టికిల్ వర్సెస్ గిగల్: మహిళ అంటే ఎవరు, ఆస్ట్రేలియా కోర్టు తీర్పు ప్రపంచానికి మార్గం చూపిందా?

ట్రాన్స్ జెండర్‌ రొక్సాన్ టికిల్‌

ఫొటో సోర్స్, Grata Fund

ఫొటో క్యాప్షన్, 'గిగల్ ఫర్ గర్ల్స్' యాప్ నిర్వాహకులు వివక్ష చూపించారని ట్రాన్స్ జెండర్‌ రొక్సాన్ టికిల్‌ కోర్టులో దావా వేశారు.
    • రచయిత, సోఫియా బెట్టిజా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహిళలకోసం మాత్రమే రూపొందించిన ఒక సోషల్ మీడియా యాప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ట్రాన్స్‌జెండర్‌కు నిర్వాహకులు యాక్సెస్ నిరాకరించారు. దీంతో తనపై వివక్ష చూపించారని ఆ ట్రాన్స్‌జెండర్ కోర్టులో కేసు వేశారు. న్యాయస్థానం ట్రాన్స్ జెండర్‌ రొక్సాన్ టికిల్‌కు అనుకూలంగా తీర్పు నిచ్చింది.

పిటిషనర్‌పై ప్రత్యక్షంగా వివక్ష చూపనప్పటికీ, పరోక్ష వివక్షకు గురయ్యారని ఫెడరల్ కోర్ట్ అభిప్రాయపడింది. దీంతో ఆమెకు నష్టపరిహారంగా సుమారు 5.6 లక్షల రూపాయలు (6,700 డాలర్లు)తో పాటు అదనంగా కోర్టు ఖర్చులూ చెల్లించాలని యాప్ నిర్వాహకులను ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.

లింగ గుర్తింపు విషయంలో మైలురాయిగా నిలిచే తీర్పు ఇది.

అయితే, ఈ కేసులో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం: స్త్రీ అంటేఎవరు?

ఇంతకీ ఈ కేసు ఏమిటి? ఈ యాప్ ఏమిటి? దీని నిబంధనలేంటి? కోర్టు తీర్పులో ఏముంది?

వాట్సాప్
గిగల్

ఫొటో సోర్స్, Giggle

ఫొటో క్యాప్షన్, గిగల్

అసలేం జరిగింది?

2021లో రొక్సాన్ టికిల్ “గిగల్ ఫర్ గర్ల్స్”అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో మహిళలు తమ అనుభవాలను పంచుకోవచ్చు, ఈ యాప్‌లో పురుషులకు అనుమతి లేదు.

యాప్ యాక్సెస్ పొందాలంటే యూజర్ ఒక మహిళ అని నిరూపించుకోవాలి, దాని కోసం ఒక సెల్ఫీని అప్‌లోడ్ చేయాలి. ఇది ‘జెండర్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్’ ద్వారా పనిచేస్తుంది.

లాగిన్ అయిన ఏడు నెలల తర్వాత, యాప్ అకస్మాత్తుగా టికిల్ సభ్యత్వం రద్దు చేసింది.

మహిళల కోసం అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించుకునే చట్టపరమైన హక్కు తనకు ఉందని టికిల్ వాదించారు. లింగ గుర్తింపు ఆధారంగా వివక్షకు గురవుతున్నట్లు టికిల్ ఆరోపించారు.

అనంతరం గిగల్ యాప్, దాని సీఈవో సాల్ గ్రోవర్‌పై రూ.1.13 కోట్ల నష్టపరిహారం కోరుతూ టికిల్ కోర్టులో దావా వేశారు.

తన లింగం గుర్తింపుపై గ్రోవర్ తప్పుగా మాట్లాడటం చాలా బాధ, ఆందోళనకు గురిచేసిందని, నిరుత్సాహం కలిగేదని, ఇది అప్పుడప్పుడు ఆత్మహత్య ఆలోచనలకు దారితీసిందని టికిల్ పేర్కొన్నారు.

