జమాల్ ఖషోగ్జీ హత్యకు సౌదీ యువరాజు ఆమోదం తెలిపారన్న అమెరికా

ఫొటో సోర్స్, Reuters
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యకు సౌదీ యువరాజు సల్మాన్ బిన్ మొహమ్మద్ ఆమోదం తెలిపారని అమెరికా నిఘా విభాగం ఒక నివేదికలో వెల్లడించింది.
సౌదీ యువరాజు ఈ హత్య పథకానికి ఆమోదం తెలిపారని, దాని ప్రకారమే అమెరికాలో ఉంటున్న సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ సజీవంగా బంధించాలని లేదా చంపాలని నిర్ణయించారని నిఘా విభాగం శుక్రవారం జారీ చేసిన ఒక రిపోర్టులో తెలిపింది.
అమెరికా ఈ హత్య కేసులో మొదటిసారి నేరుగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ పేరు బయటపెట్టింది. అయితే, ఖషోగ్జీ హత్యకు తను ఆదేశించాననే ఆరోపణలను సౌదీ యువరాజు కొట్టిపారేశారు.
2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ వాణిజ్య రాయబార కార్యాలయంలో సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యకు గురయ్యారు. తన వ్యక్తిగత పత్రాల కోసం ఆయన అక్కడికి వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాసేవారు.
"మా అంచనా ప్రకారం, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. ఇస్తాంబుల్‌లో ఒక ఆపరేషన్‌కు ఆమోదించారు. సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని సజీవంగా పట్టుకోవడం లేదా చంపడమే దాని లక్ష్యం" అని అమెరికా ఈ రిపోర్టులో చెప్పింది.
జమాల్ ఖషోగ్జీ హత్యకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు ఇచ్చినట్లు తాము బలంగా నమ్ముతున్నట్లు అమెరికా నిఘా విభాగం సీఐఏ 2018లోనే చెప్పింది. కానీ, ఆ హత్యలో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉన్నట్లు అమెరికా అధికారులు ఇంతకు ముందెప్పుడూ బహిరంగంగా చెప్పలేదు.
సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సయీద్ కొడుకు క్రౌన్ ప్రిన్స్‌ను దేశంలో సమర్థుడైన పాలకుడుగా భావిస్తారు.
ఈ హత్యకు క్రౌన్ ప్రిన్స్ ఆమోదం తెలిపారని తాము భావించడానికి అమెరికా నిఘా విభాగం తమ రిపోర్టులో మూడు కారణాలు చెప్పింది.
- 2017 నుంచి దేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఆయన నియంత్రణలోనే ఉంది.
- క్రౌన్ ప్రిన్స్ రక్షణ దళం సభ్యులతోపాటూ, ఆయన సలహాదారుల్లో ఒకరికి ఈ ఆపరేషన్‌లో నేరుగా ప్రమేయం ఉంది.
- విదేశాల్లో అసమ్మతివాదుల గొంతు నొక్కేయడానికి హింసాత్మక చర్యలు ఉపయోగించడానికి ఆయన అండ ఉంది.
ఈ రిపోర్ట్ విడుదలైన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ రవాణా ఆంక్షలు విధించారు. వీటిని 'ఖషోగ్జీ నిషేధం' అంటున్నారు.
"ఏ విదేశీ ప్రభుత్వాలకు సంబంధించిన అసమ్మతివాదులనైనా లక్ష్యంగా చేసుకునే నేరస్థులను అమెరికాలోకి రావడానికి అనుమతించేది లేదు" అని ఆయన హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియాలో మానవ హక్కులు, పాలన విషయంలో అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్, మాజీ అద్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కంటే కఠిన విధానాన్ని అవలంబించబోతున్నట్లు భావిస్తున్నారు.
వైట్ హౌస్ వివరాల ప్రకారం బైడెన్ గురువారం సౌదీ అరేబియా రాజు షా సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. విశ్వవ్యాప్త మానవహక్కులకు, చట్టపరమైన పాలనకు అమెరికా ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని గట్టిగా చెప్పారు.
రాయిటర్స్ వివరాలను బట్టి సౌదీ అరేబియాతో ఆయుధాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం గురించి బైడెన్ ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది.
