పిల్లలను ఎత్తుకుపోతున్న తోడేళ్లు, వణుకుతున్న 30 గ్రామాలు

- రచయిత, సయ్యద్ మోజిజ్ ఇమామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో తోడేళ్ల కారణంగా ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు.
భారత్-నేపాల్ సరిహద్దుల్లోని తరాయీ అంచల్ ప్రాంతమది. ఇక్కడి గ్రామాల్లో తోడేళ్లు గుంపులుగా తిరుగుతూ చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
అయితే, పిల్లలే కాకుండా పెద్దలపైనా ఇవి దాడులు చేస్తున్నాయని అక్కడి వారు చెప్తున్నారు.
తరాయీలో జులై నుంచి ఇప్పటి వరకు 26 మంది తోడేళ్ల దాడిలో గాయపడగా అందులో ఆరుగురు చిన్నారులే.
తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు మూడు మాత్రమే వారికి చిక్కాయి.
తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖకు చెందిన 9 బృందాలు పనిచేస్తున్నాయి. తోడేళ్లు తిరుగుతున్న ప్రాంతంలో నాలుగు బోనులు, ఆరు కెమేరాలు ఏర్పాటు చేశారు.
తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖ థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తోంది.
బహ్రాయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌ఓ) అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ‘పిల్లలను బయట పడుకోవద్దని గ్రామస్తులకు చెప్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా ఇళ్లకు తలుపులు లేకపోవడంతో తోడేళ్లు ఇళ్లలోకి వచ్చేస్తున్నా’ అన్నారు.
తోడేళ్లు సాధారణంగా మనుషులపై దాడి చేయవు కానీ కొన్ని సందర్భాలలో మనుషులపై దాడి చేస్తే, అదే అలవాటును కొనసాగిస్తాయి అన్నారు అజిత్ ప్రతాప్ సింగ్.
తోడేళ్ల సమస్యపై ఉత్తర్‌ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా బీబీసీతో మాట్లాడారు.
ఇప్పటివరకు మూడు తోడేళ్లను పట్టుకున్నట్లు చెప్పిన ఆయన ప్రజల ప్రాణాలు కానీ వన్యప్రాణుల ప్రాణాలు కానీ పోకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.


30 గ్రామాలకు నష్టం వాటిల్లడంతో స్థానికుల ఆగ్రహం
బహ్రాయిచ్ జిల్లాలోని మహసీ తహసీల్‌లో సుమారు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో 25 నుంచి 30 గ్రామాల ప్రజలు తోడేళ్ల బెడదతో వణుకుతున్నారు.
తోడేళ్లు సాధారణంగా మనుషులనులక్ష్యంగా చేసుకోవని.. అవి నివసించే బొరియల్లో వర్షాల కారణంగా నీళ్లు నిండిపోవడంతో గ్రామాల్లోకి వస్తున్నాయని.. మొదట పొరపాటున అవి మనుషులపై దాడి చేసినా తరువాత వాటికి అది అలవాటుగా మారినట్లుందని డీఎఫ్ఓ అజిత్ ప్రతాప్ సింగ్ బీబీసీతో చెప్పారు.
గతంలో ఈ ప్రాంతంలో చిరుతపులి భయం ఉండేదని.. ఇప్పుడు తోడేళ్ల సమస్య మొదలైందని ఆయన అన్నారు.
బీబీసీ బృందం బహ్రాయిచ్ జిల్లాలోని మైకూపుర్వా ప్రాంతం సహా పలు గ్రామాలను సందర్శించింది.
ఇక్కడి ఓ గ్రామంలో ఎనిమిదేళ్ల ఉత్కర్ష్‌ని రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో తోడేళ్లు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి.
అయితే వెంటనే మేల్కొన్న బాలుడి తల్లి ఉత్కర్ష్‌ను గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కలవారు వచ్చి ఉత్కర్ష్‌ను తోడేళ్ల నుంచి కాపాడారు.
మైకూపుర్వా గ్రామానికి చెందిన అనూప్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ మార్చి నుంచి తోడేళ్ల దాడులు జరుగుతున్నాయని.. అప్పటి నుంచి గ్రామంలో రాత్రి కాపలా కాస్తున్నామని చెప్పారు.
ఈ ప్రాంతంలో ఘఘ్రా నది ఉండడంతో ఏటా వరదలు వస్తాయి. దీంతో తోడేళ్లు ఉండే బొరియలు, గుహలు నీటితో నిండిపోతాయని అనూప్ సింగ్ చెప్పారు.
సుమారు 20 ఏళ్ల కిందట కూడా ఈ ప్రాంతంలో తోడేళ్లు మనుషులపై దాడులు చేశాయని.. అప్పట్లో గోండా, బహ్రాయిచ్, బలరాంపుర్ జిల్లాల్లో 32 మంది చిన్నారులు తోడేళ్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని డీఎఫ్ఓ తెలిపారు.
తమను తాము రక్షించుకోవడానికి పోరాటం
తోడేళ్ల దాడిని నివారించేందుకు గ్రామస్తులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.అయితే,ఇది వారికి అంత సులభం కాదు. కరెంటు లేకపోవడం,చీకటి కారణంగా ఈ పని సవాల్‌గా మారింది. చీకటిగా ఉండడం తోడేళ్లకు అనుకూలంగా ఉంటోంది. ఈ విషయం జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్)కు తెలిపాం అని మైకూపుర్వ గ్రామానికి చెందిన రాంలాల్ చెప్పారు.
ఇటీవల ఆగస్టు 17 రాత్రి హిందూపుర్వ గ్రామంలో నాలుగేళ్ల బాలిక సంధ్యపై తోడేలు దాడిచేసి లాక్కెళ్లిందని గ్రామస్తులు చెప్పారు.
‘రాత్రి లైట్లు ఆర్పిన రెండు నిమిషాల్లోనే తోడేలు దాడి చేసింది.మేం తేరుకునేలోపే సంధ్యను లాక్కెళ్లిపోయింది’ అని ఆమె తల్లి సునీత ఏడుస్తూ చెప్పారు.
ఆగస్ట్ 21న భటోలి గ్రామ సమీపంలో ఓ బాలికపై తోడేలు దాడిచేసింది.
హిందూపుర్వా గ్రామానికి సమీపంలోని నసీర్‌పుర్‌లో నాలుగేళ్ల సబాను లాక్కెళ్లేందుకు తోడేళ్లు ప్రయత్నించాయి. అయితే తండ్రి ఆమెను గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. కానీ, ఆ పెనుగులాటలో ఆయన తలకి బలమైన గాయమైంది.
ఈ ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉందని, చాలామందికి పక్కా ఇళ్లు లేకపోవడంతో ఆరుబయటే పడుకుంటారని, అలాంటివారికి తోడేళ్ల నుంచి మరింత ప్రమాదం ఎదురవుతోందని అటవీ అధికారి అజిత్ ప్రతాప్ చెప్పారు.

