సౌదీ యువరాజు: 3,772 కోట్ల రూపాయలతో ఆ పెయింటింగ్ ఎందుకు కొన్నారు, హత్యకు గురవుతానని ఎందుకు భయపడుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోనాథన్ రుగ్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సౌదీ అరేబియా రాజు 90 ఏళ్ల అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ 2015 జనవరిలో తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన సోదరుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రాజు కాబోతున్న సమయంలో అల్ సౌద్ కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ కూడా అధికారం కోసం సిద్ధమయ్యారు.
మహ్మద్ బిన్ సల్మాన్‌ను ఎంబీఎస్ అని పిలుస్తుంటారు. అప్పటికి ఆయన వయసు 29 ఏళ్లు. అయితే సౌదీ అరేబియా సామ్రాజ్యం కోసం ఎంబీఎస్ చాలా పెద్ద ప్లాన్ వేశారు. అది సౌదీ అరేబియా చరిత్రలోనే అతిపెద్ద పథకం అని భావించవచ్చు.
అయితే, సొంత రాజకుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారని ఆయన భయపడ్డారు. దీంతో ఆ నెలలో ఒకరోజు రాత్రి ఎంబీఎస్ ఒక సీనియర్ భద్రతాధికారిని ప్యాలెస్‌కు పిలిపించారు. ఆయన పేరు సాద్ అల్ జాబ్రీ.
ఆయన ఫోన్‌ను గది బయటే టేబుల్‌పై ఉంచాలని చెప్పారు. ఎంబీఎస్ కూడా ఫోన్‌ను బయటే ఉంచారు. రాజభవనంలోని గూఢచారుల పట్ల యువరాజు సల్మాన్ ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే, గదిలో ఉన్న ఏకైక ల్యాండ్‌లైన్ వైర్‌ను కూడా తీసేశారు.


సల్మాన్ ప్రణాళిక..
"నిద్రలో ఉన్న దేశాన్ని’’ ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఒక ప్రణాళిక రూపంలో ఎంబీఎస్ వివరించారని జాబ్రీ చెప్పారు. ఆ ప్రణాళికతోనే ప్రపంచ వేదికపై సౌదీ సరైన స్థానాన్ని పొందగలదని ఆయన చెప్పారని తెలిపారు.
ఆరామ్‌కోలోవాటాలను విక్రయించి, చమురుపై తన ఆర్థిక వ్యవస్థ ఆధారపడటం ఆపేస్తానని ఎంబీఎస్ చెప్పారు. టాక్సీ సంస్థ ఉబెర్, సిలికాన్ వ్యాలీలోని టెక్ స్టార్టప్‌లలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడతానన్నారు. సౌదీ మహిళలకు పని చేసే స్వేచ్ఛను కల్పించడం ద్వారా దేశంలో 60 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తానని ఆయన చెప్పారు.
ఎంబీఎస్ మాటలకు ఆశ్చర్యపోయిన జాబ్రీ, ఆయన ఆశయ సాధన ఎంతదూరంలో ఉందని ప్రశ్నించారు. దీంతో ఎంబీఎస్ సూటిగా "అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మీరు విన్నారా?" అని బదులిచ్చినట్లు జాబ్రీ చెప్పారు. అరగంట జరగాల్సిన సమావేశం మూడు గంటలసేపు సాగింది. అప్పటికే జాబ్రీ మొబైల్ ఫోన్‌కు చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఆ తరువాత జాబ్రీ గది నుంచి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
యువరాజు నియంత్రణలోకి సౌదీ
బీబీసీ డాక్యుమెంటరీ బృందం గత సంవత్సరం ఎంబీఎస్ పరిచయస్తులు, ప్రత్యర్థులతో పాటు సీనియర్ పాశ్చాత్య గూఢచారులు, దౌత్యవేత్తలతో మాట్లాడింది. వారి వ్యాఖ్యలపై స్పందించాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరింది. కానీ, వారి నుంచి సమాధానం రాలేదు.
సాద్ అల్-జాబ్రీకి సీఐఏ, ఎంఐ6 అధిపతులతో స్నేహం ఉంది. సౌదీ ప్రభుత్వం జాబ్రీని "విశ్వసనీయ" మాజీ అధికారిగా పరిగణిస్తుంది. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాబ్రీ సౌదీ యువరాజు గురించి కచ్చితమైన సమాచారం తెలిసినట్టుగా మాట్లాడారు. సౌదీ అరేబియాలో ఎంబీఎస్ పాలనపై అరుదైన, షాకింగ్ విషయాలను ఆయన పంచుకున్నారు.