ఆయుధ ఒప్పందాలు మానవ హక్కుల గురించి ఆందోళనలను పెంచిందని, భవిష్యత్తులో మిలిటరీ విక్రయాలను దేశ రక్షణ అవసరాలకే పరిమితం చేయాలని అమెరికా ఆలోచిస్తోంది.
జర్నలిస్ట్ ఖషోగ్జీని సౌదీ అరేబియా ఏజెంట్లు హత్య చేశారని, ఖషోగ్జీని కిడ్నాప్ చేసి సౌదీ అరేబియాకు తీసుకురావడానికే వాళ్లను తాము పంపించామని సౌదీ అరేబియా ఇప్పటివరకూ అధికారికంగా చెబుతూ వచ్చింది.
సౌదీలోని ఒక కోర్టు ఖషోగ్జీ హత్య కేసులో ఐదుగురికి మొదట మరణ శిక్ష విధించింది. కానీ, గత ఏడాది సెప్టెంబర్‌లో కోర్టు వారి శిక్షలను 20 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది.
"సౌదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, పక్కా ప్రణాళిక ప్రకారం ఖషోగ్జీని హత్య చేసిందని, సౌదీ ప్రభుత్వ విచారణ న్యాయవిరుద్ధంగా జరిగిందని" 2019లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అధికారి యాగ్నెస్ కాలమార్డ్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖషోగ్జీ హత్య ఎలా జరిగింది
59 ఏళ్ల జమాల్ ఖషోగ్జీ 2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ వాణిజ్య రాయబార కార్యాలయానికి వెళ్లారు.
టర్కీలో తన ఫియాన్సీ హాటిస్ చెంగిజ్‌ను పెళ్లి చేసుకోవడానికి, ఆయన తనకు సంబంధించిన కొన్ని పత్రాల కోసం అక్కడకు వెళ్లారు.
టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయం పూర్తిగా సురక్షితం అని, అక్కడికి వెళ్లవచ్చని క్రౌన్ ప్రిన్స్ సోదరుడు ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ ఆయనకు హామీ ఇచ్చినట్లు చెబుతారు.
ప్రిన్స్ ఖాలిద్ అప్పట్లో అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిగా ఉన్నారు. అయితే, జర్నలిస్ట్ ఖషోగ్జీతో తను ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆయన చెప్పారు.
సౌదీ అరేబియా ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం మొదట ఎదురుతిరిగిన ఖషోగ్జీని బలవంతంగా పట్టుకున్నారు. ఆయనకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇచ్చారు. అవి ఓవర్ డోస్ కావడంతో ఖషోగ్జీ చనిపోయారు.
తర్వాత ఆయన శవాన్ని ముక్కలు ముక్కలు చేశారు. సౌదీ రాయబార కార్యాలయం బయట తమకు సహకరించిన స్థానికులకు వాటిని అప్పగించారు. ఖషోగ్జీ మృతదేహం అవశేషాలు ఇప్పటికీ దొరకలేదు.
ఆ హత్య సమయంలో జరిగిన సంభాషణల ఆడియో రికార్డింగ్ తమ దగ్గర ఉన్నట్లు టర్గీ నిఘా విభాగం చెప్పింది. తర్వాత, ఆ ఆడియో క్లిప్‌ను కూడా బయటపెట్టడంతో ఖషోగ్జీ హత్య గురించి అందరికీ తెలిసింది.
ఖషోగ్జీకి ఒకప్పుడు సౌదీ రాజ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన వారికి సలహాదారుగా కూడా ఉండేవారు. కానీ, ఆ సంబంధాలు చెడడంతో 2017లో అమెరికా వెళ్లిపోయిన ఆయన అక్కడే ప్రవాస జీవితం గడిపారు.
ఆయన అమెరికా నుంచే వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రతి నెలా ఒక కాలమ్ రాసేవారు. వాటిలో ఆయన తరచూ సౌదీ క్రౌన్ ప్రిన్స్ విధానాలను విమర్శించేవారు.
అసమ్మతిని అణచివేయడానికి ప్రయత్నిస్తున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్ తనను కూడా అరెస్టు చేస్తారేమోనని, ఆయన తన మొదటి కాలంలోనే రాశారు.
యెమెన్‌లో సౌదీ అరేబియా జోక్యాన్ని విమర్శిస్తూ ఆయన తన ఆఖరి కాలమ్ రాశారు.

ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








