రాబర్ట్ నైరాక్: 1977లో హత్యకు గురైన ఈ కెప్టెన్‌ అవశేషాల కోసం ఇప్పుడు ఎందుకు వెతుకుతున్నారు?

కెప్టెన్ రాబర్ట్ నైరాక్,ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్

ఫొటో సోర్స్, Other

    • రచయిత, జూలియన్ ఓ నీల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐర్లాండ్‌లోని కౌంటీ లౌత్‌లో ఉన్న ఒక వ్యవసాయ భూమిలో కెప్టెన్ రాబర్ట్ నైరాక్ అవశేషాల కోసం అన్వేషించాల్సి ఉంది. అండర్ కవర్‌లో పనిచేస్తున్నప్పుడు ఆయనను ఐఆర్ఏ (ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ) కిడ్నాప్ చేసి హత్య చేసింది.

మే 1977లో నైరాక్‌ను తుపాకీతో కాల్చి, రహస్యంగా పాతిపెట్టిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన అవశేషాల కోసం మొదటిసారి అన్వేషణ మొదలైంది.

ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్ (ICLVR) అనే సంస్థ ద్వారా శోధన నిర్వహిస్తున్నారు.

ఐర్లాండ్‌లోని డుండల్క్ సమీపంలోని ఓ ప్రైవేట్ భూమిలో ఆయన అవశేషాలు ఉంటాయనడానికి అవసరమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
కెప్టెన్ రాబర్ట్ నైరాక్,ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్

ఫొటో సోర్స్, Pacemaker

ఫొటో క్యాప్షన్, కెప్టెన్ రాబర్ట్ నైరాక్ అండర్ కవర్‌లో పనిచేస్తుండగా అపహరణకు గురయ్యారు.

సమాచారం కోసం అప్పీలు

కెప్టెన్ రాబర్ట్ నైరాక్‌కు ఐర్లాండ్‌లో ఒక మిస్టీరియస్ పర్సన్‌గా పేరుంది. 1948 ఆగష్టు 31న జన్మించారు. ఆయన ఒక కాథలిక్.

ఆక్స్‌ఫర్డ్ నుండి పట్టభద్రుడయ్యారు. మధ్యయుగ, సైనిక చరిత్రను చదివారు. ఆ తర్వాత గ్రెనేడియర్ గార్డ్స్‌లో చేరారు.

బ్రిటిష్ ఆర్మీలో గూఢచారిగా విధులు నిర్వహించారు. 29 ఏళ్ల కెప్టెన్ నైరాక్‌‌ ఒక పబ్‌లో ఉండగా కిడ్నాప్ చేశారు.

ఆ తర్వాత ఐర్లాండ్ సరిహద్దు మీదుగా ఫ్లర్రీ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆయన్ను తీవ్రంగా హింసించి, తుపాకీతో కాల్చి చంపారు.

అయితే, ఆయనను ఎక్కడ ఖననం చేశారన్నది మిస్టరీగా మిగిలిపోయింది.

ఇటీవలి కాలంలో, ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్ ద్వారా సమాచారం కోసం అనేక విజ్ఞప్తులు వచ్చాయి.

1999లో బ్రిటిష్, ఐరిష్ ప్రభుత్వాలు అదృశ్యమైన వారిని కనుగొనడం కోసం ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్ సంస్థను స్థాపించాయి.

17మంది వ్యక్తులను రిపబ్లికన్లు ఇలా హత్య చేసి రహస్యంగా ఖననం చేశారని ఆరోపణలున్నాయి.

ఇప్పటి వరకు 13 మృతదేహాలు లభ్యమయ్యాయి.

కెప్టెన్ రాబర్ట్ నైరాక్,ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్

ఫొటో సోర్స్, Pacemaker

ఫొటో క్యాప్షన్, రాబర్ట్ నైరాక్ అపహరణకు ముందు దక్షిణ అర్మాగ్‌లోని ది త్రీ స్టెప్స్ పబ్‌లో ఉన్నారు.

