జమాల్ ఖషోగ్జీ హత్య: సౌదీ యువరాజు మీద అమెరికాలో కేసు వేసిన ఖషోగ్జీ ఫియాన్సీ - Newsreel

ఫొటో సోర్స్, EPA
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని హత్య చేయాలంటూ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలిచ్చారని ఆరోపిస్తూ ఆయన మీద ఖషోగ్జీ ఫియాన్సీ హాటిస్ చెంగిజ్ కేసు వేశారు.
చెంగిజ్‌తో పాటు, ఖషోగ్జీ స్థాపించిన హక్కుల సంస్థ కూడా తమకు పరిహారం కోరుతూ సౌదీ క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ మీద, మరో 20 మంది మీద ఈ కేసు వేసింది. అయితే ఎంత పరిహారం కోరుతున్నారనేది నిర్దిష్టంగా చెప్పలేదు.
సౌదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే ఖషోగ్జీ స్వయంగా ఆ దేశం వదిలి అమెరికాలో నివసిస్తుండేవారు. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వ్యాసాలు రాస్తుండేవారు. టర్కీ పౌరురాలు హాటిస్ చెంగిజ్‌తో ఆయన వివాహం నిశ్చయమైంది.
అయితే.. ఖషోగ్జీ 2018లో టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లినపుడు.. సౌదీ ఏజెంట్ల బృందం ఆయనను హత్య చేసింది.
ఆ హత్యకు తాను ఆదేశించానన్న ఆరోపణలను సౌదీ యువరాజు బిన్ సల్మాన్ తిరస్కరించారు.

ఫొటో సోర్స్, Reuters
ఆయన హత్యకు యువరాజు బిన్ సల్మాన్ ఆదేశించారని ఆరోపిస్తూ.. ఖషోగ్జీ మరణం వల్ల తనకు వ్యక్తిగతంగా హాని జరగటంతో పాటు ఆర్థికంగానూ నష్టం వాటిల్లిందని చెంగిజ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మంగళవారం సివిల్ కేసు నమోదు చేశారు.
ఖషోగ్జీ స్థాపించిన మానవ హక్కుల సంస్థ డెమొక్రసీ ఫర్ ద అరబ్ వరల్డ్ నౌ (డాన్) కూడా.. ఆయన మరణంతో తమ సంస్థ కార్యకలాపాలకు ఆటంకాలు తలెత్తాయని ఈ దావాలో పేర్కొంది.
''ఆయనను హత్య చేయటం వెనుక ఉద్దేశం స్పష్టం - అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామిక సంస్కరణ కోసం అమెరికాలో ఖషోగ్జీ చేస్తున్న ప్రచారాన్ని నిలువరించటమే'' అని ఆ దావాలో పేర్కొన్నారు.
ఖషోగ్జీ మరణానికి సౌదీ యువరాజును బాధ్యుడిగా అమెరికా కోర్టు తేల్చటంతో పాటు.. నిజాలను వెల్లడించే పత్రాలను సంపాదించటం తమ కేసు లక్ష్యమని చెంగిజ్, డాన్‌ల తరఫు న్యాయవాదులు మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది.