‘ఇప్పటికే పట్టుకున్న మూడు తోడేళ్లలో ఒకటి గుండెపోటుతో మరణించింది. మిగిలిన రెండింటిని లఖ్‌నవూ జూకు తరలించాం. వాటిలో ఒకటి మగది. మరొకటి ఆడ తోడేలు. మిగతా తోడేళ్లనూ పట్టుకుంటాం’ అని డీఎఫ్ఓ అజిత్ ప్రతాప్ సింగ్ వివరించారు.
ఈ ప్రాంతంలో తోడేళ్ల సమస్య నివారణకు ప్రభుత్వం అటవీశాఖకు రూ. 20 లక్షలు ఇచ్చింది.
తోడేళ్ల దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షలు, అటవీ శాఖ నుంచి రూ. లక్ష కలిపి మొత్తం రూ. 5 లక్షల పరిహారం ఇస్తున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు.

డ్రోన్లతో వేట
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ డీఎఫ్‌ఓ పర్యవేక్షణలో బహ్రాయిచ్ రేంజ్ ఆఫీసర్, ఆయన బృందం డ్రోన్‌లతో ఆ ప్రాంతంలోని చిత్తడి నేలలు, చెరకు పొలాల్లో తోడేళ్ల కోసం గాలిస్తున్నారు.
గ్రామాల్లో తిరుగుతూ, అక్కడి ప్రజలతో మాట్లాడుతూ.. ఎవరైనా తోడేళ్లను చూశారేమో తెలుసుకుని వారిచ్చిన సమాచారంతో గాలిస్తున్నారు.
తోడేళ్లు ఉన్నాయని అనుమానం వస్తే ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నారు. అయితే, తోడేళ్లను పట్టుకునే క్రమంలో వాటికి ఏమీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అటవీ అధికారులు చెప్తున్నారు.

మనుషులపై దాడులకు అసలు కారణం ఏమిటి?
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మనుషులు, తోడేళ్ల మధ్య ఘర్షణ కనిపిస్తోంది.
లఖ్‌నవూ యూనివర్సిటీ వైల్డ్‌లైఫ్ సైన్స్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అమిత కనోజియాతో మనుషులు, జంతువుల మధ్య వైరంపై బీబీసీ మాట్లాడింది.
‘ఇది కొత్త విషయం కాదు.తోడేళ్లు గుంపులుగా నివసిస్తాయి. రెండు నుండి పది జంతువులు ఒక గుంపుగా ఉంటాయి. అవి సంతానోత్పత్తి కాలానికి ముందు అంటే అక్టోబర్‌కు ముందు సురక్షితమైన స్థలం చూసుకుని పిల్లలను కంటాయి. ఆ పిల్లలకు యుక్త వయసు వచ్చాక వేటాడటం నేర్పిస్తాయి’ అని ప్రొఫెసర్ అమిత కనోజియా అన్నారు.
‘తోడేళ్లకు ఆహారం దొరకనప్పుడు మానవ నివాసాల మధ్య జీవించే వీధి కుక్కుల కోసం వెతుకుతాయి. ఆ సమయంలో మనుషులు కనిపిస్తే పొరపాటున దాడి చేస్తాయి. తర్వాత మనుషులపై దాడి చేయడాన్ని అలవాటు చేసుకుంటాయి’ అని అన్నారు.
వాతావరణ మార్పు వల్లే ఇలా జరుగుతోందా అని ప్రొఫెసర్ అమితా కనోజియాను అడిగినప్పుడు.. ‘వాతావరణ మార్పులనేవి నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోవచ్చు, కానీ తోడేళ్లు సులభంగా దొరికే ఆహారం కోసం వెతుకుతూ మనుషుల పిల్లలను లక్ష్యం చేసుకుంటూ ఉండొచ్చు’ అన్నారు.

‘2002 నుంచి 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా 489 తోడేళ్ల దాడులు జరిగాయి, వాటిలో 78 శాతం రాబిస్ కారణంగానే దాడులు చేశాయి’ అని నార్వేజియన్ నేచర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదికను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ వుల్ఫ్ సెంటర్ పేర్కొంది.
హిమాలయాల దిగువ ప్రాంతంలో సుమారు 1100 తోడేళ్లు ఉంటున్నాయి. భారత ఉపఖండంలో 4000 నుంచి 6000 తోడేళ్లు ఉన్నట్లు ఇంటర్నేషనల్ వుల్ఫ్ సెంటర్ పెర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














