జమాల్ ఖషోగ్జీ హత్య: సౌదీ ప్రిన్స్ విషయంలో అమెరికా మెత్తబడిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
- హోదా, బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్
అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించక ముందు జో బైడెన్... సౌదీ అరేబియాను 'సామాజికంగా దూరంగా పెట్టాల్సిన దేశం'గా అభివర్ణించారు. సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యోదంతం నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
ఖషోగ్జీ హత్యలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాత్రపై అనుమానాలున్నట్లు అమెరికా నిఘా వర్గాలు రిపోర్ట్ విడుదల చేయడానికి కూడా ఫిబ్రవరిలో అధ్యక్షుని హోదాలో బైడెన్ అనుమతి కూడా ఇచ్చారు.
కానీ, పరిణామాలు క్రమంగా మారుతూ వచ్చాయి. బైడెన్ ప్రభుత్వం కొలువుదీరిన 6 నెలల లోపే మొహమ్మద్ బిన్ సల్మాన్ తమ్ముడు, సౌదీ రక్షణ శాఖ ఉప మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటించారు. ఆయనకు ఆ దేశం రెడ్ కార్పెట్ పరిచింది.
2018 అక్టోబర్‌లో టర్కీలోని సౌదీ కాన్సులేట్‌లో జమాల్ ఖషోగ్జీ అనుమానస్పద స్థితిలో మరణించిన తర్వాత సౌదీ ప్రభుత్వంలోని సీనియర్ నేతలు అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
''క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సల్మాన్, సౌదీ అరేబియాల ప్రతిష్టను తిరిగి నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయి'' అని లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ (రుసి)లో అసోసియేట్ ఫెలో మైఖేల్ స్టీఫెన్స్ అన్నారు.
''ప్రాంతీయ భద్రతకన్నా ఆర్ధిక అవసరాలకే సౌదీ అరేబియా ప్రాధ్యాన్యత ఇస్తోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
అంటే దీనర్థం పశ్చిమ దేశాలు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను క్షమించినట్లేనా?
కచ్చితంగా క్షమించినట్లు కాదు. ఎందుకంటే మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ జమాల్ ఖషోగ్జీ కేసులో మొహమ్మద్ పాత్రపై స్వతంత్ర్య దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, REUTERS
ఖషోగ్జీ హత్యను తోసిపుచ్చిన ఖాలిద్
సౌదీ ప్రభుత్వ విమర్శకుడిగా పేరున్న జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ మరణానికి ముందు రియాద్ నుంచి 15 మంది సౌదీ ప్రభుత్వ అధికారులు రెండు జెట్ విమానాలలో ఇస్తాంబుల్‌కు చేరుకున్నారు.
ఖషోగ్జీ సౌదీ కాన్సులేట్‌కు వచ్చేంత వరకు వేచి చూశారు. ఆయన వచ్చీ రాగానే, ఆయనపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. శరీరం కూడా దొరక్కుండా చేశారు.
ఆ సమయంలో ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ వాషింగ్టన్‌లో సౌదీ రాయబారిగా పనిచేస్తున్నారు. ఖషోగ్జీని హత్య చేశారన్న వాదనను తొలుత ఖాలిద్ తోసిపుచ్చారు. సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన జరిగిందనడం పూర్తిగా నిరాధారమని, అవాస్తవమని కొట్టివేశారు.
సౌదీ కాన్సులేట్‌లో అసలేం జరిగిందో టర్కీ అధికారులు ప్రపంచానికి వెల్లడించడంతో సౌదీ నాయకత్వం వెనక్కి తగ్గింది. ఇదంతా తమకు తెలియకుండానే జరిగిందని చెప్పుకొచ్చింది. దీనిపై రహస్య విచారణ జరిపి చాలామంది చిన్న అధికారులను దోషులుగా నిర్ధారించింది.
మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు తెలియకుండా ఖషోగ్జీ హత్య జరిగే అవకాశమే లేదని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) నొక్కి చెప్పింది.
