ట్రాన్స్‌జెండర్లు, స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్లు రక్తదానం చేయకూడదా, నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌కు చెందిన వైజయంతి వసంత మొగ్లీ తల్లి పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడ్డారు. ఆమె చికిత్స కోసం రక్తం అవసరమైంది. తల్లికి తన రక్తం ఇవ్వాలనుకున్నారు వైజయంతి. కానీ, నిబంధనలు అనుమతించలేదు. ఆమె తల్లి 2017లో మరణించారు.
"ఈ నిషేధం చాలా బాధ కలిగిస్తోంది" అని వైజయంతి అన్నారు.
తల్లి కోసం రక్తదాతలను కనుక్కోవడానికి ఫేస్‌బుక్, వాట్సాప్‌తో సహా సోషల్ మీడియాలో ప్రచారం సైతం చేశారు వైజయంతి.
భారత్‌లో ట్రాన్స్‌జెండర్లు, స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్లు తమ బంధువులకు లేదా ఇతర పరిచయస్తులకు రక్తదానం చేయలేరు (అవతలి వ్యక్తులు కోరుకున్నప్పటికీ). దేశంలో ఇటువంటి వ్యక్తులు రక్తదానం చేయడంపై శాశ్వత నిషేధం ఉంది.
హెచ్‌ఐవీ నిరోధించడం కోసం 1980ల నుంచి ప్రపంచంలోని అనేక దేశాల్లో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లు రక్తదానం చేయకుండా నిషేధం ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
కోర్టు గడప తొక్కిన బాధితులు
అయితే గత కొన్నేళ్లుగా అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో రక్తదానానికి సంబంధించిన ఈ విధానాన్ని సడలించాయి. ఇప్పుడు భారత్‌లో కూడా రక్తదానం నిబంధనలు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రక్తదానం విషయంలో ‘2017 పాలసీ’ పక్షపాతంతో కూడిందని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఈ నిబంధనలు భారత రాజ్యాంగంలోని సమానత్వం, గౌరవం, జీవితానికి సంబంధించిన ప్రాథమిక హక్కుల హామీలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ విషయంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
అనంతరం, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలకు మద్దతుగా కోర్టులో వాదించింది. అవి శాస్త్రీయంగా ఉన్నాయని పేర్కొంది.
భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2011 వరకు దేశంలో దాదాపు 5 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు, 2012 వరకు దాదాపు 25 లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉన్నారు. అయితే, వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రక్తదాతల కొరతతో సమస్య
వైజయంతి చివరకు తన తల్లికి రక్తదాతలను కనుగొనగలిగారు. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు.
మణిపుర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ వైద్యుడు బియోంకి లైష్రామ్ అటువంటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
ఈ నియమం కారణంగా ఒక మహిళా ట్రాన్స్‌జెండర్ తన తండ్రికి రక్తదానం చేయలేకపోయారని తెలిపారు.
"ఆమె తండ్రికి ప్రతిరోజూ రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం ఎక్కించవలసి ఉంటుంది. దాత అందుబాటులో లేకపోవడంతో ఆయన రెండు రోజుల్లో మరణించారు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అంత నిస్సహాయ స్థితిని చూడలేదు." అని బియోంకి అన్నారు.
ఒక అంచనా ప్రకారం భారతదేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తమార్పిడి అవసరం. అలాంటి పరిస్థితిలో రక్తదానాన్ని పరిమితం చేసే నిబంధనలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
2021 అధ్యయనం ప్రకారం భారత్ ప్రతి సంవత్సరం 10 లక్షల యూనిట్ల కొరతను ఎదుర్కొంటుండగా...లాన్సెట్ అధ్యయనం ప్రకారం ఈ సంఖ్య 4 కోట్ల యూనిట్లకు దగ్గరగా ఉంది.
స్వలింగ సంపర్కుల సమస్యలపై పోరాడే 55 ఏళ్ల సామాజిక కార్యకర్త షరీఫ్ రాగ్నార్కర్ ఈ వివరాలు తెలిశాక ఈ ఏడాది కోర్టులో పిటిషన్ వేశారు.
"ఈ నియమం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో కనీసం నా బంధువులకు రక్తదానం చేయలేను" అని షరీఫ్ అన్నారు.
షరీఫ్ స్నేహితులు చాలామంది ఈ నిషేధం ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
"మా వాళ్లలో చాలామందికి ఈ నిషేధం గురించి తెలియదు. వారి సన్నిహితులు ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే తెలుసుకున్నారు" అని అన్నారు.
వలసరాజ్యాల కాలంలో స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని కొట్టివేయాలని 2018లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కృతజ్ఞతలు తెలిపింది. కానీ, ఇంకా కొన్ని ఇలాంటి నిబంధనలపట్ల నిరుత్సాహంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టులో విచారణ
ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఎప్పుడు జరుపుతుందో ఇంకా కోర్టు నిర్ణయించలేదు.