“రాబర్ట్ నైరాక్ ఉన్నత స్థాయి వ్యక్తి. అదృశ్యమైన వారిలో ఆయన ఒకరు. అయితే అతని కేసులో మాకు చాలా తక్కువ సమాచారం మాత్రమే ఉంది. దానితోనే మేం అన్వేషణ కొనసాగించాలి." అని ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్ లీడ్ ఇన్వెస్టిగేటర్ జోన్ హిల్ చెప్పారు.

"శోధన కోసం తగినంత సమాచారం మా వద్ద ఉందని మేం అనుకుంటున్నాం.’’ అని హిల్ అన్నారు.

కానీ ఆయన్ని ఖననం చేసిన కచ్చితమైన ప్రదేశం ఎక్కడనేది మాత్రం వెల్లడించలేదు.

ఆయన్ని ఖననం చేసిన ప్రదేశం ఒక ఎకరం కంటే తక్కువ విస్తీర్ణంలోనే ఉందన్నారు హిల్.

కెప్టెన్ రాబర్ట్ నైరాక్, ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాబర్ట్ నైరాక్ తల్లిదండ్రులు మారిస్, బార్బరా, సోదరి రోసమొండేతో కలిసి మే 1979లో ఆయన జార్జ్ క్రాస్ అవార్ట్ అందుకున్నారు.

"ఈ పని పూర్తి చేయడానికి మాకు నిర్దిష్ట గడువేమీ లేదు. కానీ ఒక ఎకరం భూమిలో తవ్వకాలు చేపట్టడానికి నెలల సమయం పట్టకపోవచ్చు" అని హిల్ అన్నారు.

“సెర్చ్ మొదలుపెడుతున్నామని నైరాక్ కుటుంబానికి తెలియజేశాం. పురోగతి గురించి ఎప్పటికప్పుడు వారికి తెలియపరుస్తాం" అని చెప్పారు.

"మేము నైరాక్ అవశేషాలను ఎప్పటికల్లా గుర్తిస్తామన్నది నేను కచ్చితంగా చెప్పలేను. కానీ, కనుక్కునే నైపుణ్యాలు, సామర్థ్యం, అనుభవం మాకు ఉన్నాయి అని మాత్రం చెప్పగలను’’ అని హిల్ తెలిపారు.

కెప్టెన్ రాబర్ట్ నైరాక్, ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్

"కెప్టెన్ రాబర్ట్ నైరాక్ హత్య, అదృశ్యం దక్షిణ అర్మాగ్‌లోని దాదాపు ప్రతి ఇంట్లో ఒక చర్చనీయాంశమే. అయితే ఆ చర్చలన్నీ వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి." అని సౌత్ ఈస్ట్ ఫెర్మానాగ్ ఫౌండేషన్ డైరెక్టర్ కెన్నీ డొనాల్డ్‌సన్ అన్నారు.

"వీటన్నింటికీ మూలం రాబర్ట్ భౌతికకాయం ఎక్కడ ఉందో తెలియకపోవడమే. తమ కుటుంబంలోని వ్యక్తిని క్రైస్తవ సంప్రదాయంలో ఖననం చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. దీనిపై అపోహలు, ఊహాగానాలు పెరగడానికి కారణం ఇదే." అని ఆయన చెప్పారు.

కెప్టెన్ నైరాక్ మృతదేహాన్ని మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పడేసినట్లు వచ్చిన ఊహాగానాలను కమిషన్ గతంలో తోసిపుచ్చింది.

డబ్లిన్, మోనాఘన్ బాంబు దాడుల వంటి అనేక టెర్రరిస్టుల సంఘటనలలో నైరాక్ పాల్గొన్నాడన్న ఆరోపణలు అవాస్తవాలని స్పష్టం చేసింది ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ విక్టిమ్స్ రిమైన్స్ సంస్థ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)