెళ్లకూడదు. అయితే రాత్రి షిఫ్టులలో పని చేయడం సురక్షితం కాదని మహిళా వైద్యులు, నర్సులు చెప్పారు.

"అడ్మినిస్ట్రేషన్ మెడికల్ వార్డుల వెలుపల, క్యాంపస్‌లో గార్డుల సంఖ్యను పెంచాలి" అని రెసిడెన్షియల్ డాక్టర్ అదితి కనడే అన్నారు.

"ఆసుపత్రి క్యాంపస్ పెద్దది, కానీ చాలా ప్రాంతాలు వెలుతురు లేకుండా ఉన్నాయి. రాత్రిపూట హాస్టల్ నుంచి మెడికల్ వార్డుకు డ్యూటీకి వెళ్లేటప్పుడు నాకు భయంగా ఉంటుంది" అని ఆమె అన్నారు.

చనిపోయిన రోగి బంధువులు దూకుడుగా వ్యవహరించిన సంఘటనలను కూడా అదితి గుర్తుచేసుకున్నారు. పరిస్థితిని శాంతింపజేయడానికి విధుల్లో ఉన్న వైద్యుల గదిని మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు.

“చాలా గదులు, కారిడార్లలో సీసీటీవీ కెమెరాలు లేవు. అలాగే ఆపరేషన్ థియేటర్ దగ్గర మహిళా వైద్యులకు ప్రత్యేక గది ఉండాలి. మాకు ఆ గది లేదు” అన్నారు అదితి.

ఆసుపత్రిలో తగిన భద్రత లేదని గత 26 సంవత్సరాలుగా నర్సుగా పనిచేస్తున్న హేమలత గజ్బే ఆరోపించారు.

“రోగుల బంధువులు సందర్శించడానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు వారు దూషిస్తారు, తాగి వస్తారు. కొందరు రాజకీయ ఒత్తిళ్లకూ ప్రయత్నిస్తారు' అని ఆమె అన్నారు.

"ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మాకు సహాయం చేయడానికి పక్కన ఎవరూ ఉండరు" అని హేమలత అన్నారు.

జేజే హాస్పిటల్ డీన్ డాక్టర్ పల్లవి సపాలేనిని బీబీసీ సంప్రదించడానికి ప్రయత్నించింది, కానీ ఆమె అందుబాటులో లేరు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)