గ్రోవర్ బహిరంగ వ్యాఖ్యలు తన గురించి ఇతరులు ఆన్‌లైన్‌లో ద్వేషపూరిత పోస్టులు, కామెంట్లు చేసేలా దారితీశాయని టికిల్ ఆరోపించారు.

మీడియాతో మాట్లాడుతున్న యాప్ సీఈవో సాల్ గ్రోవర్‌

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, టికిల్ పుట్టుకతోనే పురుషుడని, తనని ‘మిస్’గా సంబోధించబోనని యాప్ సీఈవో సాల్ గ్రోవర్ అన్నారు.

యాప్ నిర్వాహకులు ఏమన్నారు?

సెక్స్ అనేది ‘బయోలాజికల్ కాన్సెప్ట్’ అని గిగల్ యాప్ న్యాయ బృందం కోర్టులో వాదించింది.

యాప్ పురుషులను మినహాయించేలా ఉన్నందున, దానిలోకి టికిల్ యాక్సెస్‌ను తిరస్కరించడం చట్టబద్ధమేనని వారు వాదించారు.

టికిల్ పట్ల వివక్ష చూపినట్లు గిగల్ బృందం అంగీకరించింది.

కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు ఏం చెప్పింది?

గిగల్ లాయర్ల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఒకరు ఎల్లప్పుడూ కచ్చితంగా మగ లేదా ఆడ కాదని, సెక్స్ మార్పిడిని చట్టం గుర్తించిందని జస్టిస్ రాబర్ట్ బ్రోమ్‌విచ్ తన తీర్పులో తెలిపారు.

మహిళలకు వివక్ష నుంచి రక్షణ ఉంటుందని ఈ తీర్పు చాటుతోందని టికిల్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు ట్రాన్స్, లింగ వైవిధ్య వ్యక్తులకు ఊరటనిస్తుందన్నారు.

"మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది’’ అని యాప్ సీఈవో గ్రోవర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

"టికిల్ వర్సెస్ గిగల్"గా ఈ కేసు గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియాలోని ఫెడరల్ కోర్టులో మొదటిసారిగా ఈ విధమైన ‘లింగ గుర్తింపు వివక్ష కేసు’ విచారణకు వచ్చింది.

ట్రాన్స్ జెండర్‌ రొక్సాన్ టికిల్‌

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ట్రాన్స్ జెండర్‌ రొక్సాన్ టికిల్‌

‘అందరూ నన్ను స్త్రీలానే చూశారు’

టికిల్ పురుషుడిగా జన్మించారు, కానీ లింగాన్ని మార్చుకున్నారు. 2017 నుంచి స్త్రీగా జీవిస్తున్నారు.

"ఇప్పటివరకు ప్రతి ఒక్కరూ నన్ను మహిళగానే భావించారు" అని టికిల్ కోర్టులో తెలిపారు.

"అప్పుడప్పుడు ముఖం చిట్లించేవారు, వారి చూపులు ప్రశ్నించేలా ఉండేవి. చాలా అయోమయంగా అనిపించేది. కానీ వాళ్లు నా పని నన్ను చేసుకోనిచ్చారు" అని టికిల్ అన్నారు.

"పుట్టుకతో పురుషుడిగా జన్మించిన వ్యక్తి శస్త్రచికిత్స చేయించుకొని మహిళగా మారి, ముఖంపై రోమాలు తీయించి, జుట్టు పొడవుగా పెంచి, మేకప్ వేసుకొని, ఆడవారి దుస్తులు ధరించి స్త్రీగా అభివర్ణించుకుంటారు. స్త్రీగా పరిచయం చేసుకుంటారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులను ఉపయోగిస్తారు. వారి జనన ధృవీకరణ పత్రాన్ని మార్చుకుంటారు. వారిని మీరు స్త్రీగా అంగీకరించలేరా?’’ అని గ్రోవర్‌ను టికిల్ న్యాయవాది జార్జినా కాస్టెల్లో ప్రశ్నించారు.

దానికి సమాధానంగా గ్రోవర్ ‘లేదు’ అన్నారు. టికిల్ పుట్టుకతోనే పురుషుడని, తనని ‘మిస్’గా సంబోధించబోనని గ్రోవర్ అన్నారు.