యువరాజుతో దగ్గరి సంబంధమున్న పలువురితో బీబీసీ మాట్లాడింది. 2018లో సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జి హత్య, యెమెన్‌లో యుద్ధం ప్రారంభం గురించి తెలుసుకుంది.
రాజు ప్రాబల్యం తగ్గుతుండటంతో 38 ఏళ్ల ఎంబీఎస్ ఇప్పుడు సౌదీని నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. ఆయన అప్పట్లో సాద్ అల్-జాబ్రీకి చెప్పిన అనేక ముఖ్యమైన ప్రణాళికలను ఇపుడు అమల్లోకి తీసుకొస్తున్నారు.
అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించటం, మరణశిక్షను విస్తృతంగా ఉపయోగించడం, మహిళా హక్కుల కార్యకర్తలను జైలుకు పంపడం వంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
తదుపరి రాజు ఎవరు?
సౌదీ అరేబియా మొదటి రాజు 42 మంది కుమారులలో ఎంబీఎస్ తండ్రి సల్మాన్ ఒకరు, సంప్రదాయకంగా అధికారం సోదరుల మధ్య (పెద్ద కుమారుని నుంచి) బదిలీ కావాలి. అయితే 2011, 2012లో రాజు అబ్దుల్లా ఇద్దరు కుమారుల ఆకస్మిక మరణాలతో సల్మాన్ వారసత్వ రేసులో ముందుకొచ్చారు.
ఆ సమయంలో సౌదీ అరేబియా తదుపరి రాజు ఎవరనే దానిపై పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించాయి. చిన్న వయస్సు, ప్రపంచం దృష్టికి దూరంగా ఉండటంతో ఏజెన్సీల రాడార్‌లో ఎంబీఎస్ పడలేదు.
‘’యువరాజు ప్యాలెస్‌లో పెరిగారు. ఆయన నిర్ణయాలు తీసుకునేముందు వాటి పర్యవసానాలు గురించి ఆలోచించేవారు కాదు’’ అని 2014 వరకు ఎంఐ6కి అధిపతిగా ఉన్న సర్ జాన్ సావర్స్ అన్నారు. ఎవరి దృష్టి పడకుండా యువరాజు పెరిగారని, ఆయన అంత పవర్ ఫుల్ అవుతారని ఎవరూ ఊహించలేదని తెలిపారు.
ఎంబీఎస్ తీరు ఆయన యుక్తవయస్సులోనే బయటపడింది, ఆయనకు "ఫాదర్ ఆఫ్ బుల్లెట్" అనే పేరు పెట్టారు. ఆస్తి వివాదంలో న్యాయమూర్తి తనను వ్యతిరేకించడంతో ఆయనపైకి బుల్లెట్ పేల్చారు.
"ఆయనకు వ్యతిరేకత నచ్చదు. అందుకే ఇప్పటివరకు ఏ సౌదీ నాయకుడు చేయలేని మార్పులను అమల్లోకి తెచ్చారు" అని సావర్స్ అభిప్రాయపడ్డారు.
విదేశీ మసీదులు, మతపరమైన పాఠశాలలకు నిధుల కోత అనేవి స్వాగతించదగినవని ఆయన తెలిపారు. ఇవి ఇస్లామిక్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నట్లుగా భావిస్తుంటారు, ఈ నిర్ణయాలు పాశ్చాత్య దేశాల భద్రతను మెరుగుపరిచాయి.
ఎంబీఎస్ తల్లి ఫహదా బెడౌయిన్ గిరిజన సమాజానికి చెందిన మహిళ. రాజు తన నలుగురు భార్యలలో ఆమెను ఎక్కువ ఇష్టపడేవారని భావిస్తుంటారు.
రాజు సల్మాన్ కొన్నేళ్లుగా వాస్కులర్ డిమెన్షియాతో బాధపడుతున్నారని, ప్రిన్స్ ఎంబీఎస్ రాజుకు సాయంగా ఉంటున్నారని పాశ్చాత్య దౌత్యవేత్తలు భావిస్తున్నారు. పలువురు దౌత్యవేత్తలు ఎంబీఎస్, రాజుతో తమ సమావేశాల గురించి బీబీసీకి చెప్పారు. యువరాజు తన ఐప్యాడ్‌లో నోట్స్ రాసుకుని, ఆ నోట్స్‌ని తన తండ్రి ఐప్యాడ్‌కు పంపేవారు. ఇది రాజు తర్వాత ఏం చెప్పాలనే దానికి సాయపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
రాజును చంపాలనుకున్నారా?
తన తండ్రి సల్మాన్ రాజు కావాలని ఎంబీఎస్ ఉత్సుకతతో ఉండేవారని, 2014లో రష్యా నుంచి తెచ్చిన పాయిజన్ రింగ్‌ని ఉపయోగించి రాజు అబ్దుల్లాను చంపాలని సూచించారని జాబ్రీ తెలిపారు.
దీని గురించి జాబ్రీ “ఎంబీఎస్ ఈ విషయాలను సీరియస్‌గా చెబుతున్నారా లేదా ఊరికేనా? అనేది మాకు తెలియదు. కాని మేం ఆయన మాటలను సీరియస్‌గా తీసుకున్నాం” అని చెప్పారు.
ఎంబీఎస్ ఆ విషయంపై మాట్లాడుతుండగా రికార్డు చేసిన వీడియోను చూశానని జాబ్రీ చెప్పారు. ఆ కారణంతోనే రాజుతో కరచాలనం చేయకుండా కోర్టు ఎంబీఎస్‌పై కొంతకాలం నిషేధం విధించింది.
2015లో రాజు మరణించిన తర్వాత ఆయన సోదరుడైన ‘సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ సింహాసనాన్ని అధిష్టించారు. అప్పుడు ఎంబీఎస్ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
యెమెన్‌లో యుద్ధం..
కేవలం రెండు నెలల తర్వాత యువరాజు పశ్చిమ యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా గల్ఫ్ సంకీర్ణానికి నాయకత్వం వహించారు.అయితే, ఈ పోరాటం లక్షలాది మంది ప్రజలను కరువు అంచుకు చేర్చింది.
"ఇది తెలివైన నిర్ణయం కాదు" అని యుద్ధం ప్రారంభమైనప్పుడు బ్రిటిష్ రాయబారి జాన్ జెంకిన్స్ చెప్పారు.
"ఈ ఆపరేషన్ గురించి తనకు 12 గంటల ముందు మాత్రమే సమాచారం అందిందని ఒక సీనియర్ అమెరికా సైనిక కమాండర్ నాకు చెప్పారు" అని జాన్ గుర్తుచేసుకున్నారు. కానీ యువరాజును ఈ చర్య సౌదీ అరేబియా జాతీయ హీరోగా నిలబెట్టింది.
యెమెన్ యుద్ధం గురించి అమెరికాకు ముందుగానే చెప్పామని జాబ్రీ స్పష్టంచేశారు. అయితే కేవలం వైమానిక దాడులకు మాత్రమే మద్దతు తెలుపుతామని యూఎస్ బదులిచ్చిందని ఆయన అన్నారు. కానీ, భూ దాడుల కోసం ఎంబీఎస్ "తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. రాజు మానసిక స్థితి క్షీణించింది" అని జాబ్రీ ఆరోపించారు.
అయితే, రాజు సంతకాన్ని ఎంబీఎస్ ఫోర్జరీ చేయడంపై తనకు సమాచారం లేదని మాజీ ఎంఐ6 చీఫ్ సర్ జాన్ సావర్స్ అన్నారు.
"యెమెన్‌లో సైనిక జోక్యంపై నిర్ణయం ఎంబీఎస్‌ది. ఇది ఆయన తండ్రి నిర్ణయం కాదు, అయినప్పటికీ రాజు ఆ నిర్ణయంతోనే ముందుకెళ్లారు" అని సావర్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెయింటింగ్ కోసం వేల కోట్లు
ఎంబీఎస్ 2017లో ఒక ప్రసిద్ధ పెయింటింగ్‌ని కొనుగోలు చేసిన సంఘటనను పరిశీలిస్తే ఆయన దృష్టి కోణాన్ని, ఆలోచనలను అంచనా వేయవచ్చు. ఈ పెయింటింగ్ కొనుగోలు ఎంబీఎస్ రిస్క్ టేకర్ అని స్పష్టంగా సూచిస్తుంది.
ప్రసిద్ధ సాల్వేటర్ ముండి పెయింటింగ్ కోసం ఎంబీఎస్ సుమారు రూ.3,772 కోట్లు (450 మిలియన్ డాలర్లు) వెచ్చించారు. ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన కళాఖండం ఇదే. లియోనార్డో డా విన్సీ వేసిన ఈ పెయింటింగ్ యేసు క్రీస్తును స్వర్గానికి, భూమికి ప్రభువుగా, ప్రపంచ రక్షకునిగా వర్ణిస్తుంది. ఇపుడు ఆ పెయింటింగ్ కనిపించడం లేదు.
పెయింటింగ్ జెనీవాలో ఉందనే వార్తలను యువరాజు స్నేహితుడు, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలోని నియర్ ఈస్టర్న్ స్టడీస్ ప్రొఫెసర్ అయిన బెర్నార్డ్ హెకెల్ ఖండించారు. దీనిని ప్రిన్స్ ప్యాలెస్‌లో పెట్టారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆ పెయింటింగ్‌ను సౌదీ రాజధానిలో ఇంకా నిర్మించని మ్యూజియంలో ఎంబీఎస్ ఉంచాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
"నేను రియాద్‌లో చాలా పెద్ద మ్యూజియాన్ని నిర్మించాలనుకుంటున్నాను, మోనాలిసా మాదిరిగానే ప్రజలను ఆకర్షించే వాటిని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను" అని ఎంబీఎస్ చెప్పినట్టు హెకెల్ తెలిపారు.
అంతేకాదు, 2034 ఫీఫా ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి బిడ్డింగ్ వేసిన ఏకైక దేశం సౌదీ అరేబియా. అనంతరం టెన్నిస్, గోల్ఫ్ టోర్నమెంట్‌లలో బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. దీనిని "స్పోర్ట్స్‌వాషింగ్"గా అభివర్ణిస్తున్నారు.
"ఎంబీఎస్ ఒక నాయకుడిగా బలాన్ని పెంచుకోవాలని కోరుకుంటారు, ఆయన తన దేశ శక్తిని పెంచడం ద్వారా మాత్రమే దీన్ని చేయగలరు. ఇదే ఆయనను ప్రేరేపిస్తోంది" అని జాన్ సావర్స్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
జమాల్ ఖషోగ్జీ హత్య
2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య జరిగింది. ఆయన హత్యకు గురైన విధానం ఎంబీఎస్ ప్రమేయాన్ని బలపరుస్తోంది, దీనిని ఆయన ఖండిచండం కూడా కష్టం. జమాల్ ఖషోగ్జీ మరణానికి ముందు రియాద్ నుంచి 15 మంది సౌదీ ప్రభుత్వ అధికారులు రెండు జెట్ విమానాలలో ఇస్తాంబుల్‌కు చేరుకున్నారు.
ఖషోగ్జీ హత్య తర్వాత ఎంబీఎస్‌ను అమెరికా దౌత్యవేత్త డెన్నిస్ రాస్ కలిశారు.
ఆరోజు సంభాషణలను రాస్ గుర్తుచేసుకుంటూ " ఆ హత్య చేయలేదని ఎంబీఎస్ చెప్పారు. నేను కచ్చితంగా ఆయనను నమ్మాలనుకుంటున్నాను, ఎందుకంటే అలాంటి దానికి ఎంబీఎస్ అంగీకరిస్తారని నేను అనుకోను" అని అన్నారు.
ఖషోగ్జీ హత్య పథకం గురించి తెలియదని ఎంబీఎస్ చెబుతూ వస్తున్నారు. అయితే 2021 ఫిబ్రవరిలో విడుదలైన అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ‘ ఖషోగ్జీ హత్యలో ఎంబీఎస్ భాగస్వామి’ అని ఆరోపించింది.
ఎంబీఎస్ తండ్రి రాజు సల్మాన్ వయస్సు ఇప్పుడు 88 సంవత్సరాలు. దీంతో ఎంబీఎస్ సౌదీ అరేబియాను 50 సంవత్సరాలు పాలించగలరని నమ్ముతున్నారు.
అయితే, సౌదీ-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించడానికి చేస్తున్న ప్రయత్నాల కారణంగా తనను హత్య చేసే అవకాశం ఉందని ఎంబీఎస్ భావిస్తున్నారు.
"ఎంబీఎస్‌ను చంపాలనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు, అది ఆయనకూ తెలుసు" అని ప్రొఫెసర్ హెకెల్ చెప్పారు.
అయినా కూడా, ఎంబీఎస్ తన దేశాన్ని ఆధునీకరించే లక్ష్యంతో ఉన్నారు, ఇంతకుముందు పాలకులు ఈ మార్పులపై ధైర్యం చేయలేదు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