ఫొటో సోర్స్, PA Media
లండన్‌లో మొబైల్ షాపులో గ్యాస్ పేలుడు.. ఇద్దరు మృతి
లండన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఒక షాపులో గ్యాస్ పేలుడు సంభవించి ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.
సౌథాల్‌లోని కింగ్ స్ట్రీట్‌లో గల ఒక హెయిర్ సెలూన్, మొబైల్ ఫోన్ షాపుల్లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో లండన్ ఫైర్ బ్రిడ్జ్ సిబ్బంది నలుగురు పెద్దవాళ్లు, ఒక చిన్నారిని రక్షించారు.
ఈ పేలుడును అనుమానాస్పద పేలుడుగా పరిగణించటం లేదని మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా సైనికుడిని ఆ దేశానికి తిరిగి అప్పగించాం: భారత్
లద్దాఖ్‌లోని హిమాలయ సరిహద్దు ప్రాంతంలో భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడిని.. ఆ దేశానికి అప్పగించినట్లు భారత్ సైనికాధికారులు తెలిపారు.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికుడిని లద్ధాఖ్‌లోని దేమ్‌చోక్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు భారత సైన్యం సోమవారం నాడు చెప్పింది.
ఆ సైనికుడు తెలివిలో లేడని.. అతడికి ఆక్సిజన్, వైద్య సహాయం అందించామని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్, చైనాల మధ్య ఇటీవలి కాలంలో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగి.. పలుమార్లు ఘర్షణలకు దారితీశాయి.
ఇరు దేశాల సైనికుల మధ్య జూన్ నెలలో వివాదాస్పద ప్రాంతంలో భారీ ఘర్షణ జరిగింది. అప్పుడు 20 మంది భారత సైనికులు చనిపోయారు.
సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించటానికి ఇరు దేశాల సైన్యాలు చర్చలు జరుపుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. తమ ఆధీనంలో ఉన్న పాక్ సైనికుడిని ప్రొటోకాల్స్ ప్రకారం చైనాకు తిరిగి అప్పగించినట్లు భారత సైన్యం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
నైజీరియా: పోలీసుల క్రూరత్వంపై ప్రజల నిరసన.. సైన్యం కాల్పుల్లో 12 మంది మృతి
నైజీరియాలోని లాగోస్ నగరంలో పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారుల మీద మంగళవారం రాత్రి సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 12 మంది చనిపోయారని, చాలా మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
నిరసనకారుల మరణాలకు సంబంధించి తమ దగ్గర ''విశ్వసనీయ ఆధారాలు'' ఉన్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది.
అయితే.. నిరసనకారులు ఎవరూ చనిపోలేదని, 25 మంది గాయపడటం మాత్రమే జరిగిందని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. లాగోస్, ఇతర ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు.
బుధవారం నాడు కర్ఫ్యూను ఉల్లంఘించి ఆందోళనకు దిగిన నిరసనకారులను చెదరగొట్టటటానికి లాగోస్‌లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు రాజధాని అబుజా నుంచి బీబీసీ ప్రతినిధి డుకా ఒరింజ్మో తెలిపారు.
ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ శాంతి పాటించాలని దేశాధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విజ్ఞప్తి చేశారు.
స్పెషల్ యాంటీ-రాబరీ స్క్వాడ్ (సార్స్) అనే ప్రత్యేక పోలీసు విభాగం క్రూరంగా వ్యవహరించిందంటూ గత రెండు వారాలుగా నైజీరియాలో ప్రజా నిరసనలు జరుగుతున్నాయి. ఆ విభాగాన్ని తర్వాత రద్దుచేశారు.

ఫొటో సోర్స్, Reuters
అఫ్ఘానిస్తాన్: పాక్ వీసా దరఖాస్తుల కోసం తొక్కిసలాట.. 11 మంది మహిళల మృతి
అఫ్గానిస్తాన్‌లో వీసా దరఖాస్తులు సమర్పించే సమయంలో తొక్కిసలాట జరిగి 11 మంది మహిళలు చనిపోయారని అధికారులు తెలిపారు.
పాకిస్తాన్‌కు వెళ్లటం కోసం వీసాలు సమర్పించటానికి జనం పెద్ద సంఖ్యలో వచ్చారని.. జలాలాబాద్ లోని ఒక స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిందని అధికారులు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా అఫ్గాన్ నుంచి పాక్ వెళ్లడానికి వీసా జారీ ప్రక్రియ ఏడు నెలలుగా నిలిచిపోయింది. దీనిని తాజాగా పునరుద్ధరించటంతో జనం వీసా దరఖాస్తులతో వెల్లువెత్తారు.
''కాన్సులేట్ అధికారుల నుంచి తమ టోకెన్ పొందటానికి దరఖాస్తుదారులు తోసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది'' అని జలాలాబాద్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

పాకిస్తాన్: కరాచీ భవనంలో పేలుడు.. ఐదుగురు మృతి
పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఓ భారీ భవనంలో పేలుడు సంభవించి ఐదుగురు చనిపోయారు. మరో 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
కరాచీ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్న ఒక నాలుగు అంతస్తుల భవనంలో బుధవారం ఈ పేలుడు సంభవించినట్లు కరాచీలోని బీబీసీ ప్రతినిధి రియాజ్ సుహైల్ చెప్పారు.
ఈ భవనంలోని కింది భాగంలో బ్యాంకులు, రెస్టారెంట్లు, షాపులు ఉన్నాయి. పై అంతస్తుల్లో రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి.
పేలుడులో గాయపడ్డవారిని పటేల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
గ్యాస్ లీకేజీ వల్ల ఈ పేలుడు సంభవించిందని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తెలిపింది. ఏవైనా పేలుడు పదార్థాలు వాడినట్లు ఆధారాలు లభించలేదని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం.. ఏటీఎంల గురించి వారికి తెలియదు
- విజయవాడకు వరద ముప్పు తొలిగే మార్గం లేదా? ఎందుకు ఈ పరిస్థితి?
- లక్షకు పైగా మహిళల సోషల్ మీడియా ఫొటోలను నగ్నంగా మార్చేశారు..
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