గ్రోవర్ తనకు తాను ‘ట్రాన్స్-ఎక్స్‌క్లూనరీ రాడికల్ ఫెమినిస్ట్ (టీఈఆర్ఎఫ్) గా ప్రకటించుకున్నారు. లింగ గుర్తింపుపై టీఈఆర్‌ఎఫ్‌ల అభిప్రాయాలను ట్రాన్స్ జెండర్లకు వ్యతిరేకంగా పరిగణిస్తుంటారు.

"నేను స్త్రీల కోసం సృష్టించిన యాప్‌ను వాడటానికి, స్త్రీ అని చెప్పుకునే పురుషుడు నన్ను ఫెడరల్ కోర్టుకు తీసుకువెళుతున్నారు" అని గ్రోవర్ ఎక్స్‌లో తెలిపారు.

హాలీవుడ్‌లో స్క్రీన్‌రైటర్‌గా పనిచేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో పురుషుల నుంచి వేధింపులు ఎదుర్కొన్న తర్వాత 2020లో “గిగల్ ఫర్ గర్ల్స్” అనే యాప్‌ను రూపొందించినట్లు గ్రోవర్ చెప్పారు.

"నేను మీ ఫోన్ నుంచి యాక్సెస్ చేయగల సురక్షితమైన, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే ప్రదేశాన్ని సృష్టించాలనుకుంటున్నాను" అని ఆమె వివరించారు.

“టికిల్ ఒక మహిళ అనేది చట్టబద్ధమైన కల్పన. ఆయన జనన ధృవీకరణ పత్రాన్ని స్త్రీగా మార్చారు. కానీ ఆయన పుట్టుకతోనే పురుషుడు, ఎల్లప్పుడూ అలాగే ఉంటారు’’ అని అన్నారు.

‘’మహిళలు మాత్రమే ఉండే ప్రదేశాల భద్రత కోసం మేం నిలబడ్డాం, అంతేకాకుండా మేం చూసే సత్యం, వాస్తవాన్ని కూడా చట్టం ప్రతిబింబించాలి" అని గ్రోవర్ కోరారు.

కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు.

కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచదేశాలపై ప్రభావమెంత?

ఈ కేసు ఫలితం ఇతర దేశాలలో లింగ గుర్తింపు హక్కులు, లింగ ఆధారిత హక్కుల మధ్య సంఘర్షణల పరిష్కారానికి చట్టపరమైన ఉదాహరణగా నిలుస్తుంది.

దీనిని అర్ధం చేసుకోవడానికి మహిళల హక్కుల కోసం 1979లో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ‘కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ వుమెన్’ (సీఈడీఏడబ్ల్యూ) కీలకమైనది.

ఈ ఒప్పందానికి ఆస్ట్రేలియా ఆమోదం తెలిపినందున ‘సింగిల్ సెక్స్ స్పేస్ (మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాలు, వీటిని ట్రాన్స్ జెండర్ వినియోగించడంపై వివాదం ఉంది) సహా మహిళల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గిగల్ తరపున న్యాయవాది వాదించారు.

దీంతో బ్రెజిల్ నుండి భారత్, దక్షిణాఫ్రికా వరకు సీఈడీఏడబ్ల్యూ ఆమోదించిన మొత్తం 189 దేశాలకు ఈ తీర్పు ముఖ్యమైనది.

అంతర్జాతీయ ఒప్పందాలను వివరించేటప్పుడు ఇతర దేశాలు ఇలాంటి కేసులను ఎలా తీసుకున్నాయో జాతీయ న్యాయస్థానాలు పరిశీలిస్తాయి.

ఆస్ట్రేలియాలో ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించినందున, ఇది ఇతర దేశాలనూ ప్రభావితం చేయవచ్చు. లింగ గుర్తింపు దావాలకు అనుకూలంగా మరిన్ని కోర్టులు తీర్పు ఇవ్వడం ప్రారంభిస్తే, ఇతర దేశాలు ఈ ఉదాహరణను అనుసరించే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)