మానవ హక్కుల ఉల్లంఘనతో సంబంధమున్న 70మంది సౌదీ అధికారులపై అమెరికా చర్యలు తీసుకుంది. నాటి నుంచి సౌదీ రాజు మొహమ్మద్ పశ్చిమ దేశాల నాయకుల నుంచి బహిరంగంగానే విమర్శలు ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలే ముఖ్యం
ఇప్పటికీ కొన్ని పశ్చిమ దేశాలు సౌదీ అరేబియాను కీలక మిత్ర దేశంగా భావిస్తున్నాయి.
ఇరాన్ విస్తరణకు అడ్డుగోడగా, వాణిజ్య భాగస్వామిగా, ఆయుధాల కొనుగోలులో లాభదాయకమైన వినియోగదారుగా, చమురు మార్కెట్‌లో ప్రభావశీల దేశంగా సౌదీ అరేబియా నుంచి రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నాయి.
అధికారిక వైఖరుల్లో తేడా కారణంగా పశ్చిమ దేశాల ప్రభుత్వాలు బహిరంగంగా మొహమ్మద్‌ను దూరం పెడుతున్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సౌదీని మిత్ర దేశంగా భావిస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ కారణంగానే మొహమ్మద్ దగ్గరి బంధువు ఒకరు గత వారం వాషింగ్టన్‌లోని అత్యున్నత కార్యాలయంలో చోటు సంపాదించగలిగారు.

ఫొటో సోర్స్, Reuters
సౌదీ అరేబియాకు తగ్గని అమెరికా ప్రాధాన్యత
రెండు రోజుల వ్యవధిలోనే ప్రిన్స్ ఖాలిద్ పలువురు నేతలతో సమావేశాల్లో పాల్గొన్నారు.
అమెరికా దేశ కార్యదర్శి ఆంథోని బ్లింకెన్, అధ్యక్షుని జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివాన్, రక్షణ శాఖ కార్యదర్శి లాడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జెన్ మార్క్ మిలేలతో ఆయన చర్చలు జరిపారు.
ప్రిన్స్ ఖాలిద్ అమెరికా పర్యటన గురించి ముందస్తుగా ఎలాంటి ప్రకటనా లేదు. కానీ, ఈ సమావేశాల జాబితా, వాటి కోసం చేసిన ఏర్పాట్లను చూస్తే, అమెరికా తన మిత్రదేశంగా సౌదీ అరేబియాకి ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో తెలుపుతోంది.
యెమెన్ యుద్ధం, శక్తి వనరులు, చమురు మార్కెట్లు, ఆఫ్రికా భద్రత, ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం వంటి పలు కీలక అంశాలు ఖాలిద్‌తో సమావేశాల్లో చర్చకు వచ్చాయి.
సౌదీ అరేబియాతో సంబంధాలు నెరపడం ఎప్పటికైనా కష్టమేనని ఆ దేశం గురించి బాగా తెలిసిన దౌత్యవేత్తలు పేర్కొంటున్నారు.
పశ్చిమ దేశాలకు సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై ఉన్న అనుమానాలు ఆయన పదవి నుంచి దిగి పోయే వరకు కొనసాగుతాయని చెబుతున్నారు.
'మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ఇంకా అనుకూల సమయం రాలేదు. ఆయనతో కార్యకలాపాలు సాగించడానికి మిగతా దేశాలు ఇంకా చాలా సమయం తీసుకుంటాయి. కానీ ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటోంది' అని మైఖేల్ స్టీఫెన్స్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: యోగీ ఆదిత్యనాథ్ జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- డెల్టా వేరియంట్: ఈ ఆసియా దేశాలు ఎందుకింతగా భయపడుతున్నాయి
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
- MIS-C: కరోనా వల్ల పిల్లలకు వస్తున్న ఈ కొత్త వ్యాధి ఎంత ప్రమాదకరం
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