కోర్టు ముందు ఇలాంటి పిటిషన్లు అంతకుముందు కూడా వచ్చాయి.
2021లో ట్రాన్స్‌జెండర్ల కార్యకర్త తంగ్జమ్ శాంత సింగ్ కోర్టులో ఇదే రకమైన పిటిషన్‌ను వేశారు.
కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్ అత్యంత ముఖ్యమైనదైనప్పటికీ, ఈ నిబంధనల మూలంగా ప్రాణాలు రక్షించేందుకు ఏం చేయలేకపోయామని అన్నారు.
‘‘ఈ ఆంక్షలతో అత్యవసర పరిస్థితుల్లో సొంత వారికి ఈ కమ్యూనిటీ వారు ఎలా సాయం చేయగలుగుతారు?’’ అని నాజ్ ఫౌండేషన్‌కు చెందిన ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ప్రొగ్రామ్స్ హెడ్ సాహిల్ చౌధరి అన్నారు.
షరీఫ్ కేసును శాంత, ఇతర కేసులతో కలిపారు.
ఈ ఆంక్షలు తమని ఎలాంటి ప్రాముఖ్యత లేని వారిగా మార్చేశాయని పిటిషనర్లు అన్నారు.
2015 నుంచి 15 దేశాలు రక్తదానంపై ఉన్న ఈ ఆంక్షలను ఎత్తివేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటి?
ఈ గ్రూప్‌లలో హెచ్‌ఐవీ ప్రమాదం ఆరు నుంచి పదమూడింతలు ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో 2023లో దాఖలు చేసిన సమాధానంలో పేర్కొంది. రక్తదానం విషయంలో ఈ ఆంక్షలు తప్పనిసరని తెలిపింది.
ఇతర దేశాలలో వాడుతున్న న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ వంటి అధునాత పరీక్షా విధానాలు భారత్‌లో చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
ఈ పరీక్ష ద్వారా రోజుల వ్యవధిలోనే ఇన్‌ఫెక్షన్‌ను గుర్తిస్తుంది. ప్రస్తుతమున్న పరీక్షల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు వారాల సమయం పడుతుంది.
‘‘భారత్‌లో విధానం అంత కఠినమైనది కానప్పటికీ, ఎలాంటి మోరల్ జడ్జిమెంట్ లేకుండా ప్రమాదాన్ని తగ్గించడం ప్రభుత్వ విధానం.’’ అని వేలూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ జాయ్ మామెన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వివక్షా విధానం
ఈ విధానం వివక్షపూరితమని చాలా మంది భావిస్తున్నట్లు డాక్టర్ బియోంకి చెప్పారు.
‘‘కమ్యూనిటీలో ఒక వ్యక్తికి హెచ్ఐవీ వైరస్ ఉంటే, మొత్తం కమ్యూనిటీ దానివల్ల ఆటోమేటిక్‌గా ప్రభావితం కాదు. ఇతర జెండర్లలో కూడా హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులున్నారు. కానీ, ఈ కమ్యూనిటీపైనే రక్తదానం చేయకుండా నిషేధం విధిస్తున్నారు’’ అని అన్నారు.
ఖైదీలు, దూర ప్రయాణాలు చేసే ట్రక్కు డ్రైవర్లు వంటి చాలామందికి హెచ్ఐవీ రిస్కు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ రక్తదానం చేయకుండా ఈ గ్రూప్‌లపై ఎలాంటి ఆంక్షలు లేవని శాంత అన్నారు. ఈ వివక్ష చూపిస్తున్నట్టు కొన్ని దేశాలు ఒప్పుకుంటున్నాయని చెప్పారు.
రెండు దశాబ్దాలకు పైగా రక్తదానం చేయకుండా ‘గే’ వ్యక్తులపై విధించిన నిషేధానికి 2024లో కెనడియన్ బ్లడ్ సర్వీసెస్ క్షమాపణ కోరింది.
ఈ కంపెనీ దేశవ్యాప్తంగా రక్తాన్నిసేకరిస్తుంది. వారి లైంగిక ధోరణిని కారణంగా చూపుతూ ఈ కమ్యూనిటీ రక్తం తక్కువ సురక్షితమైనదనే భావనను పాలసీ నొక్కిచెప్పేదని, దీని వల్ల ఎన్నో ఏళ్లపాటు వివక్ష, హోమోఫోబియా, ట్రాన్స్‌ఫోబియాను వారు ఎదుర్కొన్నట్లు క్షమాపణలో ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కోర్టు నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. నిబంధనల్లో ఏదైనా మార్పు వచ్చేంత వరకు, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను కూడా రూపొందిస్తున్నారు.
‘‘రక్తదానం, అవయవదానంలో సాయం చేసేందుకు కొన్ని బ్లడ్ బ్యాంకులు, ఎన్‌జీవోలతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాం.’’ అని వైజయంతి